దక్షిణ కొరియా నాయకులు ఎందుకు గుండు కొట్టించుకుంటున్నారు?

ఫొటో సోర్స్, AFP
దక్షిణ కొరియా అధ్యక్ష భవనం బయట ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు హ్వాంగ్ క్యో-అహ్న్ గుండు కొట్టించుకున్నారు.
తన మద్దతుదారులు, పాత్రికేయుల సమక్షంలో సోమవారం సాయంత్రం ఆయన ఈ పని చేశారు. గతవారం మరో ఇద్దరు మహిళా ఎంపీలు కూడా ఇలాగే గుండు కొట్టించుకున్నారు.
దేశ న్యాయ మంత్రి పదవిలో చో కుక్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ తమ నిరసనను వారు ఈ రూపంలో తెలియజేశారు.
చో కుక్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
హ్వాంగ్ క్యో-అహ్న్ సహా గుండు కొట్టించుకున్న ఆ ఇద్దరు ఎంపీలది లబర్టీ కొరియా పార్టీ. చో కుక్ రాజీనామా చేయాలని, లేదంటే పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నిరసనలు దేనికి?
చో కుక్ గతంలో న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూనే జే ఇన్ కేబినెట్‌లో సీనియర్ సెక్రటరీగానూ సేవలందించారు.
చో కుక్ భార్య కూడా ప్రొఫెసరే. తమ కుమార్తెకు యూనివర్సిటీలో అడ్మిషన్, స్కాలర్‌షిప్‌లు లభించేలా ఫోర్జరీకి పాల్పడ్డట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో మిగతా విద్యార్థుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
వారి కుటుంబంపై కొన్ని ఆర్థిక నేరాలకు సంబంధించిన అభియోగాలు కూడా వచ్చాయి.

ఫొటో సోర్స్, AFP
ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు సంస్థలు ఇటీవల కొన్ని చోట్ల సోదాలు కూడా జరిపాయి.
తమ కుమార్తెకు లబ్ధి చేకూర్చిన చర్యల విషయంపై మాట్లాడుతూ.. యువతరానికి తాను క్షమాపణలు చెబుతున్నానని చో గత శుక్రవారం చెప్పారు.
న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు తాను కట్టుబడి ఉన్నానని వివరించారు.
చో చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడ్డట్లు రుజువు కాలేదని, కేవలం ఆరోపణలు వచ్చాయన్న కారణంతో నియామకాన్ని ఆపడం సరికాదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూనే జే ఇన్ అన్నారు.
రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాలు కొన్నేళ్లుగా దక్షిణ కొరియాను కుదిపేస్తున్నాయి.
ఇదివరకు పార్క్ గ్వెన్-హై నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి అభియోగాలతోనే కూలిపోయింది. లంచం తీసుకున్నట్లు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఇప్పుడామె జైలు జీవితం అనుభవిస్తున్నారు.
ప్రస్తుత ప్రతిపక్ష నేత హ్వాంగ్ క్యో-అహ్న్.. పార్క్ హయాంలో ప్రధానమంత్రిగా పనిచేశారు.
మూన్ జే ఇన్ ప్రతిష్ఠను మసకబార్చేందుకే హ్వాంగ్ గుండు గీయించుకుంటూ నాటకమాడుతున్నారని అధికార పార్టీ సమర్థకులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పటినుంచో ఈ సంప్రదాయం
నిరసన చర్యగా గుండు కొట్టించుకునే సంప్రదాయం దక్షిణ కొరియాలో చాలా కాలంగా ఉంది.
దీనికి మూలాలు కన్ఫూషియన్ బోధనల్లో ఉన్నాయి. ఒక విషయం పట్ల తమ నిబద్ధత చాటుకోవడానికి దక్షిణ కొరియన్లు ఇలా గుండు కొట్టించుకుంటారు.
1960ల్లో, 70ల్లో దక్షిణ కొరియా సైనిక నియంతృత్వ పాలనలో ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు గుండ్లు చేయించుకుని తమ వ్యతిరేకతను చాటుకునేవారు.
ఆ తర్వాత కూడా దాన్నో నిరసన తెలిపే మార్గంలా ఉద్యమకారులు, రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటూ వస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు
- ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'.. మానవ విపత్తులా మారిన ఫేస్‌బుక్ ఈవెంట్
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- 11 తరాలుగా ఈ ఆలయంలో అర్చకులంతా దళితులే.. వివక్షను పారదోలిన ఉప్పులూరు చెన్నకేశవ ఆలయం ప్రత్యేకతలివీ
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- కశ్మీర్: వివాదాస్పద మరణాలతో రాజుకుంటున్న ఉద్రిక్తతలు
- #HowdyModi: అమెరికాలో మోదీ కార్యక్రమానికి రానున్న ట్రంప్
- హైదరాబాద్‌కు బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది?
- హైదరాబాద్‌లో పదిలంగా ఉన్న ‘పద్మావత్’ రాతప్రతి
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్‌లు విడిపోయేవి కాదు’
- బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన తండ్రీకూతుళ్లు
- ఈ బంగారు టాయిలెట్‌ను ప్యాలస్ నుంచి ఎత్తుకెళ్లారు
- రాజు అంత్యక్రియల కోసం స్వర్గం నిర్మించిన థాయ్‌లాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








