ఉత్తర కొరియాలో యుద్ధ ఖైదీ కుమార్తె: ‘నాన్న పుర్రెను, ఎముకలను సూట్‌కేసుల్లో పెట్టుకుని వచ్చా’

కొరియా యుద్ధం 1953లో ముగిసినప్పుడు దక్షిణ కొరియాకు చెందిన దాదాపు 50 వేల మంది ఉత్తర కొరియాలో యుద్ధ ఖైదీలుగా మారారు. వారిలో చాలా మందిని ఉత్తర కొరియా బలవంతంగా కార్మికులుగా మార్చి పనిచేయించుకుంది. ఇంకొంత మందిని చంపింది.
అలాంటి యుద్ధ ఖైదీలకు జన్మించినవాళ్లు ఇప్పుడు తమ గుర్తింపు కోసం పోరాడుతున్నారు. బీబీసీ కొరియా ప్రతినిధి సబిన్ కిమ్ అందిస్తున్న కథనం...
లీ ఎంత ప్రయత్నించినా... తన తండ్రిని, సోదరుడిని అధికారులు కాల్చి చంపిన తర్వాత ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోలేకపోతున్నారు.
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆ ఘటన జరిగింది. అప్పుడు లీ వయసు 30ల్లో ఉంటుంది.
అయితే, ఆ ఘటనకు ముందు జరిగిన విషయాలు మాత్రం ఆమె మరిచిపోలేదు.
ఉత్తర కొరియాలోని మారుమూల గ్రామం అవోజీలో ఉన్న ఓ స్టేడియానికి ఆమెను భద్రతా అధికారులు లాక్కువెళ్లారు.
ఓ చెక్క వంతెనపై ఆమెను బలవంతంగా కూర్చోబెట్టారు.
అక్కడ జనాల గుంపు పెరిగింది. ఓ ట్రక్కు వచ్చి ఆగింది. అందులో నుంచి ఇద్దరిని అధికారులు దించారు. ఆ ఇద్దరూ లీ తండ్రి, సోదరుడు.
‘‘వారిని కొయ్యలకు కట్టేశారు. జాతి విద్రోహులని, గూఢచారులని, ప్రగతి వ్యతిరేకులని తిట్టారు’’ అని లీ బీబీసీతో చెప్పారు.
ఆమెకు అంత వరకే గుర్తుంది.
‘‘నేను బిగ్గరగా అరుస్తూ ఉన్నాననుకుంటా. నా దవడ ఎముక కదిలిపోయింది. మా పక్కింటివాళ్లు నన్ను ఇంటికి తీసుకువెళ్లి, దాన్ని సరి చేశారు’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, ICRC / HANDOUT
దేశం మరిచిన సైనికులు
కొరియా యుద్ధం తర్వాత ఉత్తర కొరియాలో మాజీ యుద్ధ ఖైదీలుగా ఉన్న 50 వేల మందిలో లీ తండ్రి కూడా ఒకరు.
మాజీ యుద్ధ ఖైదీలను ఉత్తర కొరియా ప్రభుత్వం పోగు చేసి, ఉత్తర కొరియా సైనిక యూనిట్లలో బలవంతంగా భర్తీ చేసేది.
జీవితాంతం వారితో పునిర్నిర్మాణ ప్రాజెక్టుల్లో, గనుల్లో పనిచేయించేది.
1953, జులై 27న యుద్ధ విరమణపై సంతకాలు జరిగినప్పుడు త్వరలోనే తమను ఇళ్లకు పంపిస్తారని ఉత్తర కొరియాలో చిక్కుకున్న దక్షిణ కొరియా సైనికులు అనుకున్నారు.
కానీ ఈ విరమణకు ఒక నెల ముందు దక్షిణ కొరియా అధ్యక్షుడు సింగ్మన్ రీ ఏకపక్షంగా 25 వేల మంది ఉత్తర కొరియాకు చెందిన యుద్ధ ఖైదీలను విడుదల చేశారు.
యుద్ధ విరమణ జరగకూడదన్న ఉద్దేశంతో ఆయన ఆ పని చేశారు. అలాగైతే ఐరాస దళాలు తమకు అండగా వస్తాయని ఆయన భావించారు.

ఫొటో సోర్స్, AFP
ఈ చర్య దక్షిణ కొరియా యుద్ధ ఖైదీలను వెనక్కిరప్పించే ప్రక్రియను సంక్లిష్టం చేసిందని చాలా మంది భావిస్తుంటారు.
