‘ప్రపంచంలోనే పేరు మోసిన బ్రాండ్లు... చేయించుకునేది మాత్రం వెట్టి చాకిరీ’

కార్మికులు
    • రచయిత, రజనీ వైద్యనాథన్
    • హోదా, బీబీసీ న్యూస్

మార్క్స్ అండ్ స్పెన్సర్, టెస్కో, సైన్స్బరీ, రాల్ఫ్ లారెన్… ఇవన్నీ అంతర్జాతీయంగా పేరు మోసిన బ్రాండ్లు. వీటి ఉత్పత్తులు భారత్‌లోని కర్మాగారాల్లోనూ తయారవుతుంటాయి.

ఇంతవరకూ ఏ సమస్యా లేదు. కానీ, ఆ కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంటోంది. వాటిలో పని చేస్తున్న మహిళలు తాము తీవ్రమైన దోపిడీకి గురవుతున్నట్లు బీబీసీతో చెప్పుకుని వాపోయారు.

ఆర్డర్లు పూర్తి చేయడానికి తెల్లవార్లూ పని చేయాల్సి వస్తోందని, కొన్ని సార్లు ఆ ఫ్యాక్టరీ నేలపైనే నడుం వాల్చుతున్నామని రాల్ఫ్ లారెన్‌కి ఉత్పత్తులు సరఫరా చేసే ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్న మహిళలు చెప్పారు.

"మేము రాత్రంతా పని చేయాల్సి వస్తోంది. తెల్లవారు జామున 3 గంటలకు పడుకుని, ఐదు గంటలకే లేవాలి. మళ్లీ రోజంతా పనిచేయాలి. మా యజమానులు మా బాధలు పట్టించుకోరు. మేం పనిచేయడం మాత్రమే వారికి కావాలి" అని వారిలో ఓ మహిళ అన్నారు.

బీబీసీతో మాట్లాడిన సదరు మహిళల పేర్లను, వారు పనిచేస్తున్న ఫ్యాక్టరీల పేర్లను వారి భద్రత దృష్ట్యా మేం గోప్యంగా ఉంచుతున్నాం.

బ్రిటన్‌లోనూ ఇవే బ్రాండ్ల కోసం చాలా మంది పనిచేస్తుంటారు. కానీ, వారికి మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉంటాయి.

‘‘మా లాంటి పరిస్థితుల్లో పనిచేయడానికి అక్కడ ఎవరూ అంగీకరించరు. మేం మాత్రం భరించాల్సి వస్తోంది’’ అని భారత్‌లోని కార్మికులు అంటున్నారు.

‘‘మాకు టాయిలెట్‌కు వెళ్లడానికి కూడా విరామం ఇవ్వరు. షిఫ్ట్‌లో ఉన్నప్పుడు కనీసం మంచి నీళ్లు తాగడానికి కూడా సమయం ఉండదు. భోజనం మాట సరేసరి’’ అని ఒక మహిళ చెప్పారు.

"కొన్ని సార్లు క్యాంటీన్లో మేము భోజనం చేస్తుండగానే మేనేజర్ మా వెనక నిల్చుని పనిలోకి వెళ్లే సమయం అయిందంటూ విజిల్ ఊదుతూ చెబుతారు" అని ఆమె అన్నారు.

"మేం ఎక్కువ సేపు పని చేసేలా ఒత్తిడి చేస్తారు. అదనపు పనిని ఇచ్చి, పూర్తి చేసే వరకు ఇంటికి వెళ్లనివ్వరు" అని మరో మహిళ చెప్పారు.

"మాపై పని భారాన్ని పెంచుతున్నారు. దాన్ని పూర్తి చేయడానికి మేం ఎక్కువ సేపు ఉండాల్సి వస్తోంది. లేదంటే మా పై అరుస్తారు. పనిలోంచి తీసేస్తామని బెదిరిస్తారు. ఉద్యోగాలు పోతాయేమోనని భయపడుతూ ఉంటాం" అని ఆమె చెప్పారు.

నాలుగు బ్రాండ్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న ఫ్యాక్టరీల్లోని పరిస్థితులను బీబీసీ పరిశీలించింది. ఇందులో వెలుగుచూసిన విషయాలను మేం ఆ బ్రాండ్ల దృష్టికి కూడా తీసుకువెళ్లాం. వీటిపై విచారణ చేపడతామని ఆ బ్రాండ్ల యాజమాన్యాలు తెలిపాయి.

కార్మికులు

ఈ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న మహిళలందరూ ఓ దక్షిణాది రాష్ట్రంలో ఒక గ్రామీణ ప్రాంతాల్లో కడు పేదరికంలో బతుకుతున్నారు.

