నేపాల్‌లో రాజకీయ సంక్షోభం... మధ్యలో చైనా రాయబారి ఏం చేస్తున్నారు?

నేపాల్‌లో చైనా రాయబారి హామో యాంకీ

ఫొటో సోర్స్, HOU YANQI/TWITTER

ఫొటో క్యాప్షన్, నేపాల్‌లో చైనా రాయబారి హామో యాంకీ
    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేపాల్‌లో చైనా రాయబారిగా పనిచేస్తున్న హామో యాంకీ మంగళవారం నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీతో భేటీ అయ్యారు.

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ వీరు సమావేశమవ్వడం ఆసక్తికరంగా మారింది.

ఈ భేటీ గురించి నేపాల్ అధ్యక్ష కార్యాలయం తరఫు నుంచి గానీ, విదేశాంగ శాఖ నుంచి గానీ ఎలాంటి ప్రకటనా రాలేదు. హావో యాంకీ మాత్రం ట్విటర్‌లో దీని గురించి స్పందించారు.

దాదాపు గంట పాటు వీరి సమావేశం జరిగింది.

అయితే, బిద్య దేవి హావో యాంకీ భేటి అవ్వడాన్ని నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోవడంగా కొందరు చూస్తున్నారు.

సాధారణంగా దౌత్యవేత్తలు తాము పనిచేసే దేశాల్లో జరిగే అంతర్గత రాజకీయాలకు దూరంగా ఉంటారు.

కానీ, చైనా రాయబారి హవో యాంకీ ఇంతకుముందు కూడా నేపాల్‌లోని రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు.

నేపాల్ ప్రధాని కేపీ ఓలీ

ఫొటో సోర్స్, PM SECRETARIAT

ఫొటో క్యాప్షన్, నేపాల్ ప్రధాని కేపీ ఓలీ

నేపాల్‌లోని అధికార కమ్యూనిస్టు పార్టీలో పెద్ద నాయకులైన కేపీ ఓలీ, కమల్ దహల్ ప్రచండ మధ్య వ్యవహారాల్లో హావో యాంకీ జోక్యం చేసుకుని ఉండకపోతే అక్కడ కొన్ని నెలల ముందే రాజకీయ సంక్షోభం వచ్చి ఉండేదన్నది కొందరి అభిప్రాయం.

పార్టీపై పట్టు ఉన్న ప్రచండకు, ప్రధాని పదవిలో ఉన్న ఓలీకి మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోంది.

ఓలీ సిఫారసు తర్వాత నేపాల్ పార్లమెంటులోని ప్రతినిధుల సభను డిసెంబర్ 20న నేపాల్ అధ్యక్షురాలు బిద్య దేవి భండారీ రద్దు చేశారు. మధ్యంతర ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఇలాంటి సమయంలో చైనా రాయబారితో బిద్య దేవి భేటీ అవ్వడాన్ని భారత్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది.

నేపాల్ అధ్యక్షురాలు బిద్య దేవి భండారీ

ఫొటో సోర్స్, OFFICE OF THE PRESIDENT OF NEPAL

ఫొటో క్యాప్షన్, నేపాల్ అధ్యక్షురాలు బిద్య దేవి భండారీ

'నేపాల్ అంతర్గత రాజకీయాల్లో చైనా జోక్యం'

''నేపాల్ ఇప్పుడు జరుగుతున్నవి అంతర్గత రాజకీయ విషయాలు. ప్రధానమంత్రి కేపీ ఓలీ ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది'' అని నేపాల్‌కు చెందిన సీనియర్ పాత్రికేయుడు యుబ్‌రాజ్ ఘిమిరే అన్నారు.

కొన్నేళ్లుగా నేపాల్‌లో చైనా జోక్యం పెంచుకుంటూ వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

''2006లో నేపాల్‌లో జరిగిన రాజకీయ మార్పుల విషయంలో భారత్ పాత్రను గమనించిన చైనా... భారత్ ప్రభావ పరిధిలో నేపాల్ ఉందని భావించింది. ఆ సమయంలో నేపాల్‌లో భారత్ పోషించిన పాత్రను అమెరికా, యురోపియన్ దేశాలు ప్రశంసించాయి. నేపాల్‌లో భారత్ జోక్యం చేసుకోవడం భద్రతపరంగా తమకు ముప్పు కావొచ్చని చైనా భావించింది. అమెరికా భారత్‌ను పొగడటం కూడా చైనా అభిప్రాయం బలపడటానికి కారణమైంది. దీంతో నేపాల్‌లో చైనా పెట్టుబడులను, తమ ప్రభావాన్ని పెంచుకోవాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది'' అని ఘిమిరే చెప్పారు.

మోదీ, ఓలీ

ఫొటో సోర్స్, PIB

నేపాల్‌లో నాలుగు రంగాల్లో చైనా పెట్టబడులు బాగా పెంచింది. వాణిజ్యం, ఇంధన రంగం, పర్యాటక రంగంతోపాటు భూకంపం తర్వాత నేపాల్ పునర్నిర్మాణంలోనూ చైనా పాత్ర పోషించింది. నేపాల్‌కు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అధిక వాటా చైనాదే.

