కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెజ్ ఫ్రెడెన్బర్గ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా సుగంధ ద్రవ్యాల వాణిజ్యం కొనసాగుతోంది. కానీ, కోవిడ్ మహమ్మారితో ఈ వాణిజ్యం స్తంభించింది.
ఈ ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, తయారీ ప్రక్రియ, ప్యాకేజి చేసే వ్యవస్థలు మాత్రం అస్తవ్యస్తంగా మారిపోయాయి.
పండిన పంటలను ఎవరు సేకరిస్తారు? ఈ ఉత్పత్తులను వాడకానికి అనుగుణంగా మార్చే ప్లాంట్లను ఎవరు నిర్వహిస్తారు? వీటిని విదేశాలకు ఎగుమతులు చేయడానికి ఓడ రేవుల దగ్గరకు ఎలా తీసుకుని వెళతారు? ఈ ఉత్పత్తుల సురక్షతను ఎవరు తనిఖీ చేస్తారు?
అదే సమయంలో సుగంధ ద్రవ్యాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. కొంతమంది వినియోగదారులు ఈ దినుసులను కొన్ని నెలలకు సరిపోయేలా కొనుక్కుని వంట గది అరలను నింపేశారు. దాల్చిన చెక్క, జీలకర్ర, నల్లమిరియాల లాంటి వస్తువులు వంటగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులుగా మారిపోయాయి.
ఔషధ విలువలున్న పసుపు, అల్లం లాంటి వాటికి వినియోగదారుల నుంచి తీవ్రమైన డిమాండ్ వచ్చింది. వీటిని వాడి ఆరోగ్యం కాపాడుకోవచ్చని చాలా మంది భావించారు.
ఈ సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేసి, ఎగుమతి చేసే దేశాలలో భారతదేశం ఒకటి. ఇక్కడ కూడా మార్చి నుంచి దేశ వ్యాప్త లాక్ డౌన్ అమలులోకి రావడంతో రైతులకు, పనుల కోసం వలస కార్మికుల మీద ఆధారపడే వర్తకులకు కూడా సరుకులను సరఫరా చేయడం చాలా కష్ట తరంగా మారింది.
భారతదేశం, వియత్నాం లాంటి దేశాలలో కొన్ని రకాల ఆహార పదార్ధాల ఎగుమతులను నిలిపివేశారు. ఓడరేవుల్లో ఈ సుగంధ ద్రవ్యాలు పేరుకుపోగా , దేశీయ మార్కెట్లలో ఈ ఉత్పత్తులు కుప్పలు తెప్పలుగా నిండిపోయాయి.
దీంతో మార్కెట్‌లో యాలకుల ధర 50 శాతం, వియత్నాం మిరియాల ధర 10 శాతం తగ్గిపోయింది. అయితే ఈ మార్పు తాత్కాలికమే. అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల వ్యాపారం మళ్ళీ తిరిగి పుంజుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో ఉత్పత్తయ్యే మసాలా దినుసులకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. వీటి పెంపకంలో దేశానికి ఘన చరిత్ర ఉండటం మాత్రమే కాకుండా ఇక్కడ ఉండే వాతావరణం, భూభాగం సువాసన భరితమైన సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి అనువుగా ఉంటుంది.
భారత సుగంధ ద్రవ్యాల ఎగుమతుల విక్రయాలు 2019 జూన్‌తో పోలిస్తే 2020 జూన్ నాటికి ఏకంగా 6.7 కోట్ల డాలర్లు పెరిగి 35.9 కోట్ల డాలర్లకు చేరిందని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా చెప్పింది.
సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ఉన్న చిన్న వ్యాపారులకు ఇది శుభవార్తే. కానీ, ఈ పెరిగిన డిమాండు వలన రైతుల ముంగిట్లో మాత్రం ధరలు పెరగలేదని స్పైస్ గ్రోయర్స్ కోపరేటివ్ వ్యవస్థాపకుడు టోమి మేత్యు చెప్పారు.
భారతదేశంలో విధించిన లాక్‌డౌన్ ప్రభావం చాలా మంది రైతులను ఆర్థికంగా కుంగదీసింది. చాలా మంది కుటుంబ సభ్యులు నగరాలలో జీవనోపాధి కోల్పోవడంతో పల్లెటూర్లకు తిరిగి వచ్చారు.
