బ్లాగ్: బాలీవుడ్ సినిమాల్లో నడివయస్సు ప్రేమకు చోటేది?

అంగ్రేజీ మే కహ్తే హై

ఫొటో సోర్స్, FACEBOOK/NDFCINDIA

    • రచయిత, వందన విజయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ఆమె చేసిన వంటను ఎప్పుడూ ప్రశంసించలేదు, ఆమెకు తెలుసనుకున్నా"

"నువ్వు అందంగా ఉంటావని ఎప్పుడూ అనలేదు, ఆమెకు తెలుసనుకున్నా"

"నిన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడూ చెప్పలేదు, ఆమెకు తెలుసనుకున్నా"

ఇది ఓ 52 ఏళ్ల హీరో (సంజయ్ మిశ్రా) డైలాగ్ లేదా ఉద్వేగం.

తను రోజూ ఆఫీసుకు వెళ్తాడు. డబ్బులు సంపాదిస్తాడు. కుటుంబాన్ని చూసుకుంటాడు. పెళ్లంటే ఆయన దృష్టిలో అంతే.

కానీ ఆయన భార్య మాత్రం ఇది ప్రేమ కాదు, బాధ్యత అనుకుంటుంది. తన జీవితంలో బాధ్యతతో పాటూ కాస్త ప్రేమ, కాస్త రొమాన్స్ కూడా కావాలని కోరుకుంటుంది.

ప్రేమ, ఆరాధన, ఇష్టం, రొమాన్స్- ఈ పదాలు, అనుభూతులన్నింటినీ మనం బాల్యం, టీనేజ్, యవ్వనంతో జోడించి చూస్తాం.

కానీ 40 లేదా 50 ఏళ్లు దాటిన తర్వాత జీవితంలో ప్రేమ అవసరం ఉండదా? ప్రేమకు చోటు లేదా? ఒకవేళ ఉన్నా పని ఒత్తిళ్లు, ఉద్యోగం, కుటుంబం మధ్య అది దూరమైపోతుందా?

ఈ వారం రిలీజైన "అంగ్రేజీ మే కహ్తే హై" సినిమా చూసిన తర్వాత మనసులో అదే అనిపించింది.

అంగ్రేజీ మే కహ్తే హై

ఫొటో సోర్స్, Facebook/NDFCINDIA

అలాంటి మూడు జంటల కథే 'అంగ్రేజీ మే కహ్తే హై' సినిమా. వీరికి ప్రేమ అంటే రకరకాల ఉద్దేశాలుంటాయి.

వీరిలో 52 ఏళ్ల యశ్ బత్రా (సంజయ్ మిశ్రా), ఆయన భార్య కిరణ్ (ఎకావలీ) జీవితంలో ఇప్పుడు ఎలాంటి రొమాన్సుకూ తావులేదు. ఒక వేళ ఉన్నా, భర్తకు దాని గురించి ఆలోచించే తీరిక, అవసరం లేవు.

తనేమీ విలన్ కాదు. కానీ మధ్య వయసులో ప్రేమ పుడుతుందని, దాన్ని వ్యక్తం చేయవచ్చని ఆయన బహుశా తెలుసుకోలేదు.

అంగ్రేజీ మే కహ్తే హై

ఫొటో సోర్స్, Facebook/NDFCIndia

చెట్ల చుట్టూ పరుగులు తీస్తూ, డిస్కోలకు వెళ్తూ ఒకసారి దొంగచాటుగా, ఒక్కోసారి బహిరంగంగా ప్రేమను వ్యక్తం చేసే యువ మనసుల కథ చెబితే అది చాలా హిందీ సినిమాల్లాగే అనిపిస్తుంది. కానీ మధ్య వయసు లవ్ స్టోరీ లాంటి కథలు ఇక్కడ చాలా తక్కువే కనిపిస్తాయి.

ఆ గుర్తొచ్చింది...1965లో వచ్చిన 'వక్త్' సినిమాలోని ఒక పాట- 'యే మేరీ జొహర జబీ జో బుజుర్గియత్'లో ప్రేమ గురించి మాట ఇస్తాడు.

తర్వాత 2007లో వచ్చిన 'హనీమూన్ ట్రావెల్స్' సినిమా.

ఇందులో చాలా యువ జంటలు హనీమూన్ కోసం వెళ్తుంటాయి. వీళ్లలో బొమన్ ఇరానీ, షబానా ఆజ్మీ జంట కూడా ఉంటుంది. ఇద్దరూ మధ్య వయసులో ఉంటారు. వీరికి పిల్లలు కూడా ఉంటారు. ఇద్దరికీ అది రెండో పెళ్లి.

సుహాసినీ ములే

ఫొటో సోర్స్, Facebook/krantikanade

ఐదు యువ జంటల మధ్య హనీమూన్ కోసం వచ్చే ఈ ఇద్దరి ప్రేమ కథ ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచుతూ ముందుకు సాగుతుంది.

ఈ సినిమాలో ఒక సీన్ ఉంది. బొమన్ ఇరానీకి ఒక పాత జ్ఞాపకం మళ్లీ గుర్తుకొస్తుంది. అప్పుడు తను కొత్త పెళ్లికూతురైన షబానాను రోడ్డు మధ్యలో గట్టిగా హత్తుకుంటాడు, ముద్దు పెడతాడు. ఇద్దరి జీవితాలు వారికి ఎన్నో గాయాలు చేశాయి. కానీ ఆ జీవితం ప్రేమించే మరో అవకాశాన్ని కూడా ఇచ్చింది. పెరిగిన వయసును దానికి వారు అడ్డుగా భావించలేదు.

అంగ్రేజీ మే కహ్తే హై

ఫొటో సోర్స్, Facebook/NDFCINDIA

ఇలాంటి హిందీ సినిమాలు తక్కువ ఉన్నాయి. అవి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా యవ్వనం పరిధి నుంచి బయటకు వచ్చి ప్రేమను వ్యక్తం చేస్తాయి.

ఉదాహరణకు దిల్ చాహతా హై సినిమాలో విడాకులు తీసుకున్న ఒక మధ్య వయసు మహిళ (డింపుల్ కపాడియా) కథ. పెయింటర్ అయిన ఆమె ఒంటరిగా ఉంటుంది. ఆ ఒంటరితనానికి తన కంటే చిన్నవాడైన పక్కింటి యువకుడు (అక్షయ్ ఖన్నా) తోడవుతాడు. కానీ ఇద్దరి మధ్య ఆ అందమైన తెలీని బంధం వయసుతో కలిగే ప్రేమ కాదు.

ఇక షర్మిలా టాగూర్, అనుపమ్ ఖేర్‌ల సినిమా 'మార్నింగ్ వాక్'. తన మనవరాలి దగ్గర కొన్ని రోజులు ఉందామని వచ్చిన అనుపమ్ ఖేర్ ఒక రోజు మార్నింగ్ వాక్‌కు వెళ్తాడు. అప్పుడు తన యవ్వనంలో స్నేహితురాలి కంటే ఎక్కువైన షర్మిలా టాగూర్‌ను కలుస్తాడు. సినిమా కథంతా ఈ వృద్ధ జంట గతం, భవిష్యత్తును స్పృశిస్తూ వెళ్తుంది.

హనీమూన్ ట్రావెల్స్

ఫొటో సోర్స్, Youtube Grab

ఫొటో క్యాప్షన్, హనీమూన్ ట్రావెల్స్ సినిమాలో ఓ దృశ్యం

ఇక బాసు చటర్జీ సినిమా 'ఖట్టా-మీటా' విషయానికి వస్తే- కథ ఇదే బంధాన్ని కామెడీ దృష్టితో చూపిస్తూ ముందుకు నడుస్తుంది.

అందులో అశోక్ కుమార్ చేసిన ఒక సీన్ ఎవరూ మర్చిపోలేరు. సినిమాలో ఆయన భార్య చనిపోయి ఉంటుంది. వృద్ధాప్యంలో తన కోసం ఆయన ఒక తోడును వెతుకుతుంటాడు. తన నలుగురు కొడుకులను బాగా చూసుకోవాలనుకుంటాడు. కానీ ఒక పార్శీ వితంతువు (పర్ల్ పదంసీ)ను పెళ్లి చేసుకుంటాడు. దాంతో మొత్తం కుటుంబంలో గందరగోళం రేగుతుంది.

2004లో ఇంగ్లీషులో 'నోట్ బుక్' అనే ఒక సినిమా వచ్చింది. ఇది రెండు యువ మనసుల ప్యాషనేట్ ప్రేమ కథ- ఈ కథలో ఒక వృద్ధుడు నర్సింగ్ హోంలో ఉండే ఒక వృద్ధురాలు ఎలీకి రోజూ ఒక నోట్ బుక్ చదివి కథలు వినిపిస్తుంటాడు.

ఆఖరి ఘడియలు లెక్కబెడుతున్న ఆ వృద్ధురాలికి 'డిమెన్షియా' ఉంటుంది. తనకు రోజూ కథలు చదివి వినిపిస్తోంది తన ప్రేమికుడు, భర్తే అని ఆమె మర్చిపోయి ఉంటుంది. ఆ ప్రేమ కథ నిజానికి వారి నిజ జీవిత కథే అయ్యుంటుంది.

హార్ట్ ఎటాక్ రావడంతో ఆ వ్యక్తిని కూడా ఒక రాత్రి అదే ఆస్పత్రిలో చేర్పిస్తారు. అర్ధరాత్రి అతడు తన గదిని వదిలి వెళ్లిపోయి తన ప్రియురాలు, భార్య ఉండే డిమెన్షియా వార్డులోకి వెళ్తాడు.

వస్తూపోయే జ్ఞాపకాల మధ్య ఎలీ అతడిని గుర్తుపడుతుంది. తర్వాత శాశ్వతంగా కలిసి ఉండేందుకు ఇద్దరూ చేతులు పట్టుకుని ఒకే పడకపై నిద్రపోతారు.

ఇద్దరు వృద్ధుల మధ్య ప్రేమ అనే ఇది కూడా ఒక ప్రత్యేకమైన ప్రేమ కథే.

ఖట్టా మీఠా

ఫొటో సోర్స్, Youtube Grab

ఫొటో క్యాప్షన్, ఖట్టా మీఠా సినిమాలో అశోక్ కుమార్

ఇక 'ద బెస్ట్ ఎగ్జోటిక్ మేరీగోల్డ్ హోటల్' అనే ఓ బ్రిటన్ సినిమా ఉంది. ఇందులో రిటైర్ అయిన వృద్ధులతో ఉండే ఒక గ్రూప్ భారత్‌లో ఒక రిటైర్మెంట్ హోటల్లో ఉండడానికి వస్తారు. అక్కడ ఈ వృద్ధుల మధ్య ప్రేమ, స్నేహం కథ అల్లుకుంటుంది.

కానీ, భారతీయ సినిమాల్లో ప్రేమను వ్యక్తం చేసే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ యువ మనసులు కూడా ఎన్నో ఆంక్షల మధ్య బంధీ అయిపోతుంటాయి.

ఇక్కడ కుటుంబాల్లో అమ్మనాన్నలు, పెద్దవాళ్ల మధ్య ప్రేమను వ్యక్తం చేయడం మరోలా ఉంటుంది. అప్పుడప్పుడూ దాని గురించి చెప్పడం కూడా ఉండదు.

నోట్‌బుక్

ఫొటో సోర్స్, Youtube grab

ఫొటో క్యాప్షన్, నోట్‌బుక్ సినిమా దృశ్యం

అంతేకాదు.. ఇక్కడ మన సినిమాలో కూడా అదే తీరు కనిపిస్తుంది. అంటే 'అంగ్రేజీ మే కహ్తే హై' సినిమాలో అది చూడ్డానికి అవకాశం లభించింది.

ఈ సినిమాలో నడివయసు హీరోయిన్ కిరణ్‌లాను చూస్తే.. వయసుతో వచ్చే మార్పులతో పాటూ పరుగులు తీస్తూ తమ ప్రేమను వ్యక్తం చేసే అవకాశమే దొరకని వాళ్లు ఇంకా ఎంతమంది ఉంటారో అనే ఆలోచన వస్తుంది.

లేదంటే సమాజంలో పరిస్థితులు ఇలాగే ఉంటాయా? ఇలాంటి అనుభూతులను వ్యక్తం చేయడం ఇది నేర్పించదా? అనిపిస్తుంది.

అందుకే బహుశా గీత రచయిత ఇందీవర్ ఎన్నో ఏళ్ల ముందు ఒక మాట రాశారు. దాన్ని జగ్జీత్ సింగ్ మనసుకు హత్తుకునేలా ఆలపించారు.

"న ఉమ్ర్ కీ సీమా హో, న జన్మ్ కా హో బంధన్

జబ్ ప్యార్ కరే కోయీ, తో దేఖే కేవల్ మన్

నయీ రీత్ చల్‌కర్ తుమ్, యే రీత్ అమర్ కర్ దో

హోటోంసే ఛూలో తుమ్, మేరా గీత్ అమర్ కర్ దో"

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)