Sexting అంటే ఏంటి... ఎవరు చేస్తారు, ఎందుకు కోరుకుంటారు?

ఫొటో సోర్స్, Getty Images
తమ ఫొటోలను, వీడియోలను తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారని కొందరు మహిళలు పోలీసులను ఆశ్రయించడం గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. ఇన్నాళ్లూ తనతో చనువుగా వ్యవహరించిన వ్యక్తే మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
మరి, అలా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇతరులతో సంభాషణలు జరిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సెక్స్టింగ్ అంటే ఏమిటి?
అశ్లీల చిత్రాలు, వీడియోలు, సందేశాలు పంపుకోవడాన్ని సెక్స్టింగ్ అంటారు. ఈ రకమైన చాటింగ్ గురించి యువత ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించింది బీబీసీ.
"కొంతమంది పురుషులు సాయంత్రం పూట పనిఒత్తిడి నుంచి బయటపడాలని అనుకుంటారు. అందుకోసం, అందమైన మహిళ ఫొటోలు, వీడియోలు పంపిస్తే బాగుంటుందని అనుకుంటారు. అలాంటి చాటింగ్‌లో పోర్న్ చూసినంత అనుభూతి ఉంటుందని నా స్నేహితుడు ఒకరు చెప్పాడు" అని నిషా అనే యువతి చెప్పారు.
చాటింగ్ సరే. కానీ, నగ్న చిత్రాలు, వీడియోలు పంపించకుండా ఉంటే మంచిదని ఆమె సూచించారు. అలా పంపించడం తనకు ఇష్టం లేదని ఎదుటి వారికి చెప్పాలన్నారు.

పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ యువకుడు మాట్లాడుతూ.. "చాటింగ్ అనేది ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిదన్న దానిమీద ఆధారపడి ఉంటుంది. శారీరక సంబంధం కోరుకునేవారు అలాంటి చాటింగ్ చేసుకుంటే సరే. కానీ, కేవలం స్నేహితులుగా ఉండే వారు అలా చేయడం తప్పు" వివరించారు.
అమ్మాయిలు ఎదుటి వారిని నమ్మి తమ చిత్రాలను, వీడియోలను పంపడం వల్ల వారు బ్లాక్ మెయిలింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుందని అశ్విన్ అనే మరో యువకుడు హెచ్చరించారు.
కొందరు నమ్మించి నగ్న చిత్రాలు తీసుకుని తర్వాత బ్రేకప్ చెప్పేసి మోసం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. "అలా తీసుకున్న ఫొటోలను, వీడియోలను ఎదుటివ్యక్తులు దుర్వినియోగం చేయొచ్చు. అలాంటి చాటింగ్ వల్ల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతాయి" అని అశ్విన్ చెప్పారు.
ఫొటోల్లో ముఖం పూర్తిగా కనిపించకుండా కత్తిరించి పంపితే కాస్త మంచిదని అశ్విన్ సూచించారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ మనోజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. "ఆయా వ్యక్తుల్లో ఒత్తిడి స్థాయిని బట్టి సెక్స్టింగ్ ఉంటుంది. చాలామంది అలాంటి చాటింగ్ ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చన్న ఆలోచనలో ఉంటారు. అందులోంచి వారు కొంత ఉత్సాహాన్ని కూడా పొందాలని ఆశిస్తారు" అని వివరించారు.
సెక్స్టింగ్ అనేది మానసిక రుగ్మతా?
సెక్స్టింగ్ అనేది మానసిక వ్యాధి కాదని మానసిక వైద్యులు ప్రవీణ్ త్రిపాఠి అన్నారు.
"లైంగికతను తెలిజేసేందుకు ఫొటోలు, వీడియోలు మాత్రమే కాదు. అనేక మార్గాలున్నాయి. రాతపూర్వకంగా చెప్తే కాస్త మేలు. అయినా అలాంటి చాటింగ్‌లతోనూ కొందరు బ్లాక్‌మెయిల్ చేసే ప్రమాదం ఉంటుంది." అని ప్రవీణ్ త్రిపాఠి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









