చంద్రయాన్-2: అమెరికా చంద్రుడిపైకి వెళ్లేందుకు చేసిన తొలి ప్రయత్నంలో 27 మంది మృతి

నాసా రాకెట్

ఫొటో సోర్స్, NASA

    • రచయిత, శ్రీకాంత్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చంద్రుడిని చేరుకునేందుకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 చివరి అడుగులో తడబడింది. అంత మాత్రాన ఈ ప్రయోగం వృథా అయ్యిందనుకోనక్కర్లేదు. ఎందుకంటే అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశానికి కూడా తొలి ప్రయత్నంలోనే చంద్రుడి దగ్గరకు వెళ్లడం సాధ్యం కాలేదు. ఎన్నో విఫలయత్నాల తర్వాతే చంద్రుడిపైకి నాసా మిషన్ పూర్తయింది.

Nasa.gov వెల్లడించిన వివరాల ప్రకారం 1969 జులై 20న అపోలో 11 అంతరిక్ష నౌకలో వెళ్లిన అమెరికన్ వ్యోమగాములు తొలిసారిగా చంద్రుడిపై కాలుమోపారు. కానీ అంతకన్నా ముందు పది సార్లు నాసా చంద్రుడి మీద దిగేందుకు విఫలయత్నాలు చేసింది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

మొదటి ప్రయోగం.. రాకెట్టే పేలిపోయింది

1967 ఫిబ్రవరి 21న నాసా అపోలో 1 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. కానీ ప్రయోగ సమయంలో క్యాబిన్లో మంటలు రేగి ప్రయోగానికి ముందే రాకెట్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యోమగాములతోపాటు 27 మంది సిబ్బంది కూడా మరణించారు. అయినా తర్వాత కూడా నాసా ప్రయోగాల్ని కొనసాగిస్తూ వచ్చింది. ఆపై అపోలో 2 నుంచి అపోలో 6 వరకూ వ్యోమగాములు లేకుండా ప్రయోగాలు చేసింది.

ఆ తర్వాత ఆరు ప్రయోగాలు మానవ రహితంగానే చేస్తూ వచ్చింది. ఆపై అపోలో 7 కార్యక్రమాన్ని మాత్రం మానవులతో చేసింది. 1968 అక్టోబర్ 11న షిర్రా, ఏసల్, కన్నింగ్‌హాం అనే ముగ్గురు వ్యోమగాములతో చంద్రుడిపైకి మొదటిసారి మానవ సహిత వ్యోమనౌకను ప్రయోగించింది. ఇందులో కమాండ్ మాడ్యూల్ ప్రయోగాన్ని మాత్రమే నిర్వహించింది. దీంతో కమాండ్ మాడ్యూల్ లో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు.. తిరిగి అక్టోబర్ 22న క్షేమంగా భూమ్మీద ల్యాండయ్యారు.

1968 డిసెంబర్ 25న అపోలో 8 ప్రయోగంలో ఫ్రాంక్ బోర్మన్, బిల్ యాండ్రెస్, జిమ్ లోవెల్‌లతో కూడిన వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి, చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టి వెనక్కి వచ్చేసింది. వాళ్లు చంద్రుడి కక్ష్యలో కూడా ప్రవేశించలేకపోవడంతో ఈ ప్రయోగం అప్పట్లో ప్రపంచానికి తెలియలేదు.

1969 మార్చి 3న చేసిన అపోలో 9 ప్రయోగంలో మరో ముగ్గురితో లూనార్ మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపి పరీక్షించింది. ఆపై 1969 మే18న అపోలో 10 మిషన్ లో కెర్నెన్, యంగ్, స్టాఫోర్డ్ అనే ముగ్గురు వ్యోమగాములతో కూడిన లూనార్ మాడ్యూల్‌ను విజయవంతంగా పంపింది. ఇది చంద్రుడి చుట్టూ నిర్ణీత కక్ష్యలో రెండు రోజుల పాటు పరిభ్రమించింది. ఆపై ఆ వ్యోమగాములు... మే 26న క్షేమంగా భూమ్మీదకు తిరిగి వచ్చారు.

చంద్రుడిపై అడుగుపెట్టిన నాసా వ్యోమగామి

ఫొటో సోర్స్, NASA

11వ ప్రయత్నంలో చంద్రుడిపై కాలుపెట్టారు..

ఇలా ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత... అపోలో 11 మిషన్ లో భాగంగా 1969 జులై 16న... అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి శాటరన్ ఫైవ్ ఎస్ఏ506 రాకెట్ సాయంతో నీల్ ఏ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్, మైఖెల్ కొల్లిన్స్ అనే ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపింది.

