కొన్ని పదాలు నాలుక చివరి వరకు వస్తాయి, కానీ గుర్తుకు రావు... వీటిని గుర్తు చేసుకోవడం ఎలా?

జ్ఞాపకశక్తి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రోజర్ క్రేజ్, రిచర్డ్ రాబర్ట్స్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

కొన్నిసార్లు పదాలు నాలుక చివరన ఉన్నట్లే ఉంటాయి. కానీ గుర్తుకు రావు. మీకు తెలుసా, ఇది జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్య కాకపోవచ్చు. దీన్ని తేలిగ్గానే నియంత్రించొచ్చు కూడా.

ఎవరిదైనా పేరు గుర్తు తెచ్చుకోవడానికి మీరు ఇబ్బంది పడ్డారా? కొన్నిసార్లు అతడి ముఖం మన మదిలో మెదలాడుతూనే ఉంటుంది. పేరు మాత్రం నోటికిరాదు. ఎవరైనా కొంచెం క్లూ ఇస్తే, వెంటనే చెప్పేస్తాం. పేర్ల విషయంలోనే కాదు. పదాల విషయంలోనూ ఇలానే జరుగుతుంటుంది. దీనికి కారణం మీరు పదాన్ని గుర్తుపెట్టుకోలేకపోవడం కాదు.

మధ్య వయసు వారు, వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించే జ్ఞాపకశక్తి సమస్యల్లో పదాలను వెతుక్కోవడమూ ఒకటి. బాగా తెలిసిన వ్యక్తులు, తెలిసిన పదాలను ఒక్కోసారి మరచిపోతుంటారు. ఇలా మరచిపోయే పదాల్లో ఎక్కువగా వ్యక్తులు, ఊర్ల పేర్లు లాంటి సంజ్ఞానామాలు, వస్తువుల పేర్లు ఉంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటిని గుర్తుతెచ్చుకోవడానికి ఒక్కోసారి సెకను నుంచి కొన్ని నిమిషాలు, గంటలు, రోజులు కూడా పడుతుందని వారంటున్నారు. ముఖ్యంగా వయసు పైబడటంతో వచ్చే సమస్యలేంటి? అని వృద్ధుల్ని అడిగితే, పేర్లను మరిచిపోవడమేనని ఎక్కువ మంది చెబుతుంటారు.

జ్ఞాపకశక్తి

ఫొటో సోర్స్, Alamy

బాగా తెలిసిన పదాలే

ఇలాంటి సందర్భాల్లో దేనిని గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారో ఆ పదం వారికి బాగా తెలిసే ఉంటుంది. ఉదాహరణకు ఒక ఊరి పేరునే తీసుకుందాం. ఈ పేరు నాలుక చివరే(టిప్ ఆఫ్ ద టంగ్) ఉంటుంది. కానీ గుర్తుకురాదు. ఇలాంటి అనుభవాలను టిప్ ఆఫ్ ద టంగ్(టీవోటీ) స్టేట్‌గా మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇలాంటి పరిస్థితిని సాధారణమే అనుకోవచ్చా?

ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు, ఎందుకు వస్తాయి? అని పరిశోధన చేపడుతున్న మానసిక నిపుణులకు చాలా సవాళ్లు ఎదురవుంటాయి. వీరి పరిస్థితి సూపర్‌నోవాలపై పరిశోధన చేపట్టే ఖగోళ నిపుణుల్లానే ఉంటుంది. ఎందుకంటే సూపర్‌నోవాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఊహించడం కష్టం. అలానే టీవోటీ పరిస్థితులు కూడా వస్తుంటాయి. ఇవి ఎప్పుడు వస్తాయో చెప్పడం కష్టం. ఈ అసందిగ్ధత, అస్పష్టతలే రెండు రకాల పరిశోధనలకు బాటలు పరిచాయి. వీటిలో ఒకటి సహజసిద్ధంగా, రెండోది ప్రయోగశాలల్లో పదాలు మరచిపోయేలా చేయడం ద్వారా. ఈ రెండు విధానాల్లోనూ పరిశోధనలు సాగుతున్నాయి.

పదాలు మరచిపోవడం, టీవోటీలపై పరిశోధన చేపట్టే శాస్త్రవేత్తలు రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. వీటిలో మొదటిది ఎంత ఎక్కువగా ఇలాంటి పరిస్థితి వస్తుంది? రెండోది ఎంత వేగంగా ఎలాంటి సాయమూ లేకుండా ఆ పదాలను గుర్తుతెచ్చుకోగలుగుతున్నారు?

జ్ఞాపకశక్తి

ఫొటో సోర్స్, Getty Images

వృద్ధుల్లోనే ఎక్కువ

టీవోటీ పరిస్థితి ఎదురయ్యేటప్పుడు ఆ విషయాన్ని నమోదు చేయమని పరిశోధనలో పాల్గొన్నవారికి సూచించారు. అనంతర విశ్లేషణలో కాలేజీ విద్యార్థులు వారంలో ఒకటి నుంచి రెండుసార్లు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు బయటపడింది. 60, 70ల వయసులో ఉన్నవారికి ఇది కొంచెం ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. అదే 80ల వయసులో ఉండేవారి విషయానికి వస్తే, కాలేజీ పిల్లల కంటే రెండు రెట్లు ఎక్కువగా వీరిని ఈ సమస్య పీడిస్తున్నట్లు వెల్లడైంది. ఇలా మరచిపోయే పదాల్లో 90 శాతం వరకు సాధారణంగానే గుర్తుకు వస్తాయని బయటపడింది.

