సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?

సుభాష్ చంద్రబోస్

ఫొటో సోర్స్, NETAJI RESEARCH BUREAU

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హిట్లర్ 1940లో లండన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి అతిపెద్ద శత్రువుల్లో ఒకరైన సుభాష్ చంద్ర బోస్ కలకత్తాలోని ప్రెసిడెన్సీ జైలులో ఖైదీగా ఉన్నారు.

బ్రిటిష్ ప్రభుత్వం బోస్‌ను 1940 జులై 2న దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేసింది. ఆ అరెస్టును నిరసిస్తూ నవంబర్ 29న బోస్ నిరాహార దీక్షను మొదలుపెట్టారు.

ఒక వారం తర్వాత అంటే, డిసెంబర్ 5న గవర్నర్ జాన్ హర్బర్ట్... బోస్‌ను ఓ అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇంటికి పంపించారు. జైల్లో బోస్‌ను చంపారన్న ఆరోపణలు బ్రిటీష్ ప్రభుత్వం మీదకు రాకూడదని ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు.

బోస్ కోలుకున్న తర్వాత తిరిగి జైలుకు తీసుకురావాలని హర్బర్ట్ అనుకున్నారు.

ఈ సమయంలో బోస్ ఇంట్లో ఏం జరుగుతుందన్నదానిపై నిఘా పెట్టేందుకు మఫ్టీలో ఉన్న పోలీసులను కూడా నియమించారు.

బోస్‌ను కలుస్తున్న వ్యక్తులందరిపై నిఘా పెట్టారు. ఆయనకు వచ్చే ఉత్తరాలను కూడా ముందే తెరిచి చూసేవారు.

సుభాష్ చంద్రబోస్

ఫొటో సోర్స్, NETAJI RESEARCH BUREAU

డిసెంబర్ 5 మధ్యాహ్నం బోస్ తన అన్న కొడుకు శిశిర్‌ను 'నాకు ఓ పని చేసి పెడతావా?' అని అడిగారు.

విషయం ఏంటో తెలుసుకోకుండానే 20 ఏళ్ల శిశిర్‌ 'సరే' అన్నారు. ఆ పని బోస్‌ని రహస్యంగా తప్పించుకునేలా చేయడం.

అర్ధరాత్రి కారులో బోస్‌ను తీసుకువెళ్లి, కలకత్తాకు దూరంగా ఉన్న ఓ రైల్వే స్టేషన్‌లో దింపాలని ప్రణాళిక వేసుకున్నారు. ఇంటి ప్రధాన ద్వారం నుంచే బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

వారి వద్ద రెండు కార్లు ఉన్నాయి. ఒకటి జర్మన్ వాండరర్. ఇంకొకటి అమెరికన్ స్టూడ్‌బేకర్ ప్రెసిడెంట్. స్టూడ్‌బేకర్‌ను సులభంగా గుర్తుపట్టే అవకాశాలున్నాయని, జర్మన్ వాండరర్ కారులో వాళ్లు బయల్దేరారు.

ఈ విషయాలన్నింటినీ శిశిర్‌ 'ద గ్రేట్ ఎస్కేప్' అనే పుస్తకంలో వివరించారు.

''కలకత్తాలో ఉన్న వైచల్ మౌలా డిపార్ట్‌మెంట్ స్టోర్‌కు వెళ్లి, బోస్ మారువేషం కోసం వదులుగా ఉన్న సల్వార్‌లు, టోపీ కొన్నాం. ఆ తర్వాత కొద్ది రోజులకు ఓ సూట్‌కేసు, ఓ బ్యాగు, రెండు చొక్కాలు, దిండు, దుప్పటి కొనుక్కువచ్చాం. బోస్ కోసం ఓ నకిలీ విజిటింగ్ కార్డు కూడా ప్రింట్ చేయించాం. దానిపై 'మహమ్మద్ జియావుద్దీన్ బీఏ, ఎల్ఎల్‌బీ, ట్రావెలింగ్ ఇన్‌స్పెక్టర్, ద అంపైర్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, చిరునామా, సివిల్ లైన్స్, జబల్‌పుర్' అని వేయించాం'' అని ఆయన అందులో రాశారు.

