"తిండి లేకపోయినా బిడ్డను అమ్ముకోవాలని ఏ తల్లీ అనుకోదు": నైరోబీలోని ఓ తల్లి ఆవేదన - బీబీసీ పరిశోధన

అమ్మేసే ముందు తన బిడ్డతో అడామా
ఫొటో క్యాప్షన్, అమ్మేసే ముందు తన బిడ్డతో అడామా
    • రచయిత, జోయెల్ గంటర్
    • హోదా, బీబీసీ ఆఫ్రికా ఐ

అడామా తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు ఆమె జీవితం హాయిగా సాగిపోయేది.

వాళ్లకు అంతగా డబ్బు లేకపోయినప్పటికి జీవితం ఓ క్రమ పద్ధతిలో సాగుతూ ఉండేది. ఆమె బడికి కూడా వెళ్తూ ఉండేవారు. ఆమెకు 12 ఏళ్లు ఉండగా తండ్రి మరణించారు. మరి కొన్నేళ్లకు తల్లి కూడా చనిపోయారు. దీంతో జీవితం గడవడం కష్టమై స్కూల్ కూడా మానేసినట్లు ఆమె చెప్పారు.

అడామా 22 సంవత్సరాలకే ఓ వ్యక్తి వలన గర్భం దాల్చారు. కానీ, ఆ బిడ్డ పుట్టిన మూడు రోజులకే ఆమె భాగస్వామి చనిపోయారు.

ఆమెకు ఒంటరితనం ఎక్కువైపోయింది. తల్లీబిడ్డలు బతకడానికి డబ్బు అవసరం. దాంతో, అడామా ఆ బిడ్డను తన బామ్మ దగ్గర వదిలి పని వెతుక్కోవడానికి నైరోబీ వెళ్లిపోయారు.

"నీ బిడ్డ జీవనం కోసం నువ్వు వెళ్తున్నావనే విషయం గుర్తు పెట్టుకో" అని ఆమె బామ్మ హెచ్చరించారు.

అడామా నైరోబీ వీధుల్లో కర్బూజా పళ్లు అమ్మడం మొదలుపెట్టారు. కానీ, దాంతో వచ్చే డబ్బు ఆమెకు సరిపోయేది కాదు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా ఆమెతో కలిసి నివసించేవారు దొంగలించేవారు. ఆమె నుదుటిపై చిన్న మచ్చ ఉండేది.

"కొంత మంది మగాళ్లు నాతో పరాచికాలు ఆడటం మొదలు పెట్టారు. ఇక ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది" అని ఆమె చెప్పారు.

అక్కడ నుంచి ఆమె ఒక నిర్మాణ కంపెనీ సైట్‌లో పని చేయడానికి వెళ్లారు. అక్కడ ఆమెకు సరిగ్గా డబ్బులిచ్చే వారు కాదు. అక్కడ నుంచి ఒక నైట్ క్లబ్‌కు వెళ్లారు. అక్కడి యజమానికి తన జీతాన్ని నేరుగా తన ఊరికే పంపమని ఆమె చెప్పారు. కొన్ని రోజుల తర్వాత జీతంలో కొంత భాగాన్ని తన కోసం ఉంచుకుని ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు.

కొన్ని రోజులకు మరో కన్‌స్ట్రక్షన్ సైట్‌లో మంచి జీతమిచ్చే ఉద్యోగం దొరికింది. అక్కడ ఆమెకో వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత అతను తనతో బిడ్డను కనమని అడిగాడు.

అడామా ఊళ్లో ఉన్న కూతురును తిరిగి తెచ్చుకోవడానికి ఒప్పుకుంటే బిడ్డను కంటానని చెప్పడంతో ఆ షరతుకు అతడు మొదట అంగీకరించాడు.

"ఆయన 5 నెలల వరకు ఇంటి అద్దె, ఖర్చులు భరించారు. ఇక ఆమె ఊరు నుంచి బిడ్డను తెచ్చుకుందామనే సమయానికి ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారు. మళ్లీ తిరిగి రాలేదు" అని ఆమె తెలిపారు.

మహిళలు తమ పేదరికం కారణంగా అక్రమ ముఠాల చేతుల్లో చిక్కుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళలు తమ పేదరికం కారణంగా అక్రమ ముఠాల చేతుల్లో చిక్కుతున్నారు.

ఒక్క మనిషికే తినడానికి తిండి లేని సమయంలో మరో ప్రాణిని లోకంలోకి తేవాలంటే మహిళలు చాలా ఒత్తిడికి గురవుతారు. ఎంత ఒత్తిడికి గురైనా పిల్లలను అమ్మాలని మాత్రం అనుకోరు. కానీ,పేదరికం వలన మరో గత్యంతరం లేక పిల్లల అక్రమ వ్యాపారం చేసేవారి చేతుల్లో పడిపోతారు.

