గాలీ ప్రాజెక్ట్: తిట్లన్నీ మహిళలను అవమానించేలా ఎందుకుంటాయి... కల్చర్ మారేదెలా?

మహిళలు
    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మాటామాటా పెరిగి, అది గొడవగా మారితే.. తర్వాత బూతులు తిట్టుకోవడం మొదలవుతుంది. ఆ గొడవ జరిగేది ఇద్దరు మగాళ్ల మధ్యే అయినా, ఆ తిట్లు మాత్రం మహిళలను లక్ష్యంగా చేసుకునే ఉంటాయి.

అలాంటి తిట్లను ప్రజల డిక్షనరీలోంచి తొలగించి, వాటికి ప్రత్యామ్నాయం అందించే లక్ష్యంతో ఇద్దరు యువతులు 'ద గాలీ (తిట్ల) ప్రాజెక్ట్' ప్రారంభించారు.

ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్లాట్‌ఫాం లేదా ఆన్‌లైన్లో ఏ సిరీస్ వచ్చినా వాటిలో భాష అంతకంతకూ దిగజారిపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా బూతుల వాడకం గురించి మేం కొంతమంది యువకులు, జనాల అభిప్రాయం అడిగినపుడు వాళ్లు "అందులో అభ్యంతరం ఏముంది. ఇట్స్ ఫర్ ఫన్" అన్నారు అని ఈ ప్రాజెక్టు చేస్తున్న వారిలో ఒకరైన ముంబయి యువతి నేహా ఠాకూర్ చెప్పారు.

"ఈమధ్య వాతావరణం చూస్తే వారికి ఇలా బూతులు తిట్టేంత కోపం రావడానికి చాలా కారణాలు, అంటే, ప్రభుత్వంపై కోపం, రాకపోకల్లో ఇబ్బంది, ఉద్యోగం, రిలేషన్‌షిప్ లాంటివి ఉన్నాయని అనిపిస్తోంది. జనాల్లో చిరాకు ఏ స్థాయికి చేరిందంటే.. వాళ్ల నోటి నుంచి ఇప్పుడు బూతులు చాలా సహజంగా వచ్చేస్తుంటాయి. కోపం తగ్గించుకోడానికి జనం ఏయే తిట్లు తిడుతుంటారో, వాటి గురించి కాస్త అవగాహన కల్పించాలనేదే మా 'గాలీ ప్రాజెక్ట్' వెనుక ప్రధాన లక్ష్యం, ఇద్దరు మగాళ్ల మధ్య గొడవలో మహిళను తిట్టడం, కుల వివక్ష, ఒక సమాజంలో వారిని తిట్టడం లాంటికి బదులు, అవతలి వారికి కూడా పెద్దగా తప్పుగా అనిపించకుండా, మీ కోపం కూడా తగ్గేలా చేసే తిట్లు ఉపయోగించాలి. మహిళలకు వ్యతిరేకంగా, కులాలు లేదా సమాజాలపై వివక్ష చూపేలా, కించపరిచేలా ఉండని తిట్లు రూపొందించడానికి మేం ప్రయత్నిస్తున్నాం" అన్నారు నేహా.

గాలీ ప్రాజెక్ట్

కొత్త తిట్లు సేకరించారు

తమ ప్రాజెక్ట్ గురించి కమ్యూనికేషన్ కన్సల్టెంట్ తమన్నా మిశ్రా కూడా మాట్లాడారు. "జనాలు తిట్టుకోకుండా మేం ఆపేయడం లేదు. అలాంటి తిట్లు లేకుండా మేం వారికి కొన్ని ప్రత్యామ్నాయాలు అందిస్తున్నాం. వాటితో మీ కోపం తీరుతుంది, అనడానికి, వినడానికి ఫన్నీగా కూడా ఉంటుంది" అన్నారు.

"ఈ ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు మేం ఒక గూగుల్ ఫామ్ రూపొందించాం. మా స్నేహితులు, బంధువులు, చాలా మందికి మీకు నచ్చిన తిట్లు ఇందులో రాస్తూ వెళ్లండని చెప్పాం. కానీ, ఆ తిట్లు మహిళలను, కులాలను, సమాజాలను లక్ష్యంగా చేసుకునేలా ఉండకూడదన్నాం. మాకు దాదాపు 800 పదాలు వచ్చాయి. వాటిలో 40 శాతం కుల వివక్ష, లింగ బేధాలు బయటపెట్టేలా ఉన్నాయి. కానీ, మిగతా దాదాపు 500 పదాలు క్లీన్‌గా ఉన్నట్టు అనిపించాయి" అని తమన్నా చెప్పారు.

