చైనా: విషం కలిపిన ఆహారాన్ని స్కూలు పిల్లలకు పెట్టిన టీచర్‌కు మరణశిక్ష

చైనా

ఫొటో సోర్స్, Getty Images

చైనాలో 25 మంది పిల్లలకు ఆహారంలో విషం ఇచ్చిన నేరానికి పాల్పడినందుకు నర్సరీ టీచర్ వాంగ్ యున్ కు చైనా కోర్టు మరణ శిక్ష విధించింది. విషాహారం బారిన పడిన ఒక చిన్నారి 10 నెలల పాటు హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత ఈ సంవత్సరం జనవరిలో మరణించారు.

గత సంవత్సరం జియాజౌ నగరంలో కిండర్ గార్డెన్ చదువుతున్న పిల్లలు విషం కలిపిన అల్పాహారం తిన్న వెంటనే హాస్పిటల్ పాలయ్యారు. ఈ నేరారోపణ పై వాంగ్ యున్ ను వెంటనే అరెస్టు చేశారు.

వాంగ్ యున్ తన సహ ఉద్యోగి పై పగ తీర్చుకునేందుకు ఆమె క్లాసు పిల్లలు తినే అల్పాహారంలో సోడియం నైట్రేట్ కలిపారని కోర్టు తెలిపింది.

ఆమెను 'నీచమైన, దుర్మార్గమైన' వ్యక్తిగా కోర్టు పేర్కొంది.

2019 మార్చి 27న చైనాలో చోటు చేసుకున్న ఈ ఘటన అంతర్జాతీయ మీడియా హెడ్ లైన్లను కూడా ఆక్రమించింది.

చైనా

స్కూల్లో పొద్దున్న పెట్టిన అల్పాహారం తిన్న తర్వాత 23 మంది పిల్లలు వాంతులు చేసుకుని కళ్ళు తిరిగి పడ్డారని వార్తలు వచ్చాయి. స్కూలు టీచరే ఈ పని చేసి ఉంటారనే ఆరోపణలు రావడంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు.

సోమవారం చైనా స్థానిక కోర్టు వాంగ్ కి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

"స్కూలులో మరొక టీచర్ మీద పగతో ఆమె క్లాసు పిల్లలు తినే ఆహారంలో సోడియం నైట్రేట్ కలిపినట్లు కోర్టు తెలిపింది. అంతకు ముందు ఇరువురు టీచర్ల మధ్య స్కూలు పిల్లలు, యాజమాన్యం విషయాల పై వాదనలు జరిగినట్లు కోర్టు చెప్పింది.

కొన్నిసార్లు మాంసాన్నిశుభ్రపరచడానికి సోడియం నైట్రేట్ని వాడతారు కానీ, ఇది ఎక్కువ మోతాదులో వాడితే విషపూరితం అయ్యే ప్రమాదం ఉంది.

వాంగ్ ఇలా విష ప్రయోగం చేయడం మొదటి సారి కాదని కోర్టు చెప్పింది. ఆమె గతంలో కూడా నైట్రేట్ ని ఆన్ లైన్ లో కొని స్వల్ప గాయాలైన ఆమె భర్త పై కూడా ప్రయోగించినట్లు కోర్టు తెలిపింది.

వాంగ్ చాలా నీచమైన దుర్మార్గపు పనులకు ఒడిగట్టారంటూ ఆమె చేసిన నేరాల ఫలితాలు చాలా తీవ్రంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఇందుకు గాను ఆమెకు శిక్ష పడాల్సిందేనని తీర్పునిచ్చింది.

చైనా ఎంత మందికి మరణ శిక్ష విధిస్తుందనే విషయాన్ని వెల్లడి చేయనప్పటికీ , ప్రతీ సంవత్సరం కొన్ని వేల మంది మరణ శిక్ష బారిన పడతారని మానవ హక్కుల గ్రూపులు చెబుతాయి.

చైనాలో మరణ శిక్షను లెథల్ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా కానీ, లేదా కాల్చి చంపడం ద్వారా కానీ అమలు చేస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)