నేపాల్‌లో ఏం జరుగుతోంది? రాజకీయ సంక్షోభం ఎందుకు వచ్చింది?

సార్వత్రిక ఎన్నికలు జరిగిన మూడేళ్ల తరువాత నేపాల్ పార్లమెంట్ రద్దు చేసారు.
నేపాల్ కేబినెట్ సిఫారసును అనుసరించి రాష్ట్రపతి బిద్యా దేవీ భండారీ పార్లమెంటు రద్దు చేసారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మేలలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని రాష్ట్రపతి కార్యాలయ ప్రతినిధి బద్రి నాథ్ అధికారి ప్రకటించారు.
దీనికి ముందు, నేపాల్ అధికార పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తడంతో, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మంత్రివర్గం పార్లమెంట్ రద్దు చెయ్యాలనే నిర్ణయానికి వచ్చింది.
ప్రధాని ఓలీ ఆదివారం ఉదయం తన నివాసంలో మంత్రివర్గంతో అత్యవసర సమావేశం అయినట్లు సీనియర్ మంత్రి బర్మన్ పుణ్ బీబీసీకి తెలిపారు.

ఓలీ మంత్రివర్గ నిర్ణయానికి కారణం?
నేపాల్ అధికార పార్టీ..కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (సీపీఎన్ (మావోయిస్టు)లో చీలికలు రావడంతో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది.
ఓలీ పార్టీని, ప్రభుత్వాన్ని ఏకపక్షంగా నడుపుతున్నారంటూ పార్టీ సహ అధ్యక్షుడు పుష్ప్ కమల్ దహల్ ప్రచండతో సహా సీనియర్ నేతలైన ఝాలానాథ్ ఖనల్, మాధవ్ కుమార్ నేపాల్ తదితరులు ఆరోపించారు.
మూడేళ్ల కిందట కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) కలిసి కూటమిని ఏర్పాటు చేసాయి. ఎన్నికల్లో ఈ కూటమి మూడింట రెండొంతుల మెజారిటీతో విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది కాలానికే ఈ రెండు పార్టీలు విలీనం అయ్యాయి.
పార్లమెంట్ రద్దు చెయ్యాలనే నిర్ణయానికి రాకముందు శనివారం నాడు ప్రధాని ఓలీ, ప్రచండ ఇంటికి వెళ్లారు. ఓలీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని పార్టీ ఒత్తిడి చేసింది.
పార్లమెంట్ స్పీకర్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడి అంగీకారం అవసరం లేకుండా వివిధ రాజ్యాంగ సంస్థల అధిపతులను, సభ్యులను నియమించే అధికారం ప్రధానమంత్రికి ఉండేలా ఓలీ ఒక ఆర్డినెన్స్ తీసుకు వచ్చారు.
ఈ వివాదాస్పద ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవడానికి ఓలీ అంగీకరించారని పార్టీ నాయకులు తెలిపారు.
కానీ, ఆదివారం ఉదయం ఓలీ తన మంత్రివర్గ సభ్యులతో సమావేశమై పార్లమెంట్ రద్దు చేయాలనే ప్రతిపాదన తీసుకు వచ్చారు.
కేబినెట్ సిఫారసు తరువాత పార్టీ కో-చైర్మన్ ప్రచండ మాట్లాడుతూ..ఆదివారం పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదన గురించి చర్చిస్తామని తెలిపారు.
"కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ సంఘటితం కావడం తప్ప మరో మార్గం లేదు. పార్లమెంట్ రద్దు ప్రతిపాదనను వెనక్కు తీసుకోకపోతే ఓలీపై ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉంది. ప్రధాని నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంది. ఇవాళ పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చిస్తాం" అని ప్రచండ బీబీసీకి తెలిపారు.
అయితే, అధికార పార్టీ అత్యవసర సమావేశానికి ముందే రాష్ట్రపతి బిద్యా దేవీ భండారీ పార్లమెంట్ రద్దు చెయ్యాలనే నిర్ణయం తీసేసుకున్నారు.

