కరోనావైరస్: పోటీ పరీక్షల విద్యార్థులను ఈ మహమ్మారి ఎలా ఇబ్బంది పెట్టింది

విద్యార్థులు

ఫొటో సోర్స్, Alamy

భారతదేశంలో విద్యారంగంలో ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావడానికే కొన్ని సంవత్సరాల సమయాన్ని వెచ్చిస్తారు.

విజయం సాధించేందుకు వారెన్ని ప్రయత్నాలు చేసినా ఈ మహమ్మారి వారి ప్రణాళికలను మాత్రం మార్చేసింది.

ఈ ఏడాది యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల గురించి అనిశ్చితి నెలకొనడంతో 5 లక్షల మందికి పైగా విద్యార్థులు కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తిగా ఎదురు చూశారు.

ఈ పోటీ పరీక్షల గురించి మాట్లాడేందుకు విద్యా శాఖ మంత్రి సోషల్ మీడియా వేదికగా ఫేస్ బుక్, ట్విటర్‌లో డిసెంబరు 10న లైవ్ బ్రాడ్ కాస్ట్ చేశారు.

ఈ ప్రసంగం పరస్పర చర్చతో కూడుకుని ఉంటుందని భావించినప్పటికీ ఈ ప్రసంగం మాత్రం ఒక రెండు పక్షాలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లుగా సాగింది.

ఈ ప్రసంగంలో మహమ్మారి సమయంలో భారతీయ విద్యా వ్యవస్థ వ్యవహరించిన తీరుని మంత్రి ప్రశంసించారు.

మరో వైపు లైవ్ స్ట్రీమ్ లో పిల్లలు పరీక్షలు వాయిదా వేయమని అడుగుతున్న సందేశాలు నిండిపోయాయి.

సోషల్ మీడియాలో కూడా కోవిడ్ లాక్ డౌన్ వలన రద్దయిన పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని విపరీతంగా ప్రచారం జరిగింది.

ముఖ్యంగా జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్), నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలంటూ కోరడం కనిపించింది.

విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు సంపాదించుకోవడానికి అర్హతను ఈ రెండు పరీక్షలు నిర్ణయిస్తాయి.

విద్యార్థుల నిరసన

ఫొటో సోర్స్, Alamy

భారతదేశంలో విద్యా రంగంలో తీవ్రమైన పోటీ ఉంటుంది.

సైన్సు, టెక్నాలజీ, మెడిసిన్, ఇంజనీరింగ్ రంగాలలో అయితే పోటీ మరింత క్లిష్టంగా ఉంటుంది.

ఐఐటి లాంటి సంస్థల్లో అయితే ప్రతి 50 మంది దరఖాస్తు దారులకు ఒక్కరికి మాత్రమే సీటు లభిస్తుంది.

జెఈఈ , నీట్ లాంటి పరీక్షలు నిర్వహించడం వలన అధిక సంఖ్యలో అభ్యర్థులను అక్కడే ఫిల్టర్ చేయవచ్చు.

ఒక్క మార్కు పోయినా వాళ్ళ ర్యాంకు కొన్ని వేల ర్యాంకుల కిందకి పడిపోతుంది.

ఇలాంటి సమస్యలను అధిగమించడానికి చాలా మంది విద్యార్థులు వాళ్ళ టీనేజి సమయాన్ని ఈ పరీక్షలకు సిద్ధం కావడానికే వెచ్చిస్తారు.

చాలా మంది కోచింగ్ కేంద్రాలలో చేరి ఈ ప్రవేశ పరీక్షలు రాసేందుకు శిక్షణ తీసుకుంటారు.

ఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు అవసరమైన ఉపాయాలు, పరీక్షకు సిద్ధం కావల్సిన తీరు వంటి వాటిని నేర్పడంలో కొన్ని కోచింగ్ కేంద్రాలు నైపుణ్యం కలిగి ఉంటాయి.

