నేపాల్‌లో చైనా విఫలమైందా.. ‘భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌ను ఉసిగొల్పాలన్న యత్నం’ బెడిసికొట్టిందా?

నేపాల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేపాల్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో చైనా ప్రతినిధుల బృందం పర్యటన చర్చాంశనీయమైంది.

గత నెలలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆ దేశ పార్లమెంట్ రద్దు చెయ్యడం వివాదాస్పమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మధ్యంతర ఎన్నికలు ఉంటాయని నేపాల్ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.

నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో విభేదాలు తల్లెత్తడంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది.

ఇదిలా ఉండగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అంతర్జాతీయ వ్యవహారాల ఉప మంత్రి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం నేపాల్ పర్యటనకు వచ్చింది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో చీలికల పట్ల చైనా అసంతృప్తిని వ్యక్తం చేసిందని..ప్రచండ, ఓలీ కూడా విభేదాలు పక్కన పెట్టి, మళ్లీ కలిసి పని చేయాలని చైనా కోరుకుంటున్నట్లు సమాచారం.

అయితే అది జరిగేట్లు కనిపించడం లేదు. చైనా ప్రతినిధుల బృందం ప్రధాని ఓలీని కలిసి మాట్లాడింది. ప్రచండతో రాజీ పడీ పడీ తాను విసిగిపోయానని బుధవారం నాడు ఓలీ తెలిపారు.

ప్రంచండ, మాధవ్ నేపాల్‌లతో కూడా చైనా ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఓలీ, ప్రచండల మధ్య నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోయింది. రెండు వర్గాలూ తమ తమ వాదనలను ఎన్నికల సంఘానికి వినిపించాయి.

నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన షేర్ బహదూర్ దేవుబా, జనతా సమాజవాదీ పార్టీ నాయకుడు బాబూరామ్ భట్టారాయ్‌లతో సహా నేపాల్‌కు చెందిన మరికొందరు రాజకీయ నాయకులతో కూడా చైనా ప్రతినిధి బృందం చర్చలు జరిపింది.

ఖాట్మండూలో ఓలీ తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రత్యర్థి వర్గాన్ని దుయ్యబట్టారు. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడంలో వారు సహకరించడం లేదని విమర్శించారు. ప్రచండ అనేక ఒప్పందాలను ఉల్లంఘించారని ఆరోపించారు.

"ప్రచండ ఒక పక్క నేపాలీ కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతూ, మరో పక్క నాతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. మేము కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచాం. ఇప్పుడు ఇంక ఆయనతో రాజీ పడి నేను అలిసి పోయాను" అని ఓలీ అన్నారు.

"ఒకవేళ నేను పార్లమెంట్ రద్దు చెయ్యకపోతే, ప్రచండ వర్గం వారు నాపై అవిశ్వాస తీర్మానం, రాష్ట్రపతిపై అభిశంసన తీర్మానం తీసుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు" అని ఆయన తెలిపారు.

నేపాల్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ రద్దు చేయాలనే ప్రతిపాదనను పంపించిన తరువాత దాన్ని పునఃపరిశీలించే అవకాశం లేదని ఓలీ తెలిపారు.

అయితే, ఈ అంశంపై నేపాల్ సుప్రీం కోర్టులో పలువురు పిటీషన్లు దాఖలు చేసారు. వీటిపై త్వరలో విచారణ జరగనుంది.

ప్రచండతో రాజీ పడీ పడీ తాను విసిగిపోయానని ఓలీ తెలిపారు
ఫొటో క్యాప్షన్, ప్రచండతో రాజీ పడీ పడీ తాను విసిగిపోయానని ఓలీ తెలిపారు

నేపాల్ రాజకీయాల్లో చైనా జోక్యం

2018లో ఓలీ, ప్రచండలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన ఘనత చైనాకే దక్కుతుంది.

2017లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) కలిసి కూటమిని ఏర్పాటు చేసాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి మూడింట రెండొంతుల మెజారిటీతో విజయం సాధించింది. మరుసటి సంవత్సరం చైనా చొరవతో ఈ రెండు పార్టీలు విలీనం అయ్యాయి.

అయితే, ఈ మొత్తం ఉదంతంలో చైనా పూర్తిగా విఫలమయ్యిందని, ఏమీ సాధించలేకపోయిందని ఖాట్మండూకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యువరాజ్ ఘిమిరే బీబీసీతో అన్నారు.

"కమ్యూనిస్ట్ పార్టీలోని అన్ని వర్గాలూ తన మాటను అంగీకరిస్తాయని చైనా సంతోషపడింది. కానీ అలా జరగలేదు. ఇండియాకు వ్యతిరేకమని భావించే ఓలీ కూడా చైనా మాట వినలేదు. ప్రచండ వర్గం కూడా చైనా మాటలను పక్కనబెట్టింది" అని ఆయన తెలిపారు.

