కశ్మీర్: వివాదాస్పద మరణాలతో రాజుకుంటున్న ఉద్రిక్తతలు

ఆరువారాల క్రితం ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి కశ్మీర్ లోయలో మరణాల సంఖ్య, వాటి కారణాలపై విరుద్ధమైన గణాంకాలు వెలుగులోకి వస్తున్నాయి.
బీబీసీ ప్రతినిధి యోగితా లిమాయే శ్రీనగర్‌లో అలాంటి కొన్ని కేసులను చూశారు.
ఆగస్టు 6న ఇంటి బయట వీధిలో ఉన్న 17 ఏళ్ల అస్రార్ అహ్మద్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో ఆ గాయాలకు చికిత్స పొందుతూ, నాలుగు వారాల తర్వాత మృతిచెందాడు.
చురుకైన విద్యార్థిగా చెబుతున్న అస్రార్‌కు క్రీడలంటే ఇష్టం. అతడి మరణం చుట్టూ పరిస్థితులు అశాంతితో రగులుతున్న ప్రాంతంలో వివాదానికి ఇటీవలి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడి పరిస్థితులపై విరుద్ధ వాదనలు వినిపిస్తున్నాయి.
"అస్రార్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నప్పుడు అతడి తలకు టియర్ గ్యాస్ షెల్, పెల్లెట్స్ తగిలాయి" అని అతడి తండ్రి ఫిర్దౌస్ అహ్మద్ ఖాన్ ఆరోపించారు.
సాయంత్రం అక్కడి నుంచి వెళ్తున్న భారత పారా మిలిటరీ దళాలు అస్రార్‌పై కాల్పులు జరిపాయని ఆ సమయంలో అతడితోపాటు ఉన్న ఒక స్నేహితుడు చెప్పాడు.

అస్రార్ మెడికల్ రిపోర్ట్
పెల్లెట్లు, టియర్ గ్యాస్ షెల్ పేలుడు వల్ల తగిలిన గాయాలతోనే అస్రార్ మృతి చెందాడని అతడి మెడికల్ రిపోర్టు చెబుతోంది.
కానీ ఆందోళనకారులు సాయుధ దళాలపై విసిరిన రాయి అస్రార్‌కు తగిలిందని కశ్మీర్‌లోని భారత ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ చెప్పారు.

కశ్మీర్ పోలీసులు కూడా ఆయన వాదనతో ఏకీభవిస్తున్నట్లు బీబీసీతో చెప్పారు. ఆస్పత్రి రిపోర్టుపై సందేహం వ్యక్తం చేసిన పోలీసులు, దానిపై మరింత దర్యాప్తు చేయాలన్నారు.
జమ్ము-కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కోల్పోయిందని, దానిని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించామని భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రోజు ఈ ఘటన జరిగింది.
ప్రభుత్వం ఈ ప్రకటన చేసే ముందు కశ్మీర్‌లో వేలాది అదనపు బలగాలను మోహరించారు. అమర్‌నాథ్ యాత్రను కూడా రద్దు చేశారు. స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. పర్యటకులకు వెంటనే అక్కడనుంచి వెళ్లిపోవాలని సూచించారు. టెలిఫోన్లు, ఇంటర్నెట్ సేవలు ఆపేసి, స్థానిక రాజకీయ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు.

పదో తరగతి పరీక్షల్లో అస్రార్ 84 శాతం మార్కులు సాధించినట్లు చూపిస్తున్న అతడి రిపోర్ట్ కార్డ్, అతడు క్రికెట్ ట్రోఫీ అందుకుంటున్న పాత వార్తాపత్రికలోని ఒక ఫొటో ఇప్పుడు ఆ కుటుంబానికి అమూల్యమైన గుర్తులుగా మిగిలిపోయాయి.
