అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో

ఫొటో సోర్స్, Ishika Mohan Motwane
- రచయిత, మధుపాల్
- హోదా, ముంబయి నుంచి బీబీసీ కోసం
బాలీవుడ్ నటుడు అనిల్‌కపూర్ నాలుగు దశాబ్దాల నట ప్రస్థానాన్ని పూర్తి చేశారు. పాత్ర ఏదైనా అందులో ఆయన జీవిస్తారని పేరు తెచ్చుకున్నారు. అది ‘వో సాథ్ దిన్’లో ప్రేమ్ ప్రతాప్ సింగ్‌గా కావచ్చు, ‘రామ్‌లఖన్’లో లఖన్‌గా కావచ్చు, ‘నాయక్’లో శివాజీరావు పాత్ర కావచ్చు. ఈ 63ఏళ్ల ఈ నటుడు వెండితెరపై అనేక పాత్రలతో మెప్పించారు.
అనిల్‌కపూర్‌ను కోరి వచ్చిన పాత్రలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఆయన కోరుకున్న పాత్రలు కూడా చాలానే ఉన్నాయి. మరో నటుడు వద్దనుకున్న, చేయలేకపోయిన పాత్రలను నేను చేస్తానంటూ తీసుకుని మెప్పించిన సందర్భాలు ఎన్నో.
తొంభైలలో వరుసగా 13 హిట్స్ ఇచ్చిన ఎవర్‌గ్రీన్ నటుడు అనిల్‌కపూర్. “ఒక సినిమా తర్వాత మరో సినిమా విజయవంతమయ్యాయి. ప్రతి సినిమా నా బాధ్యతను పెంచింది. ఒక సినిమా సక్సెస్ అయితే దాని గురించి ఎక్కువగా ఆలోచించను. తర్వాత సినిమా షూటింగ్‌కు వెళ్లిపోతా’’ అని అనిల్ కపూర్ బీబీసీతో అన్నారు.
“ఎవరైనా ఒక సినిమా ఫెయిలైందని చెబితే, నెక్ట్స్ సినిమా సూపర్ హిట్టవుతుందని చెప్పేవాడిని’’ అన్నారాయన.
అనిల్‌కపూర్ తన సక్సెస్‌ల గురించి మాట్లాడుతూ "నేను 13 చిత్రాలకు హిట్ ఇచ్చానని నాకు గుర్తు లేదు" అన్నారు. “నేను 1977లో మొదటిసారి కెమెరా ముందుకు రావడం గుర్తుంది. నా మొదటి సినిమా తెలుగు సినిమా. (బాపు దర్శకత్వం వహించిన వంశ వృక్షం) ఆ చిత్రం వచ్చి ఇప్పటికి 40 సంవత్సరాలైంది’’ అన్నారు అనిల్ కపూర్. “ఒక మంచి దర్శకుడు సినిమా చేస్తున్నాడని తెలిస్తే ఆయన దగ్గరకు వెళ్లి నాకో పాత్ర ఇవ్వమని అడుగుతాను. అందుకు ఏమాత్రం సిగ్గుపడను’’ అన్నారు అనిల్ కపూర్.

