కరోనావైరస్: వ్యాక్సీన్‌లపై వదంతులు... ఎవరు సృష్టిస్తున్నారు ? ఎలా ఆపాలి ?

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, తులిప్‌ మజుందార్‌
    • హోదా, బీబీసీ గ్లోబల్‌ హెల్త్‌ కరస్పాండెంట్‌

కోవిడ్‌-19 నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ల రూపకల్పన వేగంగా కొనసాగుతుండగా, వాటిపై వదంతులు, తప్పుడు వార్తలు కూడా అంతే వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో కొందరు ఆ వ్యాక్సీన్‌లను వేసుకోబోమని చెబుతున్నారు.

కోవిడ్‌తోపాటు ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టిస్తున్న తప్పుడు సమాచారంపై కూడా పోరాడాల్సి వస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వ్యాఖ్యానించింది.

అందుకే వ్యాక్సీన్‌ల విషయంలో ప్రజల ఆందోళనలకు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించడమే కాకుండా సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారానికి వివరణ ఇచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నం చేస్తోంది .

కరోనా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

తప్పుడు సమాచారం ఇచ్చేదెవరు?

లండన్‌లో తన నాన్నమ్మతో కలిసి ఉంటున్న 21 ఏళ్ల నీనాకు వ్యాక్సీన్‌ విషయంలో అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. తాను వ్యాక్సిన్‌ వేసుకోవాలా వద్దా అన్న విషయంలో నీనాకు స్పష్టమైన సమాధానం దొరకడం లేదు.

పైగా ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న సమాచారం ఆమెను మరింత తికమక పెడుతోంది.“ చాలామందిలాగే నేను కూడా ఈ వైరస్‌ త్వరగా పోవాలన్నది నా కోరిక. అయితే ఇంత వేగంగా సిద్ధమైన వ్యాక్సీన్‌లో నాణ్యత ఉంటుందా అన్నది నా అనుమానం‘’ అన్నారు నీనా.

ఆమెలో ఇలాంటి అనుమానాలకు కారణం సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న సమాచారమే. అందుకే ఆమె సంప్రదాయ మీడియా సోర్సుల నుంచి సమాచారం తీసుకున్నారు.

“ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌లలో అనేక రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. వీటి ప్రభావం మన ఆలోచనల మీద ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది ’’ అన్నారు నీనా.

“మన మీద దాడి చేస్తున్న ఈ సమాచార ప్రవాహం మనల్ని ఆలోచించనీయకుండా చేస్తుంది ’’అన్నారు ఆస్కార్‌ హోడ్గేసన్‌. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో ట్రైనీసొలిసిటర్‌గా పనిచేస్తున్న ఆస్కార్‌ వ్యాక్సీన్‌ ట్రయల్స్‌లో పాలు పంచుకుంటున్నారు.

“ప్రస్తుత పరిస్థితుల నుంచి బైటపడటానికి వ్యాక్సీన్‌ ఒక్కటే మార్గం. లేదంటే మనం నిత్యం లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు కొనసాగించాల్సి ఉంటుంది ’’ అన్నారాయన.

ఫైజర్ అమెరికాలో తన వ్యాక్సీన్ అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేసింది

ఫొటో సోర్స్, EPA/BIONTECH

ఫొటో క్యాప్షన్, ఫైజర్ అమెరికాలో తన వ్యాక్సీన్ అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేసింది

నమ్మకాన్ని పెంపొందించుకోవాలి

కోవిడ్‌ మహమ్మారి తీవ్రత కారణంగా వ్యాక్సీన్‌ తయారీకి అనేకమంది పరిశోధకులు ఎంతో కష్టపడి ఏడాదిలోపే వ్యాక్సీన్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ట్రయల్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షిస్తోంది.

“రకరకాల సాంకేతికతను ఉపయోగించి వ్యాక్సీన్‌ల తయరీకి మార్గాల్లో కృషి జరుగుతోంది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డాక్టర్‌ సిల్వీ బ్రయాండ్‌ అన్నారు.

వ్యాక్సీన్‌ల తయారీకి ఇన్నాళ్లూ ఏ పద్ధతులు వాడారో ఇప్పుడు కూడా అవే పద్దతులను ఉపయోగిస్తున్నారు. “మూడో దశ ట్రయల్స్‌ చాలా ఖర్చుతో ముడిపడ్డాయి. కానీ చాలా దేశాలు వాటిని భరించడానికి ముందుకు వచ్చాయి. నిధులు ఎంత ఎక్కువగా ఉంటే వ్యాక్సీన్‌ అంత వేగంగా సిద్ధమవుతుంది’’ అని అన్నారు బ్రయాండ్‌.

కరోనా వ్యాక్సీన్‌ వేగంగా సిద్ధం కావడానికి మూడు ప్రధానమైన కారణాలు కనిపిస్తున్నాయి.

  • కోవిడ్‌కంటే ముందుగానే సిద్ధంగా ఉన్న సాంకేతిక పరిజ్జానం వ్యాక్సీన్‌ను వేగంగా తయారు చేయడానికి పనికొచ్చింది.
  • వ్యాక్సిన్‌ పరిశోధన కోసం నిధులు వేగంగా అందాయి. సాధారణంగా వ్యాక్సీన్‌ తయారీ నిధుల సేకరణకు చాలాకాలం పడుతుంది
  • కోవిడ్‌-19ను పారదోలడానికి అన్ని ప్రపంచ దేశాల ప్రభుత్వాలు వేగంగా స్పందించి సహకరిస్తున్నాయి.