సుభాష్ చంద్రబోస్

ఫొటో సోర్స్, NETAJI RESEARCH BUREAU

బోస్ తల్లికి కూడా తెలియదు

వారు కొనుక్కువచ్చిన సూట్‌కేసు వాండరర్ కారు డిక్కీలో పట్టడం లేదు. దీంతో ఓ పాత సూట్‌కేసులోనే సామాను పెట్టారు. దానిపై 'ఎస్‌సీబీ' అని ఉన్న పేరును తీసేసి, ఎమ్‌జెడ్ అని చైనా ఇంకుతో రాశారు.

జనవరి 16న కారు సర్వీసింగ్ చేయించారు.

బ్రిటిష్ వాళ్లకు తెలియకుండా ఉండాలని తాను వెళ్లిపోతున్న విషయాన్ని బోస్ చాలా గోప్యంగా ఉంచారు. ఆఖరికి తన తల్లికి కూడా ఆయన ఈ విషయం చెప్పలేదు.

తన కుటుంబంతో ఆఖరిసారి కలిసి భోజనం చేసి, బోస్ అక్కడి నుంచి బయల్దేరారు. అప్పుడు ఆయన పట్టు కుర్తా, ధోతీ దరించి ఉన్నారు.

''రాత్రి 1.35 సమయంలో బోస్ మారు వేషంలోకి మారారు. పదేళ్ల క్రితం పక్కకు పెట్టిన బంగారు రిమ్‌తో ఉన్న కళ్లద్దాలు ధరించారు. శిశిర్‌ తీసుకువచ్చిన కాబూలీ చెప్పులు ఆయనకు సరిపోలేదు. దూర ప్రయాణాలకు పనికివచ్చే తోలు చెప్పులు వేసుకున్నారు. కారులో వెనుక సీట్‌లో ఆయన కూర్చున్నారు. శిశిర్ దాన్ని నడిపారు. ఓ గంట వరకూ ఇంట్లో బోస్ పడక గదిలో దీపం అలానే ఉంచారు. కలకత్తా మొత్తం నిద్రిస్తున్న సమయంలో లోయర్ సర్క్యులర్ రోడ్, సియాల్దాహ్, హారిసన్ రోడ్‌ల మీదుగా వెళ్లి హుగ్లీ నదిపైనున్న హౌరా వంతెనను వాళ్లు దాటేశారు. చంద్రనగర్ మీదుగా ఆసన్సోల్ అవతలి ప్రాంతానికి వచ్చేశారు. ధన్‌బాద్‌ దగ్గర శిశిర్‌ సోదరుడు అశోక్ ఇల్లు ఉంది. దానికి కొంత దూరంలో ఉదయం ఎనిమిదిన్నర సమయంలో బోస్ కారు దిగిపోయారు. శిశిర్‌ నేరుగా అశోక్ ఇంటికి వెళ్లారు'' అని సుభాష్ చంద్ర బోస్ గురించి 'హిస్ మెజెస్టీస్ అపోనెంట్' అనే పుస్తకం రాసిన సౌగత్ బోస్ చెప్పారు. సౌగత్... శిశిర్‌ కుమారుడు.

