గోవాను 451 ఏళ్ల బానిసత్వం నుంచి రామ్ మనోహర్ లోహియా ఎలా విడిపించారు?

ఫొటో సోర్స్, LOHIA TRUST
- రచయిత, రాజేశ్ ప్రియదర్శి
- హోదా, డిజిటల్ ఎడిటర్, బీబీసీ హిందీ
1498లో వాస్కోడీగామా మొదటిసారి భారతదేశానికి వచ్చారు. తరువాత 12 ఏళ్లకు పోర్చుగీసువారు గోవాను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. 1510లో ప్రారంభమైన పోర్చుగీసు పాలనలో గోవా 451 ఏళ్లు మగ్గిపోయింది. 1961 డిసెంబర్ 19న గోవాకు స్వాతంత్ర్యం లభించింది.
అంటే, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పధ్నాలుగున్నర సంవత్సరాల తరువాత గోవాకు విముక్తి లభించింది.
గోవా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేకమంది ప్రముఖుల గురించి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. భారత సైన్యం ఆపరేషన్ విజయ్ (1961) నిర్వహించిన 36 గంటల్లోనే పోర్చుగీస్ జనరల్ మాన్యుయేల్ ఆంటొనియో వసాలో ఎ సెల్వా సరండర్ పత్రం మీద సంతకం పెట్టేసారు.
కానీ ఆపరేషన్ విజయ్ గోవా స్వతంత్ర పోరాటంలో చివరి ఘట్టం. అంతకుమునుపే 1946లో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గోవాలో స్వతంత్ర పోరాట జ్వాలలు రగిలించారు.

ఫొటో సోర్స్, Getty Images
డాక్టర్ లోహియా తన స్నేహితుడు డాక్టర్ జూలియో మెనెజెస్ ఆహ్వానం మేరకు గోవా వెళ్లారు. అక్కడ అసోల్నాలో తన స్నేహితుని ఇంట్లో ఉన్నప్పుడు...పోర్చుగీసువారు ఎటువంటి బహిరంగ సమావేశాలకు అనుమతించడం లేదని లోహియాకు తెలిసింది.
ఓంప్రకాశ్ దీపక్, అరవింద్ మోహన్ రాసిన "లోహియా: ఏక్ జీవనీ (లోహియా: ఒక జీవితచరిత్ర) పుస్తకంలో ఆనాటి పోరాటం గురించి ఇలా రాశారు..."అనారోగ్యం కారణంగా డాక్టర్ లోహియా గోవా వెళ్లి రెస్ట్ తీసుకోవాలనుకున్నారు. కానీ అక్కడకు వెళ్లాక..పోర్చుగీసు పాలన, బ్రిటిష్ పాలనకన్నా ఘోరంగా ఉందన్న విషయం గమనించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి పౌర హక్కులూ లేవు. వెంటనే ఆయన ఒక 200 మందిని సమావేశపరిచి, పౌర హక్కుల కోసం ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు.
1946 జూన్ 18 నాడు లోహియా మొదటిసారిగా ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. ఒంట్లో నలతగా ఉన్నా, ఆరోజు జోరుగా వర్షం పడుతున్నా కూడా లెక్క చెయ్యకుండా పోర్చుగీస్ అణచివేతకు వ్యతిరేకంగా గొంతు విప్పారు. అందుకు ఆయన్ని పోలీసులు నిర్బంధించి మర్గావ్ జైల్లో పెట్టారు. ఇది జరిగిన తరువాత మహాత్మా గాంధీ ‘హరిజన్’ వార్తాపత్రికలో వ్యాసం రాస్తూ పోర్చుగీస్ అణచివేతను తీవ్రంగా విమర్శించారు. డాక్టర్ లోహియాను జైల్లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
దాంతో, పోర్చుగీసువారు లోహియాను గోవా సరిహద్దుల బయట విడిచిపెట్టారు. అంతేకాకుండా ఆయన గోవాలోకి ప్రవేశించకూడదంటూ ఐదేళ్ల నిషేధం విధించారు. కానీ, లోహియా చెయ్యవలసిన పని చేసేసారు. గోవాలో స్వాతంత్ర్య పోరాటానికి ఆజ్యం పోసారు. అక్కడి హిందువులు, కాథలిక్ క్రైస్తవులు.. భారత స్వాతంత్ర్య సంగ్రామం నుంచి ప్రేరణ పొంది సంఘటితమయ్యారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఆజాద్ గోమంతక్ దళ్
గోవానుంచీ పోర్చుగీసువారిని తరిమి కొట్టడంలో మరొక విప్లవ పార్టీ చురుకుగా పనిచేసింది...అదే ఆజాద్ గోమాంతక్ దళ్. విశ్వనాథ్ లవాండే, నారాయణ్ హరి నాయక్, దత్తాత్రేయ్ దేశ్‌పాండే, ప్రభాకర్ సినారి కలిసి ఈ పార్టీని స్థాపించారు.
ఈ పార్టీకి చెందిన అనేకమందిని పోర్చుగీసువారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వీరిలో కొందరిని ఆఫ్రికా తరలించి అక్కడి అంగోలా జైల్లో నిర్బంధించారు. విశ్వనాథ్ లవాండే, ప్రభాకర్ సినారి జైలునుంచీ తప్పించుకోగలిగారు. అంతే కాకుండా, సుదీర్ఘ కాలంపాటూ తమ విప్లవోద్యమాన్ని కొనసాగించారు.