ఐఐటీ లాంటి సంస్థల్లో సీటు లభిస్తే వారి భవిష్యత్తు విజయ పథం వైపు సాగుతుందనే ఆశతో ఉంటారు.

కానీ, ఈ సంవత్సరం చాలా మంది విద్యార్థుల సాధారణ ప్రణాళికలను కోవిడ్ భంగం చేసింది. దీంతో చాలా వరకు చదువు ఆన్‌లైన్ కి మారింది.

విద్యా శాఖ మంత్రితో ఒక గంట పాటు జరిగిన చర్చలో చాలా మంది విద్యార్థులు సరిగ్గా పని చేయని ఇంటర్నెట్ గురించి, వీడియో క్లాసుల్లో విషయం సరిగ్గా అర్థం కావటం లేదని ఫిర్యాదులు చేశారు.

కోచింగ్ సెంటర్

ఫొటో సోర్స్, Alamy

దేశంలో నియంత్రణ లేకుండా నడుస్తున్న కోచింగ్ సంస్థలు 2015 నాటికి 4 బిలియన్ డాలర్ల విలువ చేసే పరిశ్రమ అని అంచనా.

వీటిలో కొన్ని దేశ వ్యాప్తంగా నడుస్తున్నవి ఉంటే కొన్ని ప్రాంతీయంగా, మరి కొన్ని చిన్న చిన్న వీధి చివర కేంద్రాలలో కూడా నడుస్తూ ఉంటాయి.

కొన్ని ప్రాంతాల ఆర్ధిక రంగం అంతా ఆ ఊర్లో ఉన్న కోచింగ్ కేంద్రాల మీదే ఆధారపడి నడుస్తూ ఉంటుంది.

రాజస్తాన్‌లోని కోటాకు ఏటా 1,00,000 మంది విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు.

"పరీక్షలకు సిద్ధం కావడమే వారికున్న ఒకే ఒక్క లక్ష్యం" అని ముంబయి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ అండ్ యాక్షన్ రీసెర్చ్ లో పని చేస్తున్న బిందు తిరుమలై అన్నారు.

"ఈ కోచింగ్ కేంద్రాలలో విద్యార్థులు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను ఎలా చేధించాలో నేర్పిస్తారు. ఆ ప్రశ్న పత్రాలను ఎలా రూపొందిస్తారో తెలుసుకోవడంలో వారు నిష్ణాతులు. అందులో కచ్చితంగా తప్పుగా అనిపించే సమాధానాలను పక్కన పెడుతూ, సరైన జవాబును ఎన్నుకోవడం లాంటి వాటిలో బాగా శిక్షణ ఇస్తారు" అని అన్నారు.

కొన్ని కోచింగ్ కేంద్రాలు అయితే వారి దగ్గర చేరడానికి కూడా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తూ ఉంటాయి.

జెఈఈ కోసం శిక్షణ తీసుకున్న సంవత్సరాలు ఎంత కఠినంగా ఉంటాయో ఒక పెద్ద కోచింగ్ కేంద్రంలో టీచర్‌గా పని చేస్తున్న రవళి ప్రసాద్ ఎదర అన్నారు. ఆమె 2000 సంవత్సరంలో కోచింగ్ తీసుకుని ఐఐటీలో సీటు సంపాదించారు.

ఆమె హాజరయిన క్లాసులు పొద్దున్న 4 గంటలకు మొదలైతే 10 గంటలకు ముగిసేవి. దాని తర్వాత స్కూలుకు వెళ్లాల్సి వచ్చేది.

దానికి కూడా మళ్ళీ కఠినమైన డ్రెస్ కోడ్ లు, చుట్టుపక్కల వాళ్ళతో కలవడానికి నిబంధనలు ఉండేవి.

"అప్పుడైనా ఇప్పుడైనా కోచింగ్ కేంద్రాలలో పిల్లలకు మాత్రం సాంఘిక జీవనం కరువవుతోంది" అని ఆమె అన్నారు.

