నెమోంటే నెంక్విమా: ఐదు లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని కాపాడిన ఆదివాసీ వనిత

నెమోంటే నెంక్విమా

ఫొటో సోర్స్, Jeronimo Zuñiga/Amazon Frontlines

ఫొటో క్యాప్షన్, 2020 గోల్డ్ మాన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైజ్ గెల్చుకున్న ఆరుగురిలో నెమోంటే నెంక్విమా ఒకరు

ఐదు లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఉద్యమించిన ఆదివాసీ మహిళ నెమోంటే నెంక్విమో ఈ ఏడాది ‘గోల్డ్‌మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్‌’‌కు ఎంపికైనవారిలో ఉన్నారు.

ఈక్వెడార్‌లోని అమెజాన్‌ అటవీ ప్రాంతంలో చమురు వెలికితీతకు వ్యతిరేకంగా స్థానిక ఆదివాసీలను కూడగట్టి పోరాటం చేసినందుకు నెంక్విమోకు ఈ పురస్కారం దక్కింది. మొత్తంగా ఆరుగురికి ఈసారి ఈ అవార్డు ఇచ్చారు.

నెంక్విమోది వావోరాని ఆదివాసీ తెగ. తమ ప్రాంతాన్ని ఈక్వెడార్ ప్రభుత్వం అమ్మకానికి పెడుతోందంటూ ఆమె తన తెగవారితో కలిసి కోర్టును ఆశ్రయించారు.

2019లో వారికి న్యాయపరంగా విజయం దక్కింది. ఆదివాసీ హక్కులకు సంబంధించి వారి పోరాటం ఓ ఉదాహరణగా నిలిచింది.

నెమోంటే నెంక్విమా

ఫొటో సోర్స్, Getty Images

‘మా అడవిని అమ్మం’

‘‘వావోరాని తెగ ప్రజలు పరిరక్షకులు. తమ భూభాగాన్ని, సంస్కృతిని వాళ్లు వేల ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నారు’’ అని నెంక్విమో బీబీసీతో అన్నారు.

1950ల్లో క్రైస్తవ మిషనరీలు రాకముందు తాము ఎలా జీవించేవాళ్లమో పెద్దవాళ్లు చెబుతుంటే చిన్నప్పుడు తాను ఆసక్తిగా వినేదాన్నని ఆమె అన్నారు.

‘‘మా తాత ఓ నాయకుడు. బయటివాళ్ల దండయాత్రల నుంచి మా భూమిని ఆయన కాపాడారు. చొరబాటుదార్లతో ఆయన ఈటెలు పట్టుకుని పోరాడారు’’ అని నెంక్విమో వివరించారు.

తాను కూడా నాయకురాలిగా మారేలా ఐదేళ్ల వయసు నుంచే పెద్దవాళ్లు ప్రోత్సహించారని ఆమె అన్నారు.

‘‘వావోరాని తెగలో తరతరాలుగా నిర్ణయాలు తీసుకునేది మహిళలే. పురుషులు యుద్ధంలోకి వెళ్తారు. మహిళల మాటలను పురుషులు వినేవారు. కానీ, క్రైస్తవ మిషనరీలు వచ్చాక ఆడం, ఈవ్ కథను చెప్పి, అయోమయ పరిస్థితిని సృష్టించారు. కానీ, ఇప్పటికీ నిర్ణయాల విషయంలో మహిళలది కీలక పాత్ర’’ అని నెంక్విమో అన్నారు.

‘‘పస్తాజా ప్రావిన్సులోని వావోరాని తెగకు అధ్యక్షురాలిగా ఎంపికైన మొదటి మహిళను నేను కావొచ్చు. కానీ, మా తెగలో చాలా మంది నాయకురాళ్లు ఉన్నారు. చమురు వెలికితీత నుంచి మా ప్రాంతాన్ని రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటంలో వాళ్లు దారి చూపుతున్నారు’’ అని నెంక్విమో చెప్పారు.

నెంక్విమో బంధువలు ఓ చమురు బావి దగ్గర ఉండేవాళ్లు. అక్కడికి చిన్నతనంలో నెంక్వినాను ఓసారి ఆమె తండ్రి తీసుకువెళ్లారు.