అయితే వీరు చంద్రుడి కక్ష్యలో ప్రరిభ్రమించి వెనక్కి వచ్చేస్తారని అంతా అనుకున్నారు. కానీ నాసా మాత్రం వారిని మరింత ముందుకు తీసుకెళ్లేందు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ కమాండ్ మాడ్యూల్ నుంచి ఈగల్ అనే ల్యాండర్ విడిపోయి.. చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించింది.

చంద్రుడి చుట్టూ పరిభ్రమించే కమాండ్ మాడ్యూల్ లో.. మైఖెల్ కొల్లిన్స్ ఉండిపోయారు. ఆయన ల్యాండర్ కి, భూమికి మధ్య వారధిలా ఉంటూ.. చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ ల్యాండర్ ఈగిల్ లో నీల్ ఏ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్ లు చంద్రుడి మీద ల్యాండయ్యారు.

చంద్రుడి మీద ఈగిల్ ల్యాండవ్వగానే.. వ్యోమగాములు బయటకురాలేదు. దాదాపు ఆరు గంటల పాటు ల్యాండర్లోనే ఉండిపోయారు. ఆరు గంటల తర్వాత అంతా క్షేమం అని నిర్ధారించుకున్నాక... నాసా ఆదేశాలతో బయటకు వచ్చారు. అలా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్... చంద్రుడి మీద కాలు పెట్టిన మొదటి మానవుడిగా చరిత్ర కెక్కారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

1972 తర్వాత మనుషుల్ని పంపే ప్రయోగాలను నిలిపేసిన నాసా

అపోలో 11 తర్వాత కూడా నాసా తన ప్రయోగాలు కొనసాగించింది. 1969 నవంబర్ 14న అపోలో 12 రాకెట్ ద్వారా కోన్రాడ్, బీన్, గోడన్ అనే మరో ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది. ఒకవేళ అపోలో-11 చంద్రుడి మీద దిగకలేకపోతే.. అపోలో-12 కమాండర్ పీట్ కన్రాడ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన తొలి మానవుడు అయ్యేవారు.

ఆపై 1970 ఏప్రిల్ 11న అపోలో 13 ప్రయోగంలో మరో ముగ్గురిని చంద్రుడి మీదకు పంపింది. కానీ ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు కమాండ్ మాడ్యూల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో వాళ్లు చంద్రుడి మీద దిగకుండానే వెనుదిరిగి వచ్చేశారు.

ఆ తర్వాత అపోలో 14, అపోలో15 , అపోలో 16, అపోలో 17 ప్రయోగాలతో ఒక్కో విడతలో ముగ్గురేసి వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది. ఈ అన్ని ప్రయోగాల్లోనూ ఇద్దరేసి వ్యోమగాములు చంద్రుడి మీద ల్యాండయ్యారు. ఒకరు మాత్రం కమాండ్ మాడ్యూల్‌లో చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండిపోయారు.

1972 డిసెంబర్ 7న అపోలో 17 చివరి సారిగా ముగ్గురు వ్యోమగాముల్ని పంపింది. ఇలా మూడేళ్ల వ్యవధిలో నాసా 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడి మీద కాలుమోపేలా చేసింది. ఆ తర్వాత చంద్రుడి మీదకు మనుషుల్ని పంపే ప్రయోగాలను నిలిపేసింది.

చంద్రుడిపై కాలనీ

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, చంద్రుడిపై కాలనీ (ఊహాచిత్రం)

ప్రయోగాల్లో ఎన్నో విచిత్రాలు

అపోలో 11 ప్రయోగంలో చంద్రుడి మీదకు వెళ్లిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్ట్రిన్‌తో పాటు... కమాండ్ మాడ్యూల్ లో ఉండిపోయిన మైఖెల్ కొల్లిన్స్ ముగ్గురూ 1930లోనే జన్మించారు. అంతే కాదు, ఈ ముగ్గురూ సైన్యంలో పనిచేశారు. ముగ్గురు పైలెట్లు కూడా. ఇలా ఒకే వయసు, సామర్థ్యాలు ఉన్న వారిని ఒకే మిషన్ కు ఎంపిక చేయడం యాధృచ్ఛికంగానే జరిగింది. అంతేకాదు.. తొలి మూన్ ల్యాండింగ్ మిషన్ పైలట్‌గా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేయలేదు. నిజానికి ఫ్లైట్ రొటేషన్‌లో ఆయన సిబ్బంది వంతు రెండో వరుసలో ఉంది.

