బాత్ సోప్‌లు, టూత్ పేస్టులు, కాస్మెటిక్స్‌లో వాడే ట్రైక్లోసాన్... నరాలను దెబ్బతీస్తోందా?

సబ్బులు, షాంపూలు

ఫొటో సోర్స్, RAVEENDRAN

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మనం రోజూ వాడే సబ్బులు, టూత్ పేస్టులు, ఇతర సౌందర్య సాధనాలు ఆఖరికి కొన్ని రకాల దుస్తులు, వంటింటి పాత్రల్లో ఉండే ట్రైక్లోసాన్ అనే రసాయనం వలన నరాల క్షీణత బారిన పడే ప్రమాదం ఉందని ఐఐటీ హైదరాబాద్ బయోటెక్నాలజీ పరిశోధకులు చేసిన అధ్యయనం హెచ్చరిస్తోంది.

ఈ పరిశోధనకు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనామిక భార్గవ నేతృత్వం వహించారు. ఈ పరిశోధన పత్రం బ్రిటన్‌కి చెందిన ‘కెమోస్ఫియర్‌’ జర్నల్‌లో ప్రచురితమయింది.

ట్రైక్లోసాన్ అంటే ఏమిటి?

ట్రైక్లోసాన్ ని వివిధ పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లో సూక్ష్మజీవులను హరించేందుకు వాడతారు. దీనిని టూత్ పేస్టులు, మౌత్ వాష్, హ్యాండ్ శానిటైజర్, సర్జికల్ సబ్బులు, కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తులతో పాటు కొన్ని రకాల దుస్తులు, వంటింటి పాత్రలు, బొమ్మలు, ఫర్నిచర్లో కూడా వాడతారు.

టూత్‌పేస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఐఐటీ హైదరాబాద్ చేసిన పరిశోధన ఏమి చెబుతోంది?

ట్రైక్లోసాన్ రసాయనం శరీరంలోకి చేరడం ద్వారా నరాల వ్యవస్థను దెబ్బ తీస్తుందని ఐఐటీ హైదరాబాద్ చేసిన పరిశోధనలో వెల్లడైనట్లు డాక్టర్ అనామిక భార్గవ బీబీసీ న్యూస్ తెలుగుతో చెప్పారు.

జెబ్రా చేపలకు మానవ శరీర నిర్మాణానికి దగ్గర పోలికలు ఉండటం వలన ట్రైక్లోసాన్ ప్రభావం గురించి అంచనా వేయడానికి వీటి పై పరిశోధనలు నిర్వహించారు.

ట్రైక్లోసాన్‌ రసాయనం మనుషుల కణజాలం, ద్రవాల్లో ఉండటం వలన న్యూరో బిహేవియరల్ ఆల్టరేషన్స్ సంభవించే ప్రమాదం ఉందని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది.

జెబ్రా చేపల్లోని న్యూరాన్లపై ట్రైక్లోసాన్‌ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని ఇదే ప్రభావం మనుష్యుల పై కూడా పడే అవకాశం ఉందని అనామిక చెప్పారు. దీంతో నరాల్లోని కణజాలం దెబ్బ తినే అవకాశం ఉందని అన్నారు.

ఇది కేవలం శరీరం లోపలి నుంచే కాకుండా పై పొరల నుంచి కూడా కణాల లోపలికి వెళుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

బ్రెయిన్ లో ఉండే జన్యువుల పనితీరు పై ప్రభావం చూపడం వలన బ్రెయిన్ పని తీరు మారి, మనిషి కదలికలు, ఆలోచనలు, ప్రవర్తన, స్పందించే తీరు పై ప్రభావం పడుతుందని ఆమె చెప్పారు.

ట్రైక్లోసాన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఎంత మోతాదులో తీసుకుంటే ప్రమాదం?

ఈ రసాయనాన్ని 0. 3 శాతం వరకు వాడవచ్చని చెప్పినప్పటికీ తమ పరిశోధనలో నిర్ణీత మోతాదు కంటే 500 రేట్లు తక్కువ వాడినా కూడా దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

"ఈ రసాయనం మోతాదు ఎంత తక్కువగా వాడినా దీర్ఘ కాలంలో దాని మోతాదు శరీరంలో పేరుకుని నరాల వ్యవస్థకు పని చేసేందుకు తోడ్పడే జన్యువులు, ఎంజైమ్‌లు తీవ్రంగా దెబ్బతింటాయి. ఉదాహరణకు ఒక టూత్ పేస్టులో 0. 1 శాతమే ట్రైక్లోసాన్ ఉండవచ్చు. కానీ, దానిని తరచుగా వాడటం వలన అది శరీరంలో పేరుకుని ప్రతికూల ప్రభావాలకు దారి తీయవచ్చు" అని అనామిక అన్నారు.

ట్రైక్లోసాన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ట్రైక్లోసాన్ ఉన్న ఉత్పత్తులను గుర్తించడం ఎలా?

ఏదైనా ఉత్పత్తిని కొనేటప్పుడు ఉత్పత్తి పై పొందుపరిచిన పదార్ధాల జాబితాను ఒకసారి చూసుకోవడం మంచిదని అనామిక సూచించారు.

"మా పరిశోధన ప్రచురితం అవ్వగానే చాలా సంస్థలు తమ ఉత్పత్తుల్లో ట్రైక్లోసాన్ లేదని ప్రకటించాయని, కానీ, అది నిజమో కాదోననే విషయం ప్రయోగశాలల్లో చేసే పరీక్షల్లో మాత్రమే నిర్ధరితమవుతుంది" అని ఆమె అన్నారు.

కోవిడ్ మహమ్మారి కబళించిన తరువాత యాంటీ బాక్టీరియల్ ఉత్పత్తులకు ప్రాచుర్యం పెరిగింది. కొన్ని దుస్తుల కంపెనీలు కూడా ఇటీవల కాలంలో యాంటీ బ్యాక్టీరియల్ ఉత్పత్తులను అమ్మడం మొదలు పెట్టాయని ఇటువంటివి కొనుక్కునే ముందు ఆలోచించాలని అన్నారు.

వంట గదిలో వాడే చాపింగ్ బోర్డ్స్, కొన్ని రకాల పాత్రల్లో కూడా దీనిని వాడుతున్నారని అయితే, ఇటువంటి వాటిలో ట్రైక్లోసాన్ వాడారో లేదో తెలుసుకోవడం కష్టం అని అన్నారు.

ట్రైక్లోసాన్

ఫొటో సోర్స్, LOCAL GOVERNMENT ASSOCIATION

ట్రైక్లోసాన్ సురక్షితమైనదేనా?

1970 లలో ఆసుపత్రుల్లో వాడే ఉత్పత్తుల్లో వాడేవారని క్రమేపీ దానిని టూత్ పేస్టులు, సబ్బులలో వాడటం మొదలు పెట్టారని ట్రైక్లోసాన్ ప్రభావం పై పరిశోధన చేసిన ఒక అంతర్జాతీయ పరిశోధన పత్రం పేర్కొంది.

అధిక మోతాదులో ట్రైక్లోసాన్ శరీరంలోకి వెళ్లడం వలన థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తగ్గే ప్రమాదం ఉందని కొన్ని రకాల జంతువుల పై చేసిన పరిశోధనలు వెల్లడించాయి. అయితే, ఇదే ప్రభావం మనుష్యుల పై ఉంటుందా లేదా అనే విషయం గురించి ఇంకా పూర్తి సమాచారం లేదని యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. మనుష్యులు, పర్యావరణం పై ట్రైక్లోసాన్ ప్రభావం గురించి ఇంకా చాలా చర్చ నడుస్తోంది.

ఈ పదార్ధం నీటిలోకి చేరి పాలు, ఇతర ఆహార పదార్ధాలు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

కొన్ని రకాల టూత్ పేస్టుల పై చేసిన పరిశోధనల వలన దీనికి దంతాలతో సంభవించే జింజివైటిస్ ని నిర్మూలించే శక్తి ఉందని చెబుతున్నాయి. ఇదే రకమైన మేలు మిగిలిన ఉత్పత్తుల వాడకం వలన ఉంటుందో లేదోననే నిర్ధరణ మాత్రం లేదు.

అమెరికాలో సబ్బులు, లిక్విడ్ సబ్బులలో ట్రైక్లోసాన్ వాడకాన్ని 2016లో నిషేధించారు. కానీ, వీటి వాడకం ఇంకా టూత్ పేస్ట్ , హ్యాండ్ శానిటైజర్, మౌత్ వాష్ లలో కొనసాగుతోంది.

ట్రైక్లోసాన్ సురక్షత పై పూర్తి సమాచారం లేకపోవడం వలన కొన్ని రకాల ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల్లో మాత్రం మార్కెట్ రివ్యూ లేకుండా వాడటానికి లేదని యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2017లో ఆదేశాలు జారీ చేసింది.

సౌందర్య సాధనాలు

ప్రత్యామ్నాయాలు ఏమిటి?

ట్రైక్లోసాన్‌ వంటి రసాయనాల వాడకాన్ని పూర్తిగా నిషేధించడం లేదా అతి తక్కువ పరిమాణంలో ఉపయోగించేలా అంక్షలు విధించడం తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు

వివిధ ఉత్పత్తుల్లో ట్రైక్లోసాన్ వాడకం పై భారత ఆహార ఔషధ నియంత్రణ సంస్థ దృష్టి సారించి జనాభా ఆధారిత అధ్యయనాలు నిర్వహించి దాంతో ఉన్న ముప్పును అంచనా వేయవలసిన అవసరం ఉందని ఉందని అభిప్రాయ పడ్డారు.

దీనిని పర్సనల్ కేర్ ఉత్పత్తుల నుంచి కచ్చితంగా తొలగించవచ్చని అన్నారు. కానీ, అమెరికాలో వీటిని నిషేధించగల్గినప్పుడు భారతదేశంలో కూడా నిషేధించగలమని అన్నారు.

దీనికి ప్రత్యామ్న్యాయంగా సహజ సూక్ష్మక్రిమి నాశక రసాయనాలను వాడవచ్చని సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)