ఉత్తర కొరియా తాను బందీలుగా పట్టుకున్న దక్షిణ కొరియా సైనికుల్లో చాలా తక్కువ మందిని వదిలిపెట్టింది.
మరోవైపు దక్షిణ కొరియా చాలావరకూ వారిని మరిచిపోయింది.
ఇన్నేళ్లలో దక్షిణ కొరియాకు పనిచేసిన ముగ్గురు అధ్యక్షులు ఉత్తర కొరియా పాలకులతో భేటీ అయ్యారు. కానీ, యుద్ధ ఖైదీల విడుదల అంశం వారి అజెండాలో ఎప్పుడూ లేదు.
ఉత్తర కొరియాలో లీ కుటుంబాన్ని హీనంగా చూసేవారు. ఆమె తండ్రి దక్షిణ కొరియాలో పుట్టారు.
యుద్ధంలో ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా ఐరాస దళాలతో కలిసి పోరాడారు. దీన్ని ఆయనకు ఓ మచ్చలా అక్కడ పరిగణిస్తారు.
సామాజికంగా లీ కుటుంబం కింది స్థాయిలో ఉండటంతో వాళ్లకు పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. చాకిరీ పనులు చేయాల్సి వచ్చింది. లీ తండ్రి, సోదరుడు బొగ్గు గనుల్లో పనిచేసేవారు. వాటిలో నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉండేవి.
ఏదో ఒక రోజు దక్షిణ కొరియాకు తిరిగి వెళ్తానని లీ తండ్రి కలలు కనేవారు.
పని ముగించుకుని, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు తాను యుక్త వయసులో ఉండగా జరిగిన విషయాల గురించి చెప్పేవారు.

నోరు జారడంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు
దక్షిణ కొరియాకు పారిపోవాలని కూడా అప్పుడప్పుడు పిల్లలకు సూచించేవారు. ‘‘అక్కడో నా కోసం ఓ పతకం ఉంటుంది. మిమ్మల్ని ఓ హీరో పిల్లల్లా అక్కడ చూస్తారు’’ అని వారితో ఆయన అనేవారు.
లీ సోదరుడు ఓ రోజు స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ, తన తండ్రి చెప్పే విషయాల గురించి నోరు జారారు.
ఆ స్నేహితుల్లో ఒకరు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని నెలల వ్యవధిలోనే లీ సోదరుడిని, తండ్రిని ప్రభుత్వం చంపేసింది.
2004లో లీ ఎలాగోలా పారిపోయి దక్షిణ కొరియా చేరుకున్నారు. అక్కడికి వచ్చాకే, తన తండ్రి పొరపాటు పడ్డారన్న విషయం ఆమె తెలుసుకున్నారు.
దక్షిణ కొరియా తన తండ్రిని హీరోగా చూడలేదని, యుద్ధ ఖైదీలను వెనక్కి తీసుకువచ్చేందుకు పెద్దగా ఏమీ చేయలేదని తెలుసుకున్నారు.
ఉత్తర కొరియాలో చిక్కుకుపోయిన దక్షిణ కొరియా సైనికులను అక్కడ దేశానికి శత్రువుల్లా చూసేవారు.
ఉత్తర కొరియా సామాజిక వర్గ వ్యవస్థలో అట్టడుగు వర్గమైన ‘సాంగ్బన్’లో వారిని చేర్చేవారు.
ఈ వర్గం వారికి పుట్టినవారు కూడా అదే వర్గానికి చెందుతారు. కాబట్టి, యుద్ధ ఖైదీల పిల్లలు కూడా కష్టాలు అనుభవించేవారు.
వారికి పైచదువులు చదివేందుకు అనుమతి ఉండేది కాదు. ఇష్టమైన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు.

చోయి చాలా చురుకైన విద్యార్థిని. యూనివర్సిటీలో చేరాలన్నది ఆమె కల. కానీ, తన తండ్రి మాజీ యుద్ధ ఖైదీ కావడంతో ఆమెకు అది అసాధ్యంగా మారిపోయింది.
కోపంతో ఆమె తన తండ్రిని ఓసారి తిట్టారు కూడా. ‘ఇక్కడెందుకు ఉన్నావు? నీ దేశానికి వెళ్లిపో’ అని అరిచారు.
