తెలంగాణ: రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీని స్థానికులు ఎందుకు వద్దంటున్నారు ? కేసీఆర్ సర్కారు హామీలను ఎందుకు నమ్మడం లేదు?

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారంలో ఏర్పాటు చేయబోతున్న ఫార్మాసిటీ స్థానికుల జీవన ప్రమాణాలను మార్చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
అయితే గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు నిలబెట్టుకుందో స్వయంగా చూశామని, ఇక్కడ పరిశ్రమ వద్దేవద్దంటూ స్థానికులు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు.
దీంతో భూసేకరణ నుంచి ప్రభుత్వం నాలుగు గ్రామాలను మినహాయించాల్సి వచ్చింది.
భూసేకరణ వివాదాస్పదం కావడంలో ఈ ఫార్మాసిటీ వ్యవహారంలో క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని యాచారం ప్రాంతంతోపాటు రసాయన పరిశ్రమలున్న మరికొన్ని ప్రాంతాలలో పర్యటించారు.

“అన్ని కంపెనీలు అచ్చాక మేము బతుకుతామా? ఈ పొలాలు, చెరువులు వదిలి యాడికి పోవాలే? ఈ నెమిళ్లు ఎక్కడ తోలుతారు? పక్షులను యాడికి తోలుతారు? పశువులను, గొర్రెజీవాలను యాడికి పంపుతరు ? చాతకాని ముసలోళ్లని యాడికి తోలుతారంటా? మంది చిప్పలు కడ్డుకుంటూ రోడ్డు పాలెందుకు కావాలే మేము?”
- ఇది తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఫార్మా సిటీ ఏర్పాటు కోసం భూసేకరణ చెయ్యాలనుకుంటున్న పది గ్రామాలలో ఒకటైన కుర్మిద్దెకు చెందిన ఓ మహిళా రైతు అనసూయమ్మ ఆవేదన.

భూసేకరణ నుంచే అభ్యంతరాలు
రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కందుకూరు, కడ్తల్ మండలాల మధ్య ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం 2015లో ఆదేశాలు జారీ చేసింది.
19,333 ఎకరాల సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అందులో 9,500 ఎకరాల సేకరణ ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు చెప్పారు.
ఎకరం పట్టా భూమికి రూ.16లక్షలు, 120 గజాల హెచ్‌ఎండీఏ లేఅవుట్ ప్లాటు ఇస్తునట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
దీంతోపాటు భూములిచ్చిన రైతు కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
గ్రామాలలోని యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వం ఆలోచన.
“ఫార్మాసిటీ మొదటి ఫేజ్ పనులు డిసెంబర్ నెలాఖరుకల్లా ప్రారంభించాల్సి ఉంది.
కానీ అనుకున్న విధంగా భూ సేకరణ జరగనందున వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో రెండు ఫేజ్‌ల పనులు కలిపి ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది’’ అని టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి బీబీసీకి చెప్పారు.
ఇప్పటికే 200 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఫార్మాసిటీలో తమ పరిశ్రమల స్థాపనకు ఆసక్తిని వ్యక్తం చేశాయని నరసింహారెడ్డి అన్నారు.
మరోవైపు ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్న కొన్ని గ్రామాల ప్రజలు భూసేకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే హైకోర్టులో 12 పిటిషన్లు దాఖలు చేశారు.
నాలుగు గ్రామాల్లో భూసేకరణపై కోర్టు స్టే ఇచ్చింది.
ఫార్మాసిటీకి భూములిచ్చేదిలేదని, 2013 భూసేకరణ చట్టం అమలుకు పోరాటం చేస్తామని స్థానిక రైతులు అంటున్నారు.
భూసేకరణను వ్యతిరేకిస్తూ చేసిన నిరసనల్లో అనేకమందిపై కేసులు నమోదు అయ్యాయి.
భూములిచ్చిన వారికి న్యాయం చేస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు.