ఈ రెండు వర్గాలను కలపడానికి నేపాల్‌లోని చైనా రాయబారి కూడా విఫల యత్నాలు చేసారు. ఇది చైనాకు గట్టి దెబ్బే.

"అధికార పార్టీ పతనం అంచుకు చేరుకుంది. రాచరికం తిరిగి రావాలన్న డిమాండ్లు వినిపిస్తున్న కాలంలో ఇదంతా జరుగుతోంది" అని నేపాల్‌లోని ఎకనామిక్ అండ్ టెక్నికల్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరిబంశ్ ఝా అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుత ప్రభుత్వం కోవిడ్ 19 వ్యాప్తిని కట్టడి చెయ్యలేకపోయింది. అలాగే అవినీతిని అరికట్టలేకపోయింది. అదే సమయంలో భారత్.. నేపాల్ పట్ల తన స్థితి, వైఖరి, ఈ రెండు దేశాల మధ్య పారంపర్యంగా వస్తున్న ఆచార వ్యవహారాలపై దృష్టి పెడుతోంది.

మరోవైపు చైనా.. నేపాల్ 'బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)' విషయంలో వెనకబడకూడని ఆశిస్తోంది. అమెరికా కూడా ఐదు వందల బిలియన్ డాలర్ల 'మిలీనియం ఛాలెంజ్ కో-ఆపరేషన్ (ఎంసీసీ)'తో సిద్ధంగా ఉంది. దీన్ని నేపాల్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది.

నేపాల్‌లోని అంతర్గత సమస్యలవల్లే విదేశీ శక్తులకు అక్కడ అడుగు పెట్టే అవకాశం దొరికింది" అని ఝా అభిప్రాయపడ్డారు.

భారత్, నేపాల్‌ల మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ ఉండేవి
ఫొటో క్యాప్షన్, భారత్, నేపాల్‌ల మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ ఉండేవి

భారత్ కూడా నేపాల్ వ్యవహారాలను తీవ్రంగా పరిగణిస్తోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్‌వైపునుంచీ..రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) డైరెక్టర్ సామంత్ కుమార్ గోయెల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రుంగ్లా, భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నార్వానే నేపాల్‌లో పర్యటించారు.

"ఈ పర్యటన ద్వారా భారత్, నేపాల్‌తో తన సాంప్రదాయ సంబంధాలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాల్లో విఘాతం ఏర్పడింది" అని ఝా అన్నారు.

"ఇన్నాళ్లూ తమకి ప్రత్యర్థులుగా భావించిన నేపాలీ కాంగ్రెస్ నేతలను చైనా రమ్మని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆహ్వానించడమే ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని సరిదిద్దడంలో చైనా ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పడానికి ఒక ఉదాహరణ. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) శతాబ్ది ఉత్సవాలకు రమ్మని నేపాలీ కాంగ్రెస్‌ను చైనా ఆహ్వానించింది" అని విదేశీ వ్యవహారాల నిపుణులు, సీనియర్ జర్నలిస్ట్ మనోష్ జోషీ అభిప్రాయపడ్డారు.

నేపాల్ భౌగోళిక స్థానం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లోని స్ట్రాటజిక్ స్టడీ ప్రోగ్రామ్ హెడ్ ప్రొఫెసర్ హర్ష్ పంత్ అన్నారు.

"మొదట చైనా, నేపాల్ వ్యవహారాలపై అంతగా ఆసక్తి చూపించలేదు. రాచరిక వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు కూడా చైనా పెద్దగా పట్టించుకోలేదు. భారత్, నేపాల్‌ల మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ ఉండేవి. ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య ప్రయాణించడానికి పాస్‌పోర్ట్, వీసా అవసరం లేదు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చైనా అత్యాశ పడుతోంది. అంతకుముందు నేపాల్ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడంపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు అమెరికా జోక్యంపై భారత్‌కు ఎలాంటి పట్టింపు లేదు. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా చైనా నేపాల్‌పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టింది. నేపాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడం దగ్గరనుంచీ సంస్థల విలీనం వరకూ చైనా పెద్ద పాత్ర పోషించింది.

వామపక్ష పార్టీలలో అభిప్రాయ బేధాలు రావడం ఊహించనిదేం కాదు. ఇండియాలో అయినా, నేపాల్‌లో అయినా ఇవి సహజమే. కానీ భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌ను ఉసిగొల్పడానికి చైనా, నేపాల్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోంది. అయితే, ఇప్పుడు నేపాల్‌లో చైనా వ్యతిరేక భావనలు కూడా ప్రారంభమయ్యాయి" అని పంత్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)