బ్రిటన్ కంటే భారత్‌లోనే బిలియనీర్లు ఎక్కువ: అయితే సామాన్యులకు లాభమేంటి?

హాంకాంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ తరువాత ఎక్కువమంది బిలియనీర్లు హాంకాంగ్‌లో ఉన్నారు

భూమ్మీద ఇప్పుడు ఎన్నడూ లేనంత ఎక్కువమంది బిలియనీర్లు ఉన్నారు. ఒకపక్క అనేక దేశాల్లో సామాజిక అసమానతలు కొనసాగుతుంటే, మరోపక్క ఆయా దేశాల్లో అపర కుబేరులు అవతరిస్తున్నారు. ఇలా కొంతమంది దగ్గర మాత్రమే కోటానుకోట్లు పోగైతే, సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది చర్చనీయాంశమైంది.

భారత్‌నే తీసుకుంటే ముంబయిలో 2016తో పోలిస్తే గతేడాది కొత్తగా 10 మంది బిలియనీర్లు (100కోట్ల డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారు) పుట్టుకొచ్చారు. 'వెల్త్ ఎక్స్' అనే అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ తాజాగా ప్రచురించిన ‘వరల్డ్ అల్ట్రా వెల్త్ రిపోర్ట్’ ఈ విషయాన్ని చెబుతోంది.

ఎక్కువమంది బిలియనీర్లు ఉన్న నగరాల్లో గతేడాది ముంబయిది తొమ్మిదో స్థానం. ఈ జాబితాలో న్యూయార్క్ నగరం 103మంది బిలియనీర్లతో తొలి స్థానంలో ఉంది. ఇతర నగరాలను ఆశ్చర్యపరుస్తూ హాంకాంగ్‌లో ఏకంగా 21మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారు. జాబితాలో న్యూయార్క్ తరువాతి స్థానం హాంకాంగ్‌దే.

ఈ టాప్‌ 20 బిలియనీర్ నగరాల జాబితాలో సగం నగరాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నాయి. ఓ పక్క అసమానతలు కొనసాగుతున్నా, కొందరు వ్యక్తుల సంపదలు మాత్రం నానాటికీ పెరిగిపోతున్నాయి.

ఈ కొత్త బిలియనీర్ల కారణంగా భూమ్మీద అత్యంత సంపన్నుల జాబితా కూడా పెరిగిపోతోంది. 2017లో అన్ని దేశాల్లో కలిపి రికార్డు స్థాయిలో 2,754మంది బిలియనీర్లు ఉన్నట్లు తేలింది.

వాళ్లందరి సంపద విలువ 9.2 ట్రిలియన్ డాలర్లు. అంటే... జపాన్, జర్మనీల సంయుక్త జీడీపీ కంటే అది ఎక్కువ. కానీ, డబ్బు విషయంలో వ్యక్తుల మధ్య ఈ స్థాయిలో అసమానతలు పెరిగిపోతే అది నైతిక విలువల పతనానికి దారితీసే ప్రమాదం ఉందని ఆక్స్‌ఫామ్ లాంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ముంబై

ఫొటో సోర్స్, Getty Images

ఈ బిలియనీర్లు సమాజంలో సానుకూల మార్పుకు సంకేతమని ఇంకొందరు చెబుతారు. ‘సంపన్నులపై అపవాదులు వేస్తుంటారు. కానీ, డబ్బు సంపాదించడానికి రకరకాల మార్గాలుంటాయి. ఆ క్రమంలో సమాజంపైన చాలా ప్రభావం పడుతుంది. ఒక వ్యక్తి సంపన్నుడయ్యే సమయంలో అతడి వల్ల చాలామంది లాభపడతారు’ అని ‘రిచ్ పీపుల్, పూర్ కంట్రీస్’ అనే పుస్తక రచయిత్రి కరోలిన్ ఫ్రూండ్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం 72 దేశాల్లో బిలియనీర్లు ఉన్నారని, భారత్‌, చైనా, హాంకాంగ్‌లలో వారి సంఖ్యలో రెండంకెల అభివృద్ధి నమోదైందని ఫోర్బ్స్ మేగజీన్ చెబుతోంది. ఆసియాలో 784 మంది బిలియనీర్లు ఉన్నారని, చరిత్రలో తొలిసారిగా ఉత్తర అమెరికాలోని బిలియనీర్ల సంఖ్య (727)ను ఆసియా ఖండం దాటిందని ఫోర్బ్స్ తెలిపింది.

