Molar pregnancy: కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ శైలజ చందు
- హోదా, బీబీసీ కోసం
"ఏమిటి డాక్టర్ గారూ, గర్భం ఉందంటారు. మరి స్కాన్ లో బిడ్డ లేదంటారేమిటండీ?"
ఆ అమ్మాయి వాళ్లాయన గట్టిగానే అడుగుతున్నాడు.
"అవును. కొన్ని సార్లు అలా జరుగుతుంది. అదొక ప్రత్యేకమైన పరిస్థితి" డాక్టర్ ఆయన్ను కూర్చోన్నారు.
ఆ అమ్మాయికి ఇప్పుడు మూడోనెల .
''మూడో నెలలోనే కడుపు బాగా పెరిగినట్లుంటే, కవల పిల్లలేమోనని అనుమాన పడి వచ్చాం. వాంతులు చూస్తే విపరీతంగా ఉన్నాయి. ప్రెగ్నన్సీ హార్మోన్ కూడా లక్షల్లో వుంది. హార్మోన్ అంత పెరిగినపుడు స్కాన్లో పిండం కనిపించాలిగా. మీరేమో అసలు బిడ్డే కనిపించడం లేదంటున్నారు."
డాక్టర్లు చెప్పే పొంతనలేని మాటలు వింటున్న కొద్దీ అతనికి కోపంగా ఉంది.
"దీనినే ముత్యాల గర్భం లేదా Molar pregnancy అంటారు. గర్భం ఏర్పడుతుంది కానీ బిడ్డ ఎదగదు."

ఫొటో సోర్స్, Dr.SailajaChandu
ముత్యాల గర్భం (Molar pregnancy) అంటే ఏమిటి?
సాధారణంగా ఆరోగ్యమైన పిండం ఏర్పడడానికి ఒక స్పెర్మ్ , ఒక అండంతో సంయోగం చెందుతుంది.
అలా తండ్రి నుంచి ఒక జత, తల్లి నుంచి మరో జత క్రోమోజోములు బిడ్డకు సంక్రమిస్తాయి.
ముత్యాల గర్భమనేది ఒక అసాధారణమైన గర్భం.
క్రోమోజోములు లేని ఒక ఖాళీ అండంతో , ఆరోగ్యవంతమైన ఒక శుక్రకణం సంయోగం చెంది , తన క్రోమోజోముల్ని రెట్టింపు చేసుకుంటుంది.
లేదా ఒక ఖాళీ అండంతో రెండు శుక్రకణాలు కలవడం వల్ల యేర్పడిన పిండంలో కేవలం మగ క్రోమోజోములు మాత్రమే వుంటాయి. అండం తాలూకు క్రోమోజోములుండవు. దీన్ని సంపూర్ణమైన ముత్యాల గర్భం (Complete molar pregnancy) అంటారు.
ముత్యాల గర్భం ఆరోగ్యంగా ఉండే బిడ్డ లా ఎదగలేదు. ముత్యాల వంటి బుడగల ఆకారంలో ఎదుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
పాక్షికమైన ముత్యాల గర్భం (Partial molar pregnancy) అంటే ఏమిటి?
ఒక ఆరోగ్యమైన అండంతో రెండు శుక్రకణాలు సంయోగం చెందినపుడు, ఏర్పడే పిండంలో మూడు జతల క్రోమోజోములుంటాయి.
ఇలాంటి గర్భాల్లో కొన్ని సార్లు బిడ్డ పెరుగుదలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి.
కానీ అవి అసాధారణమైనవి కనుక వాటిలో కూడా పెరుగుదల వుండదు.

ఫొటో సోర్స్, Getty Images
ముత్యాల గర్భం యొక్క లక్షణాలేమిటి?
నెలలకన్నా మించి పొట్ట పెరగడం, రక్త స్రావం కనిపించడం, అతిగా వేవిళ్లు కావడం ప్రధానమైన లక్షణాలు.
గర్భానికి సంబంధించిన హార్మోన్ లెవెల్, చూస్తే చాలా హెచ్చు స్థాయిలో వుంటుంది. అందువల్లనే వీరికి వేవిళ్లు కూడా ఎక్కువగా వుంటాయి.
ప్రెగ్నన్సీ హార్మోన్ అంటే ఏమిటి? ఈ పరిస్థితిని ఎలా కనుగొంటారు?
Beta- HCG అనేది గర్భం దాల్చినపుడు పెరిగే ప్రత్యేకమైన హార్మోన్.
Molar pregnancy లో ఆ హార్మోన్ సాధారణ గర్భంలో కనిపించే స్థాయి కన్నా మరింత ఎక్కువగా ఉంటుంది.
గర్భం వచ్చిన మొదటి మూడు నెలలలో స్కానింగ్ చేయించినపుడు గర్భం సాధారణంగా పెరుగుతున్నదా, మోలార్ ప్రెగ్నన్సీ మార్పులేమైనా వున్నాయా అన్న విషయం అర్థమవుతుంది.
వ్యాధి నిర్ధరణ మాత్రం ఆ ముత్యాల వంటి కణాలను బయాప్సీ పరీక్ష చేసినపుడే.

