మత్తు మందులకు మనిషి ఎందుకు బానిస అవుతాడు?

మెదడుకు ఎలక్ట్రోడ్స్‌ ను జత చేయడం ద్వారా కోరికలను ప్రేరేపించవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెదడుకు ఎలక్ట్రోడ్స్‌ ను జత చేయడం ద్వారా కోరికలను ప్రేరేపించవచ్చు
    • రచయిత, డేవిడ్‌ ఎడ్మండ్స్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మనం దేనినైనా ఎక్కువగా కోరుకున్నామంటే దాన్ని మనం ఎంతో ఇష్టపడుతున్నామని అర్ధం. ఇది నిన్న మొన్నటి వరకు చాలామందిలో ఉన్న భావన. కానీ ఇది నిజం కాదని, కోరుకోవడానికి, ఇష్టపడటానికి తేడా ఉందని, ఈ కోరికలను తగ్గించడానికి అవకాశాలు కూడా ఉన్నాయని సైన్స్‌ చెబుతోంది.

ఇది 1970ల మాట. అమెరికాలోని న్యూఅర్లియన్స్‌ రాష్ట్రంలో మానసిక రుగ్మతతో బాధపడుతున్న పేషెంట్ మీద ఓ ప్రయోగం జరిగింది. ఇక్కడ పేషెంట్ పేరును బి-19 అని మాత్రం పిలుద్దాం.

బి-19 నిత్యం అసంతృప్తితో ఉండేవారు. డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉంది. ఆయనలో హోమోసెక్సువల్ లక్షణాలు కూడా కనిపించడంతో మిలటరీ సర్వీసు నుంచి తొలగించారు.

ఆయనను ‘గే’ లక్షణాల నుంచి బైటపడేయడానికి మెదడుకు చికిత్స చేశారు సైకియాట్రీ నిపుణుడు డాక్టర్‌ రాబర్ట్‌ హీత్‌. ఇందులో భాగంగా ఆయన మెదడులోని ప్లెజర్‌ సెంటర్స్‌కు ఎలక్ట్రోడ్‌లను జత చేశారు.

ఇలా మెదడుకు జత చేసిన ఎలక్ట్రోడ్‌లను ఒక బటన్‌ను నొక్కడం ద్వారా బి-19 వాటిని ఆన్‌ చేయగలరు. అలా ఒక సెషన్‌లో కనీసం వెయ్యిసార్లు వాటిని నొక్కగలరు. “అలా నొక్కడం వల్ల ఆయనలో లైంగిక వాంఛలు పుట్టుకొస్తాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌లో బయో సైకాలజీ అండ్‌ న్యూరోసైన్స్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కెంట్‌ బెరిడ్జ్‌ అన్నారు.

మెదడులోని ఎలక్ట్రోడ్‌లను ఆన్‌ చేయడంవల్ల బి-19లో ఒక్కసారిగా స్వయంతృప్తి పొందాలన్న కోరిక కలిగేది. ఎల్‌క్ట్రోడ్‌లను ఆన్‌ చేయడం వల్ల పురుషులతోగానీ, స్త్రీలతోగాని సెక్స్‌ చేయాలన్న కోరిక ఆయనలో బలంగా కనిపించేది. ఎలక్ట్రోడ్‌లను తొలగించే ప్రయత్నం చేస్తే ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు.

కాఫీ తాగాలన్నది ఎప్పుడూ ఇష్టంతో చేసే పని కాకపోవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాఫీ తాగాలన్నది ఎప్పుడూ ఇష్టంతో చేసే పని కాకపోవచ్చు

పరిశీలనలో కొత్త విషయాలు

అయితే సైకాలజీ నిపుణుడు రాబర్ట్‌ హీత్ బి-19లో ఒక కొత్త విషయాన్ని గమనించారు. ఎలక్ట్రోడ్‌లను ఆన్‌ చేశాక మీకేమనిపిస్తోంది అని ఆయనను అడిగారు హీత్‌. సహజంగా ఆయన నుంచి ‘అద్భుతం’, ‘అమోఘం’ అనే స్పందన వస్తుందని ఊహించారు. కానీ అలా జరగ లేదు. అసలు ఆ ఫీలింగ్‌ను ఆస్వాదిస్తున్నట్లు కనిపించ లేదాయన.

