డోనల్డ్‌ ట్రంప్‌: వందేళ్ల తర్వాత అత్యధిక మరణశిక్షలు అమలు చేసిన అమెరికా అధ్యక్షుడు

బెర్నార్డ్‌కు క్షమాభిక్ష పెట్టాలంటూ అనేకమంది విజ్జప్తి చేశారు

ఫొటో సోర్స్, Bernard Defense Team

ఫొటో క్యాప్షన్, బెర్నార్డ్‌కు క్షమాభిక్ష పెట్టాలంటూ అనేకమంది విజ్జప్తి చేశారు

అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్‌ ట్రంప్‌ పదవి నుంచి దిగిపోబోతున్న రోజుల్లో బ్రాండన్‌ బెర్నార్డ్‌ అనే నిందితుడికి మరణ శిక్ష అమలు కాబోతోంది.

మరణశిక్షను ఎదుర్కొంటున్న ఐదుగురిలో బ్రాండన్‌ బెర్నార్డ్‌కు గురువారంనాడు శిక్ష అమలు చేసేందుకు సర్వం సిద్ధమైంది

అయితే ఈ శిక్షను ఆపాలని, అతనికి క్షమాభిక్షను ప్రసాదించాలని కోరుతున్న వారిలో రియాల్టీషో నటి కిమ్‌ కర్దార్షియాన్‌ వెస్ట్‌ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

18 ఏళ్ల వయసులో ఇద్దరు వ్యక్తుల హత్యలో పాల్గొన్నాడన్న ఆరోపణలపై బెర్నార్డ్‌కు మరణ శిక్షను అమలు చేస్తున్నారు.

ప్రస్తుతం బెర్నార్డ్‌ వయసు 40 సంవత్సరాలు. అమెరికాలో 70 ఏళ్ల తర్వాత మరణశిక్షను ఎదుర్కొంటున్న అతి పిన్నవయస్కుడిగా బెర్నార్డ్‌ రికార్డులకెక్కనున్నారు.

మరణశిక్షను ఎదుర్కొంటున్న ఐదుగురికి శిక్షలు అమలైతే, వందేళ్ల తర్వాత అత్యధిక మరణశిక్షలను అమలు చేసిన అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్‌ ట్రంప్‌ చరిత్రలో నిలిచిపోతారు.

డిసెంబర్‌లో అమలు చేసే రెండు మరణశిక్షలతో ఈ ఏడాది జులై నుంచి అమలైన శిక్షల సంఖ్య 13కు చేరుతుంది.

వీటి అమలుతో అధ్యక్షుడిగా పదవి నుంచి వెళ్లబోయే ముందు మరణ శిక్షలను నిలిపేసే సంప్రదాయాన్ని 130ఏళ్ల తర్వాత బద్దలుకొట్టిన చరిత్ర కూడా ట్రంప్‌ పేరిట నిలిచిపోతుంది.

బ్రాండన్‌ బెర్నార్డ్‌ కేస్‌లో ఏం జరిగింది?

ఈ దఫాలో 56 ఏళ్ల ఆల్ఫ్రెడ్‌ బౌర్గిస్‌తోపాటు బ్రాండన్‌ బెర్నార్డ్ కూడా శిక్ష అనుభవించనున్నారు. ఇండియానాలోని టెర్రేహాటే ప్రాంతంలోని జైలులో వీరిద్దరికీ శిక్షలు అమలు చేస్తారు.

టాడ్, స్టాసీబాగ్లీ అనే ఇద్దరు మత ప్రచారకులను చంపారన్న ఆరోపణలపై 1999లో బెర్నార్డ్‌కు మరణ శిక్ష విధించారు.

టెక్సాస్‌లో వీరిద్దరినీ దోచుకుని చంపి, కారులోనే తగలబెట్టిన ఘటనలో నిందితులైన 5గురు టీనేజర్లలో బెర్నార్డ్ ఒకరు.

