విజయ్ దివస్-బంగ్లాదేశ్ ఆవిర్భావం: ఢాకాను రక్షిస్తున్న 30 వేల మంది పాకిస్తాన్ సైనికులు 3 వేల మంది భారత సైనికులకు ఎందుకు లొంగిపోయారు?

భారత్ పాకిస్తాన్ యుద్ధం 1971

ఫొటో సోర్స్, Getty/DAVE KENNERLY DA

డిసెంబర్ 16.. ఈ రోజును భారత్ 'విజయ్ దివస్‌'గా జరుపుకుంటుంది. 1971లో ఇదే రోజు పాకిస్తాన్ సైన్యం భారత్ ముందు లొంగిపోవడంతో, 13 రోజులపాటు జరిగిన యుద్ధం ముగిసింది. బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఆవిర్భవించింది.

1971లో జరిగిన ఈ చారిత్రక యుద్ధంలో తూర్పు కమాండ్ స్టాఫ్ ఆఫీసర్ మేజర్ జనరల్ జెఏఫ్ఆర్ జాకబ్ కీలక పాత్ర పోషించారు.

అప్పటి భారత ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా, పాకిస్తాన్ లొంగిపోయేలా అన్ని ఏర్పాట్లూ చేయాలని మేజర్ జనరల్ జాకబ్‌ను ఢాకా పంపించారు.

డిసెంబర్ 16న పాకిస్తాన్ జనరల్ నియాజీతోపాటూ దాదాపు 90 వేల మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు లొంగిపోయారు.

జనరల్ నియాజీతో మాట్లాడిన మేజర్ జనరల్ జాకబ్ లొంగిపోయేందుకు ఆయన్ను ఒప్పించారు.

1971 ఆపరేషన్ గురించి రెండు పుస్తకాలు రాసిన జనరల్ జాకబ్, గోవా, పంజాబ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. కొన్నేళ్ల క్రితం ఆయన్ను కలిసిన బీబీసీ ప్రతినిధి రేహాన్ ఫజల్‌ 1971 యుద్ధం గురించి జాకబ్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు.

భారత్ పాకిస్తాన్ యుద్ధం 1971

ఫొటో సోర్స్, Getty Images

1971 ఏప్రిల్లోనే భారత సైన్యం బంగ్లాదేశ్ కోసం ఏదైనా చేయాలని భారత రాజకీయ నాయకత్వం భావించిందని, కానీ ఇండియన్ ఆర్మీ దానిని వ్యతిరేకించిందని చెబుతారు.. దీని వెనుక అసలు విషయం చెబుతారా.

ఏప్రిల్ మొదట్లో నాకు ఫోన్ చేసిన మానెక్ షా, మీరు బంగ్లాదేశ్‌లోకి చొరబడేందుకు సిద్ధం కండి, ఎందుకంటే అక్కడ మనం వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు.

మన దగ్గర పర్వతాల డివిజన్ ఉంది, వంతెనల డివిజన్ లేదు. మాన్‌సూన్ కూడా మొదలవబోతోంది. మన దగ్గర బంగ్లాదేశ్‌లోకి వెళ్లడానికి సైనిక వ్యూహం, మౌలిక సౌకర్యాలు లేవు అని వారికి చెప్పాలని నేను ప్రయత్నించాను.

మనం అక్కడకు వెళ్తే, కచ్చితంగా ఇరుక్కుపోతాం. అందుకే, నవంబర్ 15 వరకూ వాయిదా వేయండి. అప్పటికి బహుశా నేల బాగా ఎండిపోవచ్చు అని నేను మానెక్ షాతో అన్నాను

రాజధాని ఢాకాను స్వాధీనం చేసుకోవడాన్ని మానెక్ షా తన వ్యూహంలో చేర్చలేదని మీరు మీ ఆత్మకథలో రాశారు. ఆ నిర్ణయం వెనుక కారణం ఏంటి?

