కరోనావైరస్‌ చరిత్రను చైనా ప్రభుత్వం తనకు అనుకూలంగా రచించుకుంటోందా?

చైనా

ఫొటో సోర్స్, China News Service

ఈ ఏడాది మొదట్లో చైనా ప్రభుత్వానికి రెండు ప్రధాన సవాళ్లు ఎదురయ్యాయి. ఒక కొత్త ఇన్ఫెక్షన్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. మరోవైపు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెబుతూ ఆన్‌లైన్‌లో కొన్ని స్వరాలు కూడా వినిపించడం ఎక్కువైంది.

అయితే, 2020 చివరినాటికి ఈ రెండింటినీ విజయవంతంగా నియంత్రించినట్లు చైనా ప్రభుత్వ వార్తలను పరిశీలిస్తే తెలుస్తోంది.

ఆన్‌లైన్‌లో నెగిటివ్ సమాచారంపై చైనా ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధిస్తోంది? ఈ ఆంక్షలను అధిగమించి కొందరు ఎలా సమాచారం వెలుగులోకి తెస్తున్నారు? ప్రభుత్వంపై ప్రజల ధోరణిని ప్రత్యేక ప్రచారాలతో ఎలా మారుస్తున్నారు? లాంటి అంశాలపై బీబీసీ ప్రతినిధులు కెరీ అలెన్, ఝవోయిన్ ఫెంగ్‌లు అందిస్తున్న కథనం.

సార్స్ తరహా వైరస్ విజృంభిస్తోందా అంటూ వీబోలో కామెంట్లు

ఫొటో సోర్స్, Sina Weibo

ఫొటో క్యాప్షన్, సార్స్ తరహా వైరస్ విజృంభిస్తోందా అంటూ వీబోలో కామెంట్లు

ఊహించని పరిణామాలు..

ఏడాది మొదట్లో చైనాలో ఏవో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయని స్పష్టంగా తెలిసేది. చైనా సోషల్ మీడియా వేదికల్లో వేల కొద్దీ మేసేజ్‌లు కనిపించేవి. సార్స్ తరహా వైరస్ విజృంభణను స్థానిక ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయా? అని చాలామంది ప్రశ్నించేవారు.

వీబో లాంటి సామాజిక అనుసంధాన వేదికలపై ప్రభుత్వ వ్యతిరేక సమాచారంపై ఎప్పుడూ ఆంక్షలు ఉంటాయి. అయితే, ఇలాంటి ఆంక్షల నడుమ కూడా చాలా సమాచారం బయటకు వినిపించేది.

విపత్తుల్లాంటి సమయాల్లో చైనా ప్రభుత్వం సోషల్ మీడియాలో ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆంక్షలను కొంచెం నెమ్మదిగా అమలుచేస్తుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇలాంటి సమయాన్నే కొన్ని మీడియా సంస్థలు అవకాశంగా మలుచుకున్నాయి. ప్రత్యేక పరిశోధనలను ప్రచురించాయి? వీటిని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు.

అయితే, చైనా ప్రభుత్వం ప్రత్యేక మీడియా వ్యూహాలతో ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి వార్తలను పూర్తిగా జల్లెడ పడుతుంది.

జనవరి వార్తల్లో అందరివైపు వేళ్లు చూపించారు. మరోవైపు మీడియాలో కొన్ని రోజులపాటు దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కనిపించలేదు. ప్రజా కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకోలేదు. పీపుల్స్ డైలీ లాంటి ప్రభుత్వ మీడియాలోనూ ఆయన ఫోటోలు కనిపించలేదు. ఆరోపణలు తనవైపు రాకుండా చూసుకొనేందుకే ఆయన బయటకు రావడంలేదని వార్తలు కూడా వచ్చాయి.

అయితే, వారం రోజుల్లోనే పరిస్థితులు పూర్తిగా మారాయి. స్థానిక ప్రభుత్వాలను ఉన్నతాధికారులు హెచ్చరించడం మొదలుపెట్టారు.

తమ ప్రాంతాల్లో కేసులను దాచిపెడితే చరిత్రలో నిలిచిపోయే తప్పు చేసినట్లు అవుతుందని ఉన్నతాధికారులు స్థానిక ప్రభుత్వాధికారులకు హెచ్చరించారు. దీంతో సోషల్ మీడియాతోపాటు, మీడియాలోనూ వూహాన్ నాయకుల వైపు దృష్టి మళ్లింది. ఏం జరుగుతుందో ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? అని బీజింగ్ న్యూస్ పత్రిక విమర్శనాత్మక కథనాలు కూడా ప్రచురించింది.

మరోవైపు ఫిబ్రవరిలో జిన్‌పింగ్ కనిపించారు. చైనాలో కేసులు తగ్గుతున్నాయనే వార్తల నడుమ అందరిలోనూ విశ్వాసాన్ని నింపేందుకు ఆయన ప్రజల ముందుకు వచ్చారు.

