జూలియన్ అసాంజ్‌ను అమెరికాకు అప్పగించేది లేదన్న లండన్ కోర్టు - Newsreel

ఫొటో సోర్స్, Reuters
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ అమెరికాకు అప్పగించడం సాధ్యం కాదని లండన్‌లోని కోర్టు ప్రకటించింది.
అమెరికాకు వెళితే అసాంజ్ మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని, ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం కూడా ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేసిన న్యాయమూర్తి, ఆయనను అప్పగించాలంటూ వచ్చిన అభ్యర్థనలను తోసిపుచ్చారు.
49 ఏళ్ల అసాంజ్ 2010, 2011 సంవత్సరాలలో వేలాది వర్గీకృత పత్రాలను ప్రచురించిన కేసులో అమెరికా ఆయన అప్పగింతను కోరుతోంది. ఆ పత్రాలను లీక్ చేయడం చట్టవిరుద్ధమని, ఆ చర్య ఎంతో మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని అమెరికా అంటోంది.
లండన్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేయడానికి అమెరికా అధికారులకు 14 రోజుల వ్యవధి ఉంటుంది. దీనిపై వారు తప్పకుండా అపీలు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఇప్పుడు అసాంజ్‌ను మళ్లీ బెల్మారిష్ జైలుకు తీసుకువెళతారు. ఆయన చాలా కాలంగా అదే జైలులో బందీగా ఉన్నారు. ఆయన బెయిలుపై పూర్తి స్థాయి దరఖాస్తును బుధవారం సమర్పించబోతున్నారు.
అసాంజ్ తప్పించుకుపోయే ఆస్కారం లేదనడానికి తగిన సాక్ష్యాలను కోర్టుకు చూపిస్తామని ఆయన తరఫు లాయర్ ఎడ్ ఫిట్జ్ గెరాల్డ్ క్యూసీ అన్నారు.

ఫొటో సోర్స్, AFP
దక్షిణ కొరియాలో తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
2020లో దక్షిణ కొరియాలో మొదటిసారి జననాల కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
దక్షిణ కొరియా ఇప్పటికే ప్రపంచంలో అతి తక్కువ జననాల రేటు ఉన్న దేశంగా నిలిచింది.
2020లో దక్షిణ కొరియాలో 2,75,800 మంది పిల్లలు పుట్టారు. అది 2019తో పోలిస్తే పది శాతం తక్కువ. మరోవైపు ఆ గత ఏడాది దేశంలో 3,07,764 మంది చనిపోయారు.
ప్రస్తుత గణాంకాలు దక్షిణ కొరియాను తమ విధానాలపై మరోసారి ఆలోచించేలా చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశ హోంశాఖ తమ విధానాలలో 'ప్రాథమిక మార్పుల' గురించి మాట్లాడింది.
జనాభా తగ్గుతుండడంతో దేశంపై అత్యంత ఒత్తిడి తీవ్రం అవుతోంది.
వృద్ధుల జనాభా పెరుగుతుండడంతో ఆరోగ్య సేవలు, పెన్షన్ల కోసం ఎక్కువ వ్యయం చేసేలా దేశంపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు యువ జనాభా తగ్గిపోతుండడంతో దేశంలో కార్మికుల కొరత తీవ్రంగా ఉంటోంది.
ఈ రెండింటి వల్ల నేరుగా దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడుతోంది.
గత నెల అధ్యక్షుడు మూన్ జెయ్ తక్కువ జననాల సమస్యను పరిష్కరించడానికి కొత్త పథకాలు ప్రారంభించారు. వీటిలో పిల్లలు పుట్టే కుటుంబాలకు నగదు అందించడం కూడా ఉంది.
ఈ పథకం కింద 2022లో పుట్టే ప్రతి బిడ్డకూ తల్లిదండ్రులకు 20 లక్షల వాన్‌లు(రూ.1,35,000) ఇస్తారు. అది కాకుండా ఆ బిడ్డకు ఏడాది వచ్చే వరకూ, వారికి ప్రతి నెలా 3 లక్షల వాన్‌లు(రూ.20 వేలు) చెల్లిస్తారు. 2025 నుంచి ఈ మొత్తాన్ని 5 లక్షల వాన్‌లు(రూ.33 వేలు) చేయనున్నారు.