మనం యుద్ధంలో గెలవాలంటే, ఢాకాను స్వాధీనం చేసుకోవాల్సిందే అని నేను ఆయనతో అన్నాను. ఎందుకంటే, వ్యూహాత్మకంగా అది చాలా ముఖ్యం. తూర్పు పాకిస్తాన్‌కు అది ఒక విధంగా భౌగోళికంగా గుండెకాయ లాంటిది. దాని వెనుక కారణం ఏంటో నాకు తెలీదు. మీరు ఖుల్నా, చట్‌గావ్ స్వాధీనం చేసుకోవాలని మాత్రమే నాకు ఆదేశాలు అందాయి. నేను, ఆయనతో చాలాసేపు చర్చించాను. ఖుల్నా మామూలు ఓడ రేవే కదా అని వాదించాను.

ఆయన మాత్రం మనం ఖుల్నా, చట్‌గావ్‌లను ఆక్రమిస్తే, ఢాకా దానంతట అదే మన సొంతం అవుతుందని అన్నారు. నేను ఎలా అని అడిగాను. దానిపై, మేం చాలాసేపు వాదించుకున్నాం. చివరికి మాకు ఖుల్నా, చట్‌గావ్ ఆక్రమించాలని లిఖిత ఆదేశాలు వచ్చాయి.

పాకిస్తాన్ డిసెంబర్ 3న భారత్ మీద దాడి చేయకపోయినా, డిసెంబర్ 4న మీరు వాళ్లపై దాడి చేసుండేవారు.. అనేది నిజమేనా?

ఆ, అది నిజమే, నేను డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ను కలిసి డిసెంబర్ 5న దాడి చేయాలని నిర్ణయించాను. కానీ మానెక్‌ షా దానిని ఒక రోజు ముందుకు జరిపారు. ఎందుకంటే నాలుగు ఆయన లక్కీ నంబర్.

పాకిస్తాన్ శరణార్థులు

ఫొటో సోర్స్, Getty Images

డిసెంబర్ 5ను ఎంచుకోడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా

దానికి ఒకటే కారణం. అప్పటికి మేం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. దాడి చేయడానికి మాకు మరింత సమయం అవసరం లేదు.

ఈ యుద్ధం జరిగినపుడు చైనా, భారత్ మీద దాడి చేస్తుందని మానెక్ షా అనుకునేవారా. మీరు ఆయనకు చెప్పకుండానే, చైనా సరిహద్దుల్లోని మూడు బ్రిగేడ్లను బంగ్లాదేశ్ యుద్ధం కోసం తీసుకొచ్చేశారా. అది తెలీగానే, ఆయన ఎలా స్పందించారు.

పాకిస్తాన్ నగరాలను కాపాడుకోవాలనే వ్యూహంలో ఉన్నట్లు మాకు తెలిసింది. దాంతో, మేం వారిని బైపాస్ చేస్తూ ఢాకావైపు ముందుకు కదిలాం. డిసెంబర్ 13న అమెరికా విమానవాహక నౌక మలక్కా తీరంలోకి చేరుకోబోతోంది. అప్పుడు, మేం బైపాస్ చేస్తూ వచ్చిన నగరాలన్నీ స్వాధీనం చేసుకోవాలని నాకు మానెక్ షా నుంచి మరోసారి ఆదేశాలు అందాయి.

ఆయన ఆ బ్రిగేడ్లకు మళ్లీ చైనా సరిహద్దులకు వెళ్లాలని ఆదేశించారు. ఆ నిర్ణయం నేను, ఇందర్ గిల్ కలిసి తీసుకున్నాం. ఎందుకంటే, ఢాకా ఆపరేషన్‌లో మాకు మరింత మంది సైనికులు కావాలి. నేను భూటాన్‌లో మోహరించిన 6 డివిజన్ ఉపయోగించాలని అనుకున్నాను. కానీ మానెక్ షా దానికి అనుమతి ఇవ్వలేదు. దాంతో, నేను సైనికులను కిందికి తీసుకొచ్చాను. కానీ, ఆయనకు అది తెలిసిపోయింది. తిరిగి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించినప్పటికీ, మేం వారిని వెనక్కు పంపించలేదు.

భారతీయ సైనికుడు

ఫొటో సోర్స్, Getty Images

"ఢాకా వెళ్లిపాకిస్తాన్ లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేయండి" అని మీకు మానెక్ షా ఫోన్ చేశాక, డిసెంబర్ 16న ఏం జరిగిందో చెబుతారా..

