ఆర్‌సీఈపీ ఒప్పందంలో చేరకుండా భారత్ తప్పు చేస్తోందా? ఇది దేశానికి లాభమా? నష్టమా?

ఆర్‌సీఈపీ

ఫొటో సోర్స్, NHAC NGUYEN/getty images

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దీపావళి సమయంలో గృహోపకరణాలను కొనేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఆన్‌లైన్ వేదికల్లో వెతికినవారికి చాలా వరకూ ‘మేడ్ ఇన్ చైనా’ వస్తువులే కనిపించి ఉంటాయి.

చైనా గణాంకాల ప్రకారం ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చిన దిగుమతులు గత ఏడాది అక్టోబర్‌లో కన్నా ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఎక్కువగా ఉన్నాయి.

అంటే, గత మే నెలలో భారత ప్రభుత్వం ప్రకటించిన ‘ఆత్మనిర్భరత’ వ్యూహ ప్రభావం పెద్దగా లేదన్న అభిప్రాయానికి మనం రావొచ్చు.

ఇక రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకానమిక్ పార్టనర్‌షిప్’ (ఆర్‌సీఈపీ) ఒప్పందం చర్చల ప్రక్రియ నుంచి గత ఏడాది నవంబర్‌లో భారత్ వైదొలిగింది. ఈ నిర్ణయం సరైందా, కాదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఆత్మ నిర్భరత సాధించేందుకు... దేశీయ మార్కెట్‌ను రక్షించుకుని, మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

చైనా నుంచి వచ్చే చవక వస్తువులు భారత్ మార్కెట్‌లో ఇబ్బడి ముబ్బడిగా లభిస్తే, దేశీయ కర్మాగారాలు, పరిశ్రమలు ఇబ్బందుల్లో పడతాయన్న భయం మోదీ ప్రభుత్వానికి ఉంది. ఆర్‌సీఈపీ చర్చల నుంచి వైదొలగాలని భారత్ తీసుకున్న నిర్ణయం అప్పుడు ఆ చర్చల్లో పాల్గొంటున్న మిగతా దేశాలను ఆశ్చర్యపరిచింది. అప్పటికి చర్చల్లో భారతే ముందుంది.

ఆర్‌సీఈపీ

ఫొటో సోర్స్, NHAC NGUYEN/getty images

‘అతిపెద్ద వాణిజ్య ఒప్పందం’

15 దేశాల మధ్య ఆర్‌సీఈపీ ఒప్పందం ఆదివారం నాడు కుదిరింది. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా దీన్ని వర్ణిస్తున్నారు. ఆయా దేశాల అధినేతలు ఈ ఒప్పందం విషయమై ఆనందం వ్యక్తం చేశారు.

వాణిజ్యానికి అడ్డంకులుగా ఉన్న సుంకాలు, ఇతర అంక్షలను పరస్పరం తగ్గించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.

ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం ఆర్‌సీఈపీ సభ్య దేశాల్లో ఉంటున్నారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థలోనూ వీరికి దాదాపు 30 శాతం భాగాస్వామ్యం ఉంది.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ చైనా, మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ జపాన్‌ కూడా ఈ ఒప్పందంలో భాగమయ్యాయి. యురోపియన్ యూనియన్ కన్నా పెద్ద వాణిజ్య కూటమి ఇది.

ఆర్‌సీఈపీలో 10 ఆసియాన్ (ఆగ్నేయాసియా) దేశాలతో పాటు దక్షిణ కొరియా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సభ్యులుగా ఉన్నాయి.

బ్రూనై, ఇండోనేసియా, వియత్నాం, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, మలేసియా, కంబోడియా, లావోస్... ఇవన్నీ ఆసియాన్ దేశాలు.

ఆసియాన్ దేశాలతో భారత్‌కు కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. చైనా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లతో మాత్రం లేదు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, MANAN VATSYAYANA/getty images

ఆర్‌సీఈపీ ఒప్పందం నుంచి వైదొలగాలన్న నిర్ణయం గురించి భారత ప్రభుత్వం అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.

‘‘దేశీయ పరిశ్రమలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌సీఈపీ నుంచి వైదొలగాలన్న భారత్ నిర్ణయం మోదీ బలమైన నాయకత్వానికి నిదర్శనం’’ అని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

అయితే, ఈ ఒప్పందం నుంచి వైదొలిగి భారత్ పొరపాటు చేసిందని దిల్లీలోని ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన డాక్టర్ ఫైసల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.