ఫొటో సోర్స్, EPA
డోనల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ రికార్డింగ్... 'నాకు 11,780 ఓట్లు వచ్చేలా చూడాలి'
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన ఒక పోన్ కాల్ రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది.
అందులో ఆయన జార్జియా ఎన్నికల ఉన్నతాధికారికి ఫోన్ చేసి తన గెలవడానికి అవసరమైన ఓట్లు వచ్చేలా చూడాలని చెబుతుంటారు.
ఈ రికార్డింగ్‌ను వాషింగ్టన్ పోస్ట్ విడుదల చేసింది.
అందులో అధ్యక్షుడు ట్రంప్ రిపబ్లికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రెఫన్‌స్పర్జర్‌తో మాట్లాడుతూ, "నాకు 11,780 ఓట్లు కావాలి" అని అంటారు. దానికి రెఫెన్‌స్పర్జర్ ఆయనతో, "జార్జియా ఫలితాలు సరిగానే ఉన్నాయి" అని బదులిస్తారు.
జార్జియాలో డెమాక్రాట్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. ఆయనకు మొత్తం 306 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకోగా, ట్రంప్‌కు 232 ఓట్లు లభించాయి.
అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల్లో భారీ స్థాయిలో మోసాలు జరిగాయని నిరాధార ఆరోపణలు చేశారు.
ఇప్పటివరకూ, జో బైడెన్ విజయానికి వ్యతిరేకంగా దాఖలైన 60 పిటిషన్లను అమెరికా కోర్టులు కొట్టివేశాయి.
వాషింగ్టన్ పోస్ట్ విడుదల చేసిన కాల్ రికార్డింగ్‌లో అధ్యక్షుడు ట్రంప్ జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్‌పై ఒత్తిడి తీసుకురావడం వినవచ్చు.
ఆయన గట్టిగా "జార్జియా ఎన్నికల్లో తాను గెలిచానని, రీకౌంటింగ్ చేశారని చెప్పడంలో తప్పేం లేదని" అంటుంటారు.
అటు రెఫన్‌స్పర్జర్ "సర్ మీ ముందున్న సవాలు ఏంటంటే, మీరు ఏ డేటా చూపిస్తున్నారో, అది తప్పు" అంటుంటారు.
ట్రంప్ ఆయన్ను చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా బెదిరిస్తారు కూడా.
అధ్యక్షుడు ఆయనతో, "వాళ్లు ఏం చేశారో మీకు తెలుసు. దీని గురించి సమాచారం ఇవ్వకపోవడం నేరం. నువ్వు అలా జరగనివ్వకూడదు. అది మీకు, మీ లాయర్ రియాన్‌కు చాలా ప్రమాదం. రాష్ట్రంలో ఫలితాలు మళ్లీ సమీక్షించండి" అన్నారు.
ఈ కాల్ రికార్డింగ్ విడుదలపై వైట్ హౌస్ ఇప్పటివరకూ ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్: బలూచిస్తాన్‌లో 11 మంది కార్మికుల తలలు నరికివేసిన ఇస్లామిక్ స్టేట్
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఆదివారం ఉదయం జరిగిన దాడిలో 11 మంది షియా హజారాలు మరణించారు. ఈ దాడిని చేపట్టింది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
దాడిని తామే చేపట్టినట్లు అమాక్ న్యూస్ ఏజెన్సీకి ఇస్లామిక్ స్టేట్ ఒక లేఖ రాసినట్లు రాయిటర్స్ తెలిపింది.
బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకు 100 కి.మీ. దూరంలో బోలాన్ జిల్లాలో ఈ దాడి జరిగింది.
బొగ్గు గనిలో పనిచేస్తున్న 11 మంది కార్మికులు దాడిలో మరణించారని అధికారులు తెలిపారు.
కార్మికుల కళ్లు, చేతులకు గుడ్డలు కట్టి తలలు నరికేశారని ఓ భద్రతా అధికారి రాయిటర్స్‌కు చెప్పారు.
మైనారిటీ షియా వర్గాలపై ఇక్కడ దాడులు జరగడం కొత్తేమీ కాదు. గత ఏప్రిల్‌లో షియాలు ఎక్కువగా ఉండే మార్కెట్‌లో దాడిచేసి 18 మందిని హతమార్చారు.

ఫొటో సోర్స్, Reuters
నైజర్ దాడిలో 100కు పెరిగిన మృతుల సంఖ్య
పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్ దేశంలో రెండు గ్రామాలపై జరిగిన ఉగ్రదాడుల్లో మరణించిన వారి సంఖ్య వందకు పెరిగింది. ఇది ఇస్లామిస్ట్ మిలిటెంట్ల చర్యగా అనుమానిస్తున్నారు.
మృతుల సంఖ్య వందకు పెరిగినట్లు నైజర్ ప్రధాన మంత్రి బ్రిగి రఫీనీ సోమవారం తెలిపారు.
ఈ రెండు గ్రామాలు కూడా నైజర్‌కు పశ్చిమాన మాలీ సరిహద్దులకు దగ్గరగా ఉన్నాయి.
ఇటీవల కాలంలో ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో మిలిటెంట్ గ్రూపులు అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాయి.
కొన్నాళ్లుగా సహెల్ ప్రాంతంలో ఇస్లామిస్ట్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ నేతృత్వంలో వెస్ట్ ఆఫ్రికా, యూరోపియన్ కూటమి చర్యలు చేపడుతోంది.
అయినా కూడా ఆ ప్రాంతంలో మాదక ద్రవ్యాల రవాణా, మానవ అక్రమ రవాణా, జాతి హింస జరుగుతూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- తేనెలో కల్తీ: ‘చైనీస్ షుగర్ సిరప్‌లను కలిపి, అమ్మేస్తున్నారు’
- లంచగొండి అధికారులను ఏసీబీ పట్టుకున్నాక ఏం జరుగుతుంది
- మోదీ ప్రభుత్వాన్ని రైతులు ఎందుకు నమ్మడం లేదు - కార్పొరేట్ సంస్థలంటే వారికి భయమెందుకు?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








