అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు

అన్నదాన కార్యక్రమం

ఫొటో సోర్స్, Reuters

అమెరికాలో ఓ పక్క కోవిడ్ కేసులు పెరుగుతుంటే, మరో పక్క ఆహర బ్యాంకులకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. దేశంలోని సంపన్న ప్రాంతాల్లో కూడా ఆహర కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

తమ కుటుంబాన్ని పోషించడానికి ఆహార బ్యాంకులపై ఆధారపడవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని వర్జీనియా రాష్ట్రంలోని లౌడౌన్‌లో నివసిస్తున్న 30 ఏళ్ల కార్లా క్యాండెలారియో అంటున్నారు.

కోవిడ్ మహమ్మారి విజృభించకముందు కార్లా వృద్ధాశ్రమంలో పని చేస్తూ ఉండేవారు. ఆమె భర్త నిర్మాణ రంగంలో పనిచేసేవారు. ఇద్దరి సంపాదనతో ఇల్లు గడిచిపోయేది. కానీ జూన్‌లో కార్లా ఉద్యోగం కోల్పోయారు.

"అప్పటినుంచీ అంతా మారిపోయింది" అని ఆమె తెలిపారు.

ఆదాయం తగ్గిపోవడమే కాకుండా అనుకోని విధంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చేతిలో ఉన్న డబ్బు కూడా ఖర్చుపెట్టేయాల్సి వచ్చింది. దాంతో కార్లా కుటుంబానికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను తలెత్తాయి. కార్లా దంపతులకు నలుగురు పిల్లలు...11 ఏళ్లు, 9 ఏళ్లు, 4 ఏళ్ల కవలలు ఉన్నారు.

అప్పులు పెరిగిపోవడంతో కుటుంబాన్ని పోషించడం భారమైపోయిందని, ఆహారం కోసం లీస్బర్గ్‌లో ఉన్న లౌడౌన్ ఆహార సహాయ కేంద్రంపై ఆధారపడవలసి వచ్చిందని కార్లా తెలిపారు.

కోవిడ్ సంక్షోభం వల్ల కార్లా కుటుంబంలాగే అనేకమంది అమెరికన్లు రోడ్డున పడిపోయారని సెన్సస్ బ్యూరో డాటా చెబుతోంది.

నవంబర్‌లో ఎనిమిదిమంది అమెరికన్లలో ఒకరికి తరచుగా ఆహారం దొరకని పరిస్థితి ఉన్నదని ఇటీవల విడుదలైన సెన్సస్ సర్వేలో వెల్లడైంది.

నవంబర్‌లో సేకరించిన హౌస్‌హోల్డ్ పల్స్ సర్వే డాటా ప్రకారం..దాదాపు 2.6 కోట్ల వయోజనులు అంటే వయోజనుల జనాభాలో 12% మంది గత వారం రోజుల్లో ఆహర కొరత ఎదుర్కొన్నారని తేలింది.

మొత్తంగా, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆహార అభద్రత రెట్టింపయ్యిందని, 1998 నుంచీ ఇప్పటిదాకా నమోదైన అత్యధిక ఆహార అభద్రత స్థాయి ఇదేనని గణాంకాలు చెబుతున్నాయి.

నవంబర్ ప్రారంభంనుంచీ వారానికి 750నుంచీ 1,100 కుటుంబాలకు లౌడౌన్ ఆహార సహాయ కేంద్రం ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. కోవిడ్‌కు ముందు గణాంకాలతో పోలిస్తే ఇది 225% అధికం.

"ఇంతకుముందెన్నడూ ఇక్కడకు రానివారిని అనేకమందిని ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. చాలామంది ఉపాధి కోల్పోవడంతో తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నారు" అని లౌడౌన్ ఆహార సహాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెన్నీఫర్ మోంట్గోమేరీ తెలిపారు.

శాన్ ఫ్రాన్సిస్కో-మరీన్ ఆహార బ్యాంకులో ఆహారాన్ని ప్యాక్ చేస్తున్న వలంటీర్లు

ఫొటో సోర్స్, Courtesy San Franscisco Marin Food Bank

ఫొటో క్యాప్షన్, శాన్ ఫ్రాన్సిస్కో-మరీన్ ఆహార బ్యాంకులో ఆహారాన్ని ప్యాక్ చేస్తున్న వలంటీర్లు

యూఎస్‌లో సంపన్నమైన శాన్ ఫ్రాన్సిస్కో, మరీన్ ప్రాంతాల్లో పని చేసే శాన్ ఫ్రాన్సిస్కో-మరీన్ ఆహార బ్యాంకు..కోవిడ్‌కు ముందుకన్నా రెట్టింపు స్థాయిలో 60,000లకు పైగా కుటుంబాలకు ఆహారం అందిస్తోందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్ యాష్ తెలిపారు.

మహమ్మరికి ముందు వృద్ధులు, నిరుద్యోగులు అధికంగా ఆహార బ్యాంకులపై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు సేవారంగంలో ఉపాధి కోల్పోయిన కార్మికులు అధికంగా వస్తున్నారని పాల్ యాష్ తెలిపారు.