"మోదీకి నా బాధ తెలిసిందా, ఆయన దీనికి క్షమాపణ చెప్పారా, దీనిని ఖండించారా? రేపు ఇక్కడ ఇంకొంతమంది చనిపోతారు. ప్రస్తుతం, కశ్మీర్‌లో ఎలాంటి జవాబుదారీతనం లేదు" అని అస్రారా బీబీసీతో అన్నారు.
కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించినప్పటి నుంచి భద్రతా దళాల చర్యల వల్ల అక్కడ ఒక్కరు కూడా చనిపోలేదని భారత ప్రభుత్వం చెబుతోంది. అయితే, అస్రార్ సహా, ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఆందోళన కారులు విసిరిన రాళ్లు తగిలి ఇద్దరు చనిపోయారని చెప్పారు.
ప్రభుత్వ వివరాల ప్రకారం అదే సమయంలో కశ్మీర్‌లో మరో ముగ్గురు కూడా చనిపోయారు. దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు సంచార గొర్రెల కాపరులను సాయుధ తిరుగుబాటుదారులు కాల్చి చంపారు.
ఆగస్టు 29న భార్యతో కలిసి దుకాణంలో ఉన్న వ్యాపారి 60 ఏళ్ల గులాం మహమ్మద్‌ను కూడా మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు కాల్చిచంపారు. తర్వాత పారిపోయారు.
షాపు తెరవద్దని మిలిటెంట్ గ్రూపులు హెచ్చరించినా వినకపోవడం వల్లే గులాంను కాల్చి చంపారని కూడా చెప్పుకుంటున్నారు. దుకాణాలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు తెరవవద్దని హెచ్చరిస్తూ మిలిటెంట్ గ్రూపులు పాంప్లెట్లు పంచిపెట్టాయని కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ చెప్పారు.
బీబీసీ గులాం మహమ్మద్ కుటుంబాన్ని కలిసింది. కానీ వారు మాట్లాడ్డానికి చాలా భయపడిపోయారు. ఆయన హత్య వెనుక కారణం గురించి తెలుసుకోడానికి ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు మాకు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ మిగతా వారు మాత్రం ఇటీవల సంభవించిన తమ సన్నిహితుల అసహజ మరణాలకు 'ప్రభుత్వం చెబుతున్నవి' కారణం కాదని చెప్పారు.
వారిలో ఒకరైన రఫీక్ షాగూ బీబీసీతో ఆగస్టు 9న శ్రీనగర్‌లోని బెమినా ఏరియాలోని తన ఇంట్లో, భార్యతో కలిసి టీ తాగుతున్నప్పుడు తమ ఇంటి పక్కనే ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు.
"ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు ప్రయోగించిన ఒక టియర్ గ్యాస్ షెల్ ఇంట్లో వచ్చి పడింది. దాంతో 34 ఏళ్ల నా భార్య పెహ్మీదా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది" అన్నారు.
"తను నాతో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పింది. నేను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. మధ్యలో నాకేం జరుగుతోందని తను నన్ను అడుగుతూనే ఉంది. చాలా భయపడిపోయింది. డాక్టర్లు చాలా ప్రయత్నించారు. కానీ ఆమెను కాపాడుకోలేకపోయాం" అని రఫీక్ చెప్పారు.
పెహ్మీదా బానో మెడికల్ రిపోర్టులో విషపూరిత వాయువు పీల్చడం వల్లే ఆమె మృతిచెందారని రాశారు. భార్య మరణంపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఆమె భర్త ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేయాలని అనుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీనగర్‌లోని సఫకదల్ ఏరియాలో 60 ఏళ్ల మహమ్మద్ అయూబ్ ఖాన్ మరణం చుట్టూ కూడా పెహ్మీదా బానోకు జరిగినట్లు అప్పటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
"అయూబ్ ఖాన్ ఆగస్టు 17న ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఘర్షణలు మొదలయ్యాయని ఆయన స్నేహితుడు ఫయాజ్ అహ్మద్ ఖాన్ చెప్పారు.