నేహ, తమన్నా మొదట ఈ జాబితాలో తాము సేకరించిన పదాల అర్థం తెలుసుకోడానికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్నేహితులు, నిపుణులతో మాట్లాడారు. ఆ పదాలను పరిశీలించి, వాటి అర్థం తెలుసుకున్నారు. తర్వాత ఆ పదాలను సోషల్ మీడియాలో పెట్టడం మొదలెట్టారు. ప్రజల స్పందన చాలా బాగుందని, కానీ, కొంతమంది మాత్రం అలాంటి క్లీన్ తిట్లు తిట్టడం వల్ల, తమకు అసలు తిట్టిన ఫీలింగే రావడం లేదన్నారని చెప్పారు.

"జనాలు చూసేలా మేం ఆ తిట్లను మీమ్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ ప్లాట్‌ఫాంలలో పెడతాం. మేం తిట్లను మార్చి, జనాల ఆలోచనలలు మార్చాలనుకుంటున్నాం. అయితే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. కానీ, ప్రతిసారీ కచ్చితంగా మార్పు రావాలని అనుకోలేం. కొన్ని మార్పులు సరదాగా కూడా జరగచ్చు. అదే మా ప్రయత్నం. అంటే, జనాలు మేం సేకరించిన తిట్లను ఆస్వాదిస్తూ, తమ పాత అలవాటు మార్చుకునేలా, ఫన్నీగా అనిపించిన కొన్ని పదాలను సోషల్ మీడియాలో పెట్టాం" అన్నారు నేహ.

నేహా ఠాకూర్

ఫొటో సోర్స్, NEHA THAKUR

ఫొటో క్యాప్షన్, నేహా ఠాకూర్

బూతులు తిట్టే ప్రజల మనస్తత్వంలో మార్పు తీసుకురావాలని తమన్నా, నేహ తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ఇద్దరూ ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉన్నారు. భవిష్యత్తులో తాము సేకరించిన తిట్లను పుస్తకంగా తీసుకురావాలని అనుకుంటున్నారు.

అయితే, ఇలా తిట్టే సంస్కృతి, ఆ తిట్లలో మహిళలను కించ పరచడం లాంటివి ఎక్కడ, ఎలా వచ్చాయి అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి.

తిట్లు తిట్టడం అనేది, భాషలు ఏర్పడిన తర్వాతే మొదలైందని నిపుణులు చెబుతున్నారు.

తిట్లు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అనేది చెప్పడం కష్టమని హిందీ, మైథిలీ సాహిత్య రచయిత్రి పద్మశ్రీ గ్రహీత ఉషా కిరణ్ ఖాన్ భావిస్తున్నారు.

కానీ సమాజం అభివృద్ధి చెందిన తర్వాత మంచి, చెడుల గురించి వారికి తెలిసుంటుందని, తిట్లు కూడా అప్పుడే మొదలయ్యాయని చెబుతున్నారు. ఎందుకంటే కోపం, విసుగు బయటపెట్టడానికి తిట్లు జనాలకు ఒక మార్గంలా మారాయని చెప్పారు.

డాక్టర్ ఉషా కిరణ్ ఖాన్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ ఉషా కిరణ్ ఖాన్

జానపదాల్లో తిట్లు

అయితే జానపదాల్లో తిట్లు ఉపయోగిస్తుంటారు. పెళ్లిళ్లలో వినోదం, హాస్యం పెంచడానికి బంధువులకు, పెళ్లి కొడుకు మేనత్తకు తిట్లు తిట్టే అధికారం ఇచ్చేస్తుంటారు. కానీ అక్కడ ఎవరినీ తక్కువ చేయడం అనేది ఉండదు. ఆ సమయంలో ఒక విధంగా కుటుంబాల మధ్య బంధం పెంచడానికి ఆ తిట్లను ఉపయోగిస్తారు.

పెళ్లి తర్వాత విందు పాటలు కూడా ఉంటాయి. వాటిలో కూడా తిట్లు తిట్టే సంప్రదాయం ఉంది అని పద్మశ్రీ డాక్టర్ శాంతి జైన్ చెప్పారు. ఆమె సంస్కృతం ప్రొఫెసర్‌గా పనిచేశారు.