కానీ, చోయి తండ్రి ఆమెపై తిరిగి అరవలేదు. తమను వెనక్కి రప్పించుకోలేనంత బలహీన దేశం తమదని మాత్రం ఆయన బాధతో అన్నారు.
ఎనిమిదేళ్ల క్రితం తన కుటుంబాన్ని వదిలేసి, పారిపోయి చోయి దక్షిణ కొరియాకు వచ్చారు.
‘‘నా తండ్రి ఇక్కడికి రావాలనుకున్నారు. నా జీవితంలో అందరికన్నా నేను ఎక్కువగా ప్రేమించింది ఆయన్నే. ఆయన జీవితాంతం ఇక్కడికి రావాలనుకున్నారు. కానీ, రాలేకపోయారు. అందుకే నేనైనా ఇక్కడికి రావాలనుకున్నా. నా భర్తను, కూతురిని, కొడుకును వదిలేసి ఇక్కడికి వచ్చాను’’ అని చోయి చెప్పారు.
చోయి తండ్రి ఇప్పుడు ప్రాణాలతో లేరు. దక్షిణ కొరియా అధికారిక పత్రాల ప్రకారమైతే, ఆయన యుద్ధ సమయంలోనే ప్రాణాలు వదిలారు. కాబట్టి, చోయికి అధికారికంగా తండ్రి లేరు.
సన్ మ్యోంగ్ హాకు 40 ఏళ్ల క్రితం తన తండ్రి పలికిన ఆఖరి మాటలు ఇంకా గుర్తున్నాయి.
‘‘దక్షిణ కొరియాకు నువ్వు వెళ్లగలిగితే, నీతోపాటు నా ఎముకలు కూడా తీసుకువెళ్లు. నేను పుట్టిన చోటే, నన్ను పూడ్చు’’ అని ఆయన అన్నారు.
సన్ తండ్రి దక్షిణ కొరియాలోని బూసాన్‌కు 18 కి.మీ.ల దూరంలోని గిమ్హేకు చెందినవారు.
యుద్ధ ఖైదీగా ఆయన్ను పట్టుకున్న ఉత్తర కొరియా బలవంతంగా బొగ్గు గనుల్లో, చెట్లు కొట్టే పరిశ్రమలో దశాబ్దాల పాటు పని చేయించుకుంది. ఆయన క్యాన్సర్‌తో మరణించడానికి పది రోజుల ముందే ఇంటికి రాగలిగారు.
‘‘నా తల్లిదండ్రులను మళ్లీ చూడకుండా ఇక్కడే చనిపోతుండటం బాధగా ఉంది. కనీసం నన్ను అక్కడ సమాధి చేస్తేనైనా మంచిది కదా’’ అని సన్‌తో ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Son Myeong-hwa
2005లో సన్ ఉత్తర కొరియా నుంచి పారిపోయారు.
అయితే, తన తండ్రి ఎముకలను ఉత్తర కొరియా నుంచి తీసుకువచ్చేందుకు ఆమెకు మరో ఎనిమిదేళ్లు పట్టింది.
ఆ ఎముకలను తవ్వి, చైనాలో ఓ మధ్యవర్తికి తెచ్చివ్వాలని ఉత్తర కొరియాలో ఉన్న తన తోబుట్టువులను సన్ కోరారు. వాళ్లు అలాగే చేశారు. మొత్తం మూడు సూట్‌కేసుల్లో వాటిని తెచ్చారు.
తన తండ్రి పుర్రె ఉన్న సూట్‌కేసును సన్ మోసుకువచ్చారు. మిగతా ఎముకలున్న రెండు సూట్‌కేసులను ఆమె వెంట వచ్చిన ఇద్దరు స్నేహితులు తీసుకువచ్చారు.
ఉత్తర కొరియాలో చిక్కుకుపోయిన దక్షిణ కొరియా సైనికుడిగా తన తండ్రిని గుర్తించాలని దక్షిణ కొరియా ప్రభుత్వాన్ని కోరుతూ సన్ ఏడాదికాపైగా ఆందోళన నిర్వహించారు.
చివరికి 2015లో నేషనల్ సెమెట్రీలో ఆయన ఎముకలను ఆమె పూడ్చి పెట్టారు.
‘‘కూతురిగా నా బాధ్యతను పూర్తిచేసినట్లు అనిపించింది. కానీ, ఆ దేశంలోనే ఆయన ఆఖరి శ్వాస వదలాల్సిరావడం గుర్తుకువస్తే చాలా బాధగా అనిపిస్తోంది’’ అని సన్ అన్నారు.