ఆయన ఫోన్ చేశాక, నేను ఢాకా చేరుకున్నాను. నన్ను తీసుకెళ్లడానికి పాకిస్తాన్ సైన్యం ఒక బ్రిగేడియర్‌ను కారు ఇచ్చి పంపించింది.

ముక్తివాహిని, పాకిస్తాన్ సైన్యం మధ్య అప్పటికీ యుద్ధం కొనసాగుతోంది. బుల్లెట్ల శబ్దం వినిపిస్తోంది. మా కారు ముందుకు కదలగానే, సైనికులు దానిపై కాల్పులు జరిపారు. అది పాకిస్తాన్ సైన్యం కారు కాబట్టి నేను వారిని తప్పుబట్ట లేను. నేను, కారు నుంచి ఎగిరి దూకేశాను. వాళ్లు పాకిస్తాన్ బ్రిగేడియర్‌ను చంపాలని కాల్పులు జరిపారు. మేం ఎలాగోలా పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ చేరుకోగలిగాం.

నేను లొంగిపోయే పత్రాలు నియాజీకి చదివి వినిపించినపుడు, ఆయన మేం లొంగిపోతున్నామని మీకెవరు చెప్పారు. మేం యుద్ధ విరమణ కోసమే ఇక్కడకు వచ్చాం అన్నారు. నేను ఆయన్ను పక్కకు పిలిచి, మేం మీకు చాలా మంచి ఆఫర్ ఇచ్చాం అన్నాను.

దాని గురించి మనం గత మూడ్రోజులుగా వైర్‌లెస్‌లో మాట్లాడుతూనే ఉన్నాం. మేం ఇంతకు మించిన ప్రతిపాదన ఇవ్వలేం అన్నాను. మైనారిటీలు, మీ కుటుంబాలతో తగిన విధంగా ప్రవర్తించేలా చూసుకుంటామని, మీతో కూడా ఒక సైనికుడితో వ్యవహరించినట్లే ప్రవర్తిస్తామని చెప్పాను.

నియాజీ అప్పటికీ ఒప్పుకోలేదు. మీరు లొంగిపోతే, మిమ్మల్ని, మీ కుటుంబాలను భద్రంగా చూసుకునే బాధ్యత మాది అన్నాను. లేదంటే, మేం ఏ బాధ్యతా తీసుకోలేం అన్నాం. ఆయన ఏ సమాధానం చెప్పలేదు.

నేను ఆయనతో.. ‘మీకు 30 నిమిషాలు టైమిస్తున్నా. దీనికి ఒప్పుకోకపోతే, మళ్లీ యుద్ధం మొదలెట్టి, ఢాకా మీద బాంబులు వేయాలని ఆదేశిస్తాను’ అనేసి, బయటకు వచ్చేశా. తర్వాత, నేను అలా ఎలా అనేశానా? అని లోలోపలే ఆలోచించా.

నా దగ్గర ఎవరూ లేరు. ఆయన దగ్గర ఢాకాలో 26,400 సైనికులు ఉన్నారు. మా దగ్గర 3 వేల మంది సైనికులు మాత్రమే ఉన్నారు. వారు కూడా ఢాకాకు 30 కిలోమీటర్ల అవతల ఉన్నారు. నియాజీ, కుదరదు అని చెబితే, ఏం చేయగలను అనుకున్నా.

నేను, 30 నిమిషాల తర్వాత లోపలికొచ్చా. లొంగుబాటు పత్రాలు టేబుల్ మీదే ఉన్నాయి. మీరు దీనికి ఒప్పుకుంటున్నారా అని అడిగాను. ఆయనేం మాట్లాడలేదు. నేను ఆయనతో మూడు సార్లు అదే అడిగా. తర్వాత టేబుల్ మీద ఉన్న ఆ కాగితాలు తీసుకుని, మీరు దీనికి ఒప్పుకున్నారని అనుకుని వెళ్తున్నాను. అన్నాను.