మరి అలా అనిపించకపోతే ఎలక్ట్రోడ్‌లను ఆన్‌ చేయగానే ఆయనెందుకు ఉద్రేకానికి లోనవుతున్నారు? తీసేస్తుంటే ఎందుకు ఆగ్రహిస్తున్నారు ?

ఎలక్ట్రోడ్‌లను ఆన్‌ చేస్తే కలిగే సెన్సేషన్‌ను ఆస్వాదించకపోయినా, దాన్ని ఆపేస్తే ఎందుకు అంగీకరించడం లేదు-అన్న పాయింట్‌ దగ్గర తమ ఆలోచన మొదలైందని కెంట్ బెర్రిడ్జ్‌ అన్నారు. ఇదొక పజిల్‌ అంటారాయన.

కోరికకు, ఇష్టానికి పెద్దగా తేడాలేదని న్యూరోసైంటిస్టులు, సైకాలజిస్టులు నిన్నమొన్నటి వరకు భావిస్తూ వచ్చారు. ఈ రెండూ ఒకే అర్ధం వచ్చే పదాలని, పొద్దున్నే లేచి మనం కాఫీ తాగడానికి దాన్ని మనం ఇష్టపడటమే కారణమని చాలామంది అనుకుంటారు.

కోరిక, ఇష్టం అనే వ్యవహారాలను చూసుకునే పని మెదడులోని డోపామైన్‌ అనే హార్మోన్‌దే కాబట్టి ఈ రెండూ ఒకటే అనుకోవడానికి అది కూడా ఒక కారణం. ఈ డోపామైన్‌ అనే హార్మోన్‌ ఆనందానికి(ప్లెజర్‌) మూలకేంద్రం.

ఎలుకలు, మనుషులు తీపిని ఎక్కువ ఇష్టపడటానికి డోపామైన్‌ హార్మోనే కారణం. ఎలుకల్లో ఈ హార్మోన్‌ను తొలగించి, వాటి ముందు తీపి పదార్ధాలను ఉంచినప్పుడు అవి వాటిని పెద్దగా పట్టించుకోలేదు. దీనినిబట్టి డోపామైన్‌ను తొలగించడమంటే ఆనందించే తత్వాన్ని తొలగించడమేనని అందరూ భావించారు.

ముఖకవళికల ద్వారా ఎలుకలలో భావాలను గుర్తించవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముఖకవళికల ద్వారా ఎలుకలలో భావాలను గుర్తించవచ్చు

ఇష్టానికి కోరికకు సంబంధం లేదా?

కానీ ఇది నిజమేనా ? డోపామైన్‌కు, ప్లెజర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనేందుకు కెంట్‌ బెర్రిడ్జ్‌ మరో మార్గంలో ప్రయత్నించారు. డోపామైన్‌ను తొలగించిన ఎలుకల ముందు తీపి పదార్ధాలను పెట్టిన ఆయన అవి వాటిని మామూలుగానే తిన్నట్లు గమనించారు. అంటే వాటిలో ఆ ప్లెజర్‌ అనేది ఇంకా ఉందా ?

తన లేబరేటరీలో కొన్ని ఎలుకల డోపామైన్‌ను ప్రేరేపిస్తే అవి విపరీతంగా తీపి పదార్ధాలను తింటాయేమోనని ఆయన పరిశీలించి చూశారు. కానీ అలా జరగలేదు. ఎలుకలు తమకు కావాలసినంతే తిన్నాయి.

కానీ ఒక సైంటిస్టు ఒక జంతువు ప్లేజర్‌ను అనుభవిస్తుందో లేదోనని ఎలా చెప్పగలడు అన్న అనుమానం చాలామందికి వచ్చింది. అయితే దీనిని గమనించడం చాలా తేలికంటారు కెంట్‌ బెర్రిడ్జ్‌.