నేపాల్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తడం చైనాను కలవరపెట్టేదే.

చైనా, నేపాల్ ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టే దేశాలు ఇదే పరిస్థితిని ఆశిస్తాయి. అయితే, ఓలీ ప్రభుత్వం పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసుకోలేకపోతుండటం చైనాకు ఇబ్బందికరమైన పరిణామమే.

''చైనా కోరుకుంటే ఓలీ అధికారంలో కొనసాగుతారని, లేదంటే దిగిపోతారని అనుకోవడం సరికాదు. నేపాల్‌ ఇప్పుడు అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలు చాలా కీలకమైనవి'' అని ఘిమిరే అన్నారు.

ప్రచండ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రచండ

రాజకీయ సంక్షోభానికి కారణాలు

నేపాల్ ప్రధాని కేపీ ఓలీ సొంత పార్టీలోనే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రభుత్వాన్ని ఏకపక్షంగా నడుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) విలీనమైన తర్వాత 2018లో కేపీ ఓలీని ప్రధానిగా ఎన్నుకున్నారు.

ఆ తర్వాత పార్టీలో సంఘర్షణ మొదలైంది. తాజాగా రాజ్యాంగ పరిషత్ భేటీ ఏర్పాటు చేయకపోవడంపై సమావేశం ఏర్పాటు విషయమై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రధాని కేపీ ఓలీ అధ్యక్షురాలికి సిఫార్సు చేశారు. అనంతరం అధ్యక్షురాలు ఆర్డినెన్స్ జారీ చేశారు. దీంతో వివాదం మొదలైంది.

నేపాల్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

పార్టీలోని సీనియర్ నాయకులు ఈ ఆర్డినెన్స్‌ను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అధ్యక్షురాలిని ఎంపీలు అభ్యర్థించారు. ప్రధాని పదవి నుంచి, పార్టీ అధ్యక్ష పదవి నుంచి కేపీ ఓలీ దిగిపోవాలని కూడా డిమాండ్ చేశారు.

దీంతో కేపీ ఓలీపై ఒత్తిడి పెరిగింది. ఇటు ఎంపీలు ప్రత్యేక సమావేశం కోసం చేసిన అభ్యర్థనను వెనక్కితీసుకోవాలని, ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా వెనక్కితీసుకోవాలని రెండు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. కానీ, ఇది జరగలేదు.

కేపీ ఓలీ పార్లమెంటును రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఇప్పుడు పార్టీ చీలిపోయింది. విభేదాలు మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి.

మంగళవారం పార్టీ కేంద్ర కమిటీ సమావేశమై, పార్టీ ఛైర్మన్ పదవి నుంచి కేపీ ఓలీని తొలగించింది. ఆ పదవిలో మాధవ్ కుమార్ నేపాల్‌ను నియమించింది. బుధవారం సీపీఎన్ (మావోయిస్టు)కు చెందిన ప్రచండ-మాధవ్ వర్గం ప్రచండను పార్లమెంటరీ పక్ష నేతగా ఎన్నుకుంది.

నేపాల్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

మే నుంచి ఇప్పటివరకూ చైనా రాయబారి క్రియాశీలంగా వ్యవహరించి కేపీ ఓలీని సంక్షోభం నుంచి కాపాడిన సందర్భాలు ఒకట్రెండు ఉన్నాయని యువ్‌రాజ్ ఘిమిరే అన్నారు.

''మేలో చైనా రాయబారి ప్రచండతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మాధవ్ కుమార్‌తోనూ భేటీ అయ్యారు. మరుసటి రోజు ఈ ఇద్దరు నేతలు పరస్పర విమర్శల దాడి ఆపేసి, పార్టీని బలోపేతం చేయడం గురించి మాట్లాడారు'' అని ఘిమిరే చెప్పారు.

జులైలో కూడా చైనా రాయబారి నేపాల్‌లోని ఐదుగురు సీనియర్ రాజకీయ నేతలతో సమావేశమయ్యారని, అయితే దీని గురించి బయటకు ప్రకటనలేవీ రాలేదని అన్నారు.

''నేపాల్‌లో అధికారంలోని ఉన్న కమ్యూనిస్టు పార్టీలో చీలికలు రావడం చైనాకు ఇష్టం లేదు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. పార్టీగా ఒకటిగా ఉంటే, చైనా తరహా కమ్యూనిస్టు భావజాలం విజయం సాధించినట్లుగా చూడొచ్చు. ఇక కేపీ ఓలీ ప్రధాని పదవిలో ఉంటే, భారత్‌కు ఎదురుగా పనిచేయొచ్చు'' అని టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక డిప్లొమాటిక్ ఎడిటర్ ఇంద్రాణీ బాగ్చీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)