"ఈ సుగంధ ద్రవ్యాల తోటలను సాగు చేసే వారి మీద అదనపు కుటుంబ సభ్యుల పోషణ భారం పడింది. అలాగే, కుటుంబ సభ్యులు నగరాలలో పని చేసి ఇంటికి పంపే అదనపు ఆదాయాన్ని కూడా కోల్పోయారు" అని మేత్యు చెప్పారు.
సుగంధ ద్రవ్యాలకు పెరిగిన డిమాండు.. వాటిని పండించే దగ్గర కూడా కనిపించి ఉంటే అది చాలా మేలు చేసి ఉండేది. వాణిజ్య న్యాయం ప్రాముఖ్యత గురించి ఈ విపత్తు మునుపెన్నడూ లేని విధంగా నిరూపించింది.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, ఈ మహమ్మారి వలన తలెత్తిన సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈ డిమాండు సహాయపడిందని చాలా మంది సుగంధ ద్రవ్యాల వ్యాపార వేత్తలు చెబుతున్నారు.
"ఏప్రిల్, మేలలో మా సుగంధ ద్రవ్యాలకు 15 శాతం డిమాండ్ పెరిగింది" అని సింతైట్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ విజు జాకబ్ చెప్పారు. సుగంధ ద్రవ్యాలు, ఆహార ఉత్పత్తిదారులు వాడే కొన్ని రకాల సువాసన భరిత పదార్ధాల తయారీలో దేశంలో ఉన్న అతి పెద్ద సంస్థల్లో ఈ సంస్థ ఒకటి.
"ఈ విపత్తు సమయంలో వ్యాపారం చేయగలిగే రంగంలో ఉండటం నిజంగా అదృష్టమే" అని ఆయన అన్నారు.
భారతదేశంలో సుగంధ ద్రవ్యాలను చాలా వరకు చిన్న రైతులే పెంచుతారు. ఈ సంస్థ ఉత్తరప్రదేశ్‌లో మిరప రైతుల దగ్గర నుంచి కేరళలో దాల్చిని చెక్క పెంచే రైతుల వరకు కనీసం 10,000 మంది రైతుల నుంచి ఉత్పత్తులను సేకరించి వాటిని వాడకానికి అనువుగా తయారు చేస్తుంది.
సాధారణంగా రైతులు తమ పంటలను స్థానిక ప్రాసెసింగ్ ప్లాంటుల దగ్గరకు తీసుకుని వెళతారు. వీటి నాణ్యత పరీక్షించి, వాటిని తయారు చేసి, ప్యాకేజి చేస్తారు. వీటిని సంస్థ గోదాముల దగ్గరకు తీసుకుని వెళ్లి అక్కడ నుంచి అంతర్జాతీయంగా సరఫరా చేస్తారు.
సక్రమంగా నడిచే ఈ వ్యవస్థను కోవిడ్ తారు మారు చేసింది. "భారతదేశంలో చాలా చోట్ల నిబంధనలు ఉండటంతో వీటి రవాణా సమస్యగా మారింది" అని విజు చెప్పారు.
"ఈ ఉత్పత్తులను ఫ్యాక్టరీల నుంచి పోర్టుల దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి చాలా లాజిస్టిక్ సమస్యలు తలెత్తాయి. అలాగే కొలంబో నుంచి రావల్సిన ఓడ రావడంలో కూడా జాప్యం జరిగింది. మాకు విపత్తేమీ తలెత్తలేదు కానీ, సవాలు మాత్రం ఎదుర్కోవల్సి వచ్చింది" అని ఆయన అన్నారు.
కానీ, పరిస్థితి ఇప్పుడు మెరుగయిందని విజు చెప్పారు. ఇప్పుడు పెరిగిన డిమాండును తట్టుకోవడానికి తమ సంస్థ పసుపు, మిరియాలను వియత్నాం, ఇండోనేసియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే దేశంలో తాము పని చేసే రైతుల సంఖ్యను కూడా 5 - 10 శాతం పెంచినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతే కాకుండా 6000-7000 కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి మాస్కులు, సుగంధ ద్రవ్యాలను విరాళంగా ఇచ్చింది. దీంతో పాటు, సంస్థ వ్యక్తిగత రక్షణ పరికరాలు, శానిటైజర్ల ఉత్పత్తి చేయడం కూడా మొదలు పెట్టింది.
"ఎవరికైనా సహాయం చేయడానికి మేమేమి చేయగలమో ఆలోచించాం. మాతో పాటు మా చుట్టూ ఉండే సమాజం కూడా అభివృద్ధి చెందడం కూడా మేము కోరుకుంటాం" అని విజు చెప్పారు.
