లవ్ జిహాద్: అమ్మాయి ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయించేది ఆ అమ్మాయా, తల్లిదండ్రులా, ప్రభుత్వమా?

లవ్ జిహాద్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లవ్ జిహాద్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి
    • రచయిత, గీత పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డిసెంబరు 5న ఓ వీడియో క్లిప్ వైరల్ అయింది. ఆ వీడియోలో మెడ చుట్టూ కాషాయ రంగు స్కార్ఫ్ ధరించిన కొంతమంది అబ్బాయిలు ఓ అమ్మాయిపై అరుస్తూ ప్రశ్నలు వేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో చోటుచేసుకుంది.

"నీలాంటి వాళ్ల వల్లే ఈ చట్టాన్ని తేవలసి వచ్చింది" అంటూ ఓ వ్యక్తి ఆమెపై అరుస్తున్నారు.

వీరంతా బీజేపీ అనుకూల బజరంగ్ దళ్ పార్టీకి చెందినవారు. లవ్ జిహాద్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి తెచ్చిన చట్ట వ్యతిరేక మత మార్పిడుల నిరోధక ఆర్డినెన్సు గురించి వాళ్లు మాట్లాడుతున్నారు. ప్రేమ, పెళ్లి అనే ముసుగులో ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలతో బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడడాన్ని లవ్ జిహాద్ అని హిందూ గ్రూపులు నిర్వచిస్తున్నాయి.

line

గమనిక: లవ్ జిహాద్ అనే పదానికి ప్రస్తుతమున్న చట్టాల్లో ఎలాంటి నిర్వచనమూ లేదు. ఇప్పటివరకు ఇలాంటి కేసు నమోదైనట్లు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థా వెల్లడించలేదు.

line

బజరంగ్ దళ్ సభ్యులు ఆ అమ్మాయిని, ఆమె భర్తను, అతని సోదరుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇద్దరు మగవాళ్లను అరెస్టు చేసి ఆ అమ్మాయిని షెల్టర్ హోమ్‌కు పంపించారు.

కొన్ని రోజుల తర్వాత 7 వారాల గర్భంతో ఉన్న ఆ అమ్మాయి కస్టడీలో ఉండగా ఆమెకు గర్భస్రావం అయిందని ఆరోపించారు.

మేజర్ అయిన తాను తన సమ్మతితోనే ఈ వివాహం చేసుకున్నట్లు కోర్టుకు విన్నవించారు. ఈవారం మొదట్లో కోర్టు ఆమెకు తన భర్త ఇంటికి వెళ్లేందుకు అనుమతినిచ్చింది. కానీ, ఆమె భర్త, మరిది మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు.

22 ఏళ్ల అమ్మాయి కడుపు నొప్పి అని చెప్పడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.

ఫొటో సోర్స్, GAJANFAR ALI

ఫొటో క్యాప్షన్, 22 ఏళ్ల అమ్మాయి కడుపు నొప్పి అని చెప్పడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.

షెల్టర్ హోమ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో షెల్టర్ హోమ్‌లో తనను సరిగ్గా చూసుకోలేదని ఆరోపించారు. తనకు కడుపులో నొప్పి వస్తోందని చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. అయితే ఈ ఆరోపణలను షెల్టర్ హోమ్ అధికారులు ఖండించారు.

"నా పరిస్థితి క్షీణించడంతో నన్ను డిసెంబరు 11న ఆసుపత్రికి తీసుకెళ్లారు. రక్త పరీక్ష చేసిన తర్వాత వాళ్లు నన్ను ఆసుపత్రిలో చేర్చుకుని ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత నాకు రక్తస్రావం మొదలైంది" అని ఆమె చెప్పారు.

రెండు రోజుల తర్వాత తనకు మరిన్ని ఇంజెక్షన్లు ఇచ్చారని, రక్తస్రావం ఆగింది కానీ తన ఆరోగ్యం క్షీణించిందని ఆమె అన్నారు. దాంతో తనకు గర్భస్రావమైందన్నారు.

ఇదంతా నిజమో కాదో తెలీదు. ఆసుపత్రిలో జరిగిన విషయాలపై స్పష్టమైన సమాచారం లేదు.