బట్టల ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న మహిళల్లో 1200కుపైగా మందికి యాక్షన్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థ సాయం అందిస్తోంది.

నిర్ణీత పని గంటలకు మీరి బలవంతంగా పని చేయించుకోవడం, తిట్టడం, హీనమైన పని పరిస్థితులు... దాదాపు అన్ని ఫ్యాక్టరీల్లో కనిపిస్తుంటాయని ఆ సంస్థ చెప్పింది.

బట్టల ఫ్యాక్టరీల్లోనే కాదు, ఇతర రంగాల్లో కార్మికులు ఇలాంటి హీనమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు.

తక్కువ వేతనాలు, బలహీనమైన కార్మిక చట్టాల కారణంగా విదేశీ బ్రాండ్లు తమ పనిని అవుట్ సోర్స్ చేసేందుకు భారత్‌ను ఎంచుకుంటున్నాయి.

భారత్‌లో ప్రైవేటు రంగంలో కార్మిక సంఘాలు పెద్దగా ఉండవు. చట్టాలను ఉల్లఘించినందుకు ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవడం కూడా అరుదు.

పెద్ద పెద్ద అంతర్జాతీయ బ్రాండ్లకు ఎగుమతులు వెళ్తాయి కాబట్టి, బట్టల ఫ్యాక్టరీలపై దృష్టి ఎక్కువగానే పడుతుంది. బట్టల తయారీలో చైనాది ప్రపంచంలో తొలిస్థానం.

భారత్ రెండో స్థానంలో ఉంది. దేశంలో సుమారు 1. 29 కోట్ల మంది కార్మికులు ఈ రంగంలోని ఫ్యాక్టరీల్లో పని చేస్తున్నట్లు 2019లో ఓ బ్లూమ్ సెంటర్‌లో ప్రచురితమైన ఓ నివేదిక పేర్కొంది.

బట్టలు

రాల్ఫ్ లారెన్‌కు వస్త్రాలు సరఫరా చేసే కర్మాగారాల్లోని మహిళలు తమ చుట్టూ ఎప్పుడూ భయపూరితమైన వాతావరణం ఉంటుందని బీబీసీతో చెప్పారు.

అదనపు పని గంటలు పని చేయాలని తమకు ముందుగా చెప్పరని, చేయడానికి ఒప్పుకోకపోతే పనిలోంచి తొలగిస్తామని బెదిరిస్తారని వాళ్లు చెప్పారు.

"ఇక్కడ ఉండే సూపర్వైజర్ ఎప్పుడూ మాపై అరుస్తూ ఉంటారు. బట్టలు కుడుతున్నప్పుడు నేను తప్పు చేస్తే నన్ను మాస్టర్ దగ్గరకు తీసుకుని వెళతారు. అది చాలా భయంగా ఉంటుంది. మళ్ళీ తప్పు చేయమని చెప్పమని బెదిరిస్తూ మా పై అరుస్తారు. అదొక భయానకమైన అనుభవం" అని ఒకామె చెప్పారు.

"అదనంగా పనిచేయాల్సి రావడంతో నేను ఇంటికి వెళ్లి పిల్లలకు వండి పెట్టే పరిస్థితి కూడా ఉండట్లేదు. మమ్మల్ని వీళ్లు బానిసల్లా చూస్తున్నారు. మాకు గౌరవం ఇవ్వాలి" అని మరొకామె అన్నారు.

ఈ మహిళలు చెబుతున్న విషయాలన్నీ... భారత ఫ్యాక్టరీల చట్టంలోని నిబంధనలను అతిక్రమించే చర్యలే.

కార్మికులెవరూ వారానికి 48 గంటల (అదనపు పని గంటలు కలిపితే 60 గంటల) కన్నా ఎక్కువ పని చేయకూడదని, రోజుకు 9 గంటల కన్నా ఎక్కువ కూడా పని చేయకూడదని ఈ చట్టం చెబుతోంది.

మహిళలకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా నైట్ షిఫ్ట్ వేయకూడదు.

రాల్ఫ్ లారెన్ 2020లో వెల్లడించిన ‘గ్లోబల్ సిటిజెన్షిఫ్ అండ్ సస్టైనెబిలిటీ’ నివేదికలో తమ ఉత్పత్తులను తయారుచేసే వారి గౌరవానికి భంగం కలగకుండా కార్యకలాపాలు సాగించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది.

‘‘ఉద్యోగులతో ఎక్కువ పనిగంటలు పని చేయించకూడదు. వారిని తిట్టడం, శిక్షించడం, ఇతరత్రా వేధింపులకు గురిచేయడం వంటివాటికి తావివ్వకూడదు’’ అన్న ప్రతిజ్ఞ కూడా ఇందులో ఉంది.