తన తండ్రి ఎముకలను ఉత్తర కొరియా నుంచి తెచ్చినందుకు, ఆ దేశంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తన తోబట్టువులను ఉత్తర కొరియా రాజకీయ ఖైదీలుగా మార్చినట్లు సన్ తెలుసుకున్నారు.
కొరియా యుద్ధ ఖైదీల కుటుంబాల సంఘానికి సన్ ఇప్పుడు నేతృత్వం వహిస్తున్నారు. ఉత్తర కొరియాలోనే చిక్కుకుపోయిన దాదాపు 110 యుద్ధ ఖైదీల కుటుంబాల సంక్షేమం కోసం ఈ సంఘం పనిచేస్తోంది.
దక్షిణ కొరియాలో సన్ డీఎన్ఏ పరీక్ష ద్వారా తన తండ్రి ఎవరన్న విషయాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఆయనకు రావాల్సి ఉన్న జీతభత్యాలను తీసుకునేందుకు ఈ పరీక్ష తప్పనిసరి.
యుద్ధ ఖైదీల పిల్లలు ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చినా, దక్షిణ కొరియా వారిని అధికారికంగా గుర్తించడం లేదు.

ఫొటో సోర్స్, Yonhap
చాలా మంది యుద్ధ ఖైదీలను దక్షిణ కొరియా చనిపోయినట్లుగా, గల్లంతైనట్లుగా పరిగణిస్తోంది.
యుద్ధ ఖైదీల పిల్లల్లో చాలా తక్కువ మంది మాత్రమే, తమ వారికి రావాల్సి ఉన్న జీత భత్యాలను తీసుకోగలిగారు.
ఉత్తర కొరియా చేతిలో బంధీలుగా ఉన్న సమయంలో మరణించినవారి విషయంలో, అసలు ఎలాంటి పరిహారమూ దక్షిణ కొరియా ఇవ్వదు.
యుద్ధ ఖైదీల పట్ల ఉత్తర కొరియా అన్యాయంగా వ్యవహరిస్తోందని, వారిని వెనక్కతీసుకువచ్చేందుకు దక్షిణ కొరియా ఏమీ చేయలేదని... యుద్ధ ఖైదీలు చిక్కుకుపోవడానికి దక్షిణ కొరియాదే బాధ్యతని సన్, ఆమె న్యాయవాదులు కోర్టులో ఓ పిటిషన్ వేశారు.
‘‘యుద్ధ ఖైదీలకు పిల్లలుగా పుట్టడం మా దురదృష్టం. దక్షిణ కొరియాకు వచ్చాక కూడా మమ్మల్ని విస్మరించడం మరింత బాధాకరం’’ అని సన్ అన్నారు.
‘‘మా తండ్రుల గౌరవాన్ని మేం ఇక్కడ పునఃప్రతిష్ఠించలేకపోతే... యుద్ధ ఖైదీలుగా వారు, వారి పిల్లలుగా మేమూ అనుభవించిన దారుణమైన జీవితాలను అందరూ మరిచిపోతారు’’ అని ఆమె అన్నారు.
గమనిక: భద్రతా కారణాల రీత్యా కథనంలోని కొందరి పేర్లు మార్చాం.
చిత్రాలు: డేవీస్ సూర్య
ఇవి కూడా చదవండి:
- తల్లుల నుంచి పసిబిడ్డలకు కరోనావైరస్ సోకే అవకాశం తక్కువే
- ఏపీజే అబ్దుల్ కలామ్‌ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకు అంటారు ?
- గోరఖ్‌పూర్ డాక్టర్ కఫీల్‌ఖాన్‌ను ఎందుకు జైలు నుంచి విడుదల చేయడం లేదు?
- చైనా - అమెరికా వివాదం: చెంగ్డూలో అమెరికన్ కాన్సులేట్‌ను ఖాళీ చేయించిన చైనా
- కరోనావైరస్ తిరుమలలో ఎలా ఉంది... దర్శనాలు నిలిపివేయడమే మంచిదా?
- అరారియా అత్యాచార కేసు: బాధితులే బోనులో ఎందుకు నిల్చోవాల్సి వస్తోంది?
- కోవిడ్-19 సామాజిక వ్యాప్తిని భారతదేశం ఎందుకు ఒప్పుకోలేకపోతోంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