''విషయం ఏంటన్నది అశోక్‌కు నేను చెప్పబోతున్నా. ఇంతలో ఇన్సూరెన్స్ ఏజెంట్‌ జియావుద్దీన్‌గా మారువేషంలో ఉన్న బోస్ అక్కడికి వచ్చారు. అశోక్‌కు బీమా పాలసీ గురించి చెప్పబోయారు. అయితే, సాయంత్రం దాని గురించి మాట్లాడదామని అశోక్ ఆయనతో అన్నారు. జియావుద్దీన్‌ విశ్రాంతి తీసుకునేందుకు ఓ గదిని సిద్ధం చేయమని పనివాళ్లకు సూచించారు. జియావుద్దీన్‌కు నన్ను పరిచయం చేశారు. నేను కొద్ది నిమిషాల ముందే ఆయన్ను కారులో అక్కడ దిగబెట్టిన విషయం అశోక్‌కు తెలియదు'' అని శిశిర్‌ కుమార్ 'ద గ్రేట్ ఎస్కేప్' అనే పుస్తకంలో రాశారు.

సుభాష్ చంద్రబోస్

ఫొటో సోర్స్, NETAJI RESEARCH BUREAU

గోమో స్టేషన్లో కాల్కా మేల్ ఎక్కారు

సాయంత్రం జియావుద్దీన్ కొద్దిసేపు అశోక్‌తో మాట్లాడారు. తాను గోమో స్టేషన్ నుంచి కాల్కా మేల్‌ రైలు ఎక్కి తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు.

గోమో స్టేషన్‌కు కాల్కా మేల్ రాత్రి పూట ఆలస్యంగా వస్తుంది. గోమో స్టేషన్‌లో నిద్ర మొహంతో ఉన్న కూలీ బోస్ సామాను మోశారు.

ఆ రైలులో బోస్ దిల్లీ దాకా వెళ్లి, అక్కడి నుంచి ఫ్రాంటియర్ మెయిల్‌లో పెషావర్ చేరుకున్నారని శిశిర్‌ తన పుస్తకంలో రాశారు.

జనవరి 19న సాయంత్రం ఆలస్యంగా ఫ్రాంటియర్ మెయిల్ పెషావర్ కంటోన్మెంట్ స్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్ నుంచి బయటకు వచ్చే గేటు వద్ద మియా అక్బర్ షా నిల్చొని ఉన్నారు.

మారువేషంలో ఉన్న బోస్‌ను ఆయన గుర్తుపట్టారు. అక్కడే ఉన్న ఓ గుర్రపు బండిలో కూర్చోమని బోస్‌కు చెప్పారు. అక్బర్ షా వెళ్లి మరో బండి ఎక్కారు. బోస్ కూర్చున్న బండి, దాన్ని అనుసరిస్తూ ముందుకు కదిలింది.

'నేతాజీస్ గ్రేట్ ఎస్కేప్' అనే పుస్తకంలో అక్బర్ షా ఆ సందర్భం గురించి రాశారు.

''నా గుర్రపు బండి నడుపుతున్న వ్యక్తి ముస్లిం మనిషిని అన్య మతస్థుల హోటల్‌కు ఎందుకు తీసుకు వెళ్తున్నారని నన్ను అడిగారు. 'తాజ్‌మహల్ హోటల్‌కి తీసుకువెళ్లవచ్చు కదా. అక్కడైతే ప్రార్థనలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది' అని అన్నారు. డీన్ హోటల్‌లో పోలీసులు, గూఢచారులు ఉండే అవకాశం ఎక్కువ. నాకు కూడా తాజ్ మహల్ హోటల్ సురక్షితమని అనిపించింది. దారి మార్చుకుని, ఆ హోటల్ వైపు వెళ్లాం. ఆ హోటల్ మేనేజర్‌ను జియావుద్దీన్ బాగా ఆకట్టుకోగలిగారు. దీంతో 'ఫైర్ ప్లేస్' ఉన్న అందమైన గదిని ఆ మేనేజర్ జియావుద్దీన్‌కు ఇచ్చారు. మరుసటి రోజు నా సహచరుడు ఆబాద్ ఖాన్ ఇంటికి బోస్‌ను తీసుకువెళ్లా. కొన్ని రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నారు. జియావుద్దీన్ వేషం తీసి, పఠాన్ వేషంలోకి మారారు. అక్కడి పష్తో భాష బోస్ మాట్లాడలేరు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది'' అని అక్బర్ షా రాశారు.