పీపుల్స్ డైలీలో షీ జిన్‌పింగ్ ఫోటో లేకుండా వార్తలు

ఫొటో సోర్స్, People's Daily

ఫొటో క్యాప్షన్, పీపుల్స్ డైలీలో షీ జిన్‌పింగ్ ఫోటో లేకుండా వార్తలు

డాక్టర్‌పై ఆంక్షలు

ఊహాగానాలు, అనిశ్చితి నడుమ ఓ డాక్టర్ నోరును ప్రభుత్వం నొక్కేసినట్లు వార్తలు వచ్చాయి. ఆయనపై చర్యలు తీసుకోకుండా ఉండాల్సిందని చాలా మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

లీ వెన్‌లియాంగ్‌ ‘‘ప్రజావేగు’’గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. సార్స్ తరహా వైరస్ విజృంభిస్తోందని ఆయనే మొదట అందరినీ హెచ్చరించారు. అయితే, అవాస్తవ వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు బనాయించి, విచారణ చేపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 7న ఆయన మరణించారు.

ఆయన మరణానంతరం పది లక్షల మంది వీబో వినియోగదారులు ఆయనకు మద్దతు పలికారు. అయితే, ఆవేదన, బాధను వ్యక్తంచేస్తూ ప్రజలు పెట్టే సందేశాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తొలగించేవారు. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు సృజనాత్మకంగా ఎమోజీలు, మోర్స్ కోడ్‌లు, పురాతన స్క్రిప్ట్‌లలో సందేశాలను రాసేవారు.

కొందరు ఆన్‌లైన్ ద్వారా చెప్పలేని సంగతులను తమ మాస్క్‌లపై రాసుకునేవారు. డాక్టర్ లీ మరణానంతరం చాలామంది తమ మాస్క్‌లపై ‘‘అసలు ఏం జరుగుతుందో అర్థంకావడంలేదు’’అని రాసుకొని చిత్రాలను వీచాట్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్‌చేశారు.

వూహాన్‌లో వైరస్ కేసులపై కథనాలు

ఫొటో సోర్స్, Beijing News

ఫొటో క్యాప్షన్, వూహాన్‌లో వైరస్ కేసులపై కథనాలు

జర్నలిస్టు అదృశ్యం

డాక్టర్ లీను అమరవీరునిగా గుర్తించినప్పటికీ.. చాలామంది ఉద్యమకారులకు మాత్రం దేశ చరిత్రలో చోటు దక్కకపోవచ్చు.

వుహాన్‌లో వైరస్ విజృంభణ మొదలైనప్పుడు కొంతమంది పౌరులు పాత్రికేయులుగా మారారు. వీరు చైనా ఆంక్షలను తోసిరాజంటూ సమాచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.

ఇలాంటి వారిలో చెన్ ఖియుషి, ఫాంగ్ బిన్, ఝెంగ్ ఝాన్ తదితరులు ఉన్నారు. వుహాన్‌లో ఏం జరుగుతుందో వీరు చెబుతున్న వీడియోలను యూట్యూబ్‌లో లక్షల మంది చూశారు.

అయితే, వారు దీనికి మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం చెప్పేదానికి వ్యతిరేకంగా స్పందించిన కొందరు జర్నలిస్టులను అరెస్టు చేశారని ద కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) తెలిపింది. ముగ్గురు ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నట్లు పేర్కొంది.

చైనా

ఫొటో సోర్స్, Sina Weibo

ఫొటో క్యాప్షన్, లీ వెన్‌లియాంగ్ వీబో పేజీ

మరోవైపు అంతర్జాతీయంగా చేపట్టే ప్రచారాల్లో భాగంగానే ఓ జర్నలిస్టు వార్తలు, వీడియోలు పెట్టారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అయ్యాయి.

ఫిబ్రవరిలో తన కారును పోలీసులు వెంబడిస్తున్నారని యూట్యూబ్‌లో వీడియో పెట్టిన అనంతరం లీ జెహువా కనిపించకుండా పోయారు.

రెండు నెలలపాటు ఆయన కనిపించలేదు. అయితే, విచారణలో అధికారులకు సహకరిస్తున్నానని, క్వారంటైన్‌లో ఉన్నానని ఆయన ఆ తర్వాత ఒక వీడియో పోస్ట్‌చేశారు.

మళ్లీ ఆయన కనిపించలేదు. దీంతో వీడియో చేయాలని ఆయన్ను అధికారులు ఒత్తిడి చేశారా? అంటూ వార్తలు వచ్చాయి.

లీ వెన్‌యాంగ్ మృతికి నెటిజన్ల సంతాపం

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్, లీ వెన్‌యాంగ్ మృతికి నెటిజన్ల సంతాపం

కొత్త దారుల్లో..

మార్చిలో వైరస్‌కు విజయవంతంగా కళ్లెం వేసినట్లు అందరికీ తెలియజేయాలని చైనా భావించింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించేవారిపై, ముఖ్యంగా యువకులపై ఆంక్షలు విధించే సోషల్ మీడియా సెన్సార్‌లు మళ్లీ అమలులోకి వచ్చాయి.

