తమ అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా ఎందుకు అడుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సారా అతీక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనా సంక్షోభం తలెత్తిన తర్వాత... తమతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చిన అప్పులను మాఫీ చేయాలని, లేకపోతే తిరిగి చెల్లించేందుకు మరింత గడువునైనా ఇవ్వాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల అభ్యర్థించారు.
ఇటీవలే పశ్చిమ దేశాల సంఘం పారిస్ క్లబ్ 1.7 బిలియన్ డాలర్ల రుణం తిరిగి చెల్లించేందుకు పాకిస్తాన్‌కు మరింత గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది.
మరోవైపు పాకిస్తాన్‌కు సన్నిహిత దేశంగా భావించే సౌదీ అరేబియా మాత్రం తాము ఇచ్చిన మూడు బిలియన్ డాలర్ల రుణాన్ని త్వరగా తిరిగి చెల్లించాలని కోరింది. అందులో రెండు బిలియన్ డాలర్లను చైనా సహకారంతో పాకిస్తాన్ రెండు వాయిదాల్లో చెల్లించింది. మిగిలిన ఒక బిలియన్ డాలర్లను కూడా ఆ దేశం త్వరలోనే చెల్లించే అవకాశం ఉంది.
సౌదీ అరేబియా పాకిస్తాన్ మీద ఆగ్రహంతో ఉండి, ఇలా త్వరగా రుణం చెల్లించాలని అడిగిందా అన్న అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
పాకిస్తాన్, సౌదీ అరేబియాల సంబంధాల్లో మార్పులు వచ్చిన మాట నిజమేనని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుడు మోయిద్ యూసుఫ్ అన్నారు. అయితే, ఇందుకు ఏ ఒక్క దేశమో కారణం కాదని, అంతర్జాతీయ పరిస్థితుల వల్లే ఇలా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
'మరింత దిగజారవచ్చు'
‘‘అమెరికా కరెన్సీ విలువ తగ్గిపోతోంది. చైనా కొత్త అధికార కేంద్రంగా ఎదుగుతోంది. చాలా ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌కు గుర్తింపు ఇచ్చాయి. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక, కొన్ని మార్పులు వస్తాయని భావిస్తున్నారు. ఇరాన్‌తో ఆ దేశానికి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ సంబంధాలు కూడా అలాగే ఉంటాయని అనుకోలేం'' అని మోయిద్ యూసుఫ్ అన్నారు.
పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు 70 ఏళ్లుగా ఉన్నట్లే ఉండటం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
''సంబంధాల్లో మార్పులు వస్తాయి. రాబోయే కొన్ని నెలల్లో పాకిస్తాన్, సౌదీ సంబంధాల్లో సమతౌల్యం మరింత దిగజారవచ్చు'' అని అభిప్రాయపడ్డారు.
సౌదీ అరేబియా రుణాన్ని త్వరగా చెల్లించాలని అడగడం గురించి స్పందిస్తూ... ''సౌదీ అరేబియా ఓ స్వతంత్ర దేశం. పాకిస్తాన్ నుంచి తమ డబ్బులు ఇప్పుడు తిరిగి రావాలని కోరుకుంది. పాకిస్తాన్ కూడా చెల్లించింది'' అని మోయిద్ అన్నారు.
గత రెండేళ్లలో పాకిస్తాన్, సౌదీ సంబంధాల్లో ఆటుపోట్లు కనిపిస్తున్నాయి. 2018లో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌లో అధికారంలోకి వచ్చారు.
పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులను దూరం చేసేందుకు సౌదీ అప్పుడు మూడు బిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది. ఇంతే విలువైన చమురును కూడా అరువు కింద తీసుకునే వెసులుబాటు ఇస్తామని హామీ ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్, టర్కీల వైపు పాక్ మొగ్గడమే కారణమా?
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ 2019లో పాకిస్తాన్‌లో పర్యటించారు. రెండు దేశాల నాయకుల్లో ఈ పర్యటనపై చాలా ఉత్సాహం కనిపించింది. మహమ్మద్ బిన్ సల్మాన్ అప్పుడు తనను తాను 'పాకిస్తాన్‌కు రాయబారి'గా కూడా వర్ణించుకున్నారు.
కానీ, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్నప్పుడు, ఈ విషయంలో సౌదీ నుంచి పాకిస్తాన్‌కు మద్దతు దొరకలేదు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఓ టీవీ ఇంటర్వ్యూలోనూ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కశ్మీర్ అంశంపై ముస్లిం దేశాల సంఘం (ఓఓఐసీ) భేటీ ఏర్పాటు చేయనందుకు కూడా సౌదీ అరేబియాపై మహమూద్ ఖురేషీ విమర్శలు చేశారు.
ఈ పరిణామాల తర్వాత సౌదీ అరేబియా తాము ఇచ్చిన రుణాన్ని త్వరగా చెల్లించాలని పాకిస్తాన్‌ను కోరింది.
ఇక సౌదీ ఈ తీరు చూపడానికి... ఇరాన్, టర్కీలవైపు పాకిస్తాన్ ఎక్కువ మొగ్గు చూపుతుండటం కూడా ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- సౌదీ అరేబియా భారతదేశంతో స్నేహం ఎందుకు కోరుకుంటోంది...
- సౌదీ అరేబియాను పాకిస్తాన్ నుంచి భారత్ తనవైపు లాగేసుకుందా?
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మెరుగైన మహిళా సాధికారత... కలవరపెడుతున్న పోషకాహార లోపం -జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
- భారత్: ఒకపక్క ఊబకాయం.. మరోపక్క పోషకాహార లోపం.. ఎందుకిలా?
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