‘‘ఓ చిన్న పడవలో కొంత దూరం వెళ్లాం. ఆ తర్వాత 19 గంటలు నడిచాం. మేం చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఆ చమురు బావి నుంచి వచ్చే శబ్దాలు నాకు వినపడతూ ఉన్నాయి. నాకు అప్పుడు 12 ఏళ్లు. చమురు బావి నుంచి ఎగిసిపడుతున్న పొగ, మంటలను చూడటం నాపై గట్టి ప్రభావం చూపించింది’’ అని చెప్పారు నెంక్విమో.

చమురు వెలికితీత పర్యావరణంపై చూపిస్తున్న దుష్ప్రభావం, వావోరాని తెగ కుటుంబాల జీవనం దెబ్బతింటున్న తీరును చూసి ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు.

నెమోంటే నెంక్విమా

ఫొటో సోర్స్, Getty Images

ఈక్వెడార్ ప్రభుత్వంపై పోరాటం

‘‘ఆ చమురు బావుల వల్ల ఏ ప్రయోజనమూ లేదని మా బంధువులు చెప్పారు. చమురు బావుల్లో పనిచేస్తే వచ్చే డబ్బులతో మగవాళ్లు మద్యం తాగేవాళ్లు. కొందరు భార్యలను కొట్టేవాళ్లు. అక్కడి నుంచి వచ్చే శబ్దాలు వింటూ వాళ్లు ఎలా బతుకుతున్నారో నాకు అర్థం కాలేదు. మా ఇల్లు ఉండే నెమోన్పరే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి ఆకాశంలో చుక్కలు చక్కగా కనిపిస్తాయి. జంతువుల అరుపులు కూడా వినిపిస్తాయి’’ అని నెంక్విమో గుర్తుచేసుకున్నారు.

20 ఏళ్ల తర్వాత, అంటే 2018లో ఈక్వెడార్ ప్రభుత్వం అమెజాన్ అటవీ ప్రాంతంలోని 70 లక్షల ఎకరాలను చమురు వెలికితీత కోసం వేలం వేస్తామని ప్రకటించింది.

ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నెంక్విమో నేతృత్వం వహించారు.

ఆదివాసీ హక్కులు, సంస్కృతి పరిక్షణ కోసం కృషి చేసే సీబో అలియెన్స్ అనే సంస్థను కూడా ఆమె స్థాపించారు.

‘మా అడవిని అమ్మం’ అన్న నినాదంతో ఓ డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని ఆమె మొదలుపెట్టారు. అటవీ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల మంది ఆమెకు సంఘీభావం తెలిపారు.

ఈక్వెడార్ ప్రభుత్వంపై నెంక్విమా న్యాయపోరాటానికి దిగారు. ముందస్తుగా వావోరాని తెగ అంగీకారం తీసుకోకుండానే తమ భూములను ప్రభుత్వానికి వేలం పెడుతోందంటూ వాదించారు.

2019 ఏప్రిల్‌లో కోర్టు వావోరాని తెగకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ఐదు లక్షల ఎకరాల భూమిలో చమురు వెలికితీత జరపకుండా ఆదేశాలు ఇచ్చింది.

భవిష్యతులో భూముల వేలం విషయంలో ముందస్తుగా స్థానిక ప్రజల అంగీకారం తీసుకుని, పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి నిర్దేశించింది.

నెమోంటే నెంక్విమా

ఫొటో సోర్స్, Jeronimo Zuñiga/Amazon Frontlines

న్యాయపోరాటంలో దక్కిన ఈ విజయాన్ని పర్యావరణ ఉద్యమకారులు కొనియాడారు.

ఈ పోరాటంలో తాము గెలుస్తామని ముందుగానే ఊహించామని నెంక్విమో అన్నారు.

అయితే, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా భూముల వేలం విషయంలో ‘ముందస్తు అంగీకారం’ అంశాన్ని చేర్చుతూ ఈక్వెడార్ నేషనల్ అసెంబ్లీ ఓ బిల్లును ఇటీవల ఆమోదించింది.

ఈ విషయంలో ఆదివాసీ ప్రతినిధుల నుంచి ఎలాంటి అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోలేదని నెంక్విమో అన్నారు.

ఇప్పుడు తనకు అభించిన పురస్కారంతో తాము చేస్తున్న పోరాటంపై మరింత మంది దృష్టిపడవచ్చని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరంపై జనాలకు అవగాహన పెరిగేందుకు సాయపడవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

రిపోర్టింగ్: వెనెస్సా బస్క్‌ష్లటర్, న్యూస్ ఆన్‌లైన్ లాటిన్ అమెరికా ఎడిటర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)