సౌదీ అరేబియా: ఇకపై బాల నేరస్థులకు ఉరి శిక్షలు ఉండవు

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Getty Images

మైనర్లుగా ఉన్నప్పుడు చేసిన నేరాలకు ఇకపై సౌదీ అరేబియా మరణశిక్ష విధించబోదని ఆ దేశ మానవ హక్కుల కమిషన్ తెలిపింది. సౌదీ రాజు సల్మాన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది.

కొరడా దెబ్బల శిక్ష విధించడాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు రెండు రోజుల క్రితం సౌదీ ప్రకటించింది.

బాలల హక్కుల అంశంపై ఐరాస ఒడంబడిక ప్రకారం మైనర్లుగా ఉన్నప్పుడు చేసిన నేరాలకు మరణ శిక్ష విధించకూడదు. దీనిపై సంతకం చేసిన దేశాల్లో సౌదీ కూడా ఉంది.

మానవ హక్కుల విషయంలో సౌదీ ప్రపంచంలోనే అత్యంత వెనుకబడి ఉన్న దేశాల్లో ఒకటని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు.

దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ తీవ్ర అణచివేతకు గురవుతోందని, ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లను నిరంకుశంగా అరెస్టు చేస్తుంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2019లో రికార్డు స్థాయిలో 189 మందికి సౌదీ అరేబియా మరణ శిక్షలు అమలు చేసిందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటోంది. మైనర్‌గా ఉండగా చేసిన నేరానికి మరణ శిక్ష పడ్డ కేసు వీటిలో కనీసం ఒక్కటైనా ఉందని తెలిపింది.

మైనర్లుగా ఉండగా చేసిన నేరాలకు మరణ శిక్షకు బదులుగా బాల నేరస్థుల నిర్బంధ కేంద్రంలో గరిష్ఠంగా పదేళ్ల పాటు ఉంచేలా మార్పులను తెస్తూ సౌదీ రాజు ఉత్తర్వు ఇచ్చారని ఆ దేశ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు అవాద్ అల్వాద్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ కమిషన్‌కు సౌదీ ప్రభుత్వ మద్దతు ఉంది.

సౌదీ శిక్షాస్మృతిని మరింత ఆధునికంగా మార్చేందుకు ఈ ఉత్తర్వు ఉపయోగపడుతుందని అల్వాద్ అభిప్రాయపడ్డారు.

‘2019లో 189 మందికి సౌదీ అరేబియా మరణ శిక్షలు అమలు చేసింది’

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ‘2019లో 189 మందికి సౌదీ అరేబియా మరణ శిక్షలు అమలు చేసింది’

ఈ నిర్ణయం గురించి సౌదీ ప్రభుత్వ మీడియాలో వెంటనే వార్తలు రాలేదు. కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేదానిపైనా స్పష్టత లేదు.

సౌదీలో ఎంతో మంది మానవ హక్కుల కార్యకర్తలు, మహిళా హక్కుల కార్యకర్తలు జైళ్లలో మగ్గుతున్నారు. 2018లో జమాల్ ఖషోగ్జీ అనే జర్నలిస్ట్ ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయంలో హత్యకు గురయ్యారు. ఈ ఉదంతం తర్వాత మానవ హక్కుల విషయమై సౌదీపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టడం ఎక్కువైంది.

గత వారం సౌదీలోని ప్రముఖ మానవహక్కుల కార్యకర్త ఒకరు జైల్లో పక్షవాతం వచ్చి మృతిచెందారు. అయితే, ఆ వ్యక్తి ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతోనే ఇలా జరిగిందని సహచర కార్యకర్తలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)