కరోనావైరస్: భారత్‌లో తయారవుతున్న 9 కోవిడ్-19 టీకాలు ఇవే

కోవిడ్ 19 వ్యాక్సీన్

ఫొటో సోర్స్, EPA/ABIR SULTAN

వచ్చే ఏడాది జనవరి నుంచి దేశ ప్రజలకు కోవిడ్-19 వ్యాక్సీన్ ఇవ్వడం ప్రారంభం కావచ్చని భారత ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.

ఈ టీకా సురక్షితంగా, సమర్థంగా పనిచేసేలా చూసుకోవడడం తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం అని తెలిపారు.

"మనం సామాన్యులకు వ్యాక్సీన్ వేసే పరిస్థితిలో జనవరిలో రావచ్చని నాకు అనిపిస్తోంది" అని ఆయన ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రస్తుతం, అత్యవసర స్థితుల్లో ఉపయోగించడానికి దరఖాస్తు చేసుకున్న కరోనా వ్యాక్సీన్లతోపాటూ అన్ని టీకాలను డ్రగ్ నియంత్రణ మండలి విశ్లేషిస్తోందని అన్నారు.

"కోవిడ్-19 వ్యాక్సీన్ పరిశోధన విషయంలో భారత్ మిగతా దేశాలకంటే వెనకబడి లేదు. వ్యాక్సీన్ పూర్తిగా సురక్షితం, వైరస్‌ను సమర్థంగా ఎదుర్కునేలా చూసుకోవడం మా మొదటి ప్రాధాన్యం. ఆ విషయంలో మేం ఏమాత్రం రాజీ పడకూడదని అనుకుంటున్నాం. అన్ని విషయాలూ దృష్టిలో పెట్టుకుని ఔషధ నియంత్రణ అధికారులు వ్యాక్సీన్‌కు సంబంధించిన డేటాను విశ్లేషిస్తున్నారు" అని మంత్రి చెప్పారు.

దేశంలో స్వదేశీ వ్యాక్సీన్ పరిశోధనలు కూడా కొనసాగుతున్నాయని, మరో ఆరేడు నెలల్లో దేశంలోని 30 కోట్ల మందికి వ్యాక్సీన్ డోస్ ఇవ్వగలమని ఆశిస్తున్నామని డాక్టర్ హర్షవర్ధన్ శనివారం చెప్పారు.

కోవిడ్-19పై ఉన్నత స్థాయి మంత్రుల బృందం(జీఓఎం) 22వ సమావేశంలో మాట్లాడిన హర్షవర్దన్ "మన శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ఈ వైరస్‌ను వేరు చేశారు. దాని జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. తర్వాత దానికి వ్యాక్సీన్ రూపొందించే పని ప్రారంభించారు. మరో ఆరేడు నెలల్లో మన దగ్గర 30 కోట్ల మందికి వ్యాక్సీన్ వేసే సామర్థ్యం ఉంటుంది" అన్నారు.

కరోనా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, REUTERS/Francis Mascarenhas/File Photo

దేశంలో తయారవుతున్న టీకాలు ఇవే

ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం ప్రస్తుతం తయారవుతున్న కరోనా వ్యాక్సీన్ల క్లినికల్ ట్రయల్స్ వేరు వేరు దశల్లో ఉన్నాయి. వీటిలో ఆరు వ్యాక్సీన్ల క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.

కోవిషీల్డ్:

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన ఈ టీకాను ఆస్ట్రాజెనెకా భారీగా ఉత్పత్తి చేస్తోంది. చింపాంజీ ఎడెనోవైరస్ ప్లాట్‌ఫాం ఆధారంగా తయారు చేసిన ఈ వ్యాక్సీన్‌కు భారత్‌లో పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ భాగస్వామిగా ఉంది. దీని రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అత్యవసర వినియోగం కోసం ఇది ప్రభుత్వం అనుమతి కోరింది.

కోవాక్సీన్:

ఇది మృత వైరస్ ఉపయోగించి రూపొందిస్తున్న వ్యాక్సీన్. దీనిని హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ తయారుచేస్తోంది. ఐసీఎంఆర్ సహకారంతో దీని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అత్యవసర వినియోగం కోసం ఇది కూడా ప్రభుత్వం అనుమతి కోరింది.

ZyCoV-D :

డీఎన్ఏ ప్లాట్‌ఫాంపై కాడిలా ఈ వ్యాక్సీన్ తయారు చేస్తోంది. దీని కోసం కాడిలా బయోటెక్నాలజీ విభాగంతో కలిసి పనిచేస్తోంది. ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.

స్పుత్నిక్-వి:

ఈ వ్యాక్సీన్‌ను రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్ తయారుచేసింది. హ్యూమన్ ఎడెనోవైరస్ ప్లాట్‌ఫాంపై దీనిని రూపొందించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో దీనిని భారీగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వ్యాక్సీన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరుకుంది.

NVX-CoV2373:

వైరస్ ప్రొటీన్ ముక్కల ఆధారంగా తయారైన ఈ వైరస్‌ను పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఇన్‌స్టిట్యూట్ దీనికోసం నోవావ్యాక్స్ తో కలిసి పనిచేస్తోంది.

ప్రొటీన్ యాంటీజెన్ బెస్ట్:

అమెరికా ఎంఐటీ తయారు చేసిన ప్రొటీన్ యాంటీజెన్ బెస్ట్ వ్యాక్సీన్ ఉత్పత్తి హైదరాబాద్ బయోలాజికల్ ఈ-లిమిటెడ్ చేస్తోంది. దీని మొదటి, రెండో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ మొదలవబోతున్నాయి.

HGCO 19:

అమెరికా హెచ్‌డీటీ ఎంఆర్ఎన్ఏ ఆధారిత ఈ వ్యాక్సీన్ ఉత్పత్తిని పుణెలోని జినోవా అనే కంపెనీ చేస్తోంది. జంతువులపై ఈ టీకా ప్రయోగాలు పూర్తయ్యాయి. త్వరలో దీని మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించబోతున్నారు.

భారత్ బయోటెక్, థామస్ జెఫర్సన్ టీకా

హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ అమెరికా థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ సహకారంతో మృత రేబిస్ వెక్టర్ ప్లాట్‌ఫాం ఆధారంగా కరోనా వ్యాక్సీన్ ఉత్పత్తి చేస్తోంది. ఈ టీకా అడ్వాన్సడ్ ప్రీ-క్లినికల్ స్థాయి వరకూ వచ్చింది.

అరబిందో ఫార్మా టీకా

అమెరికా ఆరోవ్యాక్సీన్‌తో కలిసి భారత్‌కు చెందిన అరబిందో ఫార్మా ఒక టీకా తయారు చేస్తోంది. అది ప్రస్తుతం ప్రీ-డెవలప్‌మెంట్ దశలో ఉంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)