ఫొటో సోర్స్, Getty Images
లోహియాకు గాంధీ మద్దతు
1954లో లోహియా ప్రేరణతో ‘గోవా విమోచన సహాయక సమితి’ ఏర్పడింది. ఈ సమితి సభ్యులు సత్యాగ్రహం, శాసనోల్లంఘన పాటిస్తూ ఉద్యమాన్ని నడిపించారు.
మహారాష్ట్ర, గుజరాత్‌నుంచీ కూడా ఆచార్య నరేంద్ర దేవ్ స్థాపించిన ప్రజా సోషలిస్ట్ పార్టీ సభ్యులు లోహియాకు మద్దతు తెలిపారు.
లోహియా ఏక్ జీవనీ పుస్తకం ప్రకారం...గోవానుంచీ వెళిపోయే ముందు లోహియా, స్వాతంత్ర్యోద్యమం కొనసాగించాలని గోవా ప్రజలకు పిలుపునిచ్చారు. మూడు నెలల తరువాత మళ్లీ గోవా వస్తానని వారికి మాటిచ్చారు. కానీ దేశంలో ఇతర ప్రాంతాలలో మతహింసలు చెలరేగడంతో..గాంధీతో కలిసి వాటిని అడ్డుకునే ప్రయత్నంలో నిమగ్నమైపోయారు.
అయితే, కొన్నాళ్ల తరువాత లోహియా మళ్లీ గోవా వెళ్లారుకానీ వారిని రైల్వే స్టేషన్‌లోనే అరెస్ట్ చేసారు. ఈ సంఘటన గురించి కూడా గాంధీ గట్టిగా మాట్లాడారు. పోర్చుగీసువారు లోహియాను పదిరోజులపాటూ జైల్లో ఉంచి, తరువాత గోవా సరిహద్దుల్లో విడిచిపెట్టారు.
అయితే, గోవా విముక్తి పోరాటంలో గాంధీ మాత్రమే లోహియాకు మద్దతుగా నిలిచారు. నెహ్రూ, పటేల్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవావైపు దృష్టి పెట్టలేదు. అటువైపు దృష్టి సారిస్తే బ్రిటిష్‌వారితో చేస్తున్న ప్రధాన పోరాటం దెబ్బ తింటుందని వారు భావించారు.

