కరోనావైరస్‌పై పోరాటం ఆసియాలో స్వేచ్ఛను హరించిందా

అది ఏప్రిల్ 10, 2020. భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న రోజులు. పౌరసత్వ చట్టంపై దిల్లీలో ఆందోళన చేస్తున్నప్పుడు సఫూరా జర్గార్ మూడు నెలల గర్భిణి. ఆ సమయంలో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
గర్భిణులకు ఈ వైరస్ త్వరగా సోకుతుందని నివేదికలు వస్తున్న సమయంలో దాదాపు రెండు నెలలకు పైగా ఆమె తిహార్ జైల్లో ఉన్నారు.
“నేను హిందువులను చంపే టెర్రరిస్టునని, నాతో ఎవరూ మాట్లాడవద్దని ఖైదీలకు జైలు అధికారులు చెప్పేవారు.
కానీ నేను ఒక వివాదాస్పద చట్టాన్ని వ్యతిరేకిస్తూ అరెస్టయ్యానని వాళ్లకు తెలియదు’’ అని జైలు నుంచి విడుదలయ్యాక బీబీసీ ప్రతినిధి గీతాపాండేతో సఫూరా జర్గార్ అన్నారు.
ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలో పాల్గొనడమే ఆమె చేసిన నేరం.
ఈ ఆందోళన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమయ్యాయి.
కానీ జైలుకు వెళ్లిన తర్వాత ఆమెను విడుదల చేయాలంటూ ఒక్క ఉద్యమం, నిరసన ప్రదర్శనా జరగలేదు. ఎందుకంటే అప్పుడు భారతదేశంలో కఠినమైన లాక్‌డౌన్ అమలవుతోంది. ఆమెలాగా అరెస్టైన అనేకమంది జైల్లోనే ఉండిపోయారు.
అయితే ఇది కేవలం ఇండియాలోనే కాదు. ఆసియాలోని చాలా దేశాలలో ప్రభుత్వాలు తాము తయారుచేసిన చట్టాలను కఠినంగా అమలు చేయడానికి కరోనా వైరస్‌ను వాడుకున్నాయి.
కరోనా లేకుంటే ఈ ఉద్యమాలు తీవ్రరూపం దాల్చేవి. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చేది. కానీ అలా జరగలేదు. నేతలు ఈ చట్టాలను వెనక్కి తీసుకోకపోగా, ప్రజలదృష్టిని మరల్చి పాపులారిటీ పెంచుకునేందుకు ప్రయత్నించారు.
“ప్రజల ఉద్యమాలకు వైరస్ శత్రువులా మారింది. మహమ్మారితో పోరాడుతున్నామన్న పేరుతో ప్రభుత్వాలు తమ నిరంకుశ చట్టాలను అమలు చేశాయి’’ అని గ్లోబల్ అలయన్స్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్‌కు చెందిన జోసెఫ్ బెనెడిక్ట్ బీబీసీతో అన్నారు.
“దీని అర్ధం పౌరహక్కులు, మానవహక్కులు వెనకడుగు వేశాయి’’ అని ఆయన అన్నారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అనేక ప్రభుత్వాలు తమపై ఉన్న వ్యతిరేకతను తీవ్రంగా అణచివేశాయని,ఆఖరికి కరోనాను ఎదుర్కోవడంలో తమ వైఫల్యాలను కూడా బైటికి రాకుండా జాగ్రత్త పడ్డాయని ‘సివికస్’ తాజాగా విడుదల చేసిన ‘ఎటాక్ ఆన్ పీపుల్ పవర్’ అనే రిపోర్ట్‌లో పేర్కొంది.
పెరిగిన నిఘాతో కఠినమైన నిబంధనల మాటున ప్రభుత్వాలు తమపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడ్డాయని, దీంతో చాలాచోట్ల ఈ వ్యతిరేకతలు అణచివేతకు గురయ్యాయని ఈ నివేదిక తెలిపింది.
కనీసం 26 దేశాలలో కఠినమైన నిబంధనలను అమలు చేశారని, మరో 16 దేశాలో మానవ హక్కుల కార్యకర్తలపై విచారణలు, అరెస్టులు, శిక్షలు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
కఠినమైన సందేశం
ఇండియాలో సఫూరాతోపాటు పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న 83 ఏళ్ల ఓ మత ప్రచారకుడిని కూడా అరెస్టు చేశారు. దేశద్రోహానికి పాల్పడ్డారంటూ బెయిల్‌కు వీలులేని అభియోగాలు మోపి జైల్లో పెట్టారు.
ఈ అరెస్టులు అణచివేతలు వివిధ సంఘాలకు ఒక సందేశాన్నిచ్చాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఐదు సంస్థలు పేర్కొన్నాయి.
రాజకీయ ఖైదీలను విడుదల చేయాల్సిందిగా ఆయా సంస్థలు ప్రభుత్వాలకు సూచించాయని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్‌కు చెందిన మైత్రేయి గుప్తా బీబీసీతో అన్నారు.