ఆమె నిర్బంధంలో ఉండగా ఆమెకు గర్భస్రావమైందనే రిపోర్టులను అధికారులు ఖండించారు. ఆ నివేదికలన్నీ ఆమె అత్తగారిచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగా వచ్చినవేనని అధికారులు అన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఆమెకు గర్భస్రావం జరిగిందనే నివేదికలను శిశు సంరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ విశేష్ గుప్తా ఖండించారు. గర్భంలో ఆమె బిడ్డ సురక్షితంగా ఉందని ప్రకటించారు.

అల్ట్రాసౌండ్ నివేదికల్లో పిండం కనిపిస్తోందని ఆమెకు వైద్యం చేసిన గైనకాలజిస్టు రిపోర్టర్లతో చెప్పారు. అయితే, బిడ్డ సురక్షితంగా ఉందో లేదో నిర్ధరించడానికి ట్రాన్స్‌వజైనల్ పరీక్ష నిర్వహించాలన్నారు.

ఆమె విడుదలైనప్పటి నుంచి చేసిన అభియోగాలపై అధికారులు స్పందించలేదు. అలాగే, ఆమెకు జరిపిన అల్ట్రాసౌండ్ పరీక్షల నివేదికలను కూడా బయటపెట్టలేదు. ఆమెకు ఏ ఇంజెక్షన్లు చేశారనే వివరాలు కూడా తెలియదు.

ఆసుపత్రికి తీసుకెళ్లిన అయిదు రోజుల తర్వాత కూడా ఆమె కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి గురించి స్పష్టత లేదు. ఈ విషయం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

కానీ, ఆ మహిళకు గర్భస్రావమైందని వచ్చిన నివేదికలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని తెప్పించాయి. చాలామంది ఈ అంశంపై అధికారులను నిందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

లవ్ జిహాద్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, లవ్ జిహాద్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి

భారత్‌లో మతాంతర వివాహాలను చాలా కుటుంబాలు అంత సులభంగా అంగీకరించవు. కానీ, ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ఎవరైనా మతం మారాలనుకుంటే జిల్లా అధికారుల అనుమతి తప్పనిసరి అని చెబుతోంది.

దీంతో, పౌరులకున్న ప్రేమించే హక్కు, తమ భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఉన్న హక్కులపై ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని, అధికారాన్ని ప్రదర్శిస్తోంది.

ఈ చట్టాన్ని అతిక్రమించిన వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఈ చట్టం కింద నేరం చేసిన వారికి బెయిల్ కూడా లభించదు. బీజేపీ పాలనలో ఉన్న నాలుగు రాష్ట్రాలు ఇలాంటి చట్టాన్ని తెచ్చే పనిలో ఉన్నాయి.

ఈ చట్టం తిరోగమనంగా, అవమానకరంగా ఉందని విమర్శకులు అంటున్నారు. మతాంతర వివాహాలు చేసుకున్న జంటలను ముఖ్యంగా హిందూ అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిలను ఈ చట్టం ద్వారా లక్ష్యంగా చేసుకుంటారని అంటున్నారు.

దీన్ని రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

నవంబరు 29న ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కనీసం 6 కేసులు ఈ వివాదాస్పద చట్టం కింద నమోదయ్యాయి.

తల్లిదండ్రుల అంగీకారంతో జరుగుతున్న మతాంతర వివాహాలను సైతం ఆపి, ముస్లిం అబ్బాయిలను అరెస్టు చేశారు.

ఈ 22 సంవత్సరాల అమ్మాయి ఇస్లాంలోకి మారి జులైలో డెహ్రాడూన్‌లో ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. వాళ్ల వివాహాన్ని మొరాదాబాద్‌లో రిజిస్టర్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు వారిని అడ్డుకున్నారు.

మతాంతర వివాహాలను నేరంగా పరిగణించడమే ఈ చట్టంతో ఉన్న పెద్ద సమస్య అని చరిత్రకారుడు చారూ గుప్తా అన్నారు.

"ఒక మహిళ ఇష్టాన్ని ఈ చట్టం తిరస్కరిస్తోంది. ఒక అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది ఆమె ఇష్టం కాదా? ఒకవేళ ఆమె మతం మారాలని అనుకున్నా అందులో సమస్యేమిటో అర్ధం కావడం లేదు" అని ఆమె ప్రశ్నించారు.

"ఈ చట్టం పరిధి చాలా ఎక్కువగా, విస్తారంగా ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి పైనే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యత, భారం ఈ చట్టం మోపుతోంది. అది చాలా ప్రమాదకరం" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)