కావన్: ఈ పాకిస్తాన్ ఏనుగు భారత్ మీదుగా కంబోడియాకు వెళుతోంది... ఎందుకు?

కావన్‌ ఏనుగు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇల్యాస్‌ ఖాన్‌
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్‌, ఇస్లామాబాద్‌

పాకిస్తాన్‌లోని ఓ జూలో కొన్ని సంవత్సరాల పాటు ఒంటరి జీవితం గడిపింది ఆ ఏనుగు. తనను చూడటానికి వచ్చే సందర్శకులను అలరిస్తూ, యజమానులకు తన ప్రదర్శనలతో డబ్బు సంపాదించి పెడుతూనే వారు పొడిచే ముల్లుగర్ర పోట్లను భరిస్తూ వచ్చింది.

తన చుట్టూ ఉండే ఇతర జంతువులు ఒక్కొక్కటి వెళ్లిపోగా, తనతో ఉన్న ఒక్కగానొక్క సహచర ఏనుగు మరణించగా, తన శరీరం మీదున్న గాయాల బాధతోనే ఒంటరిగా ఉండిపోయింది ఆ గజరాజు.

కొన్నేళ్లుగా ఆ ఏనుగు ఆలనాపాలనా చూసే వారు లేకపోవడంతో శరీరం మీద ఏర్పడ్ల పుండ్లు ఇన్‌ఫెక్షన్లుగా మారాయి. కాళ్లకు వేసిన గొలుసులు చేసిన గాయాలు తీవ్రమయ్యాయి. మానసిక వ్యధ, శరీరపు బరువు విపరీతంగా పెరిగాయి.

కానీ ఈ ఆదివారం ఆ ఏనుగు జీవితంలో శుభదినంగా మారింది. ఒంటరితనం నుంచి బైటపడి దేశాంతరాలలో కొత్త జీవితం గడిపే అవకాశం వచ్చింది. అమెరికన్‌ పాప్‌ సింగర్‌ చెర్‌తోపాటు పలువురు వలంటీర్ల కృషి ఫలించి ఆ ఏనుగు స్వేచ్ఛ పొందింది.

ఇది పాకిస్తాన్‌కు చెందిన కావన్‌ అనే ఏనుగు కథ.. ఈ ఏనుగు కథ ఒక చిన్నారి ప్రార్ధనతో మొదలై ఒక డాక్టర్ పాటతో ముగుస్తుంది.

కావన్‌ ఏనుగు

ఫొటో సోర్స్, Getty Images

ఒక ప్రార్ధన

పాకిస్తాన్‌ ఒకప్పటి మిలిటరీ పాలకుడు జనరల్ జియావుల్‌ హక్ కుమార్తె జెయిన్‌ జియాకు ఏనుగులంటే ఎంతో ఇష్టం.

“హాథీ మేరీ సాథీ” సినిమా చూశాక ఆమె ఏనుగుల మీద ఇష్టం పెంచుకున్నారు.

“అల్లా, నాకో ఏనుగును స్నేహితురాలిగా ఇవ్వు అని నేను ఆకాశంవైపు చూస్తూ ప్రార్ధించేదానిని’’ అని జెయిన్‌ జియా ఇటీవల బీబీసీతో అన్నారు.

ఆమె ప్రార్ధనలను తండ్రి జియా ఉల్‌ హక్‌ విన్నారు. ఒక రోజు జెయిన్‌ స్కూలుకు తయారవుతుండగా జియా ఉల్‌ హక్‌ వచ్చి ఆమె రెండు కళ్లుమూశారు.

తండ్రి జనరల్ హక్‌తో చిన్నారి జెయిన్‌ జియా

ఫొటో సోర్స్, FAMILY

ఫొటో క్యాప్షన్, తండ్రి జనరల్ హక్‌తో చిన్నారి జెయిన్‌ జియా

“సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ తెచ్చా’ అంటూ నాన్న నన్ను దాని దగ్గరకు తీసుకెళ్లి పట్టుకొమ్మని చెప్పి కళ్లు తెరిచారు. ఆశ్చర్యం. ఎదురుగా ఏనుగు పిల్ల” అని ఆనాటి స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు జెయిన్‌.

ఆ ఏనుగును మన ఇంట్లోనే ఉంచుకుందామని జెయిన్‌ మారం చేసినా దానిని మనం సరిగా చూసుకోలేమంటూ జూకు పంపించి వేశారు జియా ఉల్‌ హక్‌.

అప్పటి వరకు శ్రీలంకలోని పిన్నవల ఎలిఫెంట్‌ అర్ఫనేజ్‌ (పీఈవో)లో ఉన్న ఆ ఏనుగును అంతర్యుద్ధంలో తమ సైన్యానికి సాయం చేసినందుకు కృతజ్జతగా పాకిస్తాన్‌ ప్రభుత్వానికి లంక సర్కారు బహుమతిగా ఇచ్చింది. అలా కావన్‌ 1985లో ఇస్లామాబాద్‌ చేరుకుంది.

