కరోనావైరస్: చైనాలో కేసులు బయటపడక ముందే.. అమెరికాలో కోవిడ్-19 కేసులు ఉన్నాయా?

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

చైనాలోని వూహాన్‌లో ఏడాది క్రితం వరుస కేసులు నమోదుకావడంతో కోవిడ్-19పై అందరి దృష్టి పడింది. అయితే అంతకుముందు నుంచే ఈ వైరస్ మనుషుల్లో ఉందని ఓ అధ్యయనం చెబుతోంది.

ఈ అధ్యయానాన్ని జర్నల్ క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పరిశోధకులు ప్రచురించారు.

శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలుగజేసే ఓ వైరస్ కేసులు వూహాన్‌లో నమోదు అవుతున్నాయని చైనా ఆరోగ్య అధికారులు 2019 డిసెంబరు 31న హెచ్చరికలు జారీచేశారు. అధికారికంగా చెప్పాలంటే ఆ రోజు నుంచే మహమ్మారి వ్యాప్తి మొదలైనట్లు లెక్క.

అయితే, ఆ రోజుకు రెండు వారాల ముందే, అమెరికాలోని మూడు రాష్ట్రాలకు చెందిన 39 మందిలో కోవిడ్-19 యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తాజా అధ్యయనంలో తేలింది.

అమెరికాలో సార్స్-కోవ్-2 కేసులు మాత్రం 2020 జనవరి 21 వరకు అధికారికంగా నమోదుకాలేదు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో 2019 డిసెంబరు 13 నుంచి 2020 జనవరి 17 మధ్య 7,389 మంది రక్త నమూనాలు సేకరించారు. వీరిలో 106 నమూనాల్లో కరోనావైరస్ యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది.

రక్తంలో యాంటీబాడీలు ఉన్నాయంటే.. వారికి వైరస్ సోకిందని, వారిలో రోగ నిరోధక స్పందనలు అభివృద్ధి అయ్యాయని అర్థం.

ఈ 106 నమూనాల్లో 39 నమూనాలను డిసెంబరు 13 నుంచి 16 మధ్య కాలిఫోర్నియా, ఆరేగాన్, వాషింగ్టన్‌లలో సేకరించారు.

మరోవైపు కనెక్టికట్, అయోవా, మసాచుసెట్స్, మిషిగన్, రోడ్ ఐలండ్, విస్కాన్సిన్‌లలో జనవరిలో సేకరించిన మిగతా 67 నమూనాల్లోనూ ఈ యాంటీబాడీలు కనిపించాయి. అప్పటికీ అధికారికంగా ఇక్కడ కరోనావైరస్ విజృంభణ మొదలుకాలేదు.

ముందుగా వైరస్ సోకినట్లు తేలినవారిలో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు. వీరి సగటు వయసు 52.

ఇదివరకున్న కరోనావైరస్‌ల బారినపడటం వల్ల కొందరిలో ఇలాంటి వ్యాధి నిరోధక స్పందనలు వచ్చినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. అయితే, చాలామందిలో ఈ యాంటీబాడీలను చూస్తుంటే.. వీరిలో కొందరికైనా కోవిడ్-19 సోకి ఉండొచ్చని వారు చెబుతున్నారు.

అదే సమయంలో అమెరికాలో సామాజిక వ్యాప్తి ఫిబ్రవరి వరకు మొదలుకాలేదని పరిశోధకులు అంటున్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఎప్పుడు మొదలైంది?

కోవిడ్-19 వైరస్ ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్నకు మనం ఎప్పటికీ సమాధానం కనుగొనలేమేమో..

వుహాన్‌లో డిసెంబరు 2019లో వైరస్ విజృంభణ మొదలుకావడానికి కొన్ని వారాలు, నెలల ముందే వైరస్ జాడలు తమ దేశాల్లో కనిపించాయని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.

మరోవైపు సీడీసీ పరిశోధకులు కూడా.. ఈ యాంటీబాడీలు అభివృద్ధి అయిన వారికి వైరస్ ఎలా సోకింది? సొంత దేశంలోనా? లేకపోతే వేరే దేశాలకు వెళ్లినప్పుడా? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతోంది.