"ఈ సుగంధ ద్రవ్యాలు మా కంపెనీ కి చేరాక మేము మెషీన్ల ద్వారా వాటి నాణ్యతను పరిశీలిస్తాము. మాకు నూరు శాతం నాణ్యమైన ఉత్పత్తులు కావాలి. మేము పంట పండించడానికి వాడిన ముడి పదార్ధాలు, నాణ్యత, వాడిన ఎరువులు, రసాయనాలు అన్నిటినీ పరిశీలిస్తాం" అని ఆయన వివరించారు.
ఈ మహమ్మారి సమయంలో ప్లాంటులో నాణ్యతా ప్రమాణాలను పాటించవలసిన అవసరం మరింత పెరిగింది. సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ఎప్పుడూ మోసపూరిత వ్యవహారాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.
ఉదాహరణకు ఆరిగానో పంటలో వచ్చిన ఉత్పత్తుల్లో40 శాతం నకిలీవని తేలింది. కానీ, గత ఆరు నెలల్లో అక్రమ వ్యాపారం పెరిగిందని ఈ అధ్యయనం నిర్వహించిన బెల్ఫాస్ట్ క్వీన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్రిస్ ఎలియట్ అన్నారు.
"కోవిడ్ వలన పెరిగిన నిర్వహణ ఖర్చుల వలన ధరలు పెరుగుతూ ఉండవచ్చు అని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. అకస్మాత్తుగా అదనపు పంట ఎక్కడ నుంచి వస్తుంది?" అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
సాధారణంగా ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపార చెయిన్‌లో అపసవ్య ఉత్పత్తులను వినియోగదారులకు అమ్మకుండా ఉండేందుకు వివిధ దశల్లో నాణ్యతా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. సింతైట్ లాంటి సంస్థలు వాడే సాంకేతికత ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.
ఎలియట్ కూడా ఇలాంటి ఒక సాంకేతికత పై పని చేస్తున్నారు. డిజిటల్ ఫుడ్ ప్రింటింగ్ టెక్నాలజీ సుగంధ ద్రవ్యాల సురక్షత, పరీక్షల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తెస్తుంది అని ఆయన అంటారు
సంప్రదాయ పద్ధతిలో ఈ ఉత్పత్తులను పరిశోధన శాలల్లో పరీక్షిస్తారు. వీటి ఫలితాలు వచ్చే లోపు ఆ ఉత్పత్తి కొన్ని వందల దేశాలకు చేరిపోవచ్చు. ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ అమలులోకి వస్తే ఫలితాలు అక్కడికక్కడే చెప్పేయవచ్చు.
"ఈ వాణిజ్యంలో పేరున్న సంస్థలతో మేము ఈ పరికరాన్ని వాడటం మొదలుపెడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల శాంపిళ్లను సేకరించి ఎక్కడైతే మోసపూరిత వ్యాపారం జరుగుతుందో వాటిని సులభంగా కనిపెట్టేయగలం" అని ఆయన అన్నారు.
కోవిడ్ 19 ఇప్పట్లో అంతమయ్యే సూచనలు కనిపించకపోవడంతో సుగంధ ద్రవ్యాలకు డిమాండు కొనసాగే అవకాశం ఉంది
ఈ లాభాలు రైతులకు చేరుతాయో లేదో చూడాల్సి ఉంది. కానీ, ఈ సాంకేతికత వలన వ్యాపారంలో మరింత పారదర్శకత పెరిగి, నమ్మకమైన వ్యాపారవేత్తలకు లాభం చేకూరుతుంది.
2020 లాంటి పరిస్థితిని ప్రపంచపు వాణిజ్య మార్గాలు మునుపెన్నడూ చూసి ఉండవు. ఈ మహమ్మారికి చాలా పరిశ్రమలు, మార్కెట్లు చాకచక్యంతో స్పందించాయి. ప్రతి నిత్యం వాడే ఉత్పత్తుల వాణిజ్యం సైకిళ్ళ నుంచి విస్కీ వరకు, సుగంధ ద్రవ్యాల నుంచి సెమి కండక్టర్ల వరకు తనను తాను ఎలా మలచుకుంటుందో - లాఘవం, సరికొత్త ఆవిష్కరణలతో అంతర్జాతీయ వాణిజ్యం సరికొత్తగా ఎలా నిర్వచించుకుంటుందో మేడ్ ఆన్ ఎర్త్, రోడ్ టూ రికవరి ఫీచర్ పరిశీలిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- గంగా నదిలోకి ఘరియల్ మొసళ్లను వదులుతున్నారు.. ఎందుకంటే...
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








