‘అలీబాబా’ జాక్‌ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?

రెండు నెలల్లోనే జాక్‌ మా కంపెనీలు రూ.80వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెండు నెలల్లోనే జాక్‌ మా కంపెనీలు రూ.80వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయి

2020 చివరి నెలలు బిలియనీర్‌ ‘జాక్‌ మా’కు అంతగా కలిసి రాలేదు. అక్టోబర్‌ చివరి నుంచి, ఏడాది చివరి నాటికి ఆయన సుమారు 11 బిలియన్‌ డాలర్లను నష్టపోయారు. భారత కరెన్సీలో దీని విలువ రూ.80వేల కోట్లకు పైమాటే.

ఆయన సంస్థతోపాటు మరికొన్ని దిగ్గజ టెక్‌ కంపెనీలపై అధికారుల పర్యవేక్షణ, నిబంధనలు పెరిగాయి. వాటితోపాటే ‘జాక్‌ మా’ నిర్వహించే సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చైనాలోని అతిపెద్ద కంపెనీలలో అలీబాబా ఒకటి.

ఈ సంవత్సరం ‘జాక్‌ మా’ సంపద దాదాపు 61.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయన మరోసారి చైనాలో అత్యంత ధనవంతుడు కావడానికి చేరువగా ఉన్నారు.

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ‘జాక్‌ మా’ కంపెనీల నికర విలువ 50.9 బిలియన్ డాలర్లకు తగ్గింది.‌ ప్రస్తుతం బిలియనీర్స్‌ జాబితాలో ఆయనది నాలుగో స్థానం

యాంట్‌ గ్రూప్‌ కార్యాలయం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యాంట్‌ గ్రూప్‌ కార్యాలయం

చరిత్రలో అతిపెద్ద ఐపీఓ

‘జాక్‌ మా’ తన కంపెనీల చరిత్రలోనే అతి పెద్దదైన ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమవుతున్న దశలో సమస్య మొదలైంది. గ్రూపో హార్మిగా ఐపీఓ నిలిచిపోయింది.

నవంబర్‌ ప్రారంభం వరకు అంతా బాగానే ఉంది. ఇది చరిత్రలోనే అతి పెద్ద ఒప్పందంగా చెబుతున్నారు. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు.

గ్రూపో హార్మిగా సెక్యూరిటీస్‌ హాంకాంగ్‌ అండ్‌ షాంఘై స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ఐపీఓగా వస్తుండటంతో పెట్టుబడిదారులు దాని కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ ఐపీఓ విలువ 34.4 బిలియన్‌ డాలర్లు. కానీ చైనా ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు చివరి నిమిషంలో దీనిపై సందేహాలు లేవనెత్తడంతో ఐపీఓను నిలిపేయాల్సి వచ్చింది.

అనలిస్టుల అభిప్రాయం ప్రకారం ఇది యాంట్‌ గ్రూప్‌, జాక్‌ మా సంస్థల విస్తరణను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం.

జాక్‌ మా వివాదాలు

తరచూ చైనా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా జాక్‌ మా కామెంట్లు చేస్తుంటారని, అందుకే ప్రభుత్వం ఆయన సంస్థలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తుండవచ్చని బీబీసీ సింగపూర్‌ కరస్పాండెంట్‌ తిమోతీ మెక్డోనాల్డ్‌ విశ్లేషించారు.

“సాంకేతికంగా జాక్‌ మా ఎదుగుతున్న తీరు చైనా ప్రభుత్వం భవిష్యత్తుకు ముప్పుగా మారింది’’అని తిమోతీ అన్నారు.

గతంలో చైనా ప్రభుత్వ బ్యాంకులను విమర్శించిన జాక్‌ మా, వాటిని వినూత్న ఆలోచనలు లేని తోలుబొమ్మల దుకాణాలుగా అభివర్ణించారు. దీంతో చైనా అధికారులు కూడా జాక్‌ మాపై గుర్రుగా ఉన్నారు.

ఈ విమర్శల తర్వాత నుంచి గ్రూపో హార్మిగా వ్యవహారాలలో సమస్యలు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార సంస్థల్లో ఒకటిగా గ్రూపో హార్మిగా పేరు తెచ్చుకుంది.

డిజిటల్‌ ఫైనాన్స్

యాంట్ గ్రూప్ నుంచి వచ్చిన ‘అలీ పే’ అలీబాబా ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థకు పేమెంట్‌ గేట్‌వేగా ప్రసిద్ధి చెందింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే కస్టమర్‌కు ఆ వస్తువు అతన్ని చేరే వరకు డబ్బును ట్రస్ట్‌లో ఉంచడం ఈ అలీపే ప్రత్యేకత.

అలీబాబా వృద్ధిలో ‘అలీపే’ది ప్రధాన పాత్ర. చైనాలో క్రెడిట్‌ కార్డులకన్నా దీనికే పాపులారిటీ, వినియోగం ఎక్కువ. లిస్టింగ్‌ ప్రమాణాలు, పారదర్శకతలలో లోపాల పేరుతో హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూపో హార్మిగా ఐపీఓను నిలిపేసింది.

డిజిటల్‌ ఫైనాన్స్‌ నియంత్రణలో ఇటీవల వచ్చిన కొత్త నిబంధనలు కూడా దీని నిలిపివేతకు కొంత వరకు కారణమని తెలుస్తోంది.

ప్రభుత్వ విధానాలను విమర్శించినందుకే జాక్‌ మా టార్గెట్‌ అయ్యారని నిపుణులు విశ్లేషిస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ విధానాలను విమర్శించినందుకే జాక్‌ మా టార్గెట్‌ అయ్యారని నిపుణులు విశ్లేషిస్తున్నారు

ఆరోగ్యకరమైన పోటీ లేదా?

గ్రూపో హార్మిగా తన పనితీరును పునర్వ్యవస్థీకరించాలని కొద్దిరోజుల క్రితం చైనా సెంట్రల్‌ బ్యాంక్ ఆదేశించింది.“ నిబంధనలు పాటించకపోవడం, పోటీదారులపై బలప్రయోగంతో గెలవడంలాంటి బ్యాడ్ కార్పొరేట్‌ పాలసీలను అనుసరిస్తున్నారని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా డిప్యూటీ గవర్నర్ పాన్‌ గాంగ్షెంగ్‌ విమర్శించారు.

తమవైపు నుంచి లోపాలుంటే సరిదిద్దుకుంటామని, నిబంధనలను కచ్చితంగా పాటిస్తామని గ్రూపో హార్మిగా ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే జాక్‌ మా ను కట్టడి చేసేందుకే ప్రభుత్వం కఠినతరమైన నిబంధనలను విధిస్తోందని కొందరు విశ్లేషకులు అంటుండగా, మరికొందరు మాత్రం ఒక సంస్థ కోసం చైనా తన విధానాలను మార్చదని వాదిస్తున్నారు.

జాక్‌ మా ఒక్కరే లక్ష్యం కాదా?

ఈ మొత్తం వివాదానికి జాక్‌ మా కేంద్రంగా కనిపిస్తున్నప్పటికీ ఈ నియంత్రణ, నిబంధనలను ఎదుర్కొంటున్నది ఆయనొక్కొరే కాదు. ఫిన్‌టెక్ రంగం వాటా భారీగా పెరిగిందని చైనా ప్రభుత్వ పెద్దలు గుర్తించారు. అందుకే నిబంధనలతో వాటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ పని విధానాన్ని మార్చుకోవడం ప్రారంభించాయి.

ఉదాహరణకు గ్రూపో హార్మిగాను అధికారులు నియంత్రించిన తర్వాత జెడి డిజిట్స్, టెన్సెంట్, బైడు, లుఫాక్స్‌లాంటి సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లపై వడ్డీ డిపాజిట్ల సేకరణను నిలిపేశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)