నాసా స్పేస్ మిషన్ కమాండర్‌గా హైదరాబాదీ రాజాచారి

ఫొటో సోర్స్, ROBERT MARKOWITZ - NASA - JOHNSON SPACE CENTER
నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇసా)లు భారత-అమెరికన్ పౌరుడు రాజాచారిని స్పేస్ఎక్స్ క్రూ-3 మిషన్‌కు కమాండర్‌గా ఎంపిక చేశాయి. ఈ స్పేస్ మిషన్... ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)కు వెళ్తుంది.
43 ఏళ్ల రాజాచారి అమెరికా వాయుసేనలో కల్నల్‌గా పనిచేస్తున్నారు. త్వరలో ఆయన స్పేస్ఎక్స్ క్రూ-3 మిషన్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తారు. ఈ మిషన్‌లో నాసాకు చెందిన టామ్ మార్ష్‌బర్న్ పైలట్‌గా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మాథ్యూస్ మారర్ స్పెషలిస్ట్‌గా వ్యవహరిస్తారు. వచ్చే ఏడాది ఈ మిషన్ అంతరిక్షంలోకి వెళ్లనుంది.
త్వరలో ఈ మిషన్‌లో నాలుగో సభ్యుడు కూడా చేరతారని నాసా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
"నేను చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా. టామ్ మార్ష్‌బర్న్, మాథ్యూస్ మారర్‌తో కలిసి అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా" అని రాజాచారి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
స్పేస్ స్టేషన్‌కు వెళ్లేందుకు అవకాశం రావడంపై తన ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు రాజాచారి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
నాసాలో ఎలా అవకాశం వచ్చింది?
రాజాచారికి ఇది మొదటి అంతరిక్ష యాత్ర అని పీటీఐ తెలిపింది. ఆయన 2017లో నాసాలో చేరారు. అప్పటి నుంచి హ్యూస్టన్‌లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌లో రెండు సంవత్సరాలపాటు శిక్షణ తీసుకున్నారు.
2017లో నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌లో పాలుపంచుకున్న 12మంది ట్రైనీల్లో ఆయన కూడా ఒకరు. ఈ టీమ్‌లో ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. 18,300 మంది అభ్యర్థుల నుంచి ఈ 12 మందిని ఎంపిక చేశారు.
పైలట్‌గా శిక్షణతోపాటు స్పేస్‌వాక్‌లో కూడా ఆయనకు ట్రైనింగ్ ఇచ్చారు.

ఫొటో సోర్స్, AFP PHOTO/NASA
రాజాచారి పైలట్‌గా 2,500 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవాన్ని సంపాదించారని నాసా వెల్లడించింది.
ఇటీవలే రాజాచారి ఆర్టెమిస్ టీమ్‌లో సభ్యుడిగా ఎంపికయ్యారని, భవిష్యత్తులో జరిగే మూన్ మిషన్‌లకు కూడా ఆయన అర్హత సాధించారని నాసా తెలిపింది.
ఆర్టెమిస్ అంటే మానవసహిత అంతరిక్ష యాత్రా కార్యక్రమం. దీనికి అమెరికా ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. 2024 నాటికి తొలి మహిళను, మరో మనిషిని చంద్రుడిపైకి, ముఖ్యంగా చంద్రుడి ధ్రువ ప్రాంతానికి చేర్చడం ఈ మిషన్ లక్ష్యం.

ఫొటో సోర్స్, BILL INGALLS/NASA
రాజాచారి ప్రస్థానం
కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తరువాత నాసా యాత్రకు వెళ్లే మూడో భారత సంతతి వ్యక్తిగా రాజాచారి రికార్డు సాధించబోతున్నారు. రాజాచారి 2012లో సునీతా విలియమ్స్‌ను కలిశారు.
విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో రాజాచారి జన్మించారు. అయోవాలోని సెడార్ ఫాల్స్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. భార్య, పిల్లలతో కలిసి వాటర్లూ సిటీలో స్థిరపడ్డారు.
1999లో యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తరువాత, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ఆస్ట్రోనాటిక్స్ అండ్ ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
ఆ తర్వాత యూఎస్ నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లో కోర్సు పూర్తి చేసిన రాజాచారి, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పైలట్ ట్రైనింగ్ తీసుకున్నారు.
ఎఫ్-35, ఎఫ్-15, ఎఫ్-16, ఎఫ్-18వంటి అమెరికా యుద్ధవిమానాలను ఆయన నడిపారు. అమెరికా వాయుసేన తరఫున ఇరాక్ యుద్ధంలో ఎఫ్-15-ఇ యుద్ధ విమానాలను కూడా నడిపారాయన.
2013లో రాజాచారి మొదటిసారి నాసాలో చేరడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రాజాచారి తెలుగు నేపథ్యం
రాజాచారి తెలుగు కుటుంబానికి చెందినవారు. ఆయన తాత వెంకటాచారి హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా పని చేశారు. తండ్రి శ్రీనివాసాచారి 1970లో అమెరికాకు వచ్చి అయోవా రాష్ట్రంలోని సెడార్ ఫాల్స్‌లో స్థిరపడ్డారు.
రాజాచారి చివరిసారిగా 2006లో భారత్‌ను సందర్శించారు. బెంగళూరు ఎయిర్ షోలో అమెరికన్ ఫైటర్ జెట్ల బృందానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు.
అంతకు ముందు కూడా ఆయన అనేకసార్లు భారత్‌ను సందర్శించారు. భారతీయ వంటకాలంటే తనకు చాలా ఇష్టమని, తన కుటుంబ సభ్యులు కూడా అమెరికా ఇండియన్ రెస్టారెంట్లలో వంటలను రుచి చూడటానికి ఆరాటపడుతుంటారని 2017లో రాజాచారి బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- ఆంధ్రప్రదేశ్: రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు అమ్మే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన...
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- మీరు కోరుకునేవన్నీ మీకు ఇష్టమైనవేనా? సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








