దివీస్‌‌: బంగాళాఖాతంలో కలిపేస్తామన్న జగన్ ఇప్పుడు అనుమతులు ఎందుకిచ్చారు

ఆందోళనకారులను జైలుకు తరలిస్తున్న పోలీసులు
ఫొటో క్యాప్షన్, ఆందోళనకారులను జైలుకు తరలిస్తున్న పోలీసులు
    • రచయిత, వి.శంకర్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తూర్పుగోదావరి జిల్లాలో దివీస్‌ ఫార్మా సంస్థ నిర్మాణంపై వివాదం నెలకొంది.

ఒకప్పుడు ఈ పరిశ్రమకు అనుమతి ఇచ్చిన పార్టీ ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తుండగా, నాడు వ్యతిరేకించిన ప్రతిపక్షం, అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చింది.

ఎవరికి వారు తమ నిర్ణయాలను సమర్ధించుకుంటుండగా , పార్టీలు తమ జీవితాలతో ఆటాడుకుంటున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.

"విశాఖలో ఫార్మాసిటీ ఉంది. దివీస్‌ కంపెనీ అక్కడ ఏర్పాటు చేసి ఉంటే అందరూ ఆనందించేవాళ్లం. కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో హేచరీలు అత్యధికంగా ఉన్న తుని ప్రాంతంలో పెడుతున్నారు.

కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వాజోన్‌గా డిక్లేర్ చేసింది. రొయ్య పిల్లలు బతకాలంటే సముద్రం నీళ్లు శుభ్రంగా ఉండాలి.

లేకపోతే రొయ్య పిల్లలు బతకవు. రైతులకు కూడా ఇబ్బందులొస్తాయి. అందుకే అందరూ వద్దు వద్దు అంటున్నారు.

ఇదే దివీస్ కంపెనీ ఫార్ములేషన్ చేస్తే అందరూ సంతోషించేవాళ్లం. బల్క్‌ డ్రగ్ స్థాయిలో మందులు తయారు చేస్తున్నారు.

65 లక్షల లీటర్ల మంచి నీరు తీసుకుని 55లక్షల కలుషిత నీటిని నేరుగా సముద్రంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు.

తుని మునిసిపాల్టీకి 45 లక్షల లీటర్ల నీటిని వాడితే దానికన్నా ఎక్కువగా దివీస్ వాళ్లు కలుషిత నీటిని సముద్రంలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు"

- ఇవీ విపక్ష నేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న మాటలు. 2018 ఆగస్ట్ 18న పాదయాత్రలో భాగంగా తునిలో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకు ముందు 2016 నవంబర్ 16న తొండంగి మండలం దానవాయిపేట సమీపంలో నిర్వహించిన బహిరంగసభలోనూ ఆయన పాల్గొన్నారు. దివీస్ నిర్మించాలనుకుంటున్న ప్రాంతంలో వైసీపీ ఈ సభను నిర్వహించింది.

దివీస్‌ సంస్థకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారికి ఆనాడు జగన్ సంఘీభావం ప్రకటించారు.

అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటుని వ్యతిరేకించారు. తమనుకాదని ముందుకెళితే, అధికారంలోకి రాగానే దివీస్‌ని బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు.

జగన్

ఫొటో సోర్స్, facebook/ysrcongressparty

అధికారం చేతులు మారిన తర్వాత...

రెండేళ్లు తిరిగే సరికి జగన్‌ ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వం దివీస్‌కి వంతపాడుతోందని ఆనాడు విమర్శించిన జగన్‌, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదే పని చేస్తున్నారంటూ ప్రజల నుంచి విమర్శలకు అవకాశమిచ్చారు.

నాడు బంగాళాఖాతంలో కలిపేస్తానన్న జగన్‌ ఇప్పుడు కంపెనీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

దీంతో తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఉద్యమం మరోసారి రాజుకుంది.

చివరకు దివీస్ కంపెనీ చేపట్టిన నిర్మాణాలపై ఆందోళనకారుల దాడులకు దిగేదాకా వెళ్లింది.