అయినా అరెస్టు కొనసాగాయని, కొద్దిసంఖ్యలోనే అయినా నిరసనలు బైటికి కనిపించాయని ఆయన పేర్కొన్నారు.
అరెస్టయినవారు దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ప్రకటించిన పలు ప్రభుత్వాలు, వారిని వెంటాడి వేధిస్తున్నారన్న వాదనలను ఖండిస్తూ వచ్చాయి.
ఫిలిప్పీన్స్‌లో గుండె సంబంధ వ్యాధులతోపాటు ఆస్తమాతో బాధపడుతున్న తెరెసిటా నౌల్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది.
ఆమెపై కిడ్నాప్ అభియోగాలు మోపారు.
ఇలాంటి నేరాలకు పాల్పడ్డారని అభియోగాలున్న 400 మందితో కలిపి ఆమెను మీడియా ముందు పరేడ్ చేయించారు పోలీసులు.
ఆ 400మందిలో కూడా చాలామంది జర్నలిస్టులు, పౌరహక్కుల నేతలే ఎక్కువ. ఇక జారా అల్వారెజ్, రాండాల్ ఎచెయిన్స్‌లాంటి కార్యకర్తలపై దాడులు చేసి చంపేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వాక్‌స్వాతంత్ర్యానికి అడ్డుకట్ట
ఫిలిప్పీన్స్‌లో ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎస్-సీబీఎన్‌ను బలవంతంగా మూతపడేలాగా చేయడంతో కరోనా మహ్మమ్మారి వార్తలు కూడా బయటకు రాలేదు. కానీ ప్రెసిడెంట్ రోడ్రిగో మాత్రం తన పాపులారిటీని పెంచుకున్నారు.
కరోనా విషయంలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారన్న నెపంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేక వెబ్‌సైట్లను మూసేయించింది.
హక్కుల సంఘాలను అణచి వేయడానికి కరోనా మహమ్మారిని సర్కార్లు చాకచక్యంగా ఉపయోగించుకున్నాయని నేపాల్‌కు చెందిన హక్కుల కార్యకర్త బిద్య శ్రేష్ఠ బీబీసీతో అన్నారు.
నీవర్ తెగకు చెందిన ఓ సంప్రదాయ నివాస ప్రాంతాన్ని తొలగించి రోడ్డు వేయడం ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా నేపాల్ ప్రభుత్వం పక్కనబెట్టిందని శ్రేష్ఠ ఆరోపించారు.
థాయ్‌లాండ్, శ్రీలంక, వియత్నాం దేశాలలో అనేకమందిని లక్ష్యంగా చేసుకుని అరెస్టులకు పాల్పడ్డారని, వీరందరిపైనా కరోనాపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారన్న అభియోగాలు మోపారని ఆయన అన్నారు.
వాక్‌స్వాతంత్ర్యాన్ని హరించి వేడయానికి మయన్మార్ ప్రభుత్వం టెర్రరిజం అనే మాటను విస్తృతంగా వాడుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం కరోనా కారణంగా నిలిచిపోయింది. ప్రజాస్వామ్య ఉద్యమంలో ఈ ఆందోళన కీలకంగా మారింది. ఇంకా పురుడు పోసుకోవాల్సిన అనేక ఉద్యమాలు కరోనా కారణంగా పుట్టకుండానే గిట్టాయి.
దక్షిణకొరియా, సింగపూర్, తైవాన్‌లాంటి దేశాలలో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థలు కరోనాను గుర్తించడంలో సమర్ధవంతంగా పనిచేశాయని, అయితే ఇవి మహమ్మారి తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అభిప్రాయపడింది.
ఈ దేశాలో ప్రభుత్వాల నిర్బంధాలను అడ్డుకోవడానికి అనేక హక్కుల సంఘాలు రంగంలోకి దిగాయని హక్కుల కార్యకర్త బెనెడిక్ట్ అన్నారు.
థాయిలాంటి దేశాలలో రాజుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఇప్పటికే కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
అయితే ఇప్పటి వరకు కొనసాగిన అరెస్టులు, అణచివేతల ధోరణి మహమ్మారి తర్వాత కూడా కొనసాగవచ్చని బెనెడిక్ట్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- అమ్మాయిల కనీస వివాహ వయసు పెంచితే బాల్య వివాహాలు ఆగుతాయా?
- విశాఖపట్నం లేడీ బైక్ మెకానిక్: 'అబ్బాయిల పనులు ఎందుకన్నారు... అయినా ఎందుకు చేస్తున్నానంటే...'
- ‘ఇక్కడ తయారయ్యే మందులు వాడి ప్రజలు బతుకుతున్నారు.. మేం మాత్రం చస్తున్నాం’
- ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ యంత్రాంగం పని చేయడం లేదనే వివాదంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మెరుగైన మహిళా సాధికారత... కలవరపెడుతున్న పోషకాహార లోపం -జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
- భారత్: ఒకపక్క ఊబకాయం.. మరోపక్క పోషకాహార లోపం.. ఎందుకిలా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