బీబీసీ పరిశీలించిన ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తులు సమకూర్చుకుంటున్న నాలుగు బ్రాండ్లలో మూడు ఎథికల్ ట్రేడింగ్ ఇనీషియేటివ్ (ఈటీఐ)లో కూడా సభ్యులు. కార్మికులకు మెరుగైన పరిస్థితులు కల్పిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఈటీఐలో ఈ సంస్థలు భాగమయ్యాయి.

బట్టలు

ఇక తమకు ఉత్పత్తులు అందిస్తున్న ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వీటిపై విచారణ చేపడతామని రాల్ఫ్ లారెన్ వ్యాఖ్యానించింది.

"మాకు ఉత్పత్తులు సరఫరా చేసే సంస్థలన్నీ సురక్షితమైన, ఆరోగ్యకరమైన, నైతికంగా మెరుగైన పని వాతావరణాన్ని కల్పించేందుకు, నిర్దేశించుకున్న నిర్వహణ ప్రమాణాలను పాటించేందుకు కట్టుబడి ఉండటం చాలా అవసరం. ఆ కర్మాగారాలన్నింటిలో తరచుగా థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహిస్తాం’’ అని తెలిపింది.

రాల్ఫ్ లారెన్‌కు ఉత్పత్తులు అందిస్తున్న ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. తాము చట్టానికి లోబడే పని చేస్తున్నామని ప్రకటించింది.

తాజాగా వెలుగుచూసిన సమాచారం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని... పని గంటల ఎక్కువగా లేకుండా చూడటంతో పాటు సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని మిగతా మూడు బ్రాండ్లు కూడా చెప్పాయి.

సమస్యల పరిష్కరానికి సత్వర చర్యలు తీసుకోని పక్షంలో తాము వ్యాపారాన్ని కొనసాగించమని సదరు ఫ్యాక్టరీల యాజమాన్యాలకు చెబుతున్నట్లు సైన్స్బరీ తెలిపింది.

"కార్మికుల హక్కులను కాలరాసే ఎటువంటి చర్యలను సహించం. ఈ ఆరోపణలపై పూర్తి విచారణ చేపడతాం. ఇవి మమ్మల్ని తీవ్రంగా బాధాంయి" అని టెస్కో చెప్పింది.

కార్మికుల తమకు ఎదురైన ఇబ్బందులను తెలియజేసే విధానాలను బలపరుస్తామని, పని గంటలకు తగిన వేతనం కూడా వారికి లభించేలా చూస్తామని తెలిపింది.

తాజా ఆరోపణల నేపథ్యంలో సత్వరమే ఆడిట్ జరపాలని ఆదేశించినట్లు మార్క్స్ అండ్ స్పెన్సర్ తెలిపింది. టాయిలెట్‌కు వెళ్లడానికి, మంచి నీరు తాగడానికి కూడా సమయం ఉండట్లేదనడం మాత్రం సరైన ఆరోపణ కాదని ఖండించింది. పని వాతావరణం సక్రమంగా ఉండేటట్లు చూసేందుకు తరచుగా తాము ఆడిట్ నిర్వహిస్తామని తెలిపింది.

వస్త్ర పరిశ్రమలో పని చేసే చాలా మంది మహిళలు ఎక్కువ గంటలు పని చేస్తుంటారు
ఫొటో క్యాప్షన్, వస్త్ర పరిశ్రమలో పని చేసే చాలా మంది మహిళలు ఎక్కువ గంటలు పని చేస్తుంటారు

ఈ బ్రాండులేవీ భారతదేశంలో సొంతంగా కర్మాగారాలను నిర్వహించవు. దీంతో ఇక్కడ ఉండే పరిస్థితులు వారికి తెలియడం లేదు.

‘‘బ్రాండ్లు చౌకగా ఉత్పత్తులను కోరుకుంటే, ఫ్యాక్టరీలు ఇలాంటి పనులే చేయాల్సి వస్తుంది. ఆ బ్రాండ్లే అధిక లాభాలను ఆశిస్తాయి. వాళ్లు చెప్పిన ధరలకు ఉత్పత్తులు అందిస్తూ నిలదొక్కుకోవడానికి ఫ్యాక్టరీలు ఇలా శ్రమ దోపిడీ చేయకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది’’ అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ ఫ్యాక్టరీ నిర్వాహకుడు బీబీసీతో చెప్పారు.

‘‘ఫ్యాక్టరీ ఆడిట్‌లన్నీ నామమాత్రంగా జరిగేవే. అవి ఎప్పుడు ఫ్యాక్టరీ యజమానులకు ముందుగానే తెలుస్తుంది. ఆడిట్ సమయంలో అన్నీ సక్రమంగా కనిపించేట్లు చూసుకుంటారు. తర్వాత షరామామూలే. బట్టల తయారీ ఫ్యాక్టరీల్లో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. భారతదేశంలోనే కాదు, అంతటా ఇంతే" అని ఆయన అన్నారు.