సుభాష్ చంద్రబోస్

ఫొటో సోర్స్, NETAJI RESEARCH BUREAU

బోస్ పెషావర్‌కు చేరుకోకముందే, ఆయన్ను సరిహద్దులు ఎలా దాటించాలన్నదానికి ప్రణాళిక సిద్ధమైంది. అక్బర్ ఈ పని కోసం ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన మహమ్మద్ షా, భగత్‌రామ్ తల్వార్‌లను ఎంచుకున్నారు. భగత్ రామ్... రహమత్ ఖాన్‌గా మారుపేరు పెట్టుకున్నారు.

జియావుద్దీన్ మూగ, చెవిటి వ్యక్తి అని చెప్పి... ఆయనకు మాటలు, వినికిడి రావాలని ప్రార్థన చేసేందుకు అడ్డా షరీఫ్‌కు తీసుకువెళ్తున్నామని చెప్పి బోస్‌ను తరలించాలని వాళ్లు ప్రణాళిక వేసుకున్నారు.

1941 జవనరి 26న ఉదయం జియావుద్దీన్, రహమత్ ఖాన్ ఒక కారులో ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం వరకు వాళ్లు బ్రిటీష్ సామ్రాజ్యం సరిహద్దులను దాటారు. అక్కడ కారు వదిలేసి, వాయువ్య ప్రాంతంలో సరిహద్దుల్లోని కఠినమైన కబాయెలీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లారు.

27-28 జనవరి అర్ధరాత్రి అఫ్గానిస్తాన్‌లోని ఓ గ్రామానికి వారు చేరుకున్నారు.

''టీ పొడి పెట్టెలున్న ఓ ట్రక్కును లిఫ్ట్ అడిగి, జవనరి 28న వాళ్లు జలాలాబాద్ చేరుకున్నారు. మరుసటి రోజు జలాలాబాద్ సమీపంలోని అడ్డా శరీఫ్ మజార్ వద్ద బస చేశారు. జనవరి 30న రెండు గుర్రపు బండ్లు తీసుకుని కాబూల్ వైపు వెళ్లారు. ఆ తర్వాత ఇంకో ట్రక్కు ఎక్కి బుద్ ఖాక్ చెక్ పాయింట్ చేరుకున్నారు. మళ్లీ అక్కడ మరో గుర్రపు బండి తీసుకుని, 1941 జనవరి 31 ఉదయం కాబూల్‌లో అడుగుపెట్టారు'' అని అక్బర్ షా తన పుస్తకంలో రాశారు.

సుభాష్ చంద్రబోస్

ఫొటో సోర్స్, NETAJI RESEARCH BUREAU

ఆనంద్ బజార్ పత్రికలో వార్త

గోమో స్టేషన్‌లో బోస్‌ను దింపిన తర్వాత శిశిర్‌ జనవరి 18న కలకత్తాకు తిరిగివెళ్లారు. ఆ తర్వాత ఆయన తన తండ్రితో కలిసి బోస్ రాజకీయ గురువు చిత్తరంజన్ దాస్ మనుమరాలి పెళ్లికి వెళ్లారు.

అక్కడ బోస్ ఆరోగ్యం గురించి అడిగినప్పుడు, ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు చెప్పారు.

''ఎగ్లిన్ రోడ్‌లో ఉన్న బోస్ ఇంటిలో ఆయన గదికి రోజూ ఆహారం వెళ్తూ ఉంది. బోస్ సోదరుడి కుమారులు వాటిని తింటూ ఉన్నారు. అక్కడున్నవాళ్లకి గదిలో బోస్ ఉన్నట్లు అనిపించాలని వాళ్లు అలా చేశారు'' అని సౌగత్ బోస్ తన పుస్తకంలో రాశారు.