క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని ఆర్థిక శాస్త్రవేత్త, నార్త్‌వెస్ట్ యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలసీ రిసెర్చ్ డైరెక్టర్ డైనే విట్‌మోర్ షంజెంబాక్ అభిప్రాయపడ్డారు.

మార్చి చివర్లో ఆహార అభద్రత అనూహ్యంగా పెరిగిపోయింది. కానీ లాక్‌డౌన్ తరువాత మెల్లమెల్లగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, ఫెడరల్ రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించడంతో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి.

కానీ క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితుల వలన ఆహార అభద్రత పెరుగుతోందని ప్రొఫెసర్ డైనే విట్‌మోర్ అంటున్నారు.

మార్చిలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ సదుపాయాలు డిసెంబర్ 31తో ముగుస్తాయి. ఈలోగా కాంగ్రెస్ మరో కరోనావైరస్ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించకపోతే మరింతమంది ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వస్తుందని ఆవిడ అభిప్రాయపడ్డారు.

కరోనా సంక్షోభం వలన పిల్లలు గల కుటుంబాలు ఎక్కువగా ప్రభావితం అయినట్లు తెలుస్తోంది. స్కూళ్లు మూతబడడం, పిల్లల్ని చూసుకోవడానికి భార్యాభర్తల్లో ఒకరు ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటివద్దే ఉండిపోవడం మొదలైన కారణాల కారణంగా వీరి ఆర్థిక భారం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.

లక్షలమంది పిల్లలకు స్కూళ్లల్లో ఉచిత భోజనం లేదా అతి తక్కువ ధరలకే భోజనం లభిస్తుంది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ఈ సదుపాయం కోల్పోవడం మరింత కృంగదీస్తుంది అని ప్రొఫెసర్ డైనే విట్‌మోర్ వివరించారు.

కరోనా మోదలైన దగ్గరనుంచీ ఆహార సహాయ కేంద్రాలు, ప్యాంట్రీలు కోట్లమంది అమెరికన్లకు ఆహారాన్ని అందిస్తున్నాయి.

"ఆహార సహాయ కేంద్రాలు అవసరమైనదానికన్నా ఎక్కువగానే సరుకులు అందిస్తున్నాయి. మాంసం, కూరగాయలు, పాలు, గుడ్లు, చీస్, బ్రెడ్ మొదలైనవన్నీ అందిస్తున్నాయి" అని కార్లా తెలిపారు.

ఒక కుటుంబం 14 రోజుల పాటు మూడు పూట్ల వండుకుని తినడానికి సరిపడా సరుకులను లౌడౌన్ ఆహార కేంద్రం అందిస్తుంది. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా సరుకులను గ్రోసరీ బ్యాగ్స్‌లో పెట్టి అందిస్తారు.

"ఇక్కడికి రావడం, ఆహారం కోసం అర్థించడం అంత సులువైన విషయం కాదని మాకు తెలుసు" అని మోంట్గోమేరీ తెలిపారు.

అమెరికాలో ఆకలి కేకలు

ఫొటో సోర్స్, Courtesy Loudoun Hunger Relief

మహమ్మారికి ముందు.. ఏ సమయంలోనైనా ఆహార కేంద్రానికి వెళ్లి కావలసిన సరుకులు తెచ్చుకోవచ్చు. కానీ కోవిడ్ తరువాత నిబంధనలు పెరగడంతో ముందే ఆన్‌లైన్‌లోగానీ, ఫోన్‌లోగానీ అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఆ దేశంలో నివసిస్తున్న వారైతే చాలు, వారందరికీ ఈ కేంద్రాలలో ఆహారాన్ని అందిస్తున్నారు. కానీ ఇది ఎంతవరకూ సాధ్యమో సందేహమే.

పెరుగుతున్న డిమాండ్ చూస్తుంటే ఈ కేంద్రాలను దీర్ఘకాలం నడగలమో లేదో అని సందేహంగా ఉందంటూ మోంట్గోమేరీ దిగులు వ్యక్తం చేసారు.

"ఉద్దీపన ప్యాకేజీ అతి త్వరలో ముగియనుంది. క్రిస్మస్ పండుగ సీజన్ వస్తోంది. మరింత మందికి ఆహార అవసరాలు పెరగొచ్చు" అని పాల్ యాష్ అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మరొక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాల్సి అవసరం ఉందని ప్రొఫెసర్ డైనీ విట్‌మోర్ అభిప్రాయపడ్డారు.

కార్లా త్వరలో ఒక గ్యాస్ స్టేషన్‌లో పార్ట్-జాబ్‌లో చేరనున్నారు. దీంతో వారి కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు.

కానీ అంతవరకూ ఆహార సహాయం కేంద్రానికి వెళ్లడం తప్ప మరొక మార్గం లేదని ఆమె అన్నారు.

"పిల్లలకోసమైనా వెళ్లాలి. తప్పదు" అని కార్లా తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)