"రెండు టియర్ గ్యాస్ షెల్స్ ఖాన్ పాదాల దగ్గర పడడం నేను చూశాను" అని ఆయన బీబీసీతో చెప్పారు. "అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. కానీ ఖాన్ అప్పటికే చనిపోయారని డాక్టర్లు చెప్పారు. కుటుంబానికి ఎలాంటి మెడికల్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు" అని ఆయన అన్నారు.
కానీ పోలీసులు మాత్రం, ఖాన్ టియర్ గ్యాస్ పీల్చడం వల్లే చనిపోయారంటూ వదంతులు సృష్టిస్తున్నారని మాకు చెప్పారు.
ఆ ప్రాంతంలో దిగ్బంధం ఉన్నా, తరచూ కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఉంటున్నా ప్రభుత్వానికి, భద్రతా దళాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అవి తరచూ హింసాత్మకంగా మారుతున్నాయి.
ఎంతమంది చనిపోయారో చెప్పడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. గాయపడిన వారిలో చాలా మంది ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోడానికి వెనకాడుతున్నారు. ఆందోళనల్లో పాల్గొన్నందుకు పోలీసులు తమను అరెస్టు చేస్తారేమో అని భయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆందోళనకారులు, రాజకీయ నేతలు, వ్యాపారులు సహా ప్రభుత్వం ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు.
కానీ ఇప్పటివరకూ ఎంతమంది మరణించారు లేదా ఎంతమంది గాయపడ్డారనే సంఖ్య తెలుసుకోవడం కష్టమే అయినా, ఈ లెక్కలతో కశ్మీర్‌లో ఇంతకు ముందు కంటే అశాంతి స్థాయి చాలా తక్కువగా ఉందనే స్పష్టమవుతోంది.
"ఇది 2008, 2010, 2016లో ఘర్షణలు జరిగినప్పటి కంటే పూర్తి భిన్నంగా ఉంది. ఆ సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో చనిపోయారు" అని గవర్నర్ సత్యపాల్ మలిక్ మీడియాకు చెప్పారు.
పౌరులకు ఎలాంటి హాని జరగకుండా పరిస్థితిని క్రమంగా సాధారణ స్థితికి తీసుకురావడానికి భద్రతా బలగాలన్నీ రాత్రింబవళ్లూ పనిచేస్తున్నాయి అన్నారు.
అయితే, జనం తమ ఆగ్రహం పూర్తిగా ప్రదర్శించలేకపోవడానికి ప్రధాన కారణం కమ్యూనికేషన్ సేవల నిలిపివేత, సైన్యం అణచివేతే అని చాలా మంది అంటున్నారు.
కశ్మీర్‌లో అమలు చేసిన ఆంక్షలను ఎప్పుడు పూర్తిగా ఎత్తివేస్తారో, ఈ ఆంక్షల వల్ల ఇంకా ఏమేం జరగచ్చు అనేది ఏదీ తెలీడం లేదు.
ఇవి కూడా చదవండి:
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్‌పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
- కశ్మీర్ కోసం భారత్‌తో యుద్ధం రావచ్చు: ఇమ్రాన్ ఖాన్
- కశ్మీర్‌పై ట్రంప్ ఎందుకంత శ్రద్ధ చూపిస్తున్నారు?
- బ్రిటన్ నల్లమందు వ్యాపారం భారతీయులను పేదరికంలోకి ఎలా నెట్టింది
- చంద్రయాన్-2: వైఫల్యానికి కారణం ఇదేనా
- ప్రయోగానికి ముందే రాకెట్ పేలిపోయింది
- కశ్మీర్: మహమ్మద్ గజనీకి ముచ్చెమటలు పట్టించిన హిందూ రాజుల కథ
- 'మమ్మల్ని కొట్టకండి, కాల్చి చంపేయండి...'
- భారత వాయుసేనలో చేరిన అపాచీ హెలికాప్టర్ల దళం.. వీటి ప్రత్యేకతలేంటి
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