‘‘భారత్ తన డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఆర్‌సీఈపీ నుంచి ఇంకా సమయం తీసుకుని ఉంటే బాగుండేది. ఆర్‌సీఈపీ సభ్య దేశాలు బయటి దేశాల కన్నా తమలో తాము ఎక్కువ వ్యాపారం చేసుకుంటాయి. ఆసియాన్ దేశాలు, దక్షిణ కొరియా, జపాన్‌లతో భారత్‌కు వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. చైనా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లతో లేవు. ఉదాహరణకు ఇప్పటివరకూ భారత్ నుంచి న్యూజీలాండ్ ఏదైనా దిగుమతి చేసుకుంటుందని అనుకున్నాం. ఒకవేళ ఆర్‌సీఈపీ సభ్య దేశాల్లో ఏదైనా దేశం నుంచి అదే వస్తువు లభిస్తే, న్యూజీలాండ్ ఆ దేశం నుంచే దిగుమతి చేసుకునేందుకు మొగ్గు చూపుతుంది. సుంకాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వారికి వస్తువు కూడా చవగ్గా లభిస్తుంది. భారత్ ఎగుమతులపై దీని ప్రభావం నేరుగా ఉంటుంది’’ అని ఫైసల్ అన్నారు.

ఆర్‌సీఈపీ

ఫొటో సోర్స్, Anadolu Agency/getty images

ఫొటో క్యాప్షన్, 2019 నవంబర్‌లో జరిగిన మూడో ఆర్‌సీఈపీ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ

‘భారత్‌కు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయి’

ఆర్‌సీఈపీ సభ్య దేశాలు ఆదివారం వర్చువల్‌గా సమావేశం అయ్యాయి. ఈ భేటీ చివర్లో భారత్‌కు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయని ఆ దేశాలు వ్యాఖ్యానించాయి.

ఆర్‌సీఈపీపై సంతకం చేయకపోవడానికి ప్రధాని మోదీకి అనేక కారణాలున్నాయని, ఈ ఒప్పందంలో చేరడం గురించి భారత్ ఇప్పుడప్పుడే పునరాలోచిస్తుందని తాను అనుకోవడం లేదని ‘వియత్ థింక్ ట్యాంక్ లిమిటెడ్’ అనే మేధో మథన సంస్థ డైరెక్టర్ హోవాంగ్ హోప్ బీబీసీతో అన్నారు.

ఒకవేళ ఆర్‌సీఈపీలో భారత్ చేరాలనుకుంటే, చైనా అడ్డు చెప్పదని చైనాలోని సిచువాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ హువాంగ్ యూంగ్సాంగ్ అన్నారు.

‘‘చైనా పట్ల భయాన్ని వదిలి, పోటీతత్వాన్ని పెంపొందించుకునే దిశగా ఆలోచిస్తే ఆర్‌సీఈపీలో చేరడం భారత్‌కు సులువు అవుతుంది. చైనా సహా ఆర్‌సీఈపీ సభ్య దేశాలన్నీ భారత్ ఒప్పందంలో భాగం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాయి. భారత్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని ఆయన అన్నారు.

భారత్ తొందరపాటుగా ఏ నిర్ణయమూ తీసుకోదన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సరళి ఎలా ఉంటుందా అన్నది కూడా భారత్ గమనిస్తోంది.

ఇక భారత్‌కు ఆర్‌సీఈపీ కాకుండా ఇతర అవకాశాలు కూడా ఉన్నాయి. ‘కాంప్రహెన్సివ్ అండ్ ప్రొగ్రెసివ్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్’ (సీపీ-టీపీపీ) అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందం వీటిలో ఒకటి.

ఈ ఒప్పందంలో భారత్ చేరొచ్చు. ఆస్ట్రేలియా, జపాన్, వియత్నాం లాంటి భారత మిత్ర దేశాలు ఇందులో ఉన్నాయి.

ఆర్‌సీఈపీ

ఫొటో సోర్స్, CLAUDIO REYES/getty images

సమయం మించిపోతోంది

కరోనా మహమ్మారి ఒక కొత్త అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పాటుకు కారణమవుతోంది. దేశాల మధ్య పాత సంబంధాలు తెగిపోతున్నాయి. కొత్తవి ఏర్పడుతున్నాయి. భారత్ ముందు అవకాశాలున్నప్పటికీ, సమయం మించిపోతోంది.