చంద్రుడి మీద అడుగు పెట్టేటప్పటికి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ వయసు 38 ఏళ్లు. కానీ అపోలో-16 లూనార్ ల్యాండర్ పైలట్ చార్లీ డ్యూక్ చంద్రుడిపై అడుగుపెట్టిన వారిలో అతి పిన్నవయస్కుడు. చంద్రుడి మీద కాలు మోపేటప్పటికి అతని వయసు 36 ఏళ్లు. ఇక చంద్రుడి మీద నడిచిన వారిలో అత్యధిక వయసున్న వ్యక్తి.. అమెరికా తొలి వ్యోమగామి అలాన్ షెపర్డ్. 1971లో అపోలో-14 మిషన్‌తో చంద్రుడి మీదకు వెళ్లినపుడు ఆయన వయసు 47 సంవత్సరాలు.

మొత్తం అన్ని అపోలో మిషన్లలో 33 మంది చంద్రుడి దగ్గరకు ప్రయాణమయ్యారు. కానీ వారిలో 27 మంది మాత్రమే చంద్రుడి దగ్గరకు వెళ్లారు. వాళ్లలో 24 మంది చంద్రుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించడం వరకూ వెళ్లారు. కానీ వెళ్లిన అందరిలోనూ కేవలం 12 మంది మాత్రమే చంద్రుడి మీద నడిచారు. చంద్రుడి మీద తొలిసారి అడుగుపెట్టినప్పుడు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఏం చెప్పబోతున్నారో అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది.

చంద్రుడి మీద దిగిన తర్వాత.. ఆర్మ్ స్ట్రాంగ్ అన్న మాటలు... ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 'దట్స్ వన్ స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్, వన్ జెయింట్ లీప్ ఫర్ మ్యాన్‌కైండ్ అంటూ ఆయన సాధారణంగా చెప్పిన మాటలు... అంతరిక్ష రంగంలో మానవులు సాధించబోయే ప్రగతికి చిహ్నంగా నిలిచిపోయాయి.

చంద్రయాన్ 2 ఆర్బిటర్, ల్యాండర్ (ఊహాచిత్రాలు)

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, చంద్రయాన్ 2 ఆర్బిటర్, ల్యాండర్ (ఊహాచిత్రాలు)

చంద్రయాన్ 2 పూర్తిగా విఫలం కాలేదు

చంద్రయాన్ 2 లో ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయినంత మాత్రాన.. ల్యాండర్ విక్రమ్‌కి ప్రమాదం జరిగిందని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ల్యాండర్ విక్రమ్ నుంచి సిగ్నళ్లు కట్ అయ్యాయే తప్ప.. దానికి ప్రమాదం జరిగిందని కానీ, అది చంద్రుడి మీద క్రాష్ ల్యాండ్ అయ్యిందని ఎవరూ నిర్ధారించలేదు. కేవలం ల్యాండర్ నుంచి సిగ్నళ్లు మాత్రమే కట్ అయ్యాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్‌తో సేఫ్‌గా ల్యాండయ్యే సామర్థ్యమున్న ల్యాండర్ విక్రమ్ చంద్రుడి మీద క్షేమంగా ల్యాండయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ అది చంద్రుడి మీద నుంచి సిగ్నల్ పంపితే కానీ.. ఆ విషయాన్ని నిర్ధారించడానికి వీల్లేదు. అంత మాత్రాన.. ల్యాండర్ క్రాష్ ల్యాండయ్యిందని కూడా చెప్పడానికీ కుదరదు.

2008లో చంద్రయాన్ 1 ప్రయోగంలో పంపిన ఆర్బిటర్ కూడా 10 నెలల పాటు చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఎంతో కీలకమైన సమాచారాన్ని భూమికి పంపింది. 50 ఏళ్ల కిందట.. అమెరికా చంద్రుడి మీద కాలు మోపి, అక్కడి చంద్ర శిలల్ని భూమికి తీసుకొచ్చినా.. చంద్రుడి మీద నీటి జాడల్ని మాత్రం కనిపెట్టలేకపోయింది.

కానీ చంద్రయాన్ 1 పంపిన డేటాతోనే నెలరాజును జలరాజు అని ఇస్రో కనిపెట్టింది. ఇప్పుడు కూడా చంద్రయాన్ 2 ఆర్బిటర్ పంపే డేటాతో ఇస్రో మరిన్ని అద్భుతాలను ఆవిష్కరించొచ్చు.

అంటే చంద్రయాన్ 2 ప్రయోగం పూర్తిగా విఫలం కాలేదన్నమాట.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)