నేపాల్ రాజ్యాంగం ఏం చెబుతోంది?
నేపాల్ రాజ్యాంగంలో పార్లమెంట్ రద్దు చెయ్యడానికి సంబంధించిన స్పష్టమైన నిబంధనలేమీ లేవని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, కోర్టులో సవాలు చెయ్యొచ్చని అంటున్నారు.
నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం..ఐదేళ్ల పదవీకాలం ముగిసిన తరువాత పార్లమెంట్ రద్దు చేయబడుతుంది. ఆర్టికల్ 76 ప్రకారం..ప్రధాని విశ్వాస పరీక్షలో విఫలమైతే రాష్ట్రపతి పార్లమెంట్‌ను రద్దు చెయ్యొచ్చు. తరువాత ఆరు నెలల్లోగా ఎన్నికల తేదీని నిర్ణయించాలి.
ప్రస్తుత వివాదంలో..పార్లమెంట్‌ను రద్దు చెయ్యమని ప్రతిపాదించే హక్కు ప్రధానమంత్రికి లేదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
"ఇది రాజ్యాంగ విరుద్ధమైన ప్రతిపాదన. 2015 నేపాల్ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతినిధుల సభను రద్దు చేసే అధికారం ప్రధానమంత్రికి లేదు" అని రాజ్యాంగ నిపుణుడు బిపిన్ అధికారి అన్నారు.
ప్రతిపక్ష పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ ఎంపీ రాధేశ్యాం అధికారి కూడా ఇది రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని కోర్టులో సవాలు చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, CMPRACHANDA.COM
అసలు ఇదంతా ఎందుకు జరిగింది? నేపథ్యం ఏమిటి?
ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని ఓలీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వల్లే ప్రస్తుతం నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిందని నేపాల్ త్రిభువన్ విశ్వవిద్యాలయంలోని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ పుష్ప్ అధికారి అన్నారు.
"ఈ ఆర్డినెన్స్ ప్రధానికి ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. రాజ్యాంగ కమిటీలను నిర్ణయించే అధికారం ఇస్తుంది. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ముఖ్యంగా ఓలీ సొంత పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ నేపథ్యంలో ఓలీ బలవంతంగా తాను తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అప్పటినుంచీ అధికార పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. ఏప్రిల్‌నుంచీ రాజకీయంగా ఓలీ పరిస్థితి బలహీనపడుతూ వచ్చింది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధాని తీసుకు వచ్చిన ఆర్డినెన్స్..రాజ్యాంగ పదవులపై కూర్చున్నవారికి, వారి అధికారాలు, హక్కులకు మధ్య సమతుల్యాన్ని సాధిస్తుందని కొందరు భావిస్తున్నారు.
కానీ ప్రొఫెసర్ అధికారి ఏమన్నారంటే..."రాజకీయాల్లో చెక్స్ అండ్ బ్యాలన్స్ అవసరం ఉంది. అధికారాన్ని సమానంగా విభజించినప్పుడు అది సాధ్యపడుతుంది. కానీ ఇక్కడ అధికార పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. అలాంటి మెజారిటీ పనితీరుకు ఎవరైనా అడ్డమొస్తే, దాని అధ్యక్షుడు అది అంగీకరించలేరు. ఓలీ చేయాలనుకున్న కొన్ని పనులకు మిగిలినవారు అడ్డమొస్తున్నారు. ఆయనకు మరో మార్గం కనిపించలేదు. పార్లమెంట్ రద్దు చెయ్యాలని ప్రతిపాదించారు."

ఫొటో సోర్స్, Narayan Maharjan/NurPhoto via Getty Images
రాష్ట్రపతి, ప్రధానమంత్రి మధ్య అండర్‌స్టాండింగ్
నేపాల్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి బిద్యా దేవీ భండారి, ప్రధాని ఓలీల మధ్య సమీకరణాలు కూడా చర్చకు వస్తున్నాయి.
"ఓలీ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించారు. నేపాల్ రాజ్యాంగం ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప రాష్ట్రపతికి మరో మార్గం లేదు. గత కొద్ది నెలలుగా నేపాల్ రాజకీయాల్లో ఏం జరుగుతోందో రాష్ట్రపతికి తెలీదని అనుకోలేం. గత నాలుగైదు నెలలుగా ప్రధానికి, రాష్ట్రపతికి మధ్య కోఆర్డినేషన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉన్నట్లు తోస్తోంది" అని ప్రొఫెసర్ అధికారి అన్నారు.
అయితే, రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే ముందు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోనక్కర్లేదా అనే సందేహం వస్తుంది.
"ఓలీ కేబినెట్ ప్రతిపాదనను రాష్ట్రపతి వెంటనే అంగీకరించారు. అంటే రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేముందు సుప్రీం కోర్టు లేదా ఇతర న్యాయ నిపుణులను సంప్రదించలేదని అర్థం. అంటే రాజ్యాంగంలో ఏదో ఒక ప్రత్యేక సౌకర్యం లేదా రాయితీ ఉంది. దీనివల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది" అని ప్రొఫెసర్ అధికారి తెలిపారు.
"ప్రధానమంత్రికి పార్లమెంట్‌ను రద్దు చేసే అధికారం ఉందా లేదా అనే విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పలేదు. అయితే రాజ్యాంగంలో ఏ యే పరిస్థితుల్లో పార్లమెంట్‌ను రద్దు చేయవచ్చో చెప్పారు. ప్రస్తుతం ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాలు చెయ్యొచ్చు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS/Navesh Chitrakar
నేపాల్‌లో రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకోబోతున్నాయి?
ఇప్పటికే నేపాల్‌లో ప్రధానమంత్రి చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది కొనసాగితే రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం ఉందని, ఇదే అదనుగా ప్రతిపక్ష పార్టీ కూడా తమ వాదనలను వినిపించే అవకాశం ఉందని ప్రొఫెసర్ అధికారి అభిప్రాయపడ్డారు.
ఇవాళ కాకపోతే రేపైనా ఈ విషయం సుప్రీం కోర్టుకు వెళుతుంది. ఈ విషయమై రాజ్యాంగంలో ఏముందో స్పష్టపరచవలసిన బాధ్యత సుప్రీం కోర్టు తీసుకోవలసి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- తిట్లన్నీ మహిళలను అవమానించేలా ఎందుకుంటాయి... ఈ కల్చర్ మారేదెలా?
- పశ్చిమ బెంగాల్లో జేపీ నడ్డాపై దాడి: మోదీ, మమతా ప్రభుత్వాల మధ్య ముదురుతున్న విభేదాలు
- డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది
- పోర్న్‌హబ్: యూజర్లు అప్లోడ్ చేసిన వీడియోలను తొలగిస్తున్నామన్న అడల్ట్ వీడియో సైట్
- చైనా, మాల్దీవుల రుణ వివాదం: 'మా తాతల ఆస్తులు అమ్మినా మీ అప్పు తీర్చలేం'
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- అవసరమైనది గుర్తుండాలంటే అక్కర్లేనిది మరచిపోవాలి.. అదెలాగంటే
- కొన్ని పదాలు నాలుక చివరి వరకు వస్తాయి, కానీ గుర్తుకు రావు... వీటిని గుర్తు చేసుకోవడం ఎలా?
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