సహచరుడు 19 ఏళ్ల క్రిస్టోఫర్‌ వీల్వా వారిద్దరినీ గన్‌తో కాల్చి చంపగా, బెర్నార్డ్ వారి కారుకు నిప్పుపెట్టారు.

అయితే టాడ్, స్టాసీబాగ్లీ కారుకు నిప్పుపెట్టడానికి ముందే చనిపోయి ఉంటారని నిందితుల తరఫు లాయర్‌ వాదించారు.

దీనిపై ప్రత్యేక దర్యాప్తు జరపగా, మృతుల్లో ఒకరైన స్టాసీ మాత్రమే కారు తగలబడిపోవడానికి ముందు చనిపోయారని తేలింది.

టాడ్‌ బాగ్లీ చనిపోయినప్పటికీ స్టాసీ అప్పటికీ శ్వాస పీలుస్తున్నట్లు, చనిపోయే ముందు పొగతో ఊపిరాడక ఇబ్బందిపడినట్లు సాక్ష్యాధారాలు లభించాయి.

తన సహచరుడు వీల్వా తుపాకీతో బెదిరించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు బెర్నార్డ్‌ కారును తగలబెట్టాల్సి వచ్చిందని అతని లాయర్‌ వాదించారు.

ఈ ఘటనలో పాలుపంచుకున్న మరికొందరు టీనేజర్లు 18 ఏళ్ల లోపు వారు కావడంతో మరణశిక్ష నుంచి వారికి మినహాయింపు లభించింది.

బెర్నార్డ్‌ తన జీవితకాలంలో ఎక్కువ సమయం జైలులో గడిపారని, నేరాలు చేయవద్దంటూ అతడు అనేక కార్యక్రమాలలో ప్రచారం కూడా చేశాడని లాయర్లు కోర్టుకు చెప్పారు.

పెరోల్‌ లేని జీవిత ఖైదుతో మరణశిక్ష నుంచి తప్పించాలని వారు న్యాయస్థానాన్ని కోరారు.

బెర్నార్డ్‌కు మద్దతుగా నిలబడింది ఎవరు ?

ఒకప్పుడు బెర్నార్డ్‌కు మరణశిక్షను సమర్ధించిన ప్రభుత్వ న్యాయవాది ఏంజెలా ఇటీవల అతని మరణశిక్షను వ్యతిరేకిస్తూ ఓ మేగజైన్‌కు ఆర్టికల్‌ రాశారు.

“ఈ కేసు తర్వాత నేను మనిషి మెదడు గురించి చాలా అధ్యయనం చేశాను. బెర్నార్డ్‌ ఇప్పుడు వివేకం ఉన్న వ్యక్తిలా మారాడు. జైలులో అతను ప్రశాంతంగా జీవించే అవకాశం ఇవ్వాలి” అని ఆమె పేర్కొన్నారు.

విచారణలో పాల్గొన్న తొమ్మిదిమంది జ్యూరీ సభ్యుల్లో ఐదుగురు బెర్నార్డ్‌ మరణశిక్షను మార్చాల్సిందిగా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌కు విజ్జప్తి చేశారు.

బెర్నార్డ్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఇద్దరు సెనెటర్లతోపాటు కొన్నివేలమంది ట్రంప్‌కు విన్నపాలు చేశారు.

రియాల్టీషో నటి కిమ్‌ కర్దార్షియాన్‌ వెస్ట్‌ కూడా ఈ మరణశిక్షను వ్యతిరేకిస్తూ అనేకసార్లు ట్వీట్లు చేశారు.

కర్దార్షియాన్‌ వెస్ట్‌ ప్రస్తుతం కాలిఫోర్నియాలో న్యాయశాస్త్రం చదువుతున్నారు. అనేక క్రిమినల్‌ కేసులలో విచారణ త్వరగా తేలేందుకు ఆమె సహాయం చేశారు.

క్షమాభిక్షతో జైలు నుంచి విడుదలైన ముగ్గురు మహిళలతో ఆమె అధ్యక్షుడు ట్రంప్‌ను ఇటీవల వైట్‌హౌస్‌లో కలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)