ఈ నమూనాలను రెడ్ క్రాస్ సేకరించింది. తమకు రక్తం ఇచ్చిన వారిలో కేవలం 3 శాతం మంది రక్త దానానికి నెల రోజుల ముందు విదేశాలకు వెళ్లారని తెలిపింది. వారిలో కేవలం 5 శాతం మంది మాత్రమే ఆసియాకు వెళ్లినట్లు పేర్కొంది.

ఇదివరకు కొన్ని అధ్యయనాలు కూడా ఇలానే వూహాన్‌లో హెచ్చరికలు మొదలవ్వకముందే తమ దేశంలో వైరస్ జాడలు కనిపించాయని తెలిపాయి. డిసెంబరు 27న పారిస్‌లో న్యుమోనియా లక్షణాలతో చేరిన ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు తెలిపారు.

మరోవైపు వూహాన్‌లో హెచ్చరికలు మొదలవ్వకముందే.. తాము సేకరించిన తమ నగరాల్లోని మురుగు నీటిలో వైరస్‌ జాడలు కనిపించాయని పరిశోధకులు వివరించారు.

ఇటలీలోని మిలాన్, ట్యూరిన్‌లలో డిసెంబరు 18న సేకరించిన మురుగు నీటిలో కరోనావైరస్ జాడలు కనిపించినట్లు ఇటలీ శాస్త్రవేత్తలు తెలిపారు.

అలాగే.. స్పెయిన్‌లో తొలి కేసు నమోదుకు 40 రోజుల ముందు.. బార్సిలోనాలో సేకరించిన మురుగు నీటిలోనూ వైరస్ జాడలు కనిపించాయని ఓ అధ్యయనం తెలిపింది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

బ్రెజిల్‌లో సైతం ఈ వైరస్ వ్యాప్తి ఎప్పుడు మొదలైందనే అంశంపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

సావోపోలోకు చెందిన 61 ఏళ్ల వ్యాపారవేత్తకు ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఫిబ్రవరి 26న కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఇటలీలో వైరస్ విజృంభించింది.

అయితే, 2019 నవంబరు 27న సేకరించిన మురుగు నీటిలోనూ వైరస్ జాడలు ఉన్నాయని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ శాంటా కాటరీనా పరిశోధకులు తాజాగా వెల్లడించారు.

మరోవైపు బ్రెజిల్‌లో తొలి కేసు నమోదుకు నెల రోజుల ముందే ఓ వ్యక్తిలో వైరస్ జాడలు ఉన్నాయని ఆస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ చేపట్టిన మరో అధ్యయనం కూడా తెలిపింది.

అయితే, సదరు వ్యక్తి విదేశాలకు వెళ్లాడో లేదో ఎలాంటి సమాచారమూ లేదు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఇంతకీ అసలు ఈ వైరస్ వ్యాప్తి ఎప్పుడు, ఎక్కడ, ఏ జంతువు నుంచి మొదలైంది? అనేవి అంతుచిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

మొదట్లో అందరి దృష్టి వూహాన్ మార్కెట్‌పైనే ఉండేది. ఎందుకంటే అక్కడ బతికున్న, చనిపోయిన జంతు మాంసాలను విరివిగా అమ్మేవారు. అయితే అక్కడే వైరస్ మొదలైందా? లేదంటే అక్కడి పరిస్థితులను ఆసరాగా చేసేకుని విజృంభించిందా? అనేది చెప్పడం కష్టమని పరిశోధకులు అంటున్నారు.

‘‘ఈ రెండింటిలో ఏది జరిగే ఎక్కువ అవకాశం ఎక్కువ? అని అడిగితే.. అడవి జంతువులు అమ్మే మార్కెట్ నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువని చెబుతా’’ అని హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్ట్ యూవెన్ క్వోక్ యంగ్ చెప్పారు.

చైనా కూడా వూహాన్‌లో తొలి కేసు నమోదైన తేదీని కాస్త వెనక్కి జరిపింది. ఇలా జరగడం సర్వసాధారణం.

2019 డిసెంబరు 1న తొలి కేసు నమోదైనట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ కేసుకు మార్కెట్‌తో ఎలాంటి సంబంధమూలేదని వూహాన్‌లో వైద్యులు లాన్సెట్‌లో ఒక అధ్యయనాన్ని ప్రచురించారు.

అయితే, మహమ్మారిగా విజృంభించే అవకాశమున్న వైరస్ నెలలపాటు పరిశోధకుల కంట పటకుండా ఉండటం అసాధ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)