ఇంతలో, లోహియా గోవా చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రజలను స్వతంత్ర పోరాటానికి సంఘటితం చెయ్యనారంభించారు. ముంబయిలో నివసిస్తున్న గోవా ప్రజలను సంఘటితం చేసి, ఉద్యమానికి సన్నాహాలు చేసారు. లోహియా తమకు నాయకత్వం వహించాలని గోవా ప్రజలు కోరుకున్నారు. కానీ గోమాంతక్ ప్రజలు తమ పోరాటాన్ని తామే చెయ్యాలని గాంధీ భావించారు. వెంటనే, లోహియాను తన వద్దకు పిలిపించుకున్నారు.
లోహియా ఏక్ జీవనీ పుస్తకం ప్రకారం...1947లో నెహ్రూ కూడా గోవా విషయం అంత ముఖ్యం కాదని భావించారు. గోవా ప్రజలు భారతదేశంలో కలవాలని కోరుకుంటున్నట్లు భావించారు. ఆ తరువాత గోవాలో స్వాతంత్ర్య పోరాట ఉద్యమం మెల్లమెల్లగా క్షీణిస్తూ వచ్చింది. కానీ స్వాతంత్ర్యోద్యమ సృష్టికర్తగా లోహియా గోవా ప్రజల మనసుల్లో నిలిచిపోయారు.
ముఖ్తార్ అనీస్ రాసిన ‘సమాజవాద్ కే శిల్పి’ పుస్తకం ప్రకారం..."అప్పుడు భారతదేశంలో కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ల తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ గోవా సమస్యపై స్పందిస్తూ..గోవా సమస్య భారతదేశ ముఖంపై ఒక మొటిమలాంటిదని, బ్రిటిష్‌వారు వెళ్లిన వెంటనే దాన్ని సులువుగా తొలగించవచ్చని అన్నారు."అయితే, అప్పటి (తాత్కాలిక) ప్రభుత్వానికి, గోవాతో ఎటువంటి సంబంధం లేదని పటేల్ అన్నట్లుగా ఈ పుస్తకంలో రాశారు. గాంధీ మాత్రం లోహియాకు తన మద్దతు కొనసాగించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌తో పాటూ గోవాకు స్వాతంత్ర్యం లభించలేదు
సుదీర్ఘ పోరాటం తరువాత భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందిగానీ గోవా అప్పటికీ పోర్చుగల్ ఆధీనంలోనే ఉంది. 1954లో పాండిచేరికి విముక్తి లభించిందిగానీ గోవాకు స్వతంత్రం లభించలేదు. 1955లో భారతదేశం గోవాపై ఆర్థిక ఆంక్షలు విధించింది. అప్పుడేం జరిగిందనే విషయాలను గోవాకు చెందిన ఒక పెద్దాయన బీబీసీతో పంచుకున్నారు. హిగినో రోబెలోకు అప్పుడు 15 సంవత్సరాలు.
"మేము అప్పట్లో ప్రధాన ఓడరేవు వాస్కోలో నివసించేవాళ్లం. భారతదేశం ఆక్షలు విధించిన తరువాత నెదర్లాండ్స్‌నుంచీ బంగాళాదుంపలు, పోర్చుగల్‌నుంచి వైన్, పాకిస్తాన్‌నుంచి బియ్యం, కూరగాయలు, శ్రీలంక (అప్పటి సిలోన్)నుంచి టీ వచ్చేవి" అని ఆయన చెప్పారు.
తరువాత ఇండియా, పోర్చుగీసువారి మధ్య ఉద్రిక్తత తీవ్రమయ్యింది. లోహియా అనుచరులు అనేకమంది గోవా స్వాంత్రంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు.
అటువంటి ప్రముఖులలో మధు లిమయే ఒకరు. స్వాంత్ర్యోద్యమంలో భాగంగా 1955నుంచీ 1957 వరకూ లిమయే జైల్లో గడిపారు. ఆరోజుల్లో గోవాలోని జైళ్లన్నీ ఉద్యకారులతో నిండిపోయాయి. పోప్ జోక్యం చేసుకుని వీరందరినీ విడిపించాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం కోరింది.

ఫొటో సోర్స్, AFP
చివరకు గోవాకు స్వాతంత్ర్యం ఎలా లభించింది?
1961 డిసెంబర్ 19న గోవాకు స్వతంత్రం లభించింది. అయితే, నెహ్రూ భావించినట్టు అది ముఖంపై మొటిమను తొలగించినంత సులభంగా కాలేదు. పోర్చుగీసువారు గోవాను అంత సులువుగా విడిచిపెట్టలేదు.
1961 నవంబర్‌లో పోర్చుగీస్ సైన్యం గోవా మత్స్యకారులపై కాల్పులు జరిపింది. అందులో ఒకరు మరణించారు. తరువాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పటి భారత రక్షణ మంత్రి కేవీ కృష్ణ మీనన్, నెహ్రూ కలిసి ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు.
డిసెంబర్ 17న ఆపరేషన్ విజయ్ చేపట్టి 30వేల మంది సైనికులను గోవా పంపించాలని నిర్ణయించారు. వాయుసేన, నౌకాదళం కూడా ఇందులో పాల్గొన్నారు.
భారత సైన్యాన్ని అడ్డుకోవడానికి, పోర్చుగీసు సైనికులు వాస్కో దగ్గర ఉన్న వంతెనను పేల్చి వేసారు. అయితే, ఆ ఆపరేషన్ ప్రారంభించిన 36 గంటల్లోనే పోర్చుగీసు ప్రభుత్వం లొంగిపోయింది. గోవాను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించింది.
ఆ విధంగా గోవాను స్వతంత్రంగా చూడాలనుకున్న లోహియా కల నెరవేరింది. అయితే, లోహియా కోరుకున్నట్టు సత్యాగ్రహంతో కాకుండా తుపాకులతోనే అది సాధ్యపడింది.
ఇవి కూడా చదవండి:
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- దేశద్రోహం: బ్రిటిష్ కాలం నాటి చట్టం ఏం చెప్తోంది? సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమిటి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- కొన్ని పదాలు నాలుక చివరి వరకు వస్తాయి, కానీ గుర్తుకు రావు... వీటిని గుర్తు చేసుకోవడం ఎలా?
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








