డొరొతీ బెనర్జీ: "ఆమె అందగత్తె, తెలివైన అమ్మాయి. కానీ, ఆమె భారతీయురాలు"

ఫొటో సోర్స్, Sheela Bonarjee
- రచయిత, ఆండ్రూ వైట్ హెడ్
- హోదా, బీబీసీ స్టోరీస్
ఆమె పుట్టుకతోనే భారతీయురాలు. పెరిగింది మాత్రం ఇంగ్లీష్ తరహాలో. వివాహం తర్వాత ఫ్రెంచ్ వ్యక్తిగా మారారు. కానీ ఆమె మనసు మాత్రం ఎప్పుడూ వెల్ష్ లోనే ఉండేది.
ఆమె పశ్చిమ బెంగాలులోని ఒక జమిందారీ కుటుంబానికి చెందిన డొరొతీ బెనర్జీ. ఆమె టీనేజ్లో ఉండగానే 1914లో ఆమె వెల్ష్ కాకపోయినప్పటికీ వేల్స్ లో ఒక ప్రతిష్టాత్మక సాంస్కృతిక బహుమతిని అందుకున్నారు.
డొరొతీ బెనర్జీ కుటుంబం హోదా, మతం, సంస్కృతి విషయంలో ఇతరుల కంటే విభిన్నంగా ఉండేవారు. వారు బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. కానీ, ఆమె చిన్నతనం అంతా బెంగాలులో రామ్ పూర్ కి కొన్ని మైళ్ళ దూరంలో నేపాల్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న కుటుంబ ఎస్టేట్లో సాదా సీదా జీవనం గడిపేవారు. ఆమె కుటుంబం క్రైస్తవ మతంలోకి మారారు. ఆమె తాతగారు కోల్‌కతాలోని ఒక స్కాటిష్ చర్చిలో పాస్టర్ గా పని చేసేవారు.
ఆమెకు10 సంవత్సరాల వయస్సులో సోదరులు బెర్టీ, నీల్ తో కలిసి1904లో విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్లారు.
డొరొతీ తల్లితండ్రులిద్దరూ లండన్ లోనే కొంత కాలం పాటు గడిపి వచ్చారు. వారి పిల్లలు కూడా వారి లాగే లండన్ రిటర్న్డ్ అని అనిపించుకోవాలని కోరుకునేవారు. అప్పటికి భారతదేశం బ్రిటిష్ పాలకుల చేతుల్లో ఉంది.

ఫొటో సోర్స్, Sheela Bonarjee
ఈ చిత్రంలో డొరొతీ తెలుపు రంగు డ్రెస్సు వేసుకుని, జడకు నల్లటి రిబ్బను కట్టుకుని గంభీరంగా ఉన్నట్లు కనిపిస్తారు. ఆమె సోదరుడు సూటు, టై ధరించి ఉంటారు. ప్రపంచం అంతా వారిని భారతీయులుగా భావిస్తున్నప్పటికీ వారి వస్త్రధారణ మాత్రం వారిలో నాటుకుపోయిన ఇంగ్లీష్ భావాలకు ప్రతీకగా కనిపిస్తుంది.
డొరొతీ తండ్రి ఒక న్యాయవాది, జమీందారు కూడా. డొరొతీకి తల్లితో ఎక్కువ చనువు ఉండేదని అంటారు. ఆమె తల్లి స్త్రీ విద్యను ప్రోత్సహించేవారు. తల్లీ కూతుర్లిద్దరూ బ్రిటన్లో మహిళలకు ఓటు హక్కు కోసం మద్దతు తెలిపారు.
ఒక శతాబ్దం క్రితం బ్రిటన్లో కానీ, భారతదేశంలో కానీ పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా చదివే అవకాశం లేని రోజుల్లో డొరొతీకి చదువుకునే అవకాశం దక్కింది. దీనికి ఆమె తల్లి ఇచ్చిన ప్రోత్సాహం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు.
"మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ విశ్వవిద్యాలయాల్లో కనీసం 1000 మంది భారతీయ విద్యార్థులు చదువుతూ ఉండేవారు" అని బ్రిస్టల్ యూనివర్సిటీలో పని చేస్తున్న డాక్టర్ సుమిత ముఖర్జీ చెప్పారు. ఆమె "ఇంగ్లండ్ రిటర్న్డ్ ఇండియన్స్ అనే పుస్తక రచయత కూడా. ఆ పుస్తకంలో 50 - 70 మంది వరకు మహిళలే ఉన్నారు.
1912లో బ్రిటన్లో చదువునభ్యసిస్తున్న వారిలో డొరొతీ బెనర్జీ కూడా ఉన్నారు. ఆమె కుటుంబం మాత్రం డొరొతీ లండన్ యూనివర్సిటీలో విద్యనభ్యసించాలని కోరుకున్నారు. కానీ, ఆమె లండన్ లో చదవడాన్ని చాలా సామాన్యంగా భావించినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతారు.
డొరొతీ తీర ప్రాంత పట్టణం అబెరిస్ట్విత్ లో ఉన్న వేల్స్ కాలేజీ ని ఎన్నుకున్నారు. ఇక్కడ ఎక్కువగా అందరూ వెల్ష్ భాష మాట్లాడతారు.
ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా అదే యూనివర్సిటీలో చేరారు.