మనుషులకు లాగే ఎలుకలలో కూడా ముఖకవళికలు ఉంటాయని, వాటి ద్వారా వాటిలోని భావాలను గుర్తించవచ్చని బెర్రిడ్జ్‌ చెప్పారు. తీపి వస్తువులను తిన్నప్పుడు అవి తమ పెదాలను నాకుతాయని, అదే చేదు, కారంలాంటి వస్తువులు నాలుకకు తగిలినప్పుడు అవి నోరు పెద్దగా తెరిచి తలను విదిలిస్తాయని ఆయన వెల్లడించారు.

మరి ఇలా ఎందుకు జరుగుతోంది? తాము కోరుకోని పదార్ధాలను ఎలుకలు ఎలా తింటున్నాయి ? ఎలుకల మీద ప్రయోగాల ద్వారా కెంట్ బెర్రిడ్జ్‌ ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆ సిద్ధాంతం మీద మొదట్లో ఆయనకే పూర్తిగా గురి కుదరలేదు.

కోరిక, ఇష్టం అనే రెండు అంశాలను నిర్ధారించేది డోపామైన్‌ ఒక్కటేనా ? వేర్వేరు హార్మోనులు వీటిని నిర్ధారిస్తాయా? ఇష్టానికి డోపామైన్‌కు సంబంధం లేదా? ఇది కేవలం కోరిక అనే వ్యవహారాన్నే చూస్తుందా? ఇలా ఎన్నో సందేహాలు.

ఈ సిద్ధాంతాన్ని చాలామంది శాస్త్రవేత్తలు మొదట్లో నమ్మేవారు కాదు. కానీ ఇప్పుడిప్పుడే ఇందులోని వాస్తవాలను గుర్తిస్తున్నారు. డోపామైన్‌ అనేది కేవలం ఉద్రేకాన్ని మాత్రమే ప్రేరేపిస్తుంది. పొద్దున్నే మనం మెట్లు దిగి వెళుతున్నప్పుడు దగ్గర్లో కాఫీ మెషిన్‌ కనిపిస్తే అక్కడికి వెళ్లి ఒక కప్పు కాఫీ తాగమని డోపామైన్‌ రెచ్చగొడుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినమని చెప్పేది, సిగరెట్‌ తాగాలనిపించేలా చేసేది డోపామైన్‌ అనే హార్మోనేనని తేలింది.

డోపామైన్‌ కేవలం కోరికను మాత్రమే రగల్చగలుగుతుందని, ఇష్టానికి దానికీ సంబంధంలేదనే సిద్ధాంతానికి బలమైన ఉదాహరణను కూడా చూపించగలిగారు బెర్రిడ్జ్‌.

తన లేబరేటరీలోని ఎలుకల బోనులో ఒక ఇనుప చువ్వను పెట్టారు. దానికి స్వల్పమైన కరెంట్ షాక్ వచ్చేలా ఏర్పాటు చేశారు. ఎలుకలు దాని దగ్గరకు వచ్చి ముక్కుతోనో, కాలితోనో ముట్టుకున్నప్పుడు వాటికి షాక్‌ కొట్టేది. ఒకటి రెండుసార్లు అలా జరిగిన తర్వాత ఎలుకలు దాని దగ్గరకు వెళ్లడం మానేశాయి. అయితే అందులో ఒక ఎలుకకు డోపామైన్‌ను పెంచి చూసినప్పుడు ఆ ఎలుక షాక్‌ కొట్టినా, పదేపదే దాని దగ్గరకు వెళ్లడం, ముట్టుకోవడం చేస్తున్నట్లు గుర్తించారు. డోపామైన్‌ను ప్రేరేపిస్తున్నంతసేపూ ఆ ఎలుక దాన్ని ముట్టుకుంటూనే ఉంది.

ఇది మనలోని కాఫీ తాగే అలవాటులాంటిదేనంటారు కెంట్‌ బెర్రిడ్జ్‌. ఉదయం పూట కాఫీని కోరుకోవడం, ఇష్టపడటం రెండూ జరిగినా, మధ్యాహ్నం పూట మాత్రం అలా ఉండదు. కాస్తా చేదుగా అనిపించినా దాన్ని తాగాలనుకుంటాం. అంటే ఇక్కడ మనం కోరుకుంటున్నాం, కానీ ఇష్టపడటం లేదు.

