సీనోవాక్: చైనా కోవిడ్ వ్యాక్సీన్ గురించి మనకు తెలిసిన విషయాలేమిటి?

సీనోవాక్

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్-19 వ్యాక్సీన్ ఉత్పత్తి కోసం అంతర్జాతీయ పోటీ కొనసాగుతోంది. అయితే చైనా ఈ విషయంలో భారీగా ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. చైనాలో వ్యాక్సీన్ తయారీలో ముందు వరుసలో ఉన్న సంస్థల్లో ఒకటైన సీనోవాక్ ఇప్పటికే విదేశాలకూ వ్యాక్సీన్లను తరలిస్తోంది.

బీజింగ్‌కు చెందిన బయోఫార్మాస్యూటికల్ కంపెనీ సినోవాక్ తయారుచేసిన కోవిడ్ వ్యాక్సీన్ 'కరోనావాక్' పార్సిళ్లు ఇండినేసియాలో దిగాయి. ఆ దేశంలో భారీ స్థాయిలో వ్యాక్సీన్లు ఇవ్వటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరో 18 లక్షల డోసులు జనవరి కల్లా రాబోతున్నాయి.

కానీ.. ఈ వ్యాక్సీన్ తుది దశ ప్రయోగాత్మక పరీక్షలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మరి.. ఈ చైనా వ్యాక్సీన్ ఎంత వరకూ ఫలితాలనిస్తుంది? దీని గురించి తెలిసిన విషయాలేమిటి?

సీనోవాక్, ఇతర వ్యాక్సీన్లకు మధ్య తేడా ఏమిటి?

కరోనావాక్ ఒక ఇనాక్టివేటెడ్ వ్యాక్సీన్. ఇది.. ముందే సంహరించిన వైరస్ కణాలను శరీరంలోకి పంపించటం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. దీనివలన వ్యాక్సీన్ ద్వారా వైరస్ సోకి, జబ్బుపడే ప్రమాదం ఉండదు.

మోడర్నా, ఫైజర్ వ్యాక్సీన్లు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్లు. అంటే.. ఇందులో కరోనావైరస్ జన్యు సంకేతంలో కొంత భాగాన్ని ఉపయోగిస్తారు. దానిని శరీరంలోకి పంపించటం ద్వారా శరీరంలో వైరల్ ప్రొటీన్లు తయారయ్యేలా చేస్తుందీ వ్యాక్సీన్. కానీ వైరస్ పూర్తిగా తయారు కాదు. అసలు వైరస్ మీద దాడిచేయటంపై రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇచ్చేందుకు సరిపోయే స్థాయిలో వైరల్ ప్రొటీన్లు ఉత్పత్తి అవుతాయి.

''కరోనావాక్.. వ్యాక్సీన్ తయారీకి అనుసరించే సంప్రదాయ విధానంలో తయారైంది. రేబిస్ వంటి చాలా ప్రముఖ వ్యాక్సీన్ల తయారీకి ఈ విధానాన్ని విజయవంతంగా ఉపయోగించారు'' అని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ లూ దహాయి బీబీసీకి చెప్పారు.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Udom Pinyo/Getty Images

''ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్లు కొత్త తరహా వ్యాక్సీన్లు. ఈ తరహా వ్యాక్సీన్లను ఇప్పటివరకూ జనంలో విజయవంతంగా ఉపయోగించిన దాఖలాలు లేవు'' అని ఆయన పేర్కొన్నారు.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ తరహాలోనే.. సీనోవాక్‌ను రెండు నుంచి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో సాధారణ ఫ్రిడ్జ్‌లో కూడా నిల్వచేయవచ్చునని చెప్తున్నారు.

అయితే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్‌ను.. చింపాంజీల్లో సాధారణ జలుబును (కామన్ కోల్డ్) కలిగించే వైరస్‌కు జన్యుమార్పిడి చేసి తయారు చేశారు.

మోడెర్నా సంస్థ తయారు చేసిన వ్యాక్సీన్‌ను మైనస్ 20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలోను, ఫైజర్ వ్యాక్సీన్‌ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ నిల్వచేయాల్సి ఉంటుంది.