నాలుగైదు రోజుల వరకూ తాను పారిపోయిన విషయం బయటకు రాకుండా చూస్తే, దేశం దాటి తాను వెళ్లవచ్చని బోస్ శిశిర్‌కు చెప్పారు.

జనవరి 27న ఓ కోర్టులో బోస్‌కు వ్యతిరేకంగా ఓ కేసు విచారణ జరగాల్సి ఉంది. ఆ రోజు బోస్ కనిపించడం లేదని కోర్టుకు వాళ్లు చెప్పారు. బోస్ సోదరుడి కుమారులు పోలీసులకు కూడా ఈ సమాచారం ఇచ్చారు.

ఈ విషయం విని, బోస్ తల్లి ప్రభావతి ఏడ్వడం మొదలుపెట్టారు. ఆమె ఓదార్పు కోసం బోస్ సోదరుడు శరత్... శిశిర్‌ను బోస్‌ వెతుకులాట కోసం పంపించారు.

జనవరి 27న బోస్ మాయమైన విషయం మొదటగా ఆనంద్ బజార్, హిందుస్థాన్ హెరాల్డ్ పత్రికల్లో అచ్చయింది.

ఆ తర్వాత రాయిటర్స్ వార్తా సంస్థ ఆ వార్తను ప్రపంచమంతటికీ చేరవేసింది. బ్రిటిష్ గూఢచారులకు, అధికారులకు ఇది ఓ అవమానకరమైన విషయంగా మారింది.

''బోస్ సన్యాసుల్లో కలిసిపోయారన్న వదంతులను మేం బలోపేతం చేశాం. గాంధీ టెలీగ్రామ్ ద్వారా బోస్ గురించి ఆరా తీసినప్పుడు కూడా అలాగే బదులు ఇచ్చాం. కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ముందు మాత్రం అబద్ధం చెప్పలేకపోయాం. 'బోస్ ఎక్కడున్నా, మీ ఆశీర్వాదం అందుతుంది' అని చెప్పాం'' అని శిశిర్‌ వివరించారు.

బోస్ పారిపోయిన విషయం తెలిసి వైస్రాయ్ లిన్లిత్‌గో అగ్గి మీద గుగ్గిలమయ్యారు. బెంగాల్ గవర్నర్ హార్బర్ట్‌కు చీవాట్లు పెట్టారు.

బోస్ దేశం దాటింది నిజమే అయితే, అది బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రయోజనకరమైన విషయమేనని హార్బర్ట్ వివరణ ఇచ్చారు. అయితే, లిన్లిత్‌గో ఈ వాదనను అంగీకరించలేదు.

ఈ పరిణామంతో బ్రిటీష్ ప్రభుత్వం పరువు పోయిందని ఆయన అన్నారు.

'బోస్ సన్యాసిగా మారి ఉండొచ్చు. కానీ, అది మత కారణాలతో కాదు, విప్లవ ప్రణాళికలు రచించేందుకే అయ్యుంటుంది'' అని కలకత్తా స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ జేవీబీ జాన్‌రీవన్ అప్పట్లో అభిప్రాయపడ్డారు.

సుభాష్ చంద్రబోస్

ఫొటో సోర్స్, NETAJI RESEARCH BUREAU

జర్మనీతో సంప్రదింపులు, ఇటలీ పాస్‌పోర్టు

జనవరి 31న కాబుల్ చేరుకున్నప్పుడు, లాహోరీ గేట్ సమీపంలోని ఓ హోటల్‌లో జియావుద్దీన్ వేషంలో బోస్ బస చేశారు. అక్కడ సోవియట్ రాయబారిని సంప్రదించేందుకు రహమత్ ఖాన్ ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. జర్మన్ రాయబారిని సంప్రదించాలని బోస్ అప్పుడు నిర్ణయం తీసుకున్నారు.