అక్రమ వ్యాపారం చేసేవారు చాలా తక్కువ డబ్బులకు పిల్లలను కొనుక్కుంటారు.

శారాకు 17 ఏళ్లుండగా ఆమె రెండోసారి గర్భవతి అయ్యారు. కానీ, ఆ బిడ్డను పోషించేందుకు తనకు తగిన ఉపాధి లేదని ఆమె చెప్పారు. ఆమె తన బిడ్డను 20 పౌండ్లకు (సుమారు 1950 రూపాయలకు) అమ్మేశారు.

"అప్పుడు నా వయసు చాలా తక్కువ. నేను తప్పు చేస్తున్నాననే విషయం నాకు తెలియదు. ఐదేళ్ల తర్వాత నేను చేసిన తప్పేంటో అర్థమైంది. దాంతో ఆ డబ్బును తిరిగి ఇచ్చేద్దామనుకున్నాను" అని ఆమె అన్నారు.

తనలాగే తక్కువ డబ్బులకు పిల్లలను అమ్మేసిన మహిళలు కూడా తనకు తెలుసని ఆమె చెప్పారు. చాలామంది వాళ్లకున్న సమస్యల వల్లే పిల్లలను అమ్మేస్తారని ఆమె అన్నారు. వాళ్లను ఆదుకోవడానికి ఎవరూ ఉండకపోవడంతో వాళ్లు పిల్లలను అమ్మేస్తారని అన్నారు.

టీనేజ్‌లో గర్భం దాల్చేవారి సంఖ్య కెన్యాలో చాలా ఎక్కువ. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇది మరింత ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు.

కొంతమంది మహిళలు బతుకు వెళ్లదీయడం కోసం వ్యభిచార వృత్తిలోకి వెళ్తారు.

"ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చాలా మంది గురించి నేను విన్నాను. చాలామంది యుక్త వయసు అమ్మాయిలు పనికోసం నగరాలకు రావడం, ఇక్కడకు రాగానే ఏదో ఒక సంబంధాల్లో ఇరుక్కుపోవడం, దాంతో గర్భం దాల్చడం, ఆ తరువాత ఆ వ్యక్తి వీళ్లను వదిలేసి వెళ్లిపోవడం జరుగుతూనే ఉంది" అని కెన్యాలో మానవ హక్కుల న్యాయవాది ప్రూడెన్స్ మ్యూటిసో చెప్పారు. ఆమె పిల్లల సంరక్షణ, పునరుత్పత్తి హక్కుల నిపుణులు.

"పిల్లల తండ్రులు వదిలేసి వెళ్లిపోవడంతో ఆ తల్లులు ఆదాయం కోసం ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సి వస్తుంది. దాంతో, పిల్లల్ని అమ్మేస్తే వచ్చిన డబ్బును తనతో పాటు అంతకు ముందే పుట్టిన తన పిల్లలను పోషించుకోవడానికి వాడుకుంటారు. దీని గురించి ఎవరూ బయటకు మాట్లాడరు. కానీ, ఈ పరిస్థితి ఉంది" అని ఆమె అన్నారు.

కెన్యాలో టీనేజీ గర్భాలు పెరుగుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెన్యాలో టీనేజీ గర్భాలు పెరుగుతున్నాయి

అడామా తనకు వీలైనంత కాలం తాను గర్భం దాల్చిన విషయాన్ని దాచి పెట్టి ఉంచారు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ బరువైన సిమెంటు బ్యాగులు మోయడం కష్టంగా మారింది. ఇంటి అద్దె చెల్లించడానికి ఆమెకు వేరే ఆదాయం లేదు. మూడు నెలల వరకు ఇంటి యజమాని ఆమెను ఇంట్లో ఉండనిచ్చారు. కానీ, ఆ తరువాత బయటకు పంపించేశారు.

ఆమెకు 8 నెలలుండగా, అదే ఇంట్లోకి రాత్రి పూట ప్రవేశించడం, పడుకుని లేచి, పొద్దునే తిరిగి వెళ్లిపోవడం చేస్తూ ఉండేవారు. అదృష్టం ఉంటే తినడానికి తిండి దొరికేదని చెప్పారు. కొన్ని రోజులు కేవలం నీళ్లు తాగి, ప్రార్థన చేసుకుని పడుకునేదాన్నని చెప్పారు.