దీనినిబట్టి కోరిక అనేది ఇష్టానికంటే భిన్నమైన వ్యవహారమని కెంట్‌ వాదిస్తారు. అయితే దీని అర్ధం మనకు సెక్స్ అంటే ఇష్టమా, ఫుడ్‌ అంటే ఇష్టమా అని నిర్ణయించే జన్యువులలో ఏది దాచుకోవాలో, దేన్ని వదులుకోవాలో తేల్చుకునే వ్యవహారం కాదంటారు కెంట్‌. మనం సెక్సు కావాలని కోరుకుంటున్నామా, ఫుడ్‌ కోసం వెతుక్కుంటున్నామా అన్నదే ముఖ్యమంటారాయన.

కెంట్‌ బెర్రిడ్జ్‌
ఫొటో క్యాప్షన్, కెంట్‌ బెర్రిడ్జ్‌

తేడాలను గుర్తించడం వల్ల ప్రయోజనాలు

కోరికకు, ఇష్టానికి మధ్య ఉన్న తేడాను గుర్తించడం వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం డ్రగ్స్‌, మద్యం, జూదం, తిండిలాంటి వ్యసనాల గురించి లోతైన అవగాహన పెంచుకోవడం. తద్వారా దాని నుంచి బైటపడే మార్గాలను అన్వేషించడం.

వ్యసనపరుల విషయంలో కోరిక అనేది ఇష్టాలకు భిన్నంగా ఉంటుంది. డోపామైన్‌ అనేది కాఫీ మెషిన్‌, సిగరెట్‌లాంటి చుట్టూ ఉన్న పరిస్థితులను నిత్యం గమనిస్తూ సంకేతాలిస్తూ ఉంటుంది. పూర్తిగా నిర్ధారణ కాకపోయినా, వ్యసనపరుల్లో డోపామైన్‌ అనేది మరింత సెన్సిటివ్‌గా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు.

కోరిక మాత్రం ఎప్పటికీ ఆగిపోదు. డ్రగ్స్‌కు అలవాటు పడినవారిలో డోపామైన్‌ కారణంగా ఒక సిరంజ్‌ను చూసినా, స్పూన్‌ను చూసినా, పార్టీకి వెళ్లినా, వీధి చివరకు వెళ్లినా డ్రగ్స్‌ తీసుకోవాలన్న ప్రేరేపణకు గురయ్యే అవకాశం ఉంది.

కోరిక అనేది ఎప్పటికీ చచ్చిపోదు. చచ్చిపోయినా ఎక్కువకాలం మాయం కాదు. అందుకే డ్రగ్స్‌కు అలవాటు పడినవాళ్లు తమ పాత జ్జాపకాలు రాగానే, ఇష్టం ఉన్నా లేకపోయినా వెంటనే మళ్లీ వాటిలో మునిగిపోతారు.

ఎలుకల్లో డోపామైన్ సెన్సేషన్‌ వాటి జీవితంలో సగం కాలంపాటు కొనసాగుతుందని తేలింది. ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న లక్ష్యం ఏమిటంటే ఎలుకల్లో, మనుషుల్లో ఈ డోపామైన్‌ సెన్సెషన్‌ను వెనక్కు మళ్లించవచ్చా అన్నది గుర్తించడం.

ఇక మళ్లీ పేషెంట్ బి-19 విషయానికి వస్తే, ఆయన తనకు ఇష్టం లేకపోయినా తన మెదడులోని ఎలక్ట్రోడ్‌లను ప్రేరేపిస్తూనే ఉన్నారు. “మొదట్లో ఆయన తన భావాలను సరిగా చెప్పలేకపోయారేమోనని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ వాదనకు చాలా ఆధారాలు దొరికాయి. అది ఎలాగంటే.. ఇదిగో నేను రెండోసారి కాఫీ కప్పు కోసం బయలుదేరుతున్నా’’ అంటూ ముగించారు కెంట్‌ బెర్రిడ్జ్‌.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)