అంటే.. ఇంత తక్కువ ఉష్ణోగ్రతల్లో భారీ ఎత్తున వ్యాక్సీన్లను నిల్వ చేయలేని అభివృద్ధి చెందుతున్న దేశాలకు.. సీనోవాక్, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్లు ఎక్కువగా ఉపయోగపతాయి.

కరోనా వ్యాక్సీన్లు

ఇది ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది?

ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పటం కష్టం. ద లాన్సెట్ సైంటిఫిక్ జర్నల్ కథనం ప్రకారం.. కరోనావాక్ మొదటి, రెండో దశల ట్రయల్స్‌కు సంబంధించిన సమాచారం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.

మొదటి దశలో 144 మంది మీద, రెండో దశలో 600 మంది మీద నిర్వహించిన ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలను బట్టి.. ఈ వ్యాక్సీన్ ''అత్యవసర వినియోగానికి ఉపయోగపడుతుంది'' అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఝు ఫెంకాయ్ పేర్కొన్నారు.

ఈ వ్యాక్సీన్‌ను 1,000 మందికి పైగా వలంటీర్ల మీద పరీక్షించామని.. వారిలో అసౌకర్యానికి, నీరసానికి గురైన వారి శాతం ఐదు కన్నా తక్కువగానే ఉందని సీనోవాక్‌ ప్రతినిధి యిన్ గత సెప్టెంబర్‌లో చెప్పారు.

ఈ వ్యాక్సీన్‌ తదుపరి దశ ట్రయల్స్‌ను అక్టోబర్ ఆరంభంలో బ్రెజిల్‌లో ప్రారంభించారు. ఒక వలంటీర్ చనిపోయినట్లు వార్తలు రావటంతో నవంబరులో ఈ ట్రయల్స్‌ను కొద్ది రోజులు నిలిపివేశారు. అయితే.. ఆ వలంటీర్ మరణానికి ఈ వ్యాక్సీన్‌తో సంబంధం లేదని తెలియటంతో ట్రయల్స్‌ను పునఃప్రారంభించారు.

ఈ ట్రయల్స్ ఫలితాలను డిసెంబర్ 15వ తేదీ కల్లా ప్రచురించే అవకాశముందని బ్రెజిల్‌లో సీనోవాక్ భాగస్వామ్య సంస్థ ద బుటానాన్ ఇన్‌స్టిట్యూట్ చెప్పింది.

''ప్రాధమిక సమాచారం ఆధారంగా.. కరోనావాక్ సమర్థవంతంగా పనిచేయవచ్చు. అయితే (దీనిని నిర్ధారించటానికి) మూడో దశ ట్రయల్స్ ఫలితాలు రావాల్సి ఉంటుంది'' అని యిన్ పేర్కొన్నారు.

ఈ నెల ఆరంభంలో సావో పాలోకు ఈ వ్యాక్సీన్ సరఫరా అయింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ నెల ఆరంభంలో సావో పాలోకు ఈ వ్యాక్సీన్ సరఫరా అయింది

ఏడాదికి ఎన్ని డోసులు ఉత్పత్తి చేయగలరు?

సీనోవాక్ సంస్థ కొత్తగా నిర్మించిన ఉత్పత్తి ప్లాంటులో ఏటా 30 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగలదని ఆ సంస్థ చైర్మన్ ప్రభుత్వ మీడియా సంస్థ సీజీటీఎన్‌తో చెప్పారు.

ఇతర అన్ని వ్యాక్సీన్ల లాగానే కరోనావాక్‌ను కూడా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.

అంటే.. ఆ సంస్థ ప్రస్తుతం ఏటా 15 కోట్ల మందికి సరిపడా డోసులను మాత్రమే ఉత్పత్తి చేయగలదు. ఇది చైనా జనాభాలో సుమారు పదో వంతు మాత్రమే.

అయితే.. ఈ సంస్థ ఇప్పటికే ఇండొనేసియాకు కొంత మొత్తంలో డోసులను పంపిణీ చేసింది. టర్కీ, బ్రెజిల్, చిలీ దేశాలతోనూ ఒప్పందాలు చేసుకుంది.

వ్యాక్సీన్ దౌత్య పోటీలో నెగ్గే ప్రయత్నం...

