అమెరికాలో 1953 తరువాత మొదటిసారి ఒక మహిళకు మరణశిక్ష... ఆమె చేసిన నేరం ఏమిటంటే?

ఫొటో సోర్స్, Reuters
దాదాపు 70 ఏళ్ల తర్వాత అమెరికా ఫెడరల్ జైల్లో ఉన్న ఒక మహిళా ఖైదీకి మరణశిక్ష అమలు చేయబోతున్నట్లు ఆ దేశ న్యాయ శాఖ చెప్పింది.
లీసామోంట్‌గోమరీ 2004లో ఒక గర్భవతిని గొంతు పిసికి చంపి, ఆమె గర్భం కోసి బిడ్డను ఎత్తుకెళ్లింది.
ఈ కేసులో ఆమెకు డిసెంబర్ 8న విషం ఇంజెక్షన్ ఇవ్వనున్నారు.
అమెరికా ఫెడరల్ కోర్టు ఇంతకు ముందు చివరగా 1953లో బోనీ హీడీ అనే మహిళకు మరణ శిక్ష విధించింది.
మరణశిక్షల సమాచారం అందించే విభాగం వివరాల ప్రకారం ఆమెను మిస్సోరీలో ఒక గ్యాస్ చాంబర్‌లో పెట్టి మరణశిక్ష విధించారు.
1999లో ఇద్దరు యువ మంత్రులను హత్య చేసిన బ్రాండన్ బెర్నార్డ్ కు కూడా ఇదే ఏడాది డిసెంబర్‌లో మరణశిక్ష విధించనున్నారు.
మాంట్‌గోమరీ, బ్రాండన్ బెర్నార్డ్ ఘోరమైన హత్యలు చేశారని అమెరికా అటార్నీ జనరల్ విలియం బార్ చెప్పారు.
ఫెడరల్ కోర్ట్ మరణశిక్షలను తిరిగి ప్రారంభించవచ్చని ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది న్యాయ శాఖకు సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
మోంట్‌గోమరీ ఎవరు?
మోంట్‌గోమరీ 2004 డిసెంబరులో ఒక కుక్కపిల్ల కొనడానికి కన్సాస్ నుంచి మిస్సోరీలోని బాబీ జో స్టినెట్ ఇంటికి వెళ్లారని న్యాయ శాఖ ఒక పత్రికా ప్రకటనలో చెప్పింది.
“మాంట్‌గోమరీ ఆ ఇంట్లోకి వెళ్లాగనే స్టినెట్ గొంతు నులిమింది. అప్పటికి ఎనిమిది నెలల గర్భంతో ఉన్న బాధితురాలు స్పృహ తప్పారు. తర్వాత ఆమె వంటగదిలోని కత్తితో స్టినెట్ కడుపు కోసింది. దాంతో స్టినెట్‌కు మళ్లీ స్పృహ వచ్చింది. ఇద్దరి మధ్యా కాసేపు పెనుగులాట జరిగింది. తర్వాత మాంట్‌గోమరీ స్టినెట్‌ను గొంతు కోసి చంపింది. ఆమె గర్భం నుంచి బిడ్డను తీసి ఎత్తుకెళ్లింది. ఆ బిడ్డను తన సొంత బిడ్డగా పెంచుకోడానికి ప్రయత్నించింది” అని అందులో చెప్పారు.
కిడ్నాపింగ్, మరణానికి కారణం కేసులో 2007లో జ్యూరీ మోంట్‌గోమరీని దోషిగా గుర్తించింది. ఆమెకు మరణశిక్ష విధించాలని ఏకగ్రీవంగా సిఫారసు చేసింది.
కానీ, చిన్నప్పుడు కొట్టడం వల్ల ఆమెకు మెదడు పాడయ్యిందని, ఆమె మానసికంగా బలహీనంగా ఉన్నారని, ఆమె మరణశిక్ష రద్దు చేయాలని మాంట్‌గోమరీ లాయర్లు కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫెడరల్, స్టేట్ మరణశిక్షలకు తేడా ఏంటి
అమెరికా న్యాయ వ్యవస్థ ప్రకారం నేరాలను జాతీయ స్థాయిలో ఫెడరల్ కోర్టుల్లో, ప్రాంతీయ స్థాయిలో రాష్ట్ర కోర్టుల్లో విచారిస్తారు.
నకిలీ కరెన్సీ, లేఖలు దొంగిలించడం లాంటి నేరాల విచారణ ఆటోమేటిగ్గా ఫెడరల్ స్థాయిలో జరుగుతాయి. ఎందుకంటే, ఇందులో అమెరికా ఒక పక్షంగా ఉంటుంది, అవి రాజ్యాంగ ఉల్లంఘన కిందికి కూడా వస్తాయి. నేరాల తీవ్రతను బట్టి కొన్ని కేసులను ఫెడరల్ కోర్టుల్లో విచారిస్తారు.
1972లో ఫెడరల్, స్టేట్ స్థాయిలో మరణశిక్షలను నిషేధిస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అన్ని రకాల మరణశిక్షల చట్టాలను రద్దు చేయాలని అప్పుడు నిర్ణయించారు.
కానీ, రాష్ట్రాలు మరణశిక్షను పునరుద్ధరించేందుకు 1976లో సుప్రీంకోర్టు అనుమతించింది. 1988లో ఒక చట్టం ఆమోదించిన అమెరికా ప్రభుత్వం ఫెడరల్ స్థాయిలో కూడా మరణశిక్షను మళ్లీ అమలులోకి తెచ్చింది.
మరణశిక్షల సమాచారం అందించే విభాగం గణాంకాల ప్రకారం 1988 నుంచి 2018 మధ్య ఫెడరల్ కోర్టులు 78 మందికి మరణశిక్ష విధిస్తే, ముగ్గురికి మాత్రమే దానిని అమలు చేశారు.
మరణశిక్ష నిబంధనల్లో మార్పు ఎందుకు
సుదీర్ఘ విరామం తర్వాత ఫెడరల్ స్థాయిలో మరణశిక్షలను మళ్లీ ప్రారంభిస్తామని ట్రంప్ ప్రభుత్వం గత ఏఢాది చెప్పింది.
దారుణమైన నేరాలు చేసేవారికి మరణశిక్ష విధించాలని రెండు పార్టీలూ అధికారంలో ఉన్నప్పుడు న్యాయ శాఖ కోరిందని అప్పటి అటార్నీ జనరల్ ప్రకటించారు.
“న్యాయ పాలనను న్యాయ శాఖ సమర్థిస్తుంది. మా కోర్టులు విధించిన శిక్షను ముందుకు తీసుకెళ్లడానికి మేం బాధితులకు, వారి కుటుంబాలకు రుణపడి ఉంటాం” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- జపాన్ 'ట్విటర్ కిల్లర్': ‘అవును ఆ తొమ్మిది మందినీ నేనే చంపాను’
- ‘నన్ను నేను చంపుకోవాలనే ప్రయత్నాలను చంపేశా.. ఇలా..’
- ఆత్మవిశ్వాసం తగ్గి ఆందోళన పెరిగినప్పుడు ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే చాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








