ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ యంత్రాంగం పని చేయడం లేదనే వివాదంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు - BBC News Reel

జగన్‌

ఫొటో సోర్స్, JAGAN/FB

'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిందా' అనే దానిపై విచారణ జరపాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు శుక్రవారం నాడు స్టే ఇచ్చింది.

భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం ప్రకటించింది.

ఈ కేసు విచారణను వింటున్నప్పుడు, "ఇది ఆందోళనకరంగా ఉంది" అంటూ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేశారు.

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయా అనే దానిపై విచారణ జరపాలంటూ ఏపీ హైకోర్టు అక్టోబర్ 1న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 14న సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

నవాజ్ షరీఫ్, మోదీ

ఫొటో సోర్స్, PAKISTAN INFORMATION DEPARTMENT/ANADOLU AGENCY/GET

ఫొటో క్యాప్షన్, నవాజ్ షరీఫ్, నరేంద్ర మోదీ

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తల్లి మరణానికి సంతాపం తెలుపుతూ లేఖ రాసిన మోదీ

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తల్లి నవంబర్ 22న లండన్‌లో కన్నుమూసిన తరువాత, ఆయనకు సంతాపాన్ని ప్రకటిస్తూ భారత ప్రధాని మోదీ లేఖ రాశారని స్థానిక దినపత్రిక డాన్ ఒక వార్తను ప్రచురించింది.

మోదీ నవంబర్ 27న షరీఫ్‌కు రాసిన లేఖను ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హై కమీషన్, పీఎంఎల్-ఎన్ వైస్ ప్రెసిడెంట్ మరియం నవాజ్‌కు అందించి, లండన్‌లో ఉన్న తన తండ్రికి చేరవేయమని కోరింది.ఆ లేఖలో "ప్రియమైన మియా సాహిబ్, మీ తల్లిగారైన బేగం షమీమ్ అక్తర్ మరణవార్త విని ఎంతో విచారం కలిగింది. మీకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని మోదీ రాశారు.2015లో లాహోర్ పర్యటన సందర్భంగా షరీఫ్ తల్లిని కలిసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ "ఆమె నిరాడంబరత, ఆపేక్ష మరువలేనివి. ఈ దుఃఖం నుంచీ కోలుకునే శక్తిని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని లేఖలో పేర్కొన్నారు.నవాజ్ షరీఫ్ తల్లి లండన్‌లో మరణించారు. తరువాత, ఆమె మృతదేహాన్ని పాకిస్తాన్‌కు తీసుకు వచ్చారు.పాకిస్తాన్‌కు మూడు సార్లు ప్రధాని పదవి చేపట్టిన నవాజ్ షరీఫ్ అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. హృదయ సంబంధ చికిత్స కోసం నాలుగు వారాలు లండన్ వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు, నవాజ్ షరీఫ్‌కు అనుమతినిచ్చింది. ఆ తరువాత, గత ఏడాది నవంబర్‌నుంచీ ఆయన లండన్‌లోనే నివసిస్తున్నారు. 2015లో అఫ్గానిస్తాన్ పర్యటన తరువాత మోదీ అకస్మాత్తుగా పాకిస్తాన్ పర్యటనకు బయలుదేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. షరీఫ్ విమానాశ్రయానికి వెళ్లి మోదీకి స్వాగతం పలికారు.తరువాత, షరీఫ్ మనుమరాలి వివాహానికి మోదీ హాజరయ్యారు. అనంతరం, దిల్లీ బయలుదేరేముందు పాకిస్తాన్ ప్రధానితో సమావేశమయ్యారు.గత దశాబ్దకాలంగా ఏ భారత ప్రధాని కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. తొలిసారిగా 2015లో మోదీ వెళ్లారు. 2016లో పఠాన్‌కోట్ వైమానిక దళంపై ఉగ్రవాద దాడి జరిగిన దగ్గరనుంచీ పాకిస్తాన్, భారత్‌ల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలయ్యాయి.

అమెరికాలో కీలక రంగాల కంప్యూటర్లపై సైబర్‌ దాడి

ఫొటో సోర్స్, Reuters

అమెరికాలో కీలక రంగాల కంప్యూటర్లపై సైబర్‌ దాడి: రష్యాపై నిపుణుల అనుమానాలు

అమెరికాలో ఈవారంలో ఓ అధునాతన హ్యాకింగ్‌ కుట్ర బైటపడిందని, ఈ సైబర్‌ దాడితో ప్రభుత్వ, ప్రైవేటు సర్వర్లకు పెను ప్రమాదం ఉందని ఆ దేశ అధికారులు హెచ్చరించారు. అమెరికా ఆర్థిక శాఖ సర్వర్‌ కూడా ఈ దాడికి గురైందని తెలిపారు.