ఈ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న మహిళలకు రోజుకు 250 రూపాయల వేతనం అందుతున్నట్లు బీబీసీ గమనించింది. కానీ, వారు చేసే ఉత్పత్తులు మాత్రం కొన్ని వేల రూపాయల ధరకు అమ్ముడవుతున్నాయి.

ఇల్లు

యాక్షన్ ఎయిడ్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం 40 శాతానికి పైగా కార్మికుల నెలసరి ఆదాయం 2000 నుంచి 5000 రూపాయల మధ్యలో ఉంది.

ఇక మహిళలను తక్కువగా అంచనా చేసి, వారికి తక్కువ వేతనాలు ఇవ్వడం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోందని యాక్షన్ ఎయిడ్ చెన్నై ఆఫీస్‌లో రీజనల్ మేనేజర్‌గా పని చేస్తున్న ఎథెర్ మరియాసెల్వం చెప్పారు.

బీబీసీతో మాట్లాడిన మహిళలంతా తమకొచ్చే జీతాలతో జీవితం వెళ్లదీయడం చాలా కష్టతరంగా ఉంటోందని చెప్పారు.

తన కుటుంబాన్ని కేవలం 6000 రూపాయలతో పోషిస్తున్నట్లు రాల్ఫ్ లారెన్ కోసం పని చేస్తున్న ఒక మహిళ చెప్పారు. తండ్రి చనిపోవడంతో తల్లిని, ఇద్దరు చెల్లెళ్లను తానే చూసుకుంటున్నానని ఆమె అన్నారు.

స్థానిక వేతన ప్రమాణాలకు లోబడి ఆమెకు వేతనం అందుతోంది. కానీ, నిజానికి ఆమె చేస్తున్న పనికి అంతకు మూడింతలు వేతనం రావాలని కార్మిక సంఘాలు అంటున్నాయి.

ఆమె లాంటి పనిచేస్తున్నవారికి కనీసం 18,727 రూపాయల జీతం ఉండాలని ఆసియా ఫ్లోర్ వేజ్ అలియన్స్ ఆర్గనైజేషన్ లెక్కగట్టింది. ఈ ప్రాంతంలోని కార్మికులకు అధిక వేతనాలు ఇప్పించేందుకు ఆసియా ఫ్లోర్ వేజ్ లియన్స్ కృషి చేస్తోంది.

టెస్కో, సైన్స్బరీ, మర్క్స్ అండ్ స్పెన్సర్ కనీస వేతనాలు ఇస్తామని ప్రకటించాయి. రాల్ఫ్ లారెన్ మాత్రం ఈ మేరకు ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు.

ఆసియా ఫ్లోర్ వేజ్ అలియన్స్ చేసిన సూచనలకు అనుగుణంగా ఏ సంస్ధ తమ సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని బీబీసీ పరిశోధనలో తేలింది. ఈ అంశంపై సంస్థల యాజమాన్యాలు స్పందించలేదు.

ఫ్యాక్టరీల్లో సురక్షితమైన పని పరిస్థితులను కల్పించే బాధ్యత బ్రాండ్లదేనని లేబర్ బిహైండ్ ది లేబుల్ అనే హక్కుల ప్రచార సంఘానికి చెందిన ఏనా బ్రైహర్ అన్నారు.

"ఒక బ్రాండుగా మీరు ప్రపంచ వ్యాప్తంగా బట్టలను తయారు చేయిస్తున్నారు. వాటిని తయారు చేస్తున్న కార్మికులకు తగిన వేతనాలు లభిస్తున్నాయో లేదో చూసే బాధ్యత కూడా మీపై కచ్చితంగా ఉంటుంది" అని ఆమె అన్నారు.

ఈ శ్రమ దోపిడీని నివారించేందుకు స్థానిక కార్మిక చట్టాలు తగినంత పని చేయడం లేదని, పరిస్థితిలో మార్పు కోసం బ్రాండ్లే పూనుకోవాలని బాత్ యూనివర్సిటీ లెక్చరర్ వివేక్ సౌందర రాజన్ అన్నారు.

"కార్మికులకు ఏం అవసరమో, వారికేం కావాలో చాలా మంది చూడరు. ఫ్యాక్టరీలను నేరుగా నడపకపోయినప్పటికీ కార్మికుల పట్ల బాధ్యత తీసుకోవల్సిన అవసరం బ్రాండ్లపై ఉంది. అన్ని లాభాలనూ పొందేది వారే కదా" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడాచదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)