ఈమెయిల్: ‘థాంక్యూ’ అంటూ మెయిల్ పంపడం మానేస్తే.. పర్యావరణాన్ని కాపాడుకోవచ్చా?

కంప్యూటర్ వాడుతున్న అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డేవిడ్ మోలోయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీరు మాటిమాటికి థాంక్యూ చెబుతుంటారా? నేరుగా కాదు... ఎవరైనా ఈ-మెయిల్ చేసినప్పుడు ‘థాంక్యూ’ అని తప్పక మళ్లీ బదులు పంపుతుంటారా? మీరు ఈ అలవాటును మార్చుకుంటే, పర్యావరణానికి హానిని తగ్గించగలమని అంటున్నారు బ్రిటన్ అధికారులు.

పొడిపొడిగా ఒక్క లైన్ మెయిళ్లు అనేకం పంపే బదులు, ఒకేసారి మొత్తం సందేశమంతా ఒకే మెయిల్‌లో పంపాలని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనంలో వారు సూచించారు. మెయిళ్ల సంఖ్య తగ్గిస్తే, కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయని... ఫలితంగా పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందని అన్నారు.

గ్లాస్గో నగరంలో వచ్చే ఏడాది జరిగే ‘సీఓపీ20 వాతావరణ సదస్సు’ నిర్వహణలో పాలుపంచుకుంటున్న ఓ అధికారి ఈ విషయం చెప్పారని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది.

నిజంగానే, మెయిళ్లు తగ్గిస్తే లాభం ఉంటుందా? అసలు వాటి ద్వారా కార్బన్ ఉద్గారాలు ఎలా వస్తాయి?

కాలుష్యం

ఇంటర్నెట్ అంటే హార్డ్‌వేర్ పరికరాలతో సంబంధం లేని క్లౌడ్ వ్యవస్థ అని చాలా మంది భావిస్తుంటారు.

కానీ, నిజానికి మనం ఒక మెయిల్ పంపుతున్నామంటే, అది చాలా ఎలక్ట్రానిక్ పరికరాలను దాటుతూ అవతలి వ్యక్తికి చేరుతుంది.

ల్యాప్‌టాప్ నుంచి మెయిల్ చేస్తే, మీ వైఫై రూటర్ లోకల్ ఎక్స్చేంజ్‌కు సంకేతం పంపుతుంది. అక్కడి నుంచి టెలికాం సంస్థకు సమాచారం చేరుతుంది. అక్కడి నుంచి పెద్ద పెద్ద టెక్ సంస్థలు నిర్వహించే డేటా సెంటర్లకు ఆ సమాచారం బదిలీ అవుతుంది. ఇవన్నీ విద్యుత్‌తో నడిచేవే. వీటన్నింటి నిర్వహణలో కార్బన్ ఉద్గారాలు వెలువడతాయి.

అయితే, అంతటి భారీ వ్యవస్థలపై ఒక చిన్న మెయిల్ చూపించే ప్రభావం చాలా తక్కువ.

కానీ, బ్రిటన్‌లో ఉండే పౌరులందరూ రోజులో ‘ఒక్క థాంక్యూ మెయిల్’ను తగ్గించుకున్నా, ఏడాదికి 16,433 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని… కొన్ని వేల విమాన ప్రయాణాలతో వెలువడే కార్బన్ ఉద్గారాల పరిమాణానికి ఇది సమానమని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది.

కేబుల్స్

ఫొటో సోర్స్, Getty Images

సమస్య ఏంటంటే... ఇంత చేసినా పర్యావరణం కోసం చేయాల్సిన కృషిలో ఇది ఆవగింజంత కూడా కాదు.

2019లో బ్రిటన్ వార్షిక గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలు 43.52 కోట్ల టన్నులుగా ఉన్నాయి. అందులో మెయిళ్లను తగ్గించుకుంటే తగ్గే కార్బన్ ఉద్గారాల పరిమాణం 0.0037 శాతం.

మెయిల్ ఒకరి నుంచి మరొకరికి చేరే ప్రక్రియలో ఉన్న ప్రతి అంశాన్నీ లెక్కలోకి తీసుకుని దాని ద్వారా వెలువడే కార్బన్ ఉద్గారాలను పరిశోధకులు లెక్కగట్టారని బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్రిస్ ప్రీస్ట్ చెప్పారు.

‘‘ల్యాప్‌టాప్, ఇంట్లో వైఫై, సర్వర్లు, డేటా సెంటర్ల నిర్మాణ ప్రక్రియలో వెలువడిన కార్బన్ ఉద్గారాలు... ఇలా ప్రతి స్థాయిలో కార్బన్ ఉద్గారాల వాటాను పరిగణనలోకి తీసుకుంటూ దీన్ని లెక్కగట్టారు’’ అని ఆయన అన్నారు.

‘‘మెయిల్ పంపినా, పంపకున్నా... మీ ల్యాప్‌టాప్, వైఫై, ఇంటర్నెట్ అన్నీ ఆన్‌లోనే ఉంటాయి. పెద్ద తేడా రాదు. కానీ, మెయిళ్లు పంపడం తగ్గితే, సర్వర్లను తగ్గించవచ్చు. అయితే, ఒక్కో మెయిల్‌పై కార్బన్ ఉద్గారాలు ఒక గ్రాము కన్నా తక్కువే ఉంటాయి’’ అని క్రిస్ ప్రీస్ట్ అన్నారు.

కాలుష్యం

మరి, మార్పు ఎలా వస్తుంది?

పర్యావరణంపై చాలా తక్కువ ప్రభావం చూపే మెయిళ్ల కన్నా గేమ్స్ స్ట్రీమింగ్, వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ స్టోరేజీ వంటి వాటిని తగ్గించడంపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, పర్యావరణంపై అవే అధికంగా ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు అంటున్నారు.

అయితే, ఇదంతా సంక్లిష్టమైన వ్యవహారం. ఏ ప్రక్రియ వల్ల ఎంత ఉద్గారాలు వస్తున్నాయి? వాటికి ఎవరు బాధ్యులు?... ఇవన్నీ తలలుపట్టుకున్నా తెగని విషయాలు.

గూగుల్ లాంటి పెద్ద టెక్ సంస్థలు ఇప్పటికే కార్బన్ న్యూట్రల్‌గా మారుతున్నాయి. మెయిళ్లతో పాటు యూట్యూబ్ వంటి సేవలు అందిస్తున్నందుకు తమ ద్వారా వెలువడుతున్న కార్బన్ ఉద్గారాలకు పరిహారంగా పర్యావరణ హితమైన ప్రాజెక్టులకు అవి సబ్సీడీలు అందిస్తున్నాయి.

‘‘మెయిల్ లాంటి చిన్న చిన్న అంశాలు కాకుండా, కొంచెం పెద్ద విషయాలపై జనం దృష్టి పెట్టాలి. ఉదాహరణకు ఏసీలు, హీటర్ల వాడకం పరిమితం చేసుకోవాలి. పెద్ద పెద్ద సంస్థలు వీలైనంత పర్యావరణ హితంగా తమ కార్యకలాపాలు సాగించేందుకు కృషి చేయాలి’’ అని క్రిస్ ప్రీస్ట్ అన్నారు.

‘‘అవతలి వ్యక్తి దానికి ప్రాధాన్యతను ఇస్తారని అనిపిస్తే, ఆ థాంక్యూ మెయిల్ పంపండి. లేదంటే వదిలేయండి. నన్ను అడిగితే అన్నింటికి మించీ దీని వల్ల వృథా అయ్యేది సమయమే’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)