వ్యాక్సీన్‌ పరిశోధనల గురించి సమాచారం ఒకేసారి కాకుండా అప్పుడు కాస్త అప్పుడు కాస్త బైటికి వస్తోంది. ఆ గ్యాప్‌లో కొందరు తప్పుడు సమాచారాన్ని సృష్టిస్తున్నారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

“ప్రజలు వ్యాక్సీన్‌కు సంబంధించిన సమాచారాన్ని వెతుకుతున్నప్పుడు వారికి అసలు సమాచారంతోపాటు తప్పుడు సమాచారం కూడా వస్తోంది. దీంతో వాళ్లకు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్ధంకాక వాస్తవాలను ప్రశ్నించడమో, లేదంటే నమ్మకపోవడమో చేస్తున్నారు’’ అని ప్రొఫెసర్‌ హీడీ లార్సన్‌ అన్నారు. ఆమె లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ సంస్థలో వ్యాక్సీన్‌ కాన్ఫిడెన్స్‌ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్‌ల మీద ప్రజల నమ్మకాలు, అభిప్రాయాలపై లార్సన్‌ పరిశోధన చేస్తున్నారు. ప్రజలు కరోనా వ్యాక్సీన్‌ను తీసుకోవాలా వద్దా అనేదానిపై తప్పుడు సమాచారం ప్రభావం బాగా పడుతోందని ఆమె అంటున్నారు.

వ్యాక్సీన్‌ల గురించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆమె బృందం అమెరికా, యూకేలలో 4,000మందిపై సర్వే నిర్వహించింది. యూకేలో 54శాతంమంది వ్యాక్సీన్‌ తీసుకుంటామని చెప్పారు.

అయితే వ్యాక్సీన్‌ భద్రత విషయంలో అనుమానాలు రేకెత్తాక అందులో 6 శాతంమంది వెనక్కి తగ్గారు. తక్కువ ఆదాయ వర్గాలు, బ్లాక్‌, ఇతర మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు ఎక్కువమంది వ్యాక్సీన్‌లపై అనుమానాలు వ్యక్తం చేశారు.

బ్రిటన్ లో తక్కువ ఆదాయ, మైనారిటీ వర్గాల వారు ఎక్కువగా వ్యాక్సీన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ లో తక్కువ ఆదాయ, మైనారిటీ వర్గాల వారు ఎక్కువగా వ్యాక్సీన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారాన్ని గుర్తించడం ఎలా?

  • సదరు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరు, అతని క్రెడిబిలిటీ ఏమిటి అన్నది ఆన్‌లైన్‌లో పరిశీలించాలి.
  • ఒక సమాచారం వస్తే అది ఎప్పటిదో కూడా గమనించాలి. పాత సమాచారం అప్‌డేట్‌ అయిందా లేదా చూడాలి
  • ఇస్తున్న సమాచారానికి ఆధారాలున్నాయా లేవా అన్నది పరిశీలించాలి.
  • మన విచక్షణను ఉపయోగించింది ఆయా వార్తలు నమ్మదగినవా, కావా ? అన్న నిర్ణయానికి రావాలి

* అధారం: ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రొఫెసర్ లార్సన్
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ లార్సన్

“వ్యాక్సీన్‌కు సంబంధించి ఈ నెలలో(నవంబర్‌) విస్తృతమైన సమాచారం వచ్చింది కాబట్టి నమ్మకం పెరిగింది. వాటిలో ఇంకా పూర్తిస్థాయి నిర్ధారణలు కాలేదు. అందరి దృష్టి వ్యాక్సీన్‌ల వల్ల ప్రమాదాలు ఏంటి అన్నదానిపైనే. ట్రయల్స్‌ను అనేకరకాలుగా పరిశీలించి చూస్తున్నారు కాబట్టి మనం ఆశావహ దృక్పథంతో ఉండాలి ’’ అంటున్నారు ప్రొఫెసర్‌ లార్సన్‌.

ప్రపంచ ఆరోగ్యం సంస్థ అధికారులతో కలిసి తప్పుడు సమాచార నిరోధానికి సంబంధించి పెద్ద పెద్ద టెక్‌ కంపెనీలతో కలిసి పని చేస్తున్నారు ప్రొఫెసర్‌ లార్సన్‌.

తమ ప్లాట్‌ఫాంపై తప్పుడు సమాచారాన్ని తొలగిస్తామని ఫేస్‌బుక్‌, దాని అనుబంధ సంస్థ వాట్సప్‌ల యాజమాన్యం ప్రకటించింది. వ్యాక్సీన్‌లపై తప్పుడు సమాచారాన్ని ఇచ్చేవారు అందించే ప్రకటనలకు కూడా నిరాకరిస్తున్నామని ఫేస్‌బుక్‌ తెలిపింది.

అయితే ఇంత చేసినా తప్పుడు సమాచార ప్రవాహం మాత్రం ఆగడంలేదు. “ నిజమైన సమాచారాన్ని పెంచకుండా ఈ తప్పుడు సమాచారాన్ని ఆపడం కష్టమే ” అన్నారు ప్రొఫెసర్‌ లార్సన్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)