''బోస్‌ను భారతీయ మిత్రుల మధ్యలోనే దాగి ఉండాలని సలహా ఇచ్చాను. ఆయన తరఫున నేను రష్యా రాయబారిని సంప్రదించాను'' అని బోస్‌ని కలిసిన తర్వాత కాబూల్‌లో జర్మనీ రాయబారిగా ఉన్న హాస్ పిల్గేర్ ఫిబ్రవరి 5న జర్మనీ విదేశాంగ మంత్రికి సందేశం పంపారు.

బోస్ అక్కడి నుంచి బయటపడే విషయంలో జర్మనీ, రష్యాల మధ్య ఏకాభిప్రాయం కుదిరేవరకూ ఆయన సీమెన్స్ కంపెనీకి చెందిన హేర్ టామ్స్ ద్వారా జర్మన్ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలోనే బోస్, రహమత్ ఖాన్‌లకు ముప్పు పెరిగింది.

అఫ్గాన్ పోలీసు అధికారి ఒకరికి వారిపై అనుమానం వచ్చింది. డబ్బులు, బోస్ బంగారు గడియారం ఇచ్చి, ఆ పోలీసును వాళ్లు మాట్లాడకుండా చేశారు. ఆ గడియారం బోస్‌కు తన తండ్రి ఇచ్చిన కానుక.

కాబూల్‌లో ఉన్న ఇటలీ రాయబారి పాయిత్రో క్వారోనీని కలవాలని బోస్‌కు హెర్ టామ్స్ నుంచి సందేశం వచ్చింది.

1941 ఫిబ్రవరి 22 రాత్రి ఇటలీ రాయబారితో బోస్ భేటీ అయ్యారు. 16 రోజుల తర్వాత అంటే మార్చి 10న ఆ రాయబారి భార్య ద్వారా బోస్‌కు వేరే దుస్తుల్లో ఫొటో తీయించుకోమని సందేశం అందింది.

''ఇటలీ దౌత్య అధికారి ఓర్లాండో మజోటా పేరుతో ఉన్న పాస్‌పోర్టుపై బోస్ ఫొటో అంటించి ఇచ్చారు, మార్చి 17న బోస్‌ను ఇటలీ దౌత్య అధికారి సినోర్ క్రెససినీ ఇంటికి తీసుకువెళ్లారు. ఉదయం జర్మన్ ఇంజినీర్ వెంగర్, మరో ఇద్దరితో కలిసి బోస్ కారులో ప్రయాణమయ్యారు. అఫ్గానిస్తాన్ సరిహద్దు దాటి, సమర్‌కంద్ చేరుకున్నారు. అక్కడి నుంచి రైల్లో మాస్కో వెళ్లారు. ఆ తర్వాత జర్మనీ రాజధాని బెర్లిన్ చేరారు'' అని సౌగత్ బోస్ తన పుస్తకంలో రాశారు.

సుభాష్ చంద్రబోస్

ఫొటో సోర్స్, NETAJI RESEARCH BUREAU

కథ రాసిన టాగోర్

బోస్ సురక్షితంగా జర్మనీ చేరుకున్న తర్వాత ఆయన సోదరుడు శరత్‌చంద్ర బోస్ అనారోగ్యంతో ఉన్న టాగోర్‌ను కలిసేందుకు శాంతినికేతన్ వెళ్లారు.

బోస్ బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి జారుకున్న విషయాన్ని ఆయనకు తెలియజేశారు.

ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌లోని కటువైన దారుల గుండా స్వేచ్ఛ కోసం అన్వేషిస్తూ సాగిన ఒంటరి అన్వేషకుడి ప్రయాణాన్ని చిత్రిస్తూ 1941 ఆగస్టులో టాగోర్ 'బద్నామ్' అనే కథ రాశారు. బహుశా అదే ఆయన ఆఖరి రచన అయ్యుండొచ్చు.

(జనవరి 23 సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)