ఈ హ్యాకింగ్‌ను అడ్డుకోవడం చాలా క్లిష్టమైన వ్యవహారమని అమెరికా సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్‌ఏ) వెల్లడించింది. రష్యాపై కొందరు అనుమానం వ్యక్తం చేయగా, ఆ దేశం దీన్ని ఖండించింది.

'అడ్వాన్స్‌డ్‌ పర్సిస్టెంట్ థ్రెట్‌ యాక్టర్‌'గా పిలిచే ఈ హ్యాకింగ్‌ మార్చి నుంచి కొనసాగుతోందని అనుమానిస్తున్నారు. మౌలిక, ప్రైవేటు రంగాలకు చెందిన సర్వర్లను తమ అధీనంలోకి తెచ్చుకోవడమే ఈ హ్యాకర్ల లక్ష్యమని సీఐఎస్‌ఏ వెల్లడించింది.

అయితే ఈ కుట్రకు పాల్పడింది ఎవరు, ఇప్పటి వరకు ఏయే డిపార్ట్‌మెంట్ల సర్వర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి, ఎలాంటి సమాచారం బయటకు వెళ్లిందన్న విషయాన్ని మాత్రం సీఐఎస్‌ఏ వెల్లడించలేదు.

సైబర్‌ సెక్యూరిటీకి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, బాధ్యులైన వారు తీవ్రమైన చర్యలను ఎదుర్కోక తప్పదని ఈ ఘటనపై స్పందించిన అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు.

తమ కంప్యూటర్లు హ్యాంకింగ్‌కు గురయ్యాయని కొన్ని ప్రభుత్వ సంస్థలు కొద్దిరోజులుగా ఫిర్యాదులు చేస్తున్నాయి. హ్యాకర్లు రక్షణ, ఆర్థిక రంగాలకు చెందిన అనేక సర్వర్లలోకి ప్రవేశించగలిగారని రాయిటర్స్‌ వెల్లడించింది.

అమెరికా అణు రక్షణ విభాగపు సర్వర్లు కూడా హ్యాకింగ్‌కు గురైనట్లు తమకు కొందరు అధికారులు తెలిపారని 'పొలిటికో' మ్యాగజైన్‌ వెల్లడించింది.

టెక్సాస్‌లోని సోలార్‌విండ్‌ అనే ఓ ఐటీ కంపెనీకి చెందిన నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ సాయంతో దుండగులు ఈ హ్యాంకింగ్‌కు పాల్పడినట్లు సీఐఎస్‌ఏ వెల్లడించింది.

హ్యాకర్లు 18,000 మంది సోలార్‌ విండ్‌ కస్టమర్లకు అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ పంపడం ద్వారా ఆ సంస్థ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించారని, ఈ కారణంగా ఆ సంస్థ సాఫ్ట్‌వేర్‌లను తొలగించాల్సిందిగా అధికారులు కొన్ని ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.

తమ సంస్థ కస్టమర్లు 40మంది ఈ సైబర్‌ ఎటాక్‌కు గురైనవారిలో ఉన్నారని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన కంపెనీలున్నాయని, కేవలం అమెరికాలోనే 80% కస్టమర్లు ఈ దాడికి గురయ్యారని పేర్కొంది.

దీనికి ఎవరు బాధ్యులు అన్న విషయం ఎఫ్‌బీఐ గాని, సీఐఎస్‌ఏ గాని ప్రకటించలేదు. అయితే ప్రైవేటు విచారణ సంస్థలు రష్యాను అనుమానిస్తుండగా, తామెలాంటి సైబర్‌ దాడులకు పాల్పడలేదని అమెరికాలోని రష్యా రాయబార కార్యాలయం ఓ ట్వీట్‌లో పేర్కొంది.

మోడర్నా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, MODERNA

మోడర్నా కోవిడ్-19 వ్యాక్సీన్‌కు అమెరికాలో త్వరలోనే ఆమోదం

అమెరికాలో మరో కరోనావైరస్ వ్యాక్సీన్ అత్యవసర ఆమోదం పొందేందుకు సిద్ధంగా ఉంది. అమెరికాలో నిపుణుల బృందం ఈ వ్యాక్సీన్ సమర్థతను ఆమోదించింది.

వ్యాక్సీన్ డోసులు లక్షలాది మందికి సరఫరా చేయడానికి సత్వర అనుమతులు ఇచ్చేందుకు తమ సంస్థ ప్రయత్నిస్తోందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారి తెలిపారు.

అమెరికాలో ఇప్పటికే ఫైజర్, బయోఎన్‌‌టెక్ సంస్థలు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాయి.

ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్ కేసులు, మరణాలు అమెరికాలో నమోదయ్యాయి. ఈవారం మొదటికి అమెరికాలో 3 లక్షల మంది మరణించారు.

ఫైజర్ Vs మోడర్నా: ఏ వ్యాక్సీన్ సామర్థ్యం ఎంత?
ఫొటో క్యాప్షన్, ఫైజర్ Vs మోడర్నా: ఏ వ్యాక్సీన్ సామర్థ్యం ఎంత?

మోడర్నా వ్యాక్సీన్ వలన 18 ఏళ్లు దాటిన వారిలో కలిగే దుష్పరిణామాలతో పోల్చి చూస్తే లాభాలే ఎక్కువగా ఉన్నాయని అడ్వైజరీ ప్యానెల్ తెలిపింది. ఈ వ్యాక్సీన్ సమర్ధతకు ప్యానెల్ 20-0 ఓట్లు వేసింది. ఇదే కమిటీ గతవారం ఫైజర్, బయోఎన్‌‌టెక్ వ్యాక్సీన్‌కు కూడా ఆమోదం తెలపడంతో వాటిని అత్యవసరంగా వాడేందుకు అనుమతులు లభించాయి.

ప్యానెల్ ఆమోదం లభించగానే మోడర్నాకు అత్యవసర అనుమతులు వేగంగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఎఫ్‌డీఏ కమిషనర్ స్టీఫెన్ హన్ చెప్పారు.

మారడోనా మృతదేహం

ఫొటో సోర్స్, Reuters

మారడోనా అంతిమ సంస్కారాలను ఆపండి.. అర్జెంటీనా కోర్టు ఆదేశం

ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా మృతదేహాన్ని భద్రపరచాలని అర్జెంటీనా కోర్టు ఆదేశించింది. ఆయనకు సంబంధించిన ఓ పితృత్వ కేసు పెండింగులో ఉండటంతో ఆయన బాడీకి అంతిమ సంస్కారాలను నిలుపుదల చేయాలని ఆదేశించింది.

నవంబరు 25న మారడోనా గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 60 ఏళ్లు.

మారడోనా తన తండ్రి కావచ్చేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ 25 సంవత్సరాల మగలి గిల్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో కోర్టు స్పందిస్తూ మారడోనా డీఎన్ఏ నమూనాను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

ఆయనకు వివాహబంధంలో పుట్టిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మరో ఆరుగురు పిల్లలతో కూడా ఆయనకు పితృత్వ సంబంధం ఉందని ఆయన అంగీకరించారు. అయితే, మారడోనా అంగీకరించిన ఈ ఆరుగురిలో మగలి గిల్ లేరు.

గిల్ వేరే వ్యక్తుల దగ్గర పెరుగుతున్నారు. ఆమెకు జన్మనిచ్చిన తల్లి రెండేళ్ల క్రితం ఫోన్ చేసి ఆమె తండ్రి డిగో మారడోనా కావచ్చని చెప్పినట్లు గిల్ తెలిపారు.

"మారడోనా నా కన్నతండ్రో కాదో తెలుసుకోవడం నా సార్వత్రిక హక్కు" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో అన్నారు.

మారడోనా మరణించిన తర్వాత ఆయన బాడీని బ్యూనస్ ఎయిర్స్ నగరంలోని ఓ ప్రైవేటు స్మశానంలో పూడ్చిపెట్టారు. అయితే, అన్ని ఫోర్సెనిక్ పరీక్షలు పూర్తయ్యే వరకు ఆయన మృత దేహానికి అంతిమ సంస్కారాలు చేయడానికి వీలు లేదని నవంబరు 30న కోర్టు ఆదేశించింది.

బుధవారం నాటి కోర్టు రూలింగ్ ఆ నిషేధాన్ని మరికొన్ని రోజులకు పొడిగించింది.

మారడోనా డీఎన్ఏ నమూనాలు కొత్తగా సేకరించనక్కరలేదని, అవి ఇంతకు ముందే ఉన్నాయని మారడోనా లాయర్ రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు. పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీయవలసిన అవసరం లేదని అన్నారు.

ఆయన ఓ క్లిష్టమైన ఆర్థిక వారసత్వాన్ని వదిలిపెట్టి వెళ్లారు. ఆయన ఆస్తుల గురించి ఆయన గుర్తించిన పిల్లలు, ఇప్పుడు గుర్తింపు కోసం కోర్టులో పోరాడుతున్న పిల్లల మధ్య తగాదాలు చెలరేగుతున్నాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

మారడోనా మరణం అర్జెంటీనాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులను దిగ్బ్రాంతికి గురి చేసింది.

ఆయనకు నివాళి అర్పించడానికి వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌ , ట్విటర్ ‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)