"తులసీ మూల రామాయణంలో వాటి ప్రస్తావన కనిపిస్తుంది. రాముడికి పెళ్లి జరుగుతున్నప్పుడు, సీత వదిన మరదళ్లు ఆమెను చాలా ప్రేమగా ఆటపట్టిస్తారు. తిడతారు కూడా. జానపద కథల్లో కూడా గొడవల్లో జనం తిట్టుకునేవారు. కానీ, కోపం వచ్చినపుడు తిట్టే తిట్ల ప్రభావం మరోలా ఉంటుంది" అన్నారు.

సాహిత్యంలో మొదట తిట్లు లేవు. అవి శుభ్రంగా ఉండేవి. అంటే సంస్కృతం, పాలీ, ప్రాకృత, సంస్కృతం నుంచి వచ్చిన దక్షిణాది భాషల్లో జానపద భాషలు కూడా ఉన్నాయి. వాటిలో తిట్లు లిఖితంగా కనిపించవు. సంస్కృతంలో తిట్లు లేవు. అందులో దుష్ట్, కృపణ్ లాంటి మాటలే ఉన్నాయి. వాటినే అప్పుడు చాలా పెద్ద తిట్టుగా అనుకునేవారు. కానీ వెయ్యేళ్లుగా బయటి జనం పెరగడంతో తిట్లు కూడా వృద్ధి చెందుంటాయి" అంటారు ఉషా కిరణ్ ఖాన్.

తిట్ల సంస్కృతిలో మహిళలను జోడించడం ఎందుకు మొదలైంది?

ఈ ప్రశ్నకు సమాధానంగా, "వైదిక కాలంలో మహిళలు, పురుషులు సమానంగా ఉండేవారు. తర్వాత స్త్రీల ప్రాధాన్యం తగ్గి, పురుషులకు పెరగడం మొదలైంది. వారిపై మహిళల రక్షణ బాధ్యత పడింది. మెల్లమెల్లగా మహిళలు పురుషులకు ఒక గౌరవంగా మారిపోయారు" అని ఉష చెప్పారు.

"వారికి మహిళల భద్రత పెద్ద విషయంగా మారింది. చివరకు మహిళ పురుషుడి ఆస్తిగా మారింది. ఆ ఆస్తిని వేరేవారు తిట్టడం మొదలయ్యింది. అలా తిడుతూ, మగవాళ్లు ఇంకో మగాడిని కించపరుస్తూ తన అహం సంతృప్తి పరచుకునేవాడు. అదే కొనసాగుతూ వచ్చింది. చివరికి ఆధునిక కాలంలో అది మరింతగా పెరిగింది" అన్నారు.

మొదట సమాజం లేదా ఆదివాసీ సమాజాల్లో మహిళలను ఉన్నతంగా భావించేవారని, కానీ, తర్వాత మగాళ్లు, మహిళలను తమ గౌరవానికి ప్రతీకగా చూడడం మొదలయ్యిందని సామాజిక వేత్త, ప్రొఫెసర్ బదరీ నారాయణ్ చెప్పారు.

"తమ గౌరవాన్ని కాపాడుకోవాలంటే వాళ్లను ఇళ్లలోనే ఉంచాలి. మహిళను సమాజంలో బలహీనమైనదిగా భావించేవారు. ఎవరినైనా తక్కువ చేయాలన్నా, ఏడిపించాలన్నా వారి ఇళ్లలోని మహిళలను అంటే తల్లిని, చెల్లిని, కూతుళ్లను తిట్టేవారు. అలా వాళ్లు ఆ తిట్లకు లక్ష్యంగా మారారు. వారిని తిట్టడాన్ని ఒక పెద్ద దాడిగా భావించేవారు" అని అన్నారు.

గాలీ ప్రాజెక్ట్

ఫొటో సోర్స్, The Gaali project-Instagram page

ఫొటో క్యాప్షన్, గాలీ ప్రాజెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ పేజి

డాక్టర్ శాంతి జైన్ కూడా, "మహిళాశక్తి గురించి మాట్లాడతారు, కానీ, ఇప్పటికీ మహిళలను తక్కువ చేసి చూస్తున్నారు. చదువుకున్న మహిళలను కూడా వేధిస్తున్నారు. ఎవర్నైనా అవమానించాలంటే, వాళ్ల ఇంట్లో మహిళను తిడతారు. దాంతో, అవతలి వారికి ఘోర అవమానం జరుగుతుంది. అలా ఒక వ్యక్తి తన పురుష అహంకారాన్ని సంతృప్తి పరుస్తాడు. ఒక మగాడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే.. 'నీ ఇంట్లో ఆడవాళ్లను ఎత్తుకెళ్తా' అంటాడు. ఒకరిని తిట్టడానికి మహిళ అవమానించడం ఒక మాధ్యమంగా మారింది. గతంలో గ్రామాల్లో ఇలా చాలా జరిగేవి. ఎక్కువగా ఇవి సమాజంలో అట్టడుగు వర్గాలే చేస్తుండేవి. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్లు కూడా అలాగే చేస్తున్నారు" అన్నారు.