కెన్యాలో అడామా లాంటి స్థితిలో ఉన్నవారు అక్రమ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లడానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. కెన్యాలో తల్లీ బిడ్డ ప్రాణానికి ముప్పు ఉంటే తప్ప గర్భస్రావం చట్టబద్ధం కాదు. అలాగే, చట్టబద్ధంగా పిల్లలను పెంచుకునే విధానాల గురించి కెన్యా గ్రామీణ ప్రాంతాల్లో అంతగా అవగాహన లేదు.

అవాంఛిత గర్భం దాల్చిన మహిళలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతూ లభించదని చారిటీ హెల్త్ పావర్టీ యాక్షన్ కెన్యా నిర్వాహకుడు ఇబ్రహీం అలీ చెప్పారు.

"ఈ మహిళలు చాలాసార్లు బాధితులుగా మారతారు, లేదా వారిని ఈ సమాజంలో తప్పు చేసినవారిలా చూస్తుంటారు. దీంతో వీళ్లు నగరాలకు పారిపోయి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంటూ ఉంటారు" అని ఆయన అన్నారు.

ఆమెకు తన బిడ్డను చట్టబద్ధంగా సురక్షితంగా ఎవరికైనా అప్పగించడానికి అందుబాటులో ఉన్న చట్టపరమైన అవకాశాల గురించి తెలియదు.

నేనెప్పుడూ చట్టబద్ధంగా పిల్లలను పెంచుకోవడం గురించి వినలేదని ఆమె చెప్పారు.

దీంతో ఆమె రహస్యంగా గర్భస్రావం చేయించుకోవాలని చూసినట్లు చెప్పారు. కానీ, ఆమెకున్న నమ్మకాల వలన ఆ పని చేయలేకపోయారు. మరో దారిలేక ఆమె ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు.

"నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. నేను ఎందులోనైనా దూకి ప్రాణాలు తీసుకుంటే ఎవరికీ గుర్తుండను అనుకున్నాను. కానీ, నాకు బిడ్డ పుట్టడానికి కొన్ని రోజులు ఉందనగా మేరీ ఆమా అనే మహిళను నాకు ఎవరో పరిచయం చేశారు. గర్భస్రావం చేయించుకోవద్దని, ప్రాణాలు తీసుకోవద్దని ఆమె నాకు సూచించారు" అని అడామా అన్నారు.

ఓ క్లినిక్ నడుపుతూ లాభం కోసం బిడ్డలను అమ్మే వ్యాపారం చేస్తున్న మేరీ ఆమా
ఫొటో క్యాప్షన్, ఓ క్లినిక్ నడుపుతూ లాభం కోసం బిడ్డలను అమ్మే వ్యాపారం చేస్తున్న మేరీ ఆమా

నైరోబీలో ఒక మురికివాడలో మేరీ ఆమా ఓ అక్రమ క్లినిక్ నడుపుతున్నారు. ఆమె అడామాకు 100 షిల్లింగ్లు ఇచ్చి మరుసటి రోజు క్లినిక్‌కు రమ్మని చెప్పారు.

మేరీ ఆమా నడుపుతున్న క్లినిక్ నిజానికి క్లినిక్ కాదు. ఓ షాపు వెనక ఉన్న రెండు గదుల్లో ఆమె దాన్ని నడుపుతున్నారు. ఆ షాపు లోపల ఉన్న ఖాళీ అరల్లో చిందర వందరగా పడేసిన మందులు ఉన్నాయి. ఆమాకి సహాయకులు ఉంటారు. ఆ క్లినిక్ నుంచే ఆమె పిల్లలను అమ్మడం, కొనడం అనే వ్యాపారం చేస్తూ ఉంటారు.

అడామాకి పుట్టబోయే బిడ్డను కొనుక్కునే వారు పిల్లలు లేని దంపతులని, వాళ్లకి అడామా బిడ్డను ఇస్తానని మేరీ చెప్పారు. కానీ, నిజానికి ఆ బిడ్డను ఆమా బాగా డబ్బులు ఇస్తే చాలు, ఎవరికైనా అమ్మేస్తారు.

ఆమా గతంలో నర్సుగా పని చేసేవారని తన దగ్గరకు వచ్చే వారికి చెబుతూ ఉంటారు.

కానీ, ఆమె దగ్గర సరైన వైద్య పరికరాలు కానీ, నైపుణ్యం, ప్రసవానికి అవసరమైన పరిశుభ్ర పరిసరాలు కానీ లేవు. ఆ పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయని అడామా గుర్తు చేసుకున్నారు.

కానీ, అడామాకు అప్పుడు మరో మార్గం లేదు.