ప్రభుత్వం ఏం చెబుతోంది?
ఈ ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేస్తున్న పోరాటం వెనుక కొన్ని రాజకీయశక్తులు ఉన్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది.
“కొందరు రాజకీయాల కోసం వారిని రెచ్చగొడుతున్నారు. ప్రజలు వారి కుట్రలను అర్ధం చేసుకోవాలి’’ అని తెలంగాణ మంత్రి కె. తారక రామారావు బీబీసీతో అన్నారు.
అయితే గ్రామస్తులు మాత్రం ఫార్మాసిటీ కారణంగా కాలుష్యం పెరిగి భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“ఇప్పటికే కంపెనీలు ఉన్న ప్రాంతాల్లో కాలుష్యం ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
స్వచ్ఛమైన గాలి లేదు, నీరు లేదు. మాకు అటువంటి బతుకు వద్దు’’ అన్నారు మహిళా రైతు అనసూయమ్మ.
ఈ ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే ఫార్మా కంపెనీలు ఏర్పాటైన హైదరాబాద్ శివారు ప్రాంతాలైన సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం, కాజిపల్లి గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో పరిశీలించేందుకు వెళ్లారు బీబీసీ ప్రతినిధి.

ఫార్మా కంపెనీల ప్రాంతాలలో పరిస్థితి ఎలా ఉంది ?
గడ్డపోతారం సర్పంచ్ పులిగల్ల ప్రకాశ్ చారి తమ గ్రామంలో పరిస్థితిని బీబీసీకి వివరించారు.
“ఫార్మా కంపెనీల కారణంగా కాలుష్యంతో మా గ్రామం ఎడారిగా మారింది.
కంపెనీల ఏర్పాటుకు అనుమతిస్తూ 1988లో నాటి గ్రామసర్పంచ్‌గా నేనే సంతకాలు చేశా.
కంపెనీలు వస్తే మా ఊరు బాగుపడుతుందని, ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఏర్పాటుకు అంగీకరించాం.
కానీ కాలుష్యం ఈ స్థాయిలో ఉంటుందని మాకు తెలియదు. అధికారులు కూడా హెచ్చరించలేదు. ఉద్యోగాలు రాకపోగా కాలుష్యం కారణంగా ఇక్కడ మనుషులు ఉండటానికి వీల్లేని పరిస్థితి ఉంది.
భూగర్బ జలాలు కలుషితం అయిపోయాయి.పొలాలు పండటం లేదు.
గర్భిణుల్లో అబార్షన్లు పెరిగాయి. ఆరోగ్య సమస్యలు అయితే అనేకం” అంటూ చెప్పుకొచ్చారు ప్రకాశ్ చారి.
అక్కడ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. గ్రామంలో అడుగుపెట్టగానే బీబీసీ ప్రతినిధికి భరించలేని వాసన వచ్చింది.
గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా అనిపించింది. కళ్లు మంటలు పుట్టి నీళ్లు వచ్చాయి.
ఫార్మా కంపెనీల కారణంగా కాలుష్యం ఏ స్థాయిలో ఉందో చూపించేందుకు బీబీసీ ప్రతినిధిని ఆ ఊరులోని అయ్యమ్మ చెరువు దగ్గరకు తీసుకెళ్లారు ప్రకాశ్. రసాయనాలు చెరువులో కలుస్తున్న తీరును దగ్గరుండి చూపించారు.
ఇక్కడి పరిణామాలను ఎన్నిసార్లు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని సర్పంచ్ ప్రకాశ్ చారి ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఇక్కడి కంపెనీలు మందులు తయారు చేస్తే వాటితో అందరు బతుకుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న మేము మాత్రం చచ్చిపోతున్నాం’’ అన్నారాయన.
గడ్డిపోతారం గ్రామంలో 200 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయని, అందులో ఎక్కువశాతం ఫార్మా కంపెనీలేనని గ్రామస్తులు బీబీసీకి వివరించారు.

కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తోంది ?
వివిన్ డ్రగ్స్ అనే ఫార్మా కంపెనీ నుంచి విడుదలవుతున్న రసాయనాలు తమ గ్రామం చెరువులోకి చేరుతున్న తీరును గ్రామస్తులు బీబీసీకి చూపించారు.
భూమిలోపలి నుంచి బుడగల రూపం వస్తున్న ఎర్రటి నీళ్లు చెరువులో కలుస్తూ కనిపించాయి.
దీనిపై కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేయగా, అది నిజమేనని మండలి తన నివేదికలో పేర్కొంది.
అయితే ఫిర్యాదులు ఇవ్వడం, కాలుష్య నియంత్రణ మండలి మందలించడం, ఆ తర్వాత పరిస్థితి యధాతథంగానే ఉంటోందని గ్రామస్తులు చెప్పారు.
గడ్డపోతారం గ్రామానికి దిగువన కాజిపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ రైతుల నల్లరంగులో ఉన్న వరి ధాన్యాన్ని ఆరబోస్తున్నారు.
నలుపు రంగుకు కారణమేంటని బీబీసీ ప్రతినిధి ఆ రైతును ప్రశ్నించారు.
“ ప్రతిసారి వడ్లు ఇలాగే రంగు మారి ఉంటాయి. రసాయినాలతో కలుషితమైన నీరు నా పొలంలోకి నేరుగా వస్తుంది.
పొలంలో ఉన్న పంటంతా కలుషితమైపోతుంది. దానికి తోడు ఈసారి వర్షం పడింది. దాంతో నా పొలం మొత్తం మునిగిపోయింది” అని ఆయన అన్నారు.
“మా గ్రామంలో ఫార్మా కంపెనీలు లేవు. కానీ పైన గడ్డపోతారంలో కంపెనీలలో రసాయినాలు, అలాగే చుట్టూ ఉన్న కంపెనీల నుంచి పారుతున్న రసాయినాలు మా గ్రామం మీదుగా పారుతాయి” అంటూ రంగుమారి నురగతో ఉన్న కలుషిత నీటిని చూపించారు కాజిపల్లి సర్పంచ్ సత్యనారాయణ.
కంపెనీలలో కలుషిత రసాయినాలను ట్రీట్‌మెంట్ చేయడంలో నిర్లక్ష్యం కారణంగానే అవి బయటకు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివిన్ డ్రగ్స్ ఫార్మా కంపెనీపై స్థానికులు చేసిన ఫిర్యాదులపై కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేధిక సారాంశం కూడా అదే.

ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్న పర్యావరణవేత్తలు
కంపెనీల విషయంలో ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న కారణంగానే ఈ స్థాయి కాలుష్యానికి కారణమని పర్యావరణవేత్తలు అంటున్నారు.
“ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్న ప్రాంతం దగ్గరలోనే అడవులు ఉన్నాయి. ఈ కాలుష్యానికి అవి మిగులుతాయా’’ అని ఐఐసీటీ రిటైర్డ్ సైంటిస్ట్, పర్యావరణ కార్యకర్త, కె.బాబూరావు బీబీసీతో అన్నారు.
“గత 30 ఏళ్లలో ఎన్నో కెమికల్ పరిశ్రమలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వాటిలో ఎలాంటి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించారో తెలపాలి.
ఇన్నాళ్లూ పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీటిని మూసిలోకి వదిలారు. ఇకపై ఎందులోకి వదులతారో కూడా ప్రభుత్వం చెప్పాలి” అని ఆయన అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో బీబీసీ మాట్లాడింది. “ కాలుష్య కారక పరిశ్రమలను తరలించడం అంటే, కాలుష్యాన్ని తరలించడం కాదు.
ఒకవేళ మనం వాటిని వేరేచోటకు తరలించినా, అవి మళ్లీ అక్కడ కాలుష్యం సృష్టించకుండా చూడాలి.
తగిన మౌలిక వసతులు సృష్టించిన తరువాతే, వారిని అక్కడ నుంచి కదలమని అడగగలం” అని అన్నారు కేటీఆర్.
ఇప్పటికే ఫార్మా కంపెనీలు ఏర్పాటైన గ్రామాల్లోని దుస్థితిని చూస్తున్న యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లోని వివిధ గ్రామాల ప్రజలు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే తమ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందని భయపడుతున్నారు. అందుకే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ ఆందోళనల్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ యంత్రాంగం పని చేయడం లేదనే వివాదంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మెరుగైన మహిళా సాధికారత... కలవరపెడుతున్న పోషకాహార లోపం -జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
- భారత్: ఒకపక్క ఊబకాయం.. మరోపక్క పోషకాహార లోపం.. ఎందుకిలా?
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