పాకిస్తాన్‌లోని తన ఇంట్లో జెయిన్‌ జియా
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని తన ఇంట్లో జెయిన్‌ జియా

బంగారు గని

కావన్‌ వచ్చేనాటికి కొన్ని ఏళ్ల ముందే మర్ఘజార్‌ జూను నిర్మించారు. అయితే దాన్ని మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలలో బిజినెస్‌ మాఫియా లీడర్లు తలదూర్చారు. జూను ఇష్టారాజ్యంగా షాపులు, తినుబండారాలు అమ్మేవాళ్లకు అద్దెకిచ్చారు.

కొంతమంది అధికారులు జంతువులను ఉపయోగించుకుని డబ్బు సంపాదించడం కూడా మొదలు పెట్టారు. ఇక్కడ పెరిగే జింకలను కొందరు ధనవంతుల ఇళ్లలో పార్టీల కోసం అధికారులు అమ్ముకునే వారు.

2019లో ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇస్లామాబాద్‌ జూ (ఫిజ్‌) అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన వలంటీర్ల బృందం అనేకసార్లు జూపై సర్వే చేసి జంతువులను లెక్కించింది. ఇక్కడి జంతువుల సంఖ్య తరచూ మారిపోతోందని గుర్తించింది ఫిజ్‌.

సర్వే చేసిన విషయం బయటపడగానే తక్కువైపోయిన జంతువులు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. “అనారోగ్యం బారిన పడిన జంతువులకు చికిత్స చేయడానికి సరైన సదుపాయలు జూలో లేవు’’ అన్నారు ఫిజ్‌కు చెందిన వలంటీర్‌ మహ్మద్‌ బిన్‌ నవీద్‌.

అప్పటికి ఆ జంతు ప్రదర్శనశాలలో స్టార్‌ ఎట్రాక్షన్‌గా ఉన్నది కావన్‌ మాత్రమే.

ఇస్లామాబాద్ జూ వెలుపల ఏనుగు విగ్రహం
ఫొటో క్యాప్షన్, ఇస్లామాబాద్ జూ వెలుపల ఏనుగు విగ్రహం

ప్రదర్శనలకు కావన్‌

మావటి తన ఒంటి మీద ముల్లుతో పొడుస్తూ ఆదేశాలిస్తుండగా.. జూ చూడటానికి వచ్చిన సందర్శకులను ఎంటర్‌టైన్‌ చేయడం కావన్‌ విధి. వాళ్లు ఇచ్చిన డబ్బును మావటికి అందించేది.

అర ఎకరం కన్నా తక్కువగా ఉండే ప్రదేశంలో రాత్రి పూట ఒంటరిగా గడపేది కావన్‌. కాంక్రీట్ గోడల‌తో నిర్మించిన చిన్నపాటి కట్టడం కింద సేద తీరేది.

“ఒక ఏనుగు నివసించాల్సిన ప్రదేశంలో ఉండాల్సిన చెట్టు గానీ, సహజమైన వనరులు గానీ అక్కడ లేవు’’ అని ఫోర్‌ పాస్‌ ఇంటర్నేషనల్‌ (ఎఫ్‌పీఐ) అనే స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో పేర్కొంది.

1990లలో బంగ్లాదేశ్‌ నుంచి సహేలీ అనే ఆడ ఏనుగును తీసుకువచ్చి కావన్‌ ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. అయితే సహేలీ 2012లో మరణించింది.

తీవ్రమైన ఎండల కారణంగా సహేలీ గుండెపోటుకు గురై మరణించిందని జూ అధికారులు చెప్పారు. అయితే.. దానిని పొడిచేందుకు ఉపయోగించిన ముల్లుల వల్ల సెప్టిక్‌ అయ్యి చనిపోయిందని ఫిజ్‌ వలంటీర్లు ఆరోపించారు.

జూలోని కావన్ వద్ద సందర్శకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జూలోని కావన్ వద్ద సందర్శకులు

సహజ వాతావరణం లేక అసహనంతో ఉన్న కావన్‌ను 2000 సంవత్సరం నుంచి గొలుసులతో బందీగా ఉంచుతున్నారు. సహేలీ మరణించిన తర్వాత కావన్‌ ఇంకా అసహనంగా వ్యవహరించడంతో దాని ఎన్‌క్లోజర్‌ వైపు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు.

2016లో ఈ జూను సందర్శించిన ఎఫ్‌పీఐ బృందం తీవ్ర అసహనం, ఆవేశంతో ఉన్న కావన్‌ ‘జూకోసిస్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించింది.

జూకోసిస్‌ అనే మానసిక వ్యాధితో పాటు శరీరంలో ఇంకా అనేక రుగ్మతలున్నాయని, ముఖ్యంగా గొలుసుల వల్ల ఏర్పడ్డ గాయాలతో దాని కాళ్లు చాలా వరకు పాడయిపోయాయని తెలిపింది ఎఫ్‌పిఐ.