ముక్తి వాహిని దళాలు
ఫొటో క్యాప్షన్, ముక్తి వాహిని దళాలు

పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఢాకా రక్షణ కోసం 30 వేల మంది సైనికులున్నారు. అయినా, వారు ఎందుకు లొంగిపోయారు.

నేను ఇక్కడ హముదుర్రహమాన్ కమిషన్ చర్యలకు సంబంధించిన ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నా. కమిషన్, నియాజీని "మీ దగ్గర ఢాకాలో 26,400 మంది సైనికులున్నారు, భారత్‌కు 3 వేల మంది సైనికులే ఉన్నారు. మీరు కనీసం రెండు వారాలు వారితో యుద్ధం చేసుండొచ్చు" అని అడిగింది.

"భద్రతా మండలి సమావేశం జరుగుతోంది. మీరు ఒక రోజు యుద్ధం చేసున్నా, భారత్ బహుశా వెనక్కు వెళ్లుండేది. మీరు సిగ్గుపడేలా, బేషరతుగా బహిరంగంగా లొంగిపోయేందుకు ఎందుకు ఒప్పుకున్నారు. మీ ఏడీసీ నేతృత్వంలో భారత సైనికాధికారులకు 'గార్డ్ ఆఫ్ ఆనర్' ఎందుకు ఇచ్చారు" అని ప్రశ్నించింది.

సమాధానంగా నియాజీ "అలా చేయమని జనరల్ జాకబ్ బలవంతం చేశారు. ఆయన నన్ను బ్లాక్ మెయిల్ చేశారు. మా కుటుంబాలను బాయినెట్లతో చంపుతామని బెదిరించారు" అన్నారు.

అదంతా నిజం కాదు. నియాజీ లొంగిపోవడాన్ని కమిషన్ తప్పు బట్టింది. అలా చేయడం వల్ల భారత్ ఒక ప్రాంతీయ మహాశక్తిగా మారిందని, బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఆవిర్భవించిందని చెప్పింది.

పాకిస్తాన్ శరణార్థులు

ఫొటో సోర్స్, Getty Images

అబ్జర్వర్‌ జర్నలిస్ట్ గవిన్ యంగ్ పాకిస్తాన్ సైన్యం ఉన్నతాధికారులు హాజరైన 'సరెండర్ లంచ్' గురించి ప్రస్తావించారు.

నాకు గవిన్ చాలా కాలం నుంచీ తెలుసు. నియాజీ ఆఫీసు బయట ఆయన నన్ను కలిశారు. "జనరల్.. నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి మీరు నన్ను లోపలికి పిలుస్తారా" అన్నారు. నేను ఆయన్ను పిలిచాను. డైనింగ్ టేబుల్ మీద ఆహారం ఉంది.. ఫోర్క్, కత్తులతో ఒక పీస్ టైమ్ పార్టీ జరుగుతున్నట్టు ఉంది.

నేను ఒక మూలగా నిలబడ్డాను. ఆయన నాతో తినమని చెప్పారు. కానీ నేను తినలేకపోయా. గవిన్ దాని గురించి ఒక కథనం రాశారు. దానికి, ఆయనకు ఒక అవార్డు కూడా వచ్చింది.

జనరల్ ఆరోరాను రిసీవ్ చేసుకోడానికి మీరు, జనరల్ నియాజీతో కలిసి ఢాకా విమానాశ్రయం చేరుకున్నప్పుడు... అక్కడ ముక్తి వాహిని కమాండర్ టైగర్ సిద్దిఖీ కూడా ఒక ట్రక్కులో తన సైనికులతో చేరుకున్నారని చెబుతారు. అప్పుడేం జరిగింది.

నేను నా ఇద్దరు సైనికులను నియాజీ ముందు నిలబెట్టాను. టైగర్ దగ్గరికి వెళ్లాను. నేను ఆయనతో విమానాశ్రయం వదిలి వెళ్లాలని చెప్పాను. ఆయన ఏ సమాధానం ఇవ్వలేదు. మీరు వెళ్లకపోతే, మీపై కాల్పులకు ఆదేశిస్తాను అన్నాను. నేను నా సైనికులతో మీరు టైగర్ మీద రైఫిళ్లు ఎక్కుపెట్టండి అని చెప్పాను. టైగర్ సిద్దిఖీ ఆ తర్వాత అక్కడ ఆగలేదు.