ఆర్‌సీఈపీ చర్చలు ముందు నుంచే జరుగుతున్నా, కరోనా కారణంగా వీటిలో వేగం పెరిగింది.

కొన్నేళ్ల కిందటి పరిస్థితులు గమనిస్తే, ఆర్‌సీఈపీ ప్రాధాన్యత అర్థమవుతుందని డాక్టర్ ఫైసల్ అంటున్నారు.

2012కు ముందు అమెరికా నేతృత్వంలో ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ (టీపీపీ) అనే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చైనా ప్రాధాన్యత ఇచ్చింది. చైనా పొరుగు దేశాల్లో కొన్నింటిని ఇందులో చేర్చుకున్నప్పటికీ, చైనాను మాత్రం దూరం పెట్టారు. టీపీపీని చైనా వ్యతిరేక బృందంగా అప్పుడు చూశారు.

ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ఒప్పందానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, ఆయన తర్వాత 2017లో అధ్యక్ష పదవి చేపట్టిన డోనల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి అమెరికాను బయటకు తీసుకువచ్చారు.

అయితే, ఆ తర్వాత జపాన్ అభ్యర్థన మేరకు అమెరికా లేకుండానే మిగతా సభ్య దేశాలు ఈ ఒప్పందంలో కొనసాగాయి. 2018లో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. టీపీపీ... సీపీ-టీపీపీగా మారింది.

ఇలా ఆసియా పసిఫిక్, ఇండో ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో రెండు పెద్ద వాణిజ్య కూటములు ఏర్పడ్డాయి. కానీ, కరోనా మహమ్మారి వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

దీంతో పరిస్థితులను కలిసి ఎదుర్కొనేందుకు ఆసియాన్ దేశాలు, మరో ఐదు దేశాలు ఆర్‌సీఈపీ ఒప్పందంపై సంతకం చేయాలన్న నిర్ణయానికి వచ్చాయి.

ఆర్‌సీఈపీ

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN/getty images

ఆర్‌సీఈపీ వల్ల చైనా ప్రభావం మరింత పెరుగుతుందని, ఆ దేశ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు మరింతగా పెరుగతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఇలా ఆలోచించడం సరికాదని ప్రొఫెసర్ హువాంగ్ యూంగ్సాంగ్ అంటున్నారు.

‘‘చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ. చాలా సహచర దేశాల కన్నా బలమైంది. అలా అని ఆ దేశం ఆసియాన్, ఆసియా పసిఫక్ మార్కెట్లను నియంత్రించాలనేం లేదు. పాశ్చాత్య దేశాలకు చైనా తమ మార్కెట్‌ను తెరిచినప్పుడు కూడా మిగతా ఆర్థిక వ్యవస్థలు అక్కడి మార్కెట్‌ను నియంత్రిస్తాయన్న భయం వ్యక్తమైంది. ఆర్‌సీఈపీలో భారత్ భాగం కాకుంటేనే మెరుగ్గా ఉంటుందని కూడా కొందరు విశ్లేషకులు అంటున్నారు. కానీ, దీర్ఘకాలికంగా చూస్తే, దీని వల్ల సరైన ఫలితాలు ఉండకపోవచ్చు. దక్షిణాసియా, ఆసియా పసిఫిక్ దేశాల్లోని వ్యాపార అవకాశాలను అందింపుచ్చుకునేందుకు చైనా ఆర్థిక, పారిశ్రామిక వనరులను భారత్ ఉపయోగించుకోవాలి’’ అని అన్నారు.

తాజాగా అమెరికా ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేదాకా భారత్ వేచి చూడవచ్చని... చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఆ తర్వాత భారత్ సీపీ-టీపీపీలో చేరవచ్చని డాక్టర్ ఫైసల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.

2025కల్లా భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారాలని మోదీ కలలు కంటున్నారు.

ఆత్మ నిర్భరత వ్యూహంతో ముందుకు వెళ్తే, ఈ లక్ష్యాన్ని భారత్ చేరుకోలేకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆర్‌సీఈపీ, సీపీ-టీపీపీల్లో ఏదో ఒక దానిలో భారత్ చేరాలని, ఆ పని కూడా త్వరగా చేయాలని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)