లాక్ డౌన్ విధించిన కొత్తలో నా రోజువారీ ప్రణాళిక అంతా మారిపోయింది. చదుకోవడానికి ఆసక్తి చచ్చిపోయింది.

నేను పరీక్ష ఎప్పుడు పెడతారోనని చూసుకుంటూ ఉండేదానినని 19 ఏళ్ల దీపిక చెప్పారు. ఆమె ఈ పరీక్ష రాయడానికి నాలుగేళ్ళ నుంచి శ్రమిస్తున్నారు.

అయితే, లాక్ డౌన్ విధించక ముందే చాలా కోచింగ్ కేంద్రాలు ఈ సిలబస్ నేర్పించడాన్ని పూర్తి చేసినప్పటికీ , విద్యార్థులకు మాక్ పరీక్షలు రాయడానికి, రివిజన్ చేయడానికి సమయం సరిపోలేదు.

"మేము ఆన్‌లైన్ లో చదవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది" అని 18 సంవత్సరాల అశ్విని తిలై చెప్పారు. నీత్ ప్రవేశ పరీక్ష రాయడం కోసం ఆమె ఒక సంవత్సరం పాటు కష్టపడ్డారు. ఆమె దీని కోసం దిల్లీలో ఒక కోచింగ్ కేంద్రంలో చేరారు. లాక్ డౌన్ విధించడానికి ముందు ఆమె ఇంటికి వెళ్లిపోయారు.

కోల్‌కతాలో నీట్‌కు హాజరైన విద్యార్థిని

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, కోల్‌కతాలో నీట్‌కు హాజరైన విద్యార్థిని

"ఈ విద్యార్థులందరికీ కేవలం చదువు మాత్రమే తెలుసు. వారు ఏళ్ల తరబడి నిరంతరం చదువులోనే మునిగి తేలుతారు.

వారి జీవితంలో చదువు తప్ప మరేదీ లేదు. ప్రతి ఆదివారం వారు పరీక్షలు రాస్తూనే ఉండేవారు" అని రవళి చెప్పారు.

"ఆ మధ్యలో వారికి విరామం దొరికితే, ఆ విరామాన్ని అందుకోవడానికి చూస్తారు. దాంతో, వారు చదువు ఆపేసి టీవీ చూడటానికి అలవాటు పడిపోతారు.

ఆ సమయంలోనే చూడాలనుకున్న సినిమాలు కూడా చూస్తారు" అని అన్నారు.

కొన్ని నెలల పాటు తర్జన భర్జనలు జరిగిన తర్వాత సెప్టెంబరులో జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్), నీట్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసనలు కూడా చేశారు. కొంత మంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.

ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రధాని మోదీ ఈ విషయాన్ని పక్కన పెట్టి ఆయన మన్ కీ బాత్ లో దేశీయ శునక జాతులను పెంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రసంగాన్ని విద్యార్థులు తీవ్రంగా నిరసించారు.

విద్యార్థులు యూ ట్యూబ్ లో అప్‌లోడ్ అయిన ప్రధాని ప్రసంగాన్ని 800,000 సార్లు డిస్ లైక్ చేశారు.

దాంతో, ప్రధాని అధికారిక యంత్రాంగం విద్యార్థులకు డిస్ లైక్ చేసే అవకాశాన్ని తొలగించింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో నివాసి జ్యోతిరాదిత్య రామన్ సింగ్ సెప్టెంబరులో జెఈఈ పరీక్ష రాశారు.

"నన్ను నేను వైరస్ నుంచి రక్షించుకోవడంతో పాటు పరీక్ష రాయడం కోసం చాలా ఆలోచించాల్సి వచ్చింది.

పరీక్ష కేంద్రంలో ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. వైరస్ సోకుతుందేమో అనే భయం మాత్రం వెంటాడింది.