మా దగ్గర ఒక్క సైనికుడు కూడా లేడు. అనుకోకుండా నేను నాతోపాటు ఇద్దరు పారా ట్రూపర్స్ ను తీసుకెళ్లాను. సిద్దిఖీ ఒక ట్రక్కు నిండా తన మద్దతుదారులతో అక్కడికి వచ్చారు. ఆయన అక్కడకు ఎందుకొచ్చారో నాకు తెలీదు. కానీ, ఆయన నియాజీని చంపాలనుకుంటున్నారని నాకు అనిపించింది.

ముక్తి వాహిని దళాలు

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ ఆర్మీ 4.30 నిమిషాలకు లొంగిపోయిందని ఇందిరాగాంధీ పార్లమెంటులో పార్లమెంటులో ప్రకటించారు. కానీ, నిజానికి వారు 4.55 నిమిషాలకు లొంగిపోయారు. అలా ఎందుకు జరిగింది. దీని వెనుక కారణం ఏంటి?

దాని వెనుక కారణం ఏంటో నాకు తెలీదు. బహుశా ఎవరైనా జ్యోతిష్కుల సలహా ప్రకారం అలా చేసుంటారు. పత్రాలపై సంతకాలు చేసేటప్పటికి 4.55 అయ్యింది. పత్రాల్లో కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. అందుకే, రెండు వారాల తర్వాత ఆరోరా, నియాజీ కలకత్తాలో మళ్లీ ఆ పత్రాలపై సంతకాలు చేశారు.

నియాజీ తన పిస్టల్ తీసి జగ్‌జీత్ సింగ్ ఆరోరాకు అందించిన ఆ క్షణాల గురించి ఒకసారి చెబుతారా..

నేను నియాజీతో మీ కత్తి అప్పగించండి అని అడిగాను. ఆయన నా దగ్గర కత్తి లేదు అన్నారు. నేను ఆయనతో అయితే, మీ పిస్టల్ అయినా ఇవ్వండి అన్నాను. ఆయన పిస్టల్ తీసి ఆరోరాకు అప్పగించారు. ఆ సమయంలో ఆయన కళ్లనిండా నీళ్లున్నాయి.

సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

ఆ సమయంలో ఆరోరా, నియాజీ మధ్య ఏదైనా సంభాషణ నడిచిందా

వారిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అక్కడ గుమిగూడిన జనం నియాజీని చంపేయాలని కోపంగా ఉంది. వాళ్లు ఆయన పైకి దూకారు కూడా. మా దగ్గర చాలా తక్కువ మంది సైనికులున్నారు. అయినా, మేం ఆయన్ను ఆర్మీ జీపులో కూర్చోపెట్టాం. సురక్షితంగా తీసుకెళ్లాం.

ఆ యుద్ధం సమయంలో భారత జనరళ్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, మానెక్ షాకు ఆరోరాతో పొసగలేదని, ఆరోరా, సగత్ సింగ్ మధ్య సరిగా ఉండేది కాదని, రైనా నంబర్ టూ అయినా ఆయనను పట్టించుకునేవారు కాదని, మీ పుస్తకాల ద్వారా తెలుస్తోంది. నిజమేనా.

అతిపెద్ద సమస్యేంటంటే.. దిల్లీలో వైమానిక దళం అధ్యక్షుడు పీసీ లాల్, మానెక్ షా మధ్య మాటలు కూడా లేవు. యుద్ధం జరుగుతున్నప్పుడు చాలా మందికి ఒకరంటే ఒకరికి పడడం లేదు. నాకు, మానెక్ షాకు మధ్య సంబంధాలు చాలా బాగున్నాయి. 1997లో నేను నా పుస్తకం ప్రచురించాక ఆయనకు, నాకు మధ్య కూడా చెడింది.

ఒక జనరల్‌గా మానెక్ షాకు మీరు ఎలాంటి రేటింగ్ ఇస్తారు.

నేను దానిపై ఎలాంటి వ్యాఖ్య చేయాలనుకోవడంలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)