ఇలాంటి పరిశోధన ఫలితాలను విశ్లేషించే సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు తమ మతిమరుపు, పదాలు మరచిపోవడాన్ని చాలా ఎక్కువగా నమోదుచేస్తుంటారు. ఎందుకంటే వారు ఇలాంటి వాటి విషయంలో చాలా అప్రమత్తతతో ఉంటారు. యువతతో పోలిస్తే చేయడానికి పెద్దగా పనులు ఉండకపోవడమూ దీనికి ఒక కారణం. కొన్నిసార్లు వెంటనే గుర్తుకు వచ్చిన పదాలను టీవోటీ పదాలుగా రాసేస్తుంటారు.

ఇక రెండో విధానంలో పరిశోధనను పరిశీలిద్దాం. ఇక్కడ ప్రయోగపూర్వకంగా టీవోటీ పరిస్థితి వచ్చేలా, అంటే పదాలు మరచిపోయేలా చేయడం. దీని కోసం హార్వర్డ్ వర్సిటీకి చెందిన మానసిక నిపుణులు రోజెర్ బ్రౌన్, డేవిడ్ మెక్‌నీల్ ఒక విధానాన్ని అభివృద్ధి చేశారు.

జ్ఞాపకశక్తి

ఫొటో సోర్స్, Getty Images

దీనిలో భాగంగా పెద్దగా పరిచయంలేని ఇంగ్లిష్ పదాల నిర్వచనాలను పరిశోధనలో పాల్గొన్నవారికి చెప్పారు. దీంతో చాలా మంది ఆ పదాలను మరచిపోయే పరిస్థితి వస్తుంది. ‘‘చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాల దూరాన్ని కొలిచే ఓ పరికరం పేరు (సెక్స్‌టాంట్), దాని అర్థాన్ని వివరించి చెప్పడం’’ఇది అధ్యయనంలో ఉపయోగించిన టీవోటీ పదం.

ఈ పరిశోధనలో పాల్గొన్నవారు పదాలన్నీ తేలిగ్గానే చెప్పగలిగారు. ఒకవేళ పదం గుర్తుకురాకపోతే, దానికి సంబంధించిన మరిన్ని ప్రశ్నలను బ్రౌన్, మెక్ నీల్ అడిగారు. అలాంటి పరిస్థితుల్లో పదం గుర్తుకురాకపోయినా, దానికి సంబంధించిన సమాచారాన్ని వారు చెప్పగలగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఆ పదం మొదటి అక్షరం ఏమిటి? దానిలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? లాంటి ప్రశ్నలకు పరిశోధకులు అడిగారు. పరిశోధనలో పాల్గొన్నవారు కొన్నిసార్లు తప్పులు చేసినప్పటికీ.. ఆ పదానికి దగ్గర్లోని మరో పదాన్ని చెప్పగలగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఉదాహరణకు సెక్స్‌టాంట్ పదాన్ని మరచిపోయిన వారు.. అస్ట్రోలేబ్, కాంపాస్ లాంటి పదాలను చెప్పగలగారు. అయితే, కొన్నిసార్లు వినడానికి ఒకేలా ఉండే పదాలను కూడా చెప్పారు. సెక్స్‌టెట్, సెక్స్‌టన్ దీనికి ఉదాహరణ.

ఈ పరిశోధన ఫలితాలను పరిశీలిస్తే.. పదాలు మన బుర్రలో ఎలా నిక్షిప్తం అవుతున్నాయో కొంతవరకు తెలుసుకోవచ్చు. అయితే, వృద్ధుల విషయానికి వస్తే.. చాలాసార్లు పదానికి సంబంధించిన ఎలాంటి సమాచారమూ వారు చెప్పలేకపోతున్నట్లు పరిశోధకులు వివరించారు.

జ్ఞాపకశక్తి

ఫొటో సోర్స్, Alamy

ఇలా చేస్తే సరి..

మేధోపరంగా వయసు పెరగడంతో వచ్చే చాలా సమస్యల్లో టీవోటీ పరిస్థితులు కూడా ఒకటి. దీన్ని మనం రెండు విధాలుగా చూడొచ్చు. పదాల అర్థాలు, వాటి మధ్య సంబంధాలను మరచిపోవడమే దీనికి కారణం కావొచ్చు. అదే సమయంలో మరో కారణం దీని వెనుక ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

‘‘దీనికి వయసుతో సంబంధంలేదు. వయసు పైబడే కొద్దీ.. ఎక్కువ సమాచారం దీర్ఘకాలిక స్మృతుల్లో ఉండటంతో వారు ఎక్కువగా మరచిపోతుంటారు’’అని ఇండియానా యూనిర్సిటీకి చెందిన మానసిక నిపుణురాలు డోనా డాల్‌గ్రెన్ చెప్పారు.

కొన్నిసార్లు టీవోటీ పరిస్థితులు ఎదురుకావడం మంచిదేనని పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే వెతుకుతున్న పదం తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి అది గుర్తుకురావడం లేదు. ఈ పదాలను గుర్తుతెచ్చుకునేందుకు ప్రయత్నిస్తే గుర్తుకు కూడా వస్తాయి.

టీవోటీ పరిస్థితులను పదాలు మరచిపోతున్నాం అనేకంటే.. సమాచారాన్ని గుర్తుచేసుకుంటున్నాం అనే కోణంలో చూడాలి. వయసు పైబడేటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురైతే వ్యాయామం చేస్తే మేలని పరిశోధకులు చెబుతున్నారు.

అందుకే ఎప్పుడైనా పదం నాలుక చివరి వరకు వచ్చి ఆగిపోయిందంటే.. దానికి దగ్గర్లోని పదాలను వెతుక్కుంటూ వెళ్లాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)