ఫొటో సోర్స్, University of Aberystwyth
"అప్పటికే ఆ కాలేజీకి అభ్యుదయ విద్యా సంస్థగా పేరుండటంతో డొరొతీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ప్రభావితం చేసి ఉండవచ్చు. ఈ కాలేజీలో అన్ని మతాల వారికి, సాంస్కృతిక నేపథ్యం ఉన్నవారికి ప్రవేశం ఉండేది" అని అబెరిస్ట్విత్ యూనివర్సిటీలో చరిత్రకారులు డాక్టర్ సూసన్ డేవీస్ చెప్పారు.
వేల్స్ యూనివెర్సిటీలో ఉన్న మూడు కాలేజీలలో ఇది అన్నిటి కంటే ముందు స్థాపించినది. ఈ కాలేజికి లింగ సమానత్వం పాటించే విషయంలో మంచి పేరుంది.
డొరొతీ అక్కడ చేరేటప్పటికే సగం మంది విద్యార్థులు మహిళలు. ఇలా ఆ రోజుల్లో మరే బ్రిటిష్ విశ్వవిద్యాలయాలలోని కన్పించేది కాదు.
డొరొతీకి కాలేజి సాహిత్య వేదికల మీద చర్చల్లో పాల్గొనే విద్యార్థిగా మంచి పేరుండేది. ఆమె కాలేజీ జర్నల్ ని కూడా ఎడిట్ చేసేవారు.
1914లో కాలేజీ వార్షికోత్సవంలో వెల్ష్ లో ఉండే రచయతలు, సంగీతకారులు పోటీపడే సాహిత్య బహుమతిని అందుకోవడంతో ఆమెకు బాగా పేరు వచ్చింది. ఇది వెల్ష్ ప్రాంతంలో చాలా పేరున్న సాంస్కృతిక బహుమతి.
సంప్రదాయ వెల్ష్ తరహాలో కవిత్వం చెప్పిన వారికి చేతితో చెక్కిన, సింధూరపు చెట్టు కర్రతో తయారు చేసిన కుర్చీని బహుకరించే వారు.
ఈ పోటీకి ఎంట్రీలను కలం పేరుతోనే చేసేవారు.

ఫొటో సోర్స్, University of Aberystwyth
డొరొతీ ఈ బహుమతిని గెల్చుకోవడాన్ని ఒక వెల్ష్ వార్తాపత్రిక ఫ్రంట్ పేజీలో "ఒక హిందూ మహిళ ప్రముఖ స్థానాన్ని అలంకరించారు" అనే హెడ్ లైన్ తో వార్తను ప్రచురించారు.
ఆమె షీత అనే పేరుతో రాసిన భావగీతానికి బహుమతి వచ్చినట్లు ప్రకటించగానే అందరూ లేచి నిలబడి ఆమెకు అభివాదం చేశారు. ఆమెను వేదిక పైకి తీసుకుని వెళ్లి, అత్యంత ఆశ్చర్యానందాల మధ్య ఆమెను సత్కరించారు.
డొరొతీ సాధించిన విజయాన్ని చూసి ఆమె తల్లి తండ్రులు సంతోషించారు. "భారతదేశం ఒక కవయిత్రికి జన్మనిస్తే వేల్స్ ఆమెకు విద్యను ప్రసాదించడమే కాకుండా, ఆమెకున్న కవిత్వపు అభిరుచిని పెంపొందించుకునేందుకు ప్రోత్సహించిందని ఆమె తండ్రి ఆహుతులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అన్నారు.
డొరొతీ బనెర్జీ ఈస్టెడ్ఫోడ్ కాలేజీ నుంచి ఉత్తీర్ణత సాధించిన తొలి విదేశీ విద్యార్థి. ఇది ఒక ప్రముఖ విజయంగా చెప్పవచ్చు.
ఆమె తరువాత ఆ బహుమతిని ఒక మహిళ అందుకోవడం 2001 వరకు జరగలేదు.
ఈ విజయం తెచ్చిన ధైర్యంతో ఆమె 'ది వెల్ష్ అవుట్ లుక్' లాంటి పత్రికలకు కవితలు, పద్యాలు రాయడం మొదలు పెట్టారు.
ఆమె వేల్స్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా ఆ పత్రికలకు రాసేవారు.
"ఆమె వెల్ష్ మాట్లాడలేక పోయేవారు. కానీ ఆమెకు వెల్ష్ భాష అంటే చాలా ప్రేమ. ఆ దృష్టితో చూస్తే ఆమె వెల్ష్ కి పరాయి వారు" అని ఆమె మేనకోడలు షీలా బెనర్జీ అన్నారు. కానీ, వెల్ష్ ప్రజలు ఆమెను ఆమోదించారు అని అన్నారు.
కానీ, డొరొతీకి అబెరిస్ట్విత్ లో పేరుతో పాటు మనసును గాయపరిచే సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