మరోసారి ఉద్రిక్తత ఏర్పడడంతో పరిశ్రమల శాఖ రంగంలో దిగింది. ప్రజల అభ్యంతరాలను పరిష్కరించే వరకూ ఒక్క ఇటుక కూడా ముందుకు కదపకూడదని దివీస్ యాజమాన్యాన్ని ఆదేశించింది.

ప్రజలకు నచ్చజెప్పేందుకు పలు చర్యలు తీసుకోవాలని దివీస్ ప్రతినిధులకు సూచించింది.

ఇప్పటికే దివీస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతిస్తున్న వామపక్షనేతలు సహా 36 మందిని అరెస్ట్ చేశారు.

హత్యాయత్నంతో పలు ఆరోపణలతో కేసులు పెట్టారు. మరికొందరిపై కూడా కేసులు పెట్టాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

స్థానిక మహిళలు

‘దివీస్’ వివాదం ఎప్పుడు మొదలైంది?

దేశంలోని అతిపెద్ద ఫార్మా కంపెనీలలో దివీస్ లేబొరేటరీస్ రెండో స్థానంలో ఉంది.

మార్కెట్ విలువ ప్రకారం సన్‌ ఫార్మా తర్వాత దివీస్‌దే అగ్రస్థానం.

కరోనా నేపథ్యంలో షేర్‌ విలువ వేగంగా పెరిగిన కంపెనీలలో దివీస్ అగ్రస్థానంలో ఉంది.

విస్తరణ ప్రణాళికల కారణంగా షేర్ విలువ మరింత పెరిగిందని పరిశ్రమ వర్గాలు విశ్లేషించాయి.

ఇప్పటికే దివీస్ కంపెనీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో యూనిట్లు ఉన్నాయి. విస్తరణలో భాగంగా కాకినాడ సెజ్‌కి సమీపంలో కొత్త పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

2015లో నాటి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా 530 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ద్వారా సేకరించింది.

2016లో తొండంగి మండలం ఒంటిమామిడి సమీపంలో తన మూడో యూనిట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

అయితే ఇక్కడ కంపెనీ పెడితే రసాయనాలు సముద్రంలో కలవడం వల్ల చేపలు చనిపోతాయని, పొలాలు పాడవుతాయని స్థానిక మత్స్యకారులు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు.

ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం కూడా రసాభసాగా మారింది.

ఆ తర్వాత కూడా ఉద్యమం సాగింది. విపక్ష నేత హోదాలో జగన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు వంటి వారు ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.

ఆ సందర్భంగా పలుమార్లు అరెస్టులు, ఆందోళనలు జరిగాయి.

చివరకు ప్రభుత్వం దివీస్ నిర్మాణం విషయంలో అడుగు ముందుకేయలేని పరిస్థితి ఏర్పడింది.

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్‌ సంస్థ ఫార్మా పరిశ్రమను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు
ఫొటో క్యాప్షన్, తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్‌ సంస్థ ఫార్మా పరిశ్రమను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు

నాడు టీడీపీ- నేడు వైసీపీ

దివీస్‌ పరిశ్రమ ప్రతిపాదిత ప్రాంతం అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత మండలంలో ఉంది.

ఆయన స్వగ్రామానికి సమీపంలోనే ఈ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అయినా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించడంతో నిర్మాణం ముందుకు సాగలేదు.

పరిశ్రమ ఏర్పాటుని, భూకేటాయింపులను వ్యతిరేకించడంలో వైసీపీ నేతలు ముందున్నారు.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం దివీస్‌ ఫార్మా కంపెనీ స్థాపనకు అనుమతినిచ్చింది.

కానీ ఇప్పుడు టీడీపీ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిర్మాణ ప్రతిపాదనలు దివీస్‌ సంస్థ శాశ్వతంగా విరమించుకోవాలని డిమాండ్ చేస్తోంది.