ఫొటో సోర్స్, Getty Images
మోలార్ ప్రెగ్నన్సీ కి చికిత్స ఎలా చేస్తారు?
ఈ ముత్యాల గర్భం వల్ల బిడ్డ పెరిగే అవకాశం లేనందువల్ల దీన్ని తీసివేయడమే పరిష్కారం.
ముత్యాల గర్భాన్ని తీసివేయడానికి శస్త్ర చికిత్స అవసరమవుతుంది. శస్త్ర చికిత్స అంటే కోత, కుట్టూ అవసరం లేదు.
మత్తు ఇచ్చిన తర్వాత గర్భాశయ ద్వారం నుండి suction tube ద్వారా ముత్యాల వంటి కణ జాలాన్ని తీసివేయాలి.
అవాంఛిత గర్భం పోవడానికి మందులు అందుబాటులో ఉన్నాయి కదా. అవి వాడితే సరిపోదా?
Molar pregnancy (ముత్యాల గర్భం ) పోడానికి ఆ మందులు వాడడం నిషిద్ధం.
అబార్షన్ చేయడానికి వాడే మందులు వాడినపుడు, గర్భాశయంలో సంకోచ వ్యాకోచాలు కలుగుతాయి.
వాటివలన ఈ ముత్యాల గర్భం యొక్క కణజాలం రక్తనాళాలలో ప్రవేశించి, వేరే అవయవాలకు వ్యాప్తి చెందే అవకాశం వుంది.
ఈ ముత్యాల గర్భం రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
గర్భస్థ శిశువు ఆడా మగా అన్నది ఎలా అయితే మనుషులు నిర్ణయించలేరో, ఈ ముత్యాల గర్భం ఏర్పడడమూ, దాన్ని నిరోధించడమూ మన పరిధిలో లేని విషయం.
ముత్యాల గర్భాన్ని , యుటిరెస్ నుండి తొలగిస్తే ఇక చికిత్స పూర్తి అయినట్టేనా?
లేదు. చికిత్స తర్వాత ప్రెగ్నన్సీ హార్మోన్ సాధారణ స్థాయికి వచ్చేవరకూ డాక్టర్ల పర్యవేక్షణలో వుండాలి. ప్రతి రెండు వారాలకొకమారు రక్త పరీక్ష ద్వారా హార్మోన్ లెవెల్ గమనించుకోవాలి.
ప్రెగ్నన్సీ హార్మోన్ స్థాయి సాధారణ గర్భం లో కనిపించే స్థాయి కన్నా ఎక్కువ వుంటుంది.
హార్మోన్ లెవెల్ తగ్గడానికి గడువు ఏమైనా వుందా?
గర్భాశయాన్ని క్లీన్ చేసిన తర్వాత 56 రోజుల్లో, అంటే 8 వారాల్లో తగ్గిపోవాలి. రెండు వారాలకొక మారు హార్మోన్ లెవెల్స్ చెక్ చేస్తూ ఉండాలి.
ఒక వేళ 56 రోజుల్లోపల అది సాధారణ స్థాయికి వచ్చినట్లైతే, యుటిరస్ ను క్లీన్ చేసిన నాటి నుండి, 6 నెలలవరకు పేషంట్ డాక్టర్ల పర్యవేక్షణలో వుండాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఒక వేళ్ల హార్మోన్ లెవెల్స్ తగ్గకపోయినట్లైతే ఏం చెయ్యాలి?
15% శాతం కేసులలో ఈ మోలార్ ప్రెగ్నన్సీకి చెందిన కణాలు అసాధారణమైన రీతిలో విస్తరిస్తాయి.
గర్భాశయ గోడలను చొచ్చుకునిపోతాయి. గర్భాశయపు పరిసర కణాలే కాకుండా, మెదడు, వూపిరి తిత్తులకు, లివర్ కు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
ఆ హార్మోన్ తగ్గకపోతే మిగిలిన అవయవాలను స్కానింగ్ ద్వారా పరీక్షించుకోవాలి. వారిలో హార్మోన్ స్థాయి తగ్గుముఖం పట్టదు. వారి వయసు, ఏయే అవయవాలకు సోకిందీ, హార్మోన్ లెవెల్ ఎంత ఉన్నదీ , ఇటు వంటి మరికొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వారికి కీమోథెరపీ ఇవ్వవలసి ఉంటుంది.
ఒక సారి ముత్యాల గర్భం వచ్చి, చికిత్స తీసుకున్న తర్వాత మరల ఎన్నాళ్ళకు గర్భం దాల్చవచ్చు?
చికిత్స అనంతరం హార్మోన్ స్థాయి పడిపోయే వరకూ గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కీమోథెరపీ చికిత్స అవసరమైన వారికి, అది పూర్తయిన సంవత్సరం వరకూ గర్భం రాకుండా రక్షణ తీసుకోవాలి.
ముత్యాల గర్భం తొలగించాక ఎటువంటి గర్భ నిరోధక సాధనాలు వాడాలి?
అందుబాటులో వున్న అనేక సంతాన నిరోధక సాధనాలను డాక్టర్ తో చర్చించి వాడుకోవచ్చు.
కానీ గర్భాశయంలో అమర్చే కాపర్ టీని వాడకూడదు. ఎందుకంటే ముత్యాల గర్భం వల్ల గర్భాశయపు గోడలు మృదువుగా మారి ఉంటాయి.
Copper- T అమర్చినపుడు యుటిరెస్ కు రంధ్రం పడే అవకాశముంటుంది.
ఒక వేళ గర్భం వస్తే మరలా ఇటువంటి మోలార్ ప్రెగ్నన్సీ వచ్చే అవకాశం ఎంత?
చాలా తక్కువ. ముత్యాల గర్భం దాల్చిన 100 మంది స్త్రీలలో, 99 మందికి రాదు. ఒక్కరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- ‘ఇక్కడ తయారయ్యే మందులు వాడి ప్రజలు బతుకుతున్నారు.. మేం మాత్రం చస్తున్నాం’
- ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ యంత్రాంగం పని చేయడం లేదనే వివాదంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మెరుగైన మహిళా సాధికారత... కలవరపెడుతున్న పోషకాహార లోపం -జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
- భారత్: ఒకపక్క ఊబకాయం.. మరోపక్క పోషకాహార లోపం.. ఎందుకిలా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