డొరొతీ రాసుకున్న ఒక నల్లని కవరుతో ఉన్న పుస్తకం ఇంకా షీలా దగ్గర ఉంది. ఆమెకు 22 ఏళ్ళుండగా రాసిన ఒక పద్యంలో ఆమె మనసుకు తగిలిన గాయం గురించి రాసుకున్నారు.
మూడేళ్ళ పాటు తనతో రహస్యంగా బంధంలో ఉన్న ఒక వ్యక్తి అతని తల్లి తండ్రులు అంగీకరించక పోవడంతో ఆమెను వదిలిపెట్టినట్లు రాసుకున్నారు. ఆయన తల్లితండ్రులు "ఆమె అందగత్తె, తెలివైన అమ్మాయి. కానీ, ఆమె భారతీయురాలు" అనే నెపంతో వారి బంధానికి అడ్డు చెప్పినట్లు రాసుకున్నారు.
"ఈ సంఘటన ఆమెను తీవ్రంగా కలచివేసింది" అని షీలా చెప్పారు.
ఆమె చిన్న సోదరుడు నీల్ తర్వాత ఆక్స్‌ఫర్డ్ లో విద్యను అభ్యసించారు. ఆయన మాత్రం అక్కడ పక్షపాతానికి గురయ్యారు.
"మిగిలిన జాతుల వారి లాగే భారతీయులకు కూడా ఈ విశ్వ విద్యాలయంలో ప్రాముఖ్యత లేదు" అని ఆయన రాసుకున్నారు.
"నాకు లేని సామ్రాజ్యం ఇక్కడ చదివే ఇంగ్లీష్ విద్యార్థులకు ఉంది. వాళ్లకు ఇక్కడ హక్కు ఉంది. నాకు ఇక్కడ కేవలం సంబంధం ఉంది" అని ఆయన రాసుకున్నారు.
డొరొతీ, ఆమె సోదరుడు లండన్ తిరిగి వచ్చి రెండవ సారి డిగ్రీలో చేరారు. ఇక్కడ కూడా ఆమె ప్రముఖంగా నిలిచారు.
లండన్ యూనివర్సిటీ కాలేజీలో ఆమె న్యాయ శాస్త్రంలో పట్టా అందుకున్న తొలి మహిళా విద్యార్థిగా నిలిచారు.
పిల్లల చదువు పూర్తి కాగానే భారతదేశానికి తిరిగి రావాలని ఆమె కుటుంబం కోరుకున్నారు. ఆమె సోదరులు తల్లి తండ్రుల నిర్ణయాన్ని శిరసావహించారు కానీ, డొరొతీ మాత్రం భారతదేశం తిరిగి రావడానికి ఒప్పుకోలేదు. ఆమె వివిధ సంస్కృతులు, సాంఘిక విలువల మధ్య చిక్కు పడిపోయారు.
ఆమె స్వేచ్చాయుత భావాలతో ఉండేవారు. మహిళల సమానత్వానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు.
ఆమె పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడానికి అంగీకరించే మనస్తత్వం కలిగిన వారు మాత్రం కాదు. ఆ తర్వాత ఆమె పాల్ సర్టెల్ అనే ఫ్రెంచ్ కళాకారునితో కలిసి పారిపోయారు.
ఇది ఆమె తండ్రికి బాగా ఆగ్రహం తెప్పించింది.
కానీ, ఆమె తల్లి మాత్రం ఆమెను అర్ధం చేసుకున్నారు. వీరిద్దరూ 1921లో వివాహం చేసుకుని ఫ్రాన్సులో స్థిరపడ్డారు.