అధికారంలో ఉండగా ఒకమాట, ప్రతిపక్షంలో ఉండగా మరో మాట మాట్లాడుతూ తమను మోసం చేస్తున్నారని ఇరు పార్టీల నేతల తీరుపై దివీస్ ప్రభావిత ప్రాంతవాసులు విమర్శిస్తున్నారు

"ముఖ్యమంత్రి జగన్‌, దాడిశెట్టి రాజా, చంద్రబాబు, యనమల... వీళ్లంతా ప్రజలను దూరం పెట్టాలని చూస్తున్నారు. అప్పుడు వాళ్లు పెట్టాలంటే వీళ్లు వద్దని, వీళ్లు పెడతానంటే వాళ్లు వద్దని ఇద్దరూ మా జీవితాలతో ఎందుకు ఆటలు ఆడుతున్నారు?” అని కొత్తపాకలు గ్రామానికి చెందిన దారా సింహాచలం అనే మహిళ బీబీసీతో అన్నారు.

“ మేము ఇక్కడ బాగానే బతుకుతున్నాం. మేము అమ్మకపోయినా మా ఇళ్లు, మా పొలాలు లాగేసుకుంటున్నారు. ఇదేం న్యాయమని అడిగితే మా మీదకు పోలీసులను పంపిస్తున్నారు. చంటిబిడ్డ తల్లులను కూడా అరెస్ట్ చేసి తీసుకెళుతున్నారు" అంటూ ఆవేదన చెందారు.

పరిశ్రమపై అభ్యంతరాలు తొలగిస్తామన్న ప్రభుత్వం, దివీస్ రాదు అంటున్న ఎమ్మెల్యే

తుని నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉద్యమానికి అండగా నిలబడ్డారు.

ఇప్పుడు కూడా ప్రజల పక్షాన నిలుస్తానని చెబుతున్నారు.

తొండంగి మండలంలో పరిశ్రమ పెడితే తానే ముందుండి వ్యతిరేకిస్తానని ప్రకటించారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం భిన్నంగా స్పందించింది.

ప్రజల అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకూ 'దివీస్' ఒక్క ఇటుక కూడా కదపకూడదని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆదేశాల ఇచ్చారు.

అదే సమయంలో 'దివీస్' పరిశ్రమ చుట్టూ అలుముకున్న సున్నితాంశాల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రకటించారు.

అన్ని సమస్యలు పరిష్కరించాకే దివీస్ నిర్మాణం చేపడతామన్నారు.

"గత ప్రభుత్వంలో దివీస్‌కు కారు చౌకగా భూములు కట్టబెట్టారు. రూ.300కోట్ల విలువైన భూమిని రూ.30 కోట్లకే అప్పగించారు.

అప్పట్లో ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు. దాంతో మా పార్టీ కూడా ఉద్యమించింది.

సీఏం జగన్ కూడా అప్పట్లో స్వయంగా పోరాటానికి అండగా నిలిచారు’’ అని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బీబీసీతో అన్నారు.

“ఇప్పటికీ మేము కాలుష్య పరిశ్రమలను వ్యతిరేకిస్తున్నాం. అయితే జీరో డిశ్చార్జ్‌తో పొల్యూషన్‌ లేకుండా చేస్తామని కంపెనీ యాజమాన్యం సీఎంకి హామీ ఇచ్చింది.

కానీ మాతో వేరుగా చెబుతోంది. ఇప్పటికీ దివీస్ ఇక్కడ పెట్టకూడదనే కోరుకుంటున్నాం" అన్నారు దాడిశెట్టి రాజా.

పోరాటం ఆగదంటున్న స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
ఫొటో క్యాప్షన్, పోరాటం ఆగదంటున్న స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా

దివీస్‌ పరిశ్రమపై దాడి- జైలుకి ఆందోళనకారులు

మూడేళ్ల కిందట జరిగిన ఉద్యమంతో పరిశ్రమ వెనక్కిపోయిందని భావించామని, కానీ మళ్లీ మొదలు పెడుతున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.

20 రోజులుగా నిరసనలు సాగుతున్నాయి. ఆ క్రమంలోనే డిసెంబర్ 17న పరిశ్రమ వద్ద ఆందోళనకు దిగారు స్థానికులు.

కొందరు నిరసనకారులు పరిశ్రమ నిర్మిత ప్రాంతంలోకి చొరబడ్డారు. జనరేటర్‌ సహా మరికొంత సామాగ్రి ధ్వంసమైంది. దీనిపై దివీస్‌ సంస్థ ఫిర్యాదు చేసింది.