ఫొటో సోర్స్, Instagram/Anil Kapoor
‘కరణ్ జోహార్‌కు ఆ పాత్ర దక్కడంపై బాధపడ్డా’
అనురాగ్ కశ్యప్ గురించి చెబుతూ“అనురాగ్ ‘బాంబే వెల్వెట్’ మూవీ చేస్తున్నాడని తెలియగానే అతనితో మాట్లాడటానికి ప్రయత్నించా. ఆ సినిమా నాకు వస్తే నేను గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషించాల్సి ఉంటుంది. కాని అనురాగ్ ఆ పాత్రను కరణ్ జోహార్‌కి ఇచ్చారు. నేను చాలా బాధపడ్డాను. అయితే నా టైమ్ వచ్చినప్పడు అతనితో ఎప్పటికైనా పని చేస్తానని అనుకున్నాను’’ అని అనిల్ కపూర్ అన్నారు.
“2003లో అనురాగ్ 'ఆల్విన్ కాళీచరణ్' అనే సినిమా తీయాలనుకున్నారు. కానీ అది జరగలేదు. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి పని చేయాలనుకున్నా విధి అనుకూలించకపోతే అది జరగదు. ఒకవేళ జరగాలని అనుకుంటే కొన్నేళ్ల తర్వాతైనా అది సాధ్యపడుతుంది’’ అన్నారాయన.
ప్రస్తుతం అనిల్ కపూర్ అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఏకే వర్సెస్ ఏకే’లో సహనటుడిగా పని చేస్తున్నారు. “నేను ఎప్పటికైనా అనురాగ్ దర్శకత్వంలో పని చేయడానికి ఎదురు చూస్తున్నా’’నని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Instagram/Anil Kapoor
“ఇంటికొచ్చిన రాజ్‌కపూర్‌ను వదల్లేదు’’
అనిల్‌కపూర్ ఇలా దర్శకులను, నిర్మాతలను పాత్రల కోసం అడిగిన సందర్భం ఒక్క ‘బాంబే వెల్వెట్’ మాత్రమే కాదు. ”కె.విశ్వనాథ్ ‘ఈశ్వర్’ సినిమా తీస్తున్నారు. ముంబయిలోని ఒక హోటల్లో ఆయన్ను పట్టుకున్నాను. ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నానని, కమల్‌హాసన్ అందులో హీరో అని, రాజ్‌కపూర్ నిర్మాత అని విశ్వనాథ్ చెప్పారు. ఒకసారి రాజ్‌కపూర్ మా ఇంటికి డిన్నర్‌కు వచ్చారు. నాకో పాత్ర ఇవ్వమని నేను ఆయన్ను అడిగాను. అయితే కమల్‌తో సినిమా చేస్తున్నానని, ఆయన చేయనంటే అది నీకు ఇస్తానని రాజ్‌కపూర్ అన్నారు. తర్వాత కమల్ ఆ సినిమా చేయకపోవడంతో నేను ఆ పాత్ర తీసుకున్నాను’’ అని అనిల్ కపూర్ గుర్తు చేసుకున్నారు.
'నాయక్ కోసం ఆమిర్ లేదా షారూఖ్ అనుకున్నారు’
ఫేమస్ మూవీ ‘నాయక్’ గురించి కూడా అనిల్ కపూర్ తన అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు. “ నాయక్ సినిమాను నేను చేస్తానని అడిగాను. కానీ దర్శకుడు, నిర్మాత మాత్రం ఆమిర్ లేదంటే షారూఖ్‌తో చేయాలనుకున్నారు. వారిద్దరు ఆ సినిమా చేయలేకపోవడంతో అది నేను చేసాను. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమా కూడా అంతే. దర్శకుడు ఒకరిని అనుకుంటే, అది నాకు వచ్చింది. ఇప్పుడు ‘ఏకే వర్సెస్ ఏకే’లో కూడా దర్శకుడు నా స్థానంలో వేరొకరిని అనుకోగా అది చివరకు నాకే దక్కింది’’ అన్నారు అనిల్ కపూర్.
‘మిస్టర్ ఇండియా, లమ్హేలకు కూడాఅమితాబ్ మొదటి ఆప్షన్’
పెద్ద హీరోలకు వెళ్లాల్సిన చాలా సినిమాలు చివరకు అనిల్ కపూర్‌కు దక్కాయి. ఉదాహరణకు ‘మిస్టర్ ఇండియా’. ఈ సినిమాతో అనిల్‌కపూర్‌కు మంచి పేరొచ్చింది. కానీ ఆ సినిమాకు మొదట అమితాబ్‌ను తీసుకోవాలనుకున్నారు. కానీ అది అనిల్ చేతికి వచ్చింది.
శేఖర్ సుమన్ తన ‘లైట్ కెమెరా టేల్స్’ అనే టీవీ షోలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. “లమ్హే చిత్రానికి యశ్‌రాజ్ మొదట అమితాబ్, రేఖలను అనుకున్నారు. కథాపరంగా చూస్తే అమితాబ్ మరీ పాతవాడిలాగా కనిపిస్తారని ఆయన భావించారు. అందుకోసం కొత్త ముఖం కోసం వెతకడం ప్రారంభించారు. అలా ఆ పాత్ర అనిల్ కపూర్‌కు దక్కింది’’ అన్నారు.

ఫొటో సోర్స్, Instagram/Anil Kapoor
‘యశ్‌చోప్రా జీ కోసం మీసాలు తీసుకోవడానికి సిద్ధం’
“ఫొటోలను చూసిన తర్వాత తనను కలవాల్సిందిగా యశ్‌చోప్రా అనిల్ కపూర్‌కు కబురు పెట్టారు. తాను ఆ సినిమా పాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని అనిల్ యశ్‌కు చెప్పారు. కానీ ఈ పాత్రకు నువ్వు చాలా పెద్దవాడిలా కనిపిస్తావని అనిల్‌కు నచ్చజెప్పారు యశ్. కానీ అనిల్‌కపూర్ వినలేదు. ఆ పాత్ర కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని ఆయనతో చెప్పారు. అప్పుడు నీ మీసాలు తీసేస్తావా అని హఠాత్తుగా యశ్ అనిల్‌ను అడిగారు. కాసేపు ఆలోచించిన అనిల్ మీసాలు తీసేయడానికి రెడీ అన్నారు. మరుసటి రోజు అనిల్‌కపూర్‌ను ఫొటోషూట్‌కు పిలిచారు. మీసంలేని అనిల్‌కపూర్, అతనికి తోడుగా శ్రీదేవీ జంటను చూసి యశ్‌చోప్రా ముచ్చటపడ్డారు. అలా ‘లమ్హే’ వచ్చింది’’ అన్నారు శేఖర్ సుమన్.
అనిల్ కపూర్ పుట్టిన రోజు డిసెంబర్ 24సందర్భంగా ‘ఏకే వర్సెస్ ఏకే’ సినిమాను విడుదల చేయబోతోంది నెట్‌ఫ్లిక్స్. ఈ సినిమాలో అనిల్‌కపూర్ అనురాగ్ కశ్యప్‌కు సహనటుడిగా కనిపిస్తారు. ఈ సినిమాకు విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
- బాలీవుడ్లో మహిళలను చూపించే విధానం మారాలి
- అభిప్రాయం: మహిళలతో బాలీవుడ్ బంధం ఎలాంటిది?
- #BollywoodSexism: బాలీవుడ్లో లైంగిక వేధింపులు ఎలా ఉంటాయంటే..
- బాలీవుడ్ సినిమాల్లో నడివయస్సు ప్రేమకు చోటేది?
- జోసెఫ్ విర్షింగ్: బాలీవుడ్‌తో ప్రేమలో పడ్డ జర్మన్ సినిమాటోగ్రాఫర్
- ‘డబ్బులిస్తే రాజకీయ పార్టీలకు అనుకూలంగా ట్వీట్ చేస్తా’
- కరోనావైరస్లో కొత్తరకంతో భారత్‌లోనూ అప్రమత్తం.. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ
- కరోనావైరస్: భారత్‌లో తయారవుతున్న 9 కోవిడ్-19 టీకాలు ఇవే
- కరోనావైరస్: అన్ని దేశాలకూ వ్యాక్సీన్ దొరకదా.. ఎవరికి లభ్యమవుతుంది.. ఎవరికి అవకాశం లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