ఈ మహమ్మారి మేము పరీక్షకు సిద్ధం అవ్వడానికి బాగా ఆటంకం కలిగించింది" అని అన్నారు. ఆయన అనుకున్న ఇంజనీరింగ్ కాలేజిలో సీటు సంపాదించేందుకు ఆయనకు తగినంత ర్యాంకు లభించలేదు.

విద్యార్థిని

ఫొటో సోర్స్, Getty Images

దీప్షికకు కూడా ఐఐటీ లో సీటు లభించేందుకు అవసరమైన ర్యాంకు లభించలేదు. ఇప్పుడు మరేదైనా యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నిస్తున్నారు.

తిలైకి కూడా అనుకున్నట్లుగా ర్యాంకు రాలేదు.

విద్యార్థులువచ్చే సంవత్సరం ఈ పరీక్షను నాలుగు సార్లు రాసే అవకాశం ఇస్తామని జెఈఈ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. కానీ, వీరందరికీ అవకాశం ఇవ్వడానికి 2021 పరీక్షల ప్రణాళిక ఫిబ్రవరి నుంచే మొదలవ్వాల్సి ఉంటుంది.

నీట్ ఈ విషయం పై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఇంకా చాలా కోచింగ్ కేంద్రాలు మూత పడే ఉన్నాయి. కొన్ని ఇంకా ఆన్ లైన్ లోనే శిక్షణ ఇస్తున్నాయి.

ఒక వైపు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య కోటికి పైగా చేరుతుండగా, మరో వైపు విద్యార్థులు పరీక్షలు రాయడానికి వేరే ఊళ్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది.

"విద్యార్థులు ఈ పరీక్షలకు సరిగ్గా సిద్ధం కాలేదు" అని రవళి అన్నారు.

“పరీక్షలు వాయిదా వేయాలనే వాదన వేడెక్కుతోంది కానీ, దేశంలో ఉన్నత విద్యా విధానంలో ఉన్న వ్యవస్థాగత అంశాలను పునః పరిశీలించాలనే అంశం పై మాత్రం ఎవరూ చర్చించటం లేదు.

తగినన్ని యూనివర్సిటీ సీట్లు లేకపోవడం, జ్ఞాన సముపార్జనను పక్కన పెట్టి, ఈ ప్రవేశ పరీక్షలను ఎలా అయినా ఛేదించాలని విద్యార్థులు చేస్తున్నప్రయత్నాల గురించి కూడా చర్చ జరగాలి” అని అన్నారు.

"విద్యా విధానం గురించి పునః సమీక్ష చేయడానికి ఇప్పుడు తలెత్తిన సమస్యను అవకాశంగా మలుచుకోవాలి. కానీ, అలా ఎవరూ ఆలోచించలేదు అని ఐఎల్ఎస్ లా కాలేజిలో సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ లా అండ్ పాలసీలో డైరెక్టర్ గా పని చేస్తున్న సౌమిత్ర పథారే అన్నారు.

"ఈ సంవత్సరం ఏర్పడిన అనిశ్చితి అయితే మాత్రం చాలా మంది యువత ఆశల పై నీళ్లు చల్లింది. ఏదైనా అంశం ఒత్తిడిని కలుగ చేస్తే అది అనిశ్చితికి దారి తీస్తుంది" అని ఆమె అన్నారు.

వచ్చే సంవత్సరం 17 ఏళ్ల రిషిత్ పోలిపెద్ది రాయనున్న జెఈఈ పరీక్ష అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

ఆయన కోచింగ్ కేంద్రం ఇచ్చే శిక్షణ నచ్చకపోవడంతో ఒక వ్యక్తిగత ట్యూటర్ ని నియమించుకున్నారు.

"పరీక్ష నాటికి నేను సిలబస్ పూర్తి చేయగలనని అనుకుంటున్నాను" అని రిషిత్ అన్నారు. ఒక వేళ కుదరకపోతే మళ్ళీ ఒక సంవత్సరం ఆగి పరీక్ష రాయాల్సిందే" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)