రంగంలో దిగిన పోలీసులు ఫిర్యాదుల మేరకు కేసులు పెట్టారు.

"శాంతియుతంగా నిరసనలు తెలిపితే అభ్యంతరం లేదు. కానీ కంపెనీ సామాగ్రిని ధ్వంసం చేయడంతో మాకు ఫిర్యాదులు వచ్చాయి.

ఇప్పటి వరకూ 36 మందిని అరెస్ట్ చేశాం. 116 మందిపై కేసులు పెట్టాం. చట్ట ప్రకారం అందరి మీద చర్యలుంటాయి’’ అని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.

400మంది పోలీసులు దివీస్‌ నిర్మాణ స్థలం వద్ద విధులు నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

దివీస్‌ ఫార్మా కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం అనుమతినివ్వగా నాటి ప్రతిపక్ష నేతగా జగన్‌ వ్యతిరేకించారు
ఫొటో క్యాప్షన్, దివీస్‌ ఫార్మా కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం అనుమతినివ్వగా నాటి ప్రతిపక్ష నేతగా జగన్‌ వ్యతిరేకించారు

ప్రభుత్వ తీరుపై విపక్షాల ఆగ్రహం

దివీస్‌ ఫార్మా విషయంలో ముఖ్యమంత్రి మాట మారుస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు.

ఇదే అంశంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీఎంకి లేఖ రాశారు.

దివీస్ ప్రతిపాదన విరమించుకోవాలని సూచించారు. మాట తప్పిన దివీస్‌కు అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు.

జనసేన నేతలు కూడా దివీస్ పరిశ్రమ పెడితే ప్రభావితమయ్యే ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ బాధితులను కలిసిన తర్వాత వ్యాఖ్యానించారు.

గతంలో దివీస్‌ ఉద్యమం సందర్భంగా మాజీ ఎంపీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పలుమార్లు అరెస్ట్ అయ్యారు.

"ప్రజా ఉద్యమాలతో నాటి ప్రభుత్వం వెనకడుగు వేసింది. దివీస్‌ నిర్మిత ప్రాంతంలో ఇప్పటికే 300 హేచరీలు ఉన్నాయి. ఒక్కో పరిశ్రమలో 100మందికి ఉపాధి దక్కుతోంది.

దాదాపుగా 30వేల మందికి అక్కడ జీవనోపాధికి ఢోకా లేదు. మత్స్యకారుల వేటకు కూడా ఎటువంటి సమస్యలు లేవు.

జీడిమామిడివంటి వ్యాపార పంటలు కూడా సాగులో ఉన్నాయి. సీఆర్‌జెడ్‌ చట్టం ప్రకారం ఆ కంపెనీకి ఇచ్చిన అనుమతులు చెల్లవు.

పైగా ఫారెస్ట్‌ ప్రాంతంలో ఫార్మా కంపెనీ ప్రతిపాదన తప్పు’’ అని మధు బీబీసీతో అన్నారు. “జగన్‌ ప్రభుత్వం కంపెనీకి వంతపాడటం తగదు’’ అన్నారాయన.

ఫార్మా కంపెనీ నిర్మాణాలపై స్థానికులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు
ఫొటో క్యాప్షన్, ఫార్మా కంపెనీ నిర్మాణాలపై స్థానికులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు

అనుమతుల్లో మార్పులు చేశామంటున్న ప్రభుత్వం

దివీస్‌ ఫార్మా విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులలో పలుమార్పులు చేశామని తూర్పుగోదావరి జిల్లాకి చెందిన వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రభుత్వం తరఫున మీడియాకు తెలిపారు.

"దివీస్‌ నిర్మాణం ద్వారా కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. జీరోడిశ్ఛార్జ్‌కి కంపెనీ సిద్ధమైన తర్వాతే అనుమతినిచ్చాం.

గత ప్రభుత్వం 500 ఎకరాలలో పరిశ్రమ స్థాపనకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. మేము దానిని 250 ఎకరాలకు కుదించాం’’ అని ఆయన వివరించారు.

టీడీపీ నేతలు అప్పుడు అనుమతులు ఇచ్చి ఇప్పుడు విమర్శలు చేయడం తగదు"అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)