సర్టెల్ కి చిత్రకారునిగా మంచి పేరు వచ్చింది కానీ, డొరొతీకి మాత్రం అంతగా పేరు రాలేదు.
వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అందులో ఒకరు శిశువుగా ఉండగానే మరణించారు. 1930ల మధ్యనాటికి వారిద్దరూ విడిపోయారు.
అప్పటికైనా ఆమెను భారతదేశానికి తిరిగి రమ్మని ఆమె కుటుంబ సభ్యులు బతిమాలారు. కానీ, ఆమె అందుకు అంగీకరించలేదు. తాను తీసుకున్న నిర్ణయం గురించి ఆమె తర్వాత బాధపడినట్లు చెబుతారు.
దాంతో ఆమె తండ్రి ఆమెకొక ద్రాక్ష తోట కొని అందులోనే నివాసం ఉండే ఏర్పాట్లు చేశారు. ఆమె ఆర్ధిక పరిస్థితి కష్టంగా ఉండేది. ఆమె ఇలాంటి జీవితం అయితే ఆశించి ఉండరు.
షీలా బనెర్జీ కూడా 1950 లలో లండన్ వెళ్లారు. ఆమె చాలా సార్లు మేనత్త దగ్గరకు వెళుతూ ఉండేవారు. ఆమె అత్త డోర్ఫ్ హుందాగా, ఆత్మవిశ్వాసంతో, విభిన్నంగా ఉండేవారని షీలా చెప్పారు. కొన్ని విధాలుగా చూస్తే ఆమె ఫ్రెంచ్ వారిలా ఉండే వారని అన్నారు.
"ప్రతి రోజు భోజనంతో పాటు ఆమె వైన్ తీసుకునే వారు. నాకు అదంతా కొత్తగా ఉండేది. కొన్ని సార్లు నాకు రోజంతా మగతగా ఉండేది" అని షీలా చెప్పారు.

ఫొటో సోర్స్, Sheela Bonarjee
వెల్ష్ లో ఉన్న ఆమె స్నేహితులతో డొరొతీ జీవితాంతం సంప్రదింపుల్లోనే ఉండేవారు. ఆమెకు వార్ధక్యం వచ్చిన తర్వాత 80 ఏళ్ల వయసులో ఆమె చదువుకున్న విశ్వవిద్యాలయానికి తీర్ధ యాత్రలా వెళ్లారు. ఆమెతో పాటు అప్పుడు షీలా కూడా వెళ్లారు.
ఆ పర్యటన ఆమెకు చాలా ముఖ్యమైనది. ఆమెకు అవి మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాయి.
వెల్ష్ బయోగ్రఫీలో భారతీయ మూలాలతో చోటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తిగా డొరొతీ నిలిచారు. దీనిని ఎస్సెక్స్ యూనివర్సిటీలో పని చేస్తున్న డాక్టర్ బెత్ జెంకిన్స్ రాశారు. డొరొతీ వెల్ష్ సంస్కృతిని ఆపాదించుకుని ఇక్కడ గడిపిన కాలంలో ప్రముఖ పాత్ర వహించారు" అని ఆమె అంటారు.
డొరొతీ 90 సంవత్సరాల వరకు జీవించారు. కానీ, లండన్ వెళ్లిన తర్వాత ఆమె ఒక్క సారి కూడా భారతదేశంలో అడుగుపెట్టలేదు.
కానీ, ఆమెలో ఉన్న భారతీయతకు కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. కొన్ని ముఖ్యమైన రోజుల్లో, సెలవుల్లో చీర కట్టుకుని ఆమె ఇరుగుపొరుగు వారికి కనిపించేవారు.
కానీ, ఆమె భారతీయురాలు అనే కంటే కొంత ఫ్రెంచ్, కొంత ఇంగ్లీష్ తరహాలో ఎక్కువగా వెల్ష్ తరహాలో ఉండేవారు. కానీ, ప్రతి చోటా ఆమె పరాయి వారిగానే మిగిలారు.

ఫొటో సోర్స్, Sheela Bonarjee
ఇవి కూడా చదవండి:
- ‘ఇక్కడ తయారయ్యే మందులు వాడి ప్రజలు బతుకుతున్నారు.. మేం మాత్రం చస్తున్నాం’
- ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ యంత్రాంగం పని చేయడం లేదనే వివాదంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మెరుగైన మహిళా సాధికారత... కలవరపెడుతున్న పోషకాహార లోపం -జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
- భారత్: ఒకపక్క ఊబకాయం.. మరోపక్క పోషకాహార లోపం.. ఎందుకిలా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