1990ల్లో కేవలం ఇద్దరు భారతీయులే ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చోటు సంపాదించారు. కానీ 2016 నాటికి 84మంది భారతీయులు ఆ జాబితాలో చేరారు. మరోపక్క దేశంలో 28కోట్ల మందికి పైగా ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనే జీవిస్తున్నారని 2016 ప్రపంచ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి.

చైనాలో కూడా అసమానతలు అదే స్థాయిలో ఉన్నాయి. 2016లో దేశ సంపదలో మూడో వంతు అక్కడి 1శాతం మంది సంపన్నుల చేతుల్లోనే ఉంది. మరో పక్క 25శాతం పేదల దగ్గర మొత్తం దేశ సంపదలో ఒక్క శాతం మాత్రమే ఉంది.

‘పేద దేశాల్లో సంపన్నుల సంఖ్య ఎక్కువైతే, అది ఎక్కువ కష్టపడుతూ తక్కువ సంపాదించే వాళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కానీ, అలాంటి దేశాల్లో సంపన్నుల సంఖ్య పెరిగితే మొత్తం ఆర్థిక వ్యవస్థమీద సానుకూల ప్రభావం చూపుతుంది’ అని కరోలిన్ చెప్పారు.

నీతా, ముకేష్ అంబానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వారసత్వంగా ముకేష్ అంబానీ చాలా సంపదను పొందారు

ఉదాహరణకు, 2009 నుంచి 2013లో చైనాలో ఉత్పాదక రంగం ఊపందుకోవడంతో ఉద్యోగుల సగటు జీతం మూడొంతుల మేర పెరిగింది.

‘ది ఎకనిమిస్ట్’ పత్రిక అధ్యయనం ప్రకారం... అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సొంతంగా ఎదిగిన బిలియనీర్లు స్థాపించిన సంస్థల ద్వారా సగటున 80వేల మంది ఉపాధి పొందుతున్నారు. వారసత్వంగా దక్కిన సంపద ద్వారా బిలియనీర్లుగా మారే వ్యక్తులు కల్పించే ఉపాధి కంటే ఇది చాలా ఎక్కువ.

'వెల్త్ ఎక్స్' గణాంకాల ప్రకారం 2017 సంపన్నుల జాబితాలో దాదాపు 57శాతం మంది సొంతంగా ఎదిగిన వారే. 13.2 శాతం మంది మాత్రమే వారసత్వంగా దక్కిన సంపదతో బిలియనీర్లుగా మారారు.

నైజీరియన్ కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆఫ్రికాలో అత్యంత ధనికులున్న దేశం నైజీరియా. కానీ అక్కడ పేదరికం ఏటికేడు పెరుగుతూ వస్తోంది.

2025 నాటికి 'ఫార్చ్యూన్ 500' సంస్థల జాబితాలో 45శాతం సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఉంటాయని, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 50శాతం మంది ఆ దేశస్తులే ఉంటారని 'మెకిన్సే' సంస్థ అంచనా వేస్తోంది.

కానీ, సంపన్నుల సంఖ్య ఎంత పెరిగినా దాని వల్ల పేదవాళ్లకు ఒరుగుతున్నది ఏమీ లేదని ఆక్స్‌ఫామ్ సంస్థ ప్రతినిధి రెబెకా గౌలాండ్ చెబుతున్నారు. ఉదాహరణకు... ఆఫ్రికాలో అత్యంత సంపన్నులున్న దేశాల్లో నైజీరియా ఒకటి. కానీ అక్కడ పేదరికం ఏటికేడు పెరుగుతోందని ఆమె అన్నారు.

అత్యంత సంపన్నులకు పన్నుల విషయంలో ప్రత్యేక పాలసీలు రూపొందించాలని, యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించాలని, రాజకీయాల్లో సంపన్నుల ప్రభావాన్ని తగ్గించాలని కరోలిన్ సూచించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)