హలాల్, కొషర్ పద్ధతుల్లో జంతువులను చంపొద్దంటూ ఈయూ కోర్టు తీర్పు.. ముస్లింలు, యూదుల అభ్యంతరం

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA
జంతువులను కొషర్(యూదుల పద్ధతిలో చంపడం) లేదా హలాల్(ఇస్లాం పద్ధతిలో చంపడం) చేసే ముందు వాటికి స్టన్నింగ్(స్పృహ తప్పించడం) చేయాలన్న బెల్జియం తీర్పును యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సమర్థించింది.
మొదట చాలా మత సంస్థలు ఈ తీర్పును వ్యతిరేకించాయి.
జంతు హక్కుల ప్రకారం, ఏ జంతువులనైనా చంపే ముందు వాటికి షాక్ ఇచ్చి స్పృహ తప్పేలా చేయాలని బెల్జియం కోర్ట్ ఇచ్చిన తీర్పు సరైనదేనని యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం భావించింది. జంతువులు స్పృహలో ఉన్నప్పుడు వాటిని చంపకూడదని ఆదేశించింది.
"ఇది దారుణమైన నిర్ణయం. యూరప్‌లోని యూదుల జీవితాలకు విఘాతం లాంటిది" అని బెల్జియంలోని ఇజ్రాయెల్ రాయబారి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు రాయిటర్స్ చెప్పింది.
మరోవైపు యూరప్‌లోని రబ్బియో కాన్ఫరెన్స్ అధ్యక్షుడు కూడా ఈ తీర్పును విమర్శించారు. యూరప్‌లోని యూదులపై దీని ప్రభావం పడుతుందన్నారు.

ఫొటో సోర్స్, ABDUL MAJEED
ముస్లిం గ్రూపుల్లో అసంతృప్తి
ఈ చట్టాన్ని ఆమోదించినప్పటి నుంచి 2019 జనవరిలో అమలు చేసే వరకూ చాలా ముస్లిం గ్రూపులు జంతువులను చంపే ముందు స్పృహ తప్పించడాన్ని చాలాసార్లు కోర్టులో సవాలు చేశాయి.
యూరోపియన్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో మిగతా యూరోపియన్ దేశాలు కూడా ఇప్పుడు ఇలాంటి ఆంక్షలే విధించేందుకు దారులు వేసినట్లు రాయిటర్స్ చెప్పింది.
ఇస్లాం, యూదు మత సంప్రదాయం ప్రకారం జంతువు గొంతులోని రక్త నాళాలను పదునైన చాకుతో కోసి చంపుతారు. ఆ సమయంలో ఆ జంతువు స్పృహలో ఉండడం అవసరం.
యూరోపియన్ యూనియన్, బ్రిటన్ చట్టాల ప్రకారం ఒక జంతువు మాంసం ముస్లిలుం, యూదుల కోసం కానప్పుడు, ఆ జంతువును చంపే ముందు, దానిని స్పృహ తప్పించడం తప్పనిసరి.
ఉత్తర బెల్జియంలోని ఫ్లాండర్స్ ప్రభుత్వం గురువారం వచ్చిన ఈ తీర్పును స్వాగతించింది. "మేం ఈరోజు చరిత్ర లిఖిస్తున్నాం" అని ఆ దేశ జంతు సంక్షేమ మంత్రి బెన్ వెస్ట్స్ అన్నారు.
జంతువుల సంక్షేమం కోసం పనిచేసే బెల్జియం సంస్థ గ్లోబల్ యాక్షన్ దీనిని ఒక ప్రత్యేకమైన రోజుగా వర్ణించింది. 25 ఏళ్ల తన పోరాటానికి ఫలితం దక్కిందని చెప్పింది.
ఇదే ఏడాది సెప్టెంబరులో ఫ్లెమిష్ చట్టాన్ని అంతం చేయడానికి మద్దతిచ్చిన కోర్టు అడ్వకేట్ జనరల్ "ప్రాథమిక మత సంప్రదాయాలను ఉల్లంఘించనంత వరకూ, కఠినమైన జంతు సంక్షేమ నిబంధనలు అమలు చేయవచ్చు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టు ఏం చెప్పింది
సభ్య దేశాలన్నిటిలో జంతు సంక్షేమం, మత స్వేచ్ఛ రెండింటినీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని యూరోపియన్ కోర్టు భావించింది. ప్రాథమిక హక్కులను సమర్థించినంతవరకూ, జంతువులను స్పృహ తప్పించడం తప్పనిసరని తాము ఈయూ సభ్య దేశాలను అడ్డుకోమని అది స్పష్టం చేసింది.
అయితే, కోర్టు ఈ ఆంక్షల వల్ల ముస్లింలు, యూదుల హక్కులు పరిమితం అవుతాయని, అందుకే సంప్రదాయ పద్ధతిలో జంతువులను చంపడంపై ఆంక్షలు విధించలేదని కూడా కోర్టు అంగీకరించింది.
బెల్జియం చేసిన చట్టం మత స్వేచ్ఛ హక్కుల్లో జోక్యం చేసుకోవడమే, కానీ యూరోపియన్ యూనియన్ ప్రయోజనాలకు అనుగుణంగా జంతు సంక్షేమాన్ని ప్రోత్సహించడమేన దాని లక్ష్యం అని కోర్టు చెప్పింది.
జంతువులను చంపేముందు వాటి బాధను తగ్గించడానికి, వాటిని స్పృహ తప్పించడం ఒక మెరుగైన పద్ధతని ఫ్లెమిష్ పార్లమెంట్ అందించిన శాస్త్రీయ ఆధారాలను కూడా కోర్టు విశ్వసిస్తోందని ఈయూ కోర్టు తీర్పులో చెప్పింది.
జంతు సంక్షేమం, మత స్వేచ్ఛ మధ్య న్యాయం సమంగా ఉండేలా కోర్టు దీనికి అనుమతి ఇచ్చిందని కూడా ఈయూ న్యాయస్థానం చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు అమ్మే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన...
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- మీరు కోరుకునేవన్నీ మీకు ఇష్టమైనవేనా? సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