అనారోగ్యం కారణంగా ఎక్కువసేపు విశ్రాంతిలో ఉండటం, సందర్శకులు ఇచ్చే తీయని పదార్ధాలు మితం తప్పి తీసుకోవడంతో కావన్‌ బరువు విపరీతంగా పెరిగిపోయింది.

కావన్‌ ఏనుగు

మార్పు తెచ్చిన ఓ పాట

అమెరికాకు చెందిన ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత, నటి, గాయని చెర్‌ 2016లో కావన్‌ పరిస్థితి గురించి విన్నారు. ఆమె జంతువుల స్వేచ్ఛను కోరే ‘ఫ్రీ ద వైల్డ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు.

ఆమె వేసిన పిటిషన్‌కు స్పందించిన న్యాయస్థానం ఈ ఏడాది మే నెలలో కావన్‌ను విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. ఇది తన జీవితంలో అత్యంత గొప్పదినంగా తీర్పు వచ్చిన రోజును అభివర్ణించారు చెర్‌.

అయితే కావన్‌తోపాటు ఆ జూలో మరికొన్ని జంతువుల కోసం జరిగిన న్యాయపోరాటం అంతటితో ముగియ లేదు. వివిధ శాఖలు అనేక కొర్రీలు పెట్టడంతో కావన్‌ విడుదల ఆలస్యమైంది. కేసు హైకోర్టు వరకు వెళ్లి జూన్‌లో విడుదలకు ఆదేశాలు వచ్చాయి.

కావన్‌ బయటకు వెళ్లే మార్గం దొరికినా దానిని ఎలా తీసుకెళ్లాలన్నది సమస్యగా మారింది. ఫోర్‌ పా ఇంటర్నేషనల్‌ సంస్థను పాకిస్తాన్‌కు రప్పించి ప్రణాళికలు రచించారు.

కంబోడియాకు పయనమవుతూ బోనులోకి వెళ్తున్న కావన్
ఫొటో క్యాప్షన్, కంబోడియాకు పయనమవుతూ బోనులోకి వెళ్తున్న కావన్

ఎలా తీసుకు వెళ్లాలి?

మూడు పదులు దాటిన వయసులో, అధిక బరువుతో పాటు, తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఏనుగును కంట్రోల్‌ చేయడం, దాన్ని తాము కోరుకున్నట్లు కాంబోడియాకు తరలించడం కష్టమని స్వచ్ఛంద సంస్థ వలంటీర్లు భావించారు.

ఏనుగును దారిలోకి తీసుకు రావడానికి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎఫ్‌పీఐకి చెందిన డాక్టర్‌ ఖలీల్‌ ఒక ఉపాయం కనుగొన్నారు. తన పాట వింటున్నప్పుడు ఏనుగు సైలెంట్‌ అయిపోవడం గమనించానని ఖలీల్‌ అన్నారు.

సాధారణంగా తన గొంతు ఎవరికీ నచ్చదని, చివరకు తనకొక అభిమాని దొరికాడంటూ ఖలీల్‌ తన ప్రయత్నాలు కొనసాగించారు. పాట వినిపిస్తూ క్రమంగా దానికి దగ్గరయ్యారు.

కంబోడియాకు పయనమైన కావన్‌కు ఆహారం అందిస్తున్న డాక్టర్ ఖలీల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కంబోడియాకు పయనమైన కావన్‌కు ఆహారం అందిస్తున్న డాక్టర్ ఖలీల్

డాక్టర్‌ ఖలీల్ చేసిన ప్రయత్నాలు ఫలించడంతో దానికి చికిత్స మొదలైంది. ఆగ్రహం తగ్గించుకుని బుద్ధిగా ఉండటం మొదలు పెట్టింది. స్నానం చేయడం, మందులు తీసుకోవడం ప్రారంభించింది.

దీంతో ఇక ఐదున్నర టన్నుల బరువున్న ఏనుగును విమానంలో కాంబోడియా తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కదలకుండా ఉండేందుకు ఒక బోనును ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు ఏనుగు కాంబోడియాకు బయలుదేరింది.

ఆ విమానం దారి మధ్యలో భారతదేశంలోనూ ఆగింది.

ఏనుగును కాంబోడియా తరలించే పని మొదలుకానుందని తెలియడంతో సింగర్‌ చెర్‌ పాకిస్తాన్‌ చేరుకున్నారు. శుక్రవారం ఆమె పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను కూడా కలిశారు.

ఆమె పాకిస్తాన్‌ నుంచి నేరుగా కాంబోడియాలోని కావన్‌ కొత్త ఇల్లు “కులెన్‌ ప్రామ్‌టెప్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చురి’’ని చూడటానికి వెళతారు. ఈ అభయారణ్యం లక్షల ఎకరాలలో విస్తరించి, అస్తిత్వ ప్రమాదంలో ఉన్న అనేక జంతువులకు నెలవుగా ఉంది.

ఈ కొత్త ప్రదేశానికి అలవాటు పడేదాకా కావన్‌ కొన్ని మానసిక సమస్యలను ఎదుర్కొంటుందని, తర్వాత అన్నీ సర్దుకుంటాయని డాక్టర్‌ ఖలీల్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)