అడామా క్లినిక్‌కు వెళ్లగానే ఆమెకు నొప్పులు రావడానికి రెండు టాబ్లెట్లు ఇచ్చారు. పుట్టే బిడ్డను కొనుక్కోవడానికి అప్పటికే ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారు.

కానీ, అడామా బిడ్డ పుట్టగానే గుండెలో సమస్య కనిపించింది. దాంతో, ఆ బాబును హాస్పిటల్‌కు తీసుకెళ్లమని ఆమా చెప్పారు.

హాస్పిటల్లో ఓ వారం రోజులు చికిత్స తర్వాత ఆ బిడ్డ ఆరోగ్యం కుదుటపడింది. ఆమె పాత ఇంటి యజమాని ఇంటికి రమ్మని ఆహ్వానించి, ఆ బాబును చూసుకునే వారు. ఓరోజు మార్కెట్లో కనిపించిన ఆమా ఆమెకు 100 షిల్లింగ్లు (సుమారు 66 రూపాయిలు) ఇచ్చి మళ్లీ క్లినిక్‌కు రమ్మని పిలిచారు.

"కొత్త ప్యాకేజీ వచ్చింది. ఖరీదు సుమారు 45,000 షిల్లింగ్లు (దాదాపు 30,000 రూపాయలు)" అని బిడ్డను కొనుక్కునేవారికి సందేశాన్ని పంపారు.

అయితే ఈ డబ్బును ఆమా.. అడామాకి ఇవ్వడం లేదు. ఆమెకు కేవలం 10,000 షిల్లింగ్లు (దాదాపు 6000 రూపాయలు) మాత్రమే ఇస్తానని చెప్పారు.

కానీ, ఆ బిడ్డను కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నది ఓ సంవత్సరం నుంచి ఈ అంశంపై పరిశోధన చేస్తున్న బీబీసీ రిపోర్టర్ అని మేరీ ఆమాకు తెలియదు.

ఆ మరుసటి రోజు అడామా క్లినిక్‌కు వెళ్లారు. ఈ బిడ్డను కొనుక్కునే వ్యక్తి ఆమె చెవిలో రహస్యంగా వేరే మార్గాలున్నాయని చెప్పారు.

దాంతో అడామా మనసు మారింది. ఆమె అక్కడ నుంచి బయటపడి ప్రభుత్వం నడిపే పిల్లల సంరక్షణ కేంద్రానికి బిడ్డను అప్పగించారు.

అక్కడ ఆ బిడ్డకు పోషణ దొరుకుతుంది. లేదా చట్టబద్ధంగా పిల్లలను పెంచుకునే వారికి బిడ్డను అప్పగిస్తారు.

ఈ ఆరోపణలపై మేరీ ఆమాను ప్రశ్నించినా ఆమె సమాధానం ఇవ్వడానికి అంగీకరించలేదు.

అడామాకు ఇప్పుడు 29 సంవత్సరాలు. ఆమె ఇప్పుడు తిరిగి తన గ్రామానికి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆమె ఆకలితో పడుకుంటూ ఉండొచ్చు. జీవితం గడవడం ఇంకా కష్టంగానే ఉండి ఉండొచ్చు.

అక్కడ దగ్గరలో ఉన్న హోటల్లో అప్పుడప్పుడూ పని దొరుకుతుంది. కానీ, అది ఆమెకు సరిపోదు. ఆమె ఊర్లో సొంతంగా చెప్పుల షాపు తెరవాలని ఆమె కల.

కానీ, ఆ కల చాలా దూరంగా కనిపిస్తోంది. ఆమెకు ఆమె బిడ్డతో ఎలాంటి సంబంధాలూ లేవు, కానీ, ఆమెకు బిడ్డ గురించి ఎలాంటి బాధా లేదు.

"నా బిడ్డను అమ్మడం సంతోషం కలిగించే విషయం కాదు. అందుకే నాకు ఆ డబ్బు ముట్టుకోవాలని కూడా లేదు" అని ఆమె చెప్పారు.

"నా బిడ్డను అమ్మడం వలన డబ్బులు వస్తాయని అనుకున్నపుడు నేను సరే అనుకున్నాను. నా బిడ్డను వదిలిపెట్టి వచ్చిన ప్రాంతం గురించి నాకు తెలుసు. అది సురక్షితమైనదని నాకు తెలుసు. నా బిడ్డను చూసుకుంటున్న వారు మంచివారని నాకు తెలుసు" అని ఆమె చెప్పారు.

(అదనపు రిపోర్టింగ్: జేరి మవాంగి;ఫొటోలు: టోనీ ఓమాండి, బీబీసీ కోసం)

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)