వ్యాక్సీన్ దౌత్య పోటీలో నెగ్గటానికి చైనా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

వ్యాక్సీన్లు కొనుక్కోవటానికి ఆఫ్రికా ఖండం కోసం 200 కోట్ల డాలర్లు కేటాయిస్తాయమని; లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకు 100 డాలర్ల రుణం ఇస్తామని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఈ ఒప్పందాలు జరిగితే వాటి విధివిధానాలు ఎలా ఉంటాయనే స్పష్టత లేదు.

''ప్రాణాలను కాపాడే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తన వాణిజ్య, దౌత్య ప్రయోజనాల కోసం తప్పకుండా వాడుకుంటుంది'' అని మెరిక్స్ విశ్లేషకుడు జాకబ్ మార్డెల్ ఏబీసీ న్యూస్‌తో పేర్కొన్నారు.

''దేశాలకు చాలా అవసరమైన ఉత్పత్తి చైనా వద్ద ఉంది. దీనిని అందించటం ఒక దాతృత్వ చర్యగా చూపుతుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాక్సీన్ ఖరీదు ఎంత ఉండవచ్చుననేదీ ఇంకా తెలియదు. అయితే ఈ ఏడాది ఆరంభంలో చైనాలోని జియాజింగ్ నగరం.. ఈ వ్యాక్సీన్ రెండు డోసులను 200 యువాన్లకు (సుమారు 30 డాలర్లు) అందిస్తామని చెప్పింది.

తమ దేశంలో ఈ వ్యాక్సీన్ రెండు డోసుల ధర సుమారు 2,00,000 రుపియాలుగా ఉంటుందని ఇండొనేసియాకు చెందిన ప్రభుత్వ సంస్థ బయో ఫార్మా తెలిపింది.

ఈ ధర ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ ధర కంటే చాలా ఎక్కువ కాగా.. మోడర్నా వ్యాక్సీన్ ధర కన్నా కాస్త తక్కువ. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ ధర ఒక డోసు ధర నాలుగు డాలర్లు అయితే.. మోడెర్నా వ్యాక్సీన్ ఒక డోసు ధర 33 డాలర్లుగా ఉంది.

మోడెర్నా సంస్థ.. 2021 సంవత్సరంలో 50 కోట్ల వ్యాక్సీన్ డోసులు పంపిణీ చేయాలన్నది తమ లక్ష్యంగా చెప్పగా.. ఆస్ట్రాజెనెకా 2021 మొదటి త్రైమాసికం ముగిసే సరికి 70 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని చెప్పింది.

చైనా వ్యాక్సీన్
ఫొటో క్యాప్షన్, అక్టోబర్‌లో చైనాలో వందలాది మంది కోవిడ్ వ్యాక్సీన్లు తీసుకున్నారు

చైనాలో తయారవుతున్న ఇతర వ్యాక్సీన్ల సంగతేమిటి?

చైనాలో మరో ప్రముఖ వ్యాక్సీన్ తయారీ సంస్థ సీనోఫార్మ్.. ఇప్పటికే వివాదాస్పద అత్యవసర కార్యక్రమంలో భాగంగా దాదాపు 10 లక్షల మందికి తన వ్యాక్సీన్ పంపిణీ చేసింది.

ఈ సంస్థ తన మూడో దశ ట్రయల్స్ ఫలితాలను ఇంకా ప్రచురించాల్సి ఉంది.

''సాధారణంగా అయితే.. అత్యవసర వినియోగానికి అనుమతి పొందటం ద్వారా వ్యాక్సీన్ పంపిణీ చేయటానికి ముందు మూడో దశ ట్రయల్స్ విశ్లేషణ కోసం వేచి ఉంటారు'' అని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ డేల్ ఫిషర్ ఇంతకుముందు సీఎన్‌బీసీతో పేర్కొన్నారు.

ఆ ఫలితాలు రాకముందే వ్యాక్సీన్ పంపిణీ చేయటం సంప్రదాయవిరుద్ధమని.. పశ్చిమ దేశాల్లో దీనిని ఆమోదించరని ఆయన చెప్పారు.

ఇదిలావుంటే.. చైనాలో వైరస్ వ్యాప్తిని చాలా వరకూ నియంత్రణలోకి తెచ్చారు. జనజీవనం నెమ్మదిగానే అయినా 'కొత్త సాధారణ' పరిస్థితులకు తిరిగివస్తోంది.

అదనపు సమాచారం: వెట్టి టాన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)