బదరీ నారాయణ్ ఇలాంటి తిట్లకు, సెన్సారింగ్‌కు మధ్య సంబంధాన్ని కూడా చెప్పారు.

"మొదట్లో జనం తమ కుటుంబాలను గౌరవించేవారు. ఇంట్లో పెద్ద వాళ్ల ముందు ఇలాంటి మాటలు అనేవారు కాదు. మాట్లాడితే ఎవరైనా వింటారేమో అని భయపడేవారు. కానీ, ఇప్పుడు ఆ సోషల్ సెన్సారింగ్ అంతమైపోతోంది. సోషల్ మీడియాలో జనం ఒకరినొకరు ఓపెన్‌గా బూతుల తిట్టుకుంటున్నారు. అక్కడ కొందరు ఆ బూతులను లైకులు కూడా చేస్తున్నారు. దానిని మన సమాజం స్వీకరిస్తోంది. వాటిలో ఎవరికీ ఎలాంటి చెడూ కనిపించడం లేదు. మనం అదే మనస్తత్వంలో జీవిస్తున్నాం" అన్నారు.

దిల్లీ యూనివర్సిటీ హిందీ సాహిత్యం అసిస్టెంట్ ప్రొఫెసర్ నీరా ఇందులో మరో కోణం కూడా అందించారు.

"ఈ తిట్లలో మహిళను ఉద్దేశించినవే కనిపిస్తాయి, కానీ, మగాళ్లను ఉద్దేశించి తిట్లు ఏవీ కనిపించవు. ఇది ఇప్పటి విషయం కాదు. చరిత్రలో కూడా అలాంటి ప్రస్తావనలు లేవు. సమాజంలో వర్గీకరణ జరిగినపుడు, అందరి కంటే కిందున్న వారికోసం ఇలాంటి తిట్లు ఉపయోగిస్తారు. జానపదాల్లో అలాంటి ఎన్నో జాతీయాలు ఉన్నాయి. వాటిలో మహిళలు, ఒక కులం, రంగు ఆధారంగా ప్రతికూలంగా మాట్లాడుతారు. మహిళలకు వేశ్య, గణిక, సతి లాంటి మాటలు ఉపయోగించారు. కానీ మగాళ్ల కోసం వాటికి సమానార్థాలు దొరకవు" అన్నారు.

"మన సమాజంలో ఒక విస్తృతమైన సెన్సారింగ్‌లా ఉంటూ వచ్చిన సంప్రదాయం, విలువలు, మానవత్వం అనేవి బలహీనం అయ్యాయి. అయితే స్త్రీవాదులు చాలా ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై అవగాహన కూడా పెరుగుతోంది. కానీ, వారు సోషల్ కాన్షియెస్‌నెస్‌ను మార్చలేకపోతున్నారు" అంటారు ప్రొఫెసర్ బదరీ నారాయణ్.

ఆయన చెబుతున్న దాని ప్రకారం ఇప్పుడు జనాల్లో ఎంత తేడా వచ్చిందంటే.. మహిళలు పనిచేస్తున్న చోట కూడా నేరుగా ఎవరూ తిట్టడం లేదు. వెనక నుంచి వారిని వ్యంగ్యంగా మాట్లాడేవారు కూడా తగ్గుతున్నారు. ఎందుకంటే ఇద్దరి మధ్యా ఒక చర్చ నడుస్తోంది. వారు, కలిసి పనిచేస్తున్నారు. తింటున్నారు.

అంటే మొదట మగ, ఆడ అనే భావన అంతమైపోయింది. కాస్త మార్పు కూడా వచ్చింది. కానీ అది ఒక చిన్న భాగంలో మాత్రమే. ఒక పెద్ద భాగం ఇంకా అలాగే ఉంది. ఒకరి నోటి వెంట వినిపించే బూతు, వారి మనస్తత్వానికి ప్రతీక కూడా. అసహ్యకరమైన తిట్లు తిట్టేవారు, వాటిని ప్రాక్టికాలిటీలోకి కూడా తీసుకొస్తారు. నిర్భయ లాంటి ఘటనలు జరగడానికి అదే కారణం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)