ముఖ్యంగా మరో వుహాన్ తరహా లాక్‌డౌన్‌ను విధించేందుకు సిద్ధంగాలేమనే సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది. అయితే చాలా యూనివర్సిటీలు ఇప్పటికీ కఠినమైన లాక్‌డౌన్ విధానాలు, ఆంక్షలను అమలు చేస్తున్నాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.

ఆగస్టులో చాలా మంది విద్యార్థులు తొలిసారిగా తరగతి గదుల్లోకి అడుగుపెట్టారు. అయితే చాలాచోట్ల నిరసనలు జరిగాయి. ముఖ్యంగా ఇంటర్నెట్‌పై ఆంక్షల విషయంలో ఈ నిరసనలు జరిగాయి. మరోవైపు యూనివర్సిటీలు ఆహారం ధరలను పెంచేశాయని, ఎక్కువమంది ఒకేచోట కూర్చోవాల్సి వస్తోందని వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ ప్రభుత్వం సెన్సార్ చేసింది.

చాలామంది యువకులు తమ అసంతృప్తిని తెలియజేసేందుకు సంప్రదాయ సోషల్ మీడియా సైట్లకు బదులు కొత్తకొత్త మీడియా సైట్లను ఎంచుకున్నారు.

మ్యూజిక్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘‘నెట్‌ ఈజ్ క్లౌడ్ మ్యూజిక్’’లో వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని న్యూస్‌ వెబ్‌సైట్ సిక్స్త్ టోన్ తెలిపింది. ముఖ్యంగా చైనా యువత దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది.

లీ జెహువా, జర్నలిస్టు

ఫొటో సోర్స్, Li Zehua/YouTube

ఫొటో క్యాప్షన్, లీ జెహువా, జర్నలిస్టు

చరిత్రను తిరగరాస్తూ...

మొత్తంగా అంతా ఆశావహంగానే, సవ్యంగానే నడుస్తోందని చైనా చెప్పే ప్రయత్నం చేస్తోంది.

చరిత్రను బ్రిటన్ ఎలా తమ కోణంలో చెబుతుందో.. వుహాన్‌లో కరోనావైరస్ పరిణామాలను చైనా కూడా తమకు నచ్చిన, తమ అనుకూల కోణంలోనే చెబుతుందని చాలామంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

వుహాన్‌లో తన రోజువారీ జీవితాన్ని డైరీ రూపంలో వెల్లడించిన రచయిత ఫెంగ్ ఫెంగ్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.

అయితే, చైనా జాతీయ వాదులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. చైనా వ్యతిరేక వార్తలను ఆమె కావాలనే రాస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు కరోనావైరస్ కట్టడిపై చైనా ప్రభుత్వం చెప్పే వార్తలతో సరిపోలే పుస్తకాలను ప్రభుత్వ మీడియా ప్రోత్సహిస్తోంది.

అయితే, వుహాన్‌లో వైరస్ విజృంభణ విషయంలో పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రభుత్వ మీడియా వార్తలు రాసిందని కొన్నిసార్లు వ్యతిరేకత కూడా వ్యక్తమైంది.

కరోనావైరస్ ఫ్రంట్ లైన్ వర్కర్స్‌పై తెరకెక్కించిన హీరోస్ ఇన్ హార్మ్స్ వే సిరీస్‌ విషయంలో ఇది కొట్టొచ్చినట్లు కనిపించింది.

చైనాపై మీమ్స్

ఫొటో సోర్స్, Li Zehua/YouTube

ఫొటో క్యాప్షన్, చైనాపై మీమ్స్

ఆశావహ ముగింపు కోసం..

2020కి ఆశావహ వాతావరణంలో ముగింపు పలకాలని చైనా భావిస్తోంది.

కోవిడ్-19పై పోరాటంలో విజయం సాధించామని తమ పౌరులతోపాటు ప్రపంచానికి చాటిచెప్పాలని చైనా ప్రయత్నిస్తోంది.

అదే సమయంలో కరోనావైరస్ మొదట ఎక్కడ విజృంభించిందనే వార్తలకు దూరంగా ఉంటోంది. మరోవైపు కరోనావైరస్ కట్టడి విషయంలో రాజకీయంగా పశ్చిమ దేశాల కంటే తమ మోడల్ మేలైనదని చెబుతోంది.

అమెరికా, బ్రిటన్‌లలో కరోనావైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న తీరుపై చైనా మీడియా సంస్థలు వరుస వార్తలు ప్రచురించాయి.

కొందరు చైనా నెటిజన్లు కోవిడ్-19ను అమెరికా వైరస్, ట్రంప్ వైరస్ అంటూ పోస్ట్‌లు కూడా చేశారు.

ప్రపంచమంతా విభేదాలు, అస్థిరత్వంతో ముందుకు వెళ్తుంటే ఏకత్వం, సుసంపన్నతతో తాము 2021లోకి అడుగు పెడుతున్నామని చైనా సంకేతాలు ఇస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)