పోర్న్‌‌హబ్: యూజర్లు అప్‌లోడ్ చేసిన వీడియోలను తొలగిస్తున్నామన్న అడల్ట్ వీడియో సైట్

పోర్న్‌హబ్ అడల్ట్ వీడియోలు అప్‌లోడ్ చేసే సంస్థ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పోర్న్‌హబ్ అడల్ట్ వీడియోలు అప్‌లోడ్ చేసే సంస్థ

చట్ట వ్యతిరేకమైన వీడియోలు అప్‌లోడ్ చేసిన వివాదం నేపథ్యంలో పోర్న్‌హబ్ తమ సైటులో అనధికారికంగా అప్‌లోడ్ అయిన వీడియోలను చాలా వరకు తొలగించింది. పోర్న్‌హబ్ అడల్ట్ వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసే సంస్థ.

సంస్థపై తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈ వెబ్‌సైటుకు కార్డు ద్వారా చెల్లింపులు చేసే సౌలభ్యం కల్పిస్తున్న మాస్టర్ కార్డు కూడా తన సేవలను ఉపసంహరించుకుంది.

ఈ వెబ్‌సైట్ పిల్లలను వేధింపులకు గురి చేస్తున్న వీడియోలు, అత్యాచార వీడియోలతో చెద పట్టినట్లుగా తయారయిందని న్యూ యార్క్ టైమ్స్ పత్రిక రాసిన రిపోర్టు పేర్కొంది.

పోర్న్‌హబ్ కొత్తగా అమలు చేయబోయే చర్యలు ఇతర సోషల్ మీడియా వేదికల కంటే కఠినంగా ఉంటాయని సంస్థ తెలిపింది.

ఈ సైటుకు అధికారికంగా కంటెంట్ ఇచ్చే భాగస్వాముల నుంచి, వారి కార్యక్రమాలలో సభ్యులుగా ఉన్న వారి నుంచి వచ్చిన వీడియోలను మాత్రమే ఇక పై అప్‌లోడ్ చేస్తారు.

ఇప్పటి వరకు ఈ సైటులో అనధికార సభ్యులు కూడా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. సంస్థ కొత్తగా అమలు చేసిన విధానం వలన కొన్ని లక్షల వీడియోలను సైటు నుంచి తొలగించారు.

పోర్నోగ్రఫీ నిషేధం దిశగా పని చేసే సంస్థలు తమ సైటు వలన ఉన్న లాభాలను పరిశీలించకుండా కేవలం తమను నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని పోర్న్‌హబ్ ఆరోపించింది.

న్యూ యార్క్ టైమ్స్ కథనం వలన తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాలలో భాగంగా పోర్న్‌హబ్ ఈ కొత్త విధానాన్ని అమలు చేసింది.

ఈ సైటులో పొందుపరిచిన వివరాలు మాత్రం ఆఫ్ లైన్ లో వచ్చిన వీడియోలను పూర్తిగా తొలగించినట్లు కాకుండా వాటిని నిషేధించినట్లు మాత్రమే చెబుతున్నాయి.

కొత్త సంవత్సరం నుంచి తమ సైటును వాడే యూజర్లకు కొత్తగా ధ్రువీకరణ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు సంస్థ తెలిపింది.

"దీని వలన పోర్న్‌హబ్ లో అప్‌లోడ్ చేయబోయే ప్రతీ వీడియో సంస్థ ధృవీకరణ చేసిన వారి నుంచి మాత్రమే వస్తుంది. ఇలాంటి విధానాన్ని ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ , టిక్ టాక్, యూ ట్యూబ్, స్నాప్ చాట్, ట్విటర్ లాంటి ప్లాట్ఫారంలు కూడా ఇంకా ప్రవేశ పెట్టలేదు’’ అని సంస్థ తమ బ్లాగులో పేర్కొంది.

"మేము అడల్ట్ కంటెంట్ ప్లాట్ఫారం కావడంతో మాలాగే పని చేస్తున్న సంస్థలతో మమ్మల్ని పోల్చి చూడటం వలన మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది కానీ, మా విధానాల వలన కాదని స్పష్టం అవుతోంది" అని బ్లాగులో రాశారు.

కంటెంట్ అసభ్యకర రీతిలో ఉందని భావించడం వలన, పోర్నోగ్రఫీని నిషేధించాలని కంకణం కట్టుకున్న సంస్థలే ఈ సమస్యలకు కారణమని సంస్థ ఆరోపించింది.

ఆరోపణలేమిటి?

వయస్సు పరిమితి కన్నా తక్కువ ఉన్న పిల్లల కోసం సెర్చ్ చేసినప్పుడు ఈ సైటులో కొన్ని వేల రిజల్ట్స్ వచ్చాయని, వీటిలో చాలా మంది అత్యాచార బాధితులు, వేధింపులకు గురైన వారి వీడియోలు ఉన్నాయని నికోలస్ క్రిస్టోఫ్ రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

ఈ సంవత్సరం మొదట్లో బీబీసీ నిర్వహించిన పరిశోధనలో ఒక మహిళ 14 ఏళ్లప్పుడు అత్యాచారానికి గురైన వీడియో కూడా ఈ సైటులో దొరికింది.

క్రిస్టోఫ్ తన వ్యాసంలో బ్యాంకులు, సెర్చ్ ఇంజిన్లు , కార్డు కంపెనీలు పోర్న్‌హబ్ కి మద్దతివ్వవల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఇందులో మాస్టర్ కార్డు కూడా ఉంది.

ఈ అంశం పై మాస్టర్ కార్డు విచారణకు ఆదేశించి పోర్న్‌హబ్ తో తమ వ్యాపార సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. వీసా కూడా దీని పై విచారణ చేపట్టింది.

పోర్న్‌హబ్ తీసుకున్న ఈ చర్య వలన సంస్థ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ సైటు వాడకం ఉచితమే అయినప్పటికీ కొంత ప్రత్యేక కంటెంట్, నాణ్యతతో కూడిన వీడియోలు చూడాలంటే మాత్రం సంస్థ నెలకు సుమారు 736 రూపాయిలు (9. 99 డాలర్లు) వసూలు చేస్తుంది.

సంస్థ పై చేసిన ఆరోపణలన్నీ "బాధ్యతారాహిత్యమైనవని, అసత్యమైనవని" పోర్న్ హబ్ మాతృ సంస్థ మైండ్ గీక్ వ్యాఖ్యానించింది.

పోర్న్‌హబ్ కి 2019లో 42 వేల కోట్ల సైటు విజిటర్లు ఉన్నట్లు సంస్థ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే ఈ సైటులో ఇప్పటి వరకు 60 లక్షల 83 వేల వీడియోలు అప్‌లోడ్ అయినట్లు తెలిపింది. అయితే, వీటిని పర్యవేక్షించేందుకు ఎంత మంది సిబ్బందిని నియమించిందో మాత్రం చెప్పలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)