కరోనా వైరస్: కొత్త రకం వ్యాప్తితో ఇండియాలోనూ అప్రమత్తం.. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ

ఫొటో సోర్స్, Ani
బ్రిటన్‌లో కరోనావైరస్ కొత్త రకం బయటపడడం, ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై చాలా దేశాలు నిషేధించడంతో ప్రపంచమంతా అప్రమత్తమవుతోంది.
భారత్ కూడా ఇప్పటికే యూకే నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించింది.
మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రకం వైరస్ ముప్పును ఎదుర్కోవడానికి డిసెంబరు 22 నుంచి ముంబయి,ఇతర అన్ని నగరాలు, పట్టణాలలో రాత్రి కర్ఫ్యూ విధిస్తామని ప్రకటించింది.
రాత్రి 11 నుంచి తర్వాత రోజు ఉదయం 6 వరకూ నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోమవారం చెప్పింది.
జనవరి 5 వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారు.
అలాగే యూరప్, మధ్యప్రాచ్యం నుంచి వచ్చే ప్రయాణికులకు కొత్త క్వారంటీన్ నిబంధనలను ప్రకటించింది.
యూరప్, మధ్యప్రాచ్యం నుంచి వచ్చే ప్రయాణికులు ఇప్పుడు 14 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటీన్‌కు పంపిస్తారు. మిగతా వారిని 14 రోజులపాటు హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు.
నైట్ కర్ఫ్యూ సమయంలో కూరగాయలు, పాలు లాంటి అత్యవసర వస్తువుల సరఫరాను అడ్డుకోరు. అయితే ఒకేసారి ఒక దగ్గర ఐదుగురికి మించి గుమిగూడకూడదు.

ఫొటో సోర్స్, EPA
40కిపైగా దేశాల నిషేధం
దీనిపై ఒక ఉమ్మడి విధానం రూపొందించడానికి ఈయూ చర్చలు జరిపింది, బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను 40కి పైగా దేశాలు నిషేధించాయి.
డెన్మార్క్ లో కొత్త రకం కరోనా వైరస్ కేసులు బయటపడడంతో, ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపైనా స్వీడన్ నిషేధం విధించింది.
కొత్త రకం కరోనావైరస్ మరింత వ్యాపిస్తుందని తెలుస్తున్నప్పటికీ, ఇది మరింత ప్రమాదకరం అనడానికి ఇప్పటివరకూ ఆధారాలు లభించలేదు.
బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధిస్తున్న దేశాల జాబితా పెరుగుతుండడంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై స్పందించింది.
"మహమ్మారి ఆవిర్భావంలో కొత్త రకాలు రావడం అనేది సహజమే. అది 'అదుపు తప్పి పోలేదు' అని డబ్ల్యుహెచ్ఓ అత్యవసర పరిస్థితుల చీఫ్ మైక్ రయాన్ అన్నారు.
బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్ ఆదివారం చేసిన ప్రకటనకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది.
బ్రిటన్‌లో బయటపడిన కొత్త రకం వైరస్‌కు సంబంధం లేని, మరో కొత్త రకం కరోనావైరస్ దక్షిణాఫ్రికాలో బయటపడడంతో, ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపైనా కొన్ని దేశాలు నిషేధం విధించాయి.

ఫొటో సోర్స్, EPA
యూరప్‌లో ఏం జరుగుతోంది
కొత్త రకం వైరస్ వ్యాపించకుండా అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి.
బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులు, సరుకులను ఫ్రాన్స్ నిషేధించింది. దీంతో, దక్షిణ బ్రిటన్‌లో కీలకమైన రేవు డోవర్‌లో అంతరాయం ఏర్పడింది.
రెండు దేశాల మధ్య వాణిజ్యం పునరుద్ధరించేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం అవుతుందని ఆశించారు.
ఈయూ మంగళవారం వరకూ దీనిపై ఏ నిర్ణయాలూ తీసుకోలేదు. కానీ, బ్రిటన్ నుంచి వెళ్లే ప్రయాణికులకు కోవిడ్-19 పరీక్షల్లో నెగటివ్ ఉండాలనేదానిపై చర్చించారు.
పైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్‌కు సోమవారం అనుమతించిన ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ యూరప్ ప్రజలకు శుభవార్త వినిపించింది. వీలైనంత త్వరగా వీటిని ఇవ్వాలని భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
మిగతా ప్రపంచం ఏం చేస్తోంది
భారత్, ఇరాన్, కెనడా లాంటి దేశాలు కూడా బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించాయి. అమెరికా ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. కానీ బ్రిటిష్ ఎయిర్ వేస్, డెల్టా ఎయిర్ లైన్స్ మాత్రం కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారిని మాత్రమే న్యూయార్క్ తీసుకెళ్తున్నాయి.
సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ అంతర్జాతీయ ప్రయాణికులకు తమ సరిహద్దులను మూసివేశాయి.
డెన్మార్క్‌తోపాటూ ఆస్ట్రేలియా, ఇటలీ, నెదర్లాండ్స్‌లో కూడా కొత్త రకం కరోనా వైరస్ బయటపడింది.
డెన్మార్క్‌లో కొన్ని కేసులు నమోదవడంతో అక్కడి నుంచి వచ్చేవారిపై స్వీడన్ నిషేధం విధించింది. పొరుగు దేశ ప్రయాణికులపై ఇలా స్వీడన్ నిషేధం విధించడం ఇదే మొదటిసారి.
"డెన్మార్క్ వాసులు క్రిస్మస్ బహుమతులు కొనుగోలు చేయడానికి స్వీడన్ రావాలనుకుంటే, దానివల్ల కచ్చితంగా ముప్పు ఉంటుంది" అని ఆ దేశ హోం మంత్రి మిఖాయెల్ డాంబెర్గ్ అన్నారని ఏఎఫ్‌పీ చెప్పింది.
బ్రిటన్ కొత్త రకం కరోనావైరస్‌ను గుర్తించేందుకు జీనోమిక్ సర్వేలెన్స్ ఉపయోగిస్తుందని చెబుతున్న కొంతమంది నిపుణులు, అది ఇప్పటికే పుట్టిన చోటు నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించి ఉంటుందని చెబుతున్నారు.
"మనం రాబోయే రోజుల్లో దానిని మిగతా చాలా దేశాల్లో గుర్తించవచ్చు" అని బెల్జియంలోని రేగా ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వైరాలజిస్ట్ మార్క్ వాన్ రాన్‌స్ట్ చెప్పారని వీఆర్‌టీ మీడియా సంస్థ కథనం ప్రసారం చేసింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: అన్ని దేశాలకూ వ్యాక్సీన్ దొరకదా.. ఎవరికి లభ్యమవుతుంది.. ఎవరికి అవకాశం లేదు?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- కోవిడ్ వ్యాక్సీన్: ఇప్పుడిక ఫార్మా కంపెనీలకు లాభాల పంట పండుతుందా?
- అర్బన్ ఎకో ఫార్మింగ్: విశాఖలో వీకెండ్స్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలా వ